• facebook
  • whatsapp
  • telegram

మ్యాథ్స్‌లో మేటి స్కోరుకు వ్యూహం!

ఉపాధ్యాయ నియామక పరీక్ష రాయడానికి తెలంగాణ అభ్యర్థులు టీఎస్‌ టెట్‌ - 2022లో అర్హత సాధించవలసి ఉంటుంది. దీనివల్ల టెట్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ పరీక్షలో గణితంలో అత్యధిక మార్కులు సాధించడానికి కింది సూచనలు, మెలకువలు పాటిస్తే చాలు. 

టీఎస్‌టెట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం... ఈ పరీక్ష పేపర్‌-1, పేపర్‌-2 విభాగాల్లో జరుగుతుంది. 1 నుంచి 5వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు పేపర్‌-1 పరీక్షను, 6 నుంచి 8వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు పేపర్‌-2 పరీక్షను రాయాలి. టెట్‌ పరీక్షలో ప్రతి పేపర్‌ 150 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షలోని 5 విభాగాల్లో ఒక విభాగమైన గణితానికి 30 మార్కులు కేటాయించారు. ఈ పరీక్షలో పొందిన మార్కులకు ఉపాధ్యాయ నియామక పరీక్షలో 20 శాతం మార్కులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల టెట్‌లో అర్హత (ఓసీ-60 శాతం, బీసీ-50 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌-40 శాతం) సాధించవలసి ఉంది. గణితంలో ఎక్కువ మార్కులు సాధించడం ద్వారా టెట్‌లో అర్హత పొందడం సులువవుతుంది.

సిలబస్‌

టెట్‌లో గణితానికి 30 మార్కులు కేటాయించారు. అందులో 24 మార్కులు కంటెంట్‌కు, 6 మార్కులు పెడగాజికి ఉంటాయి. 

కంటెంట్‌లో సంఖ్యావ్యవస్థ, భిన్నాలు, అంకగణితం, రేఖాగణితం, కొలతలు, దత్తాంశ వినియోగం, జీజగణితం ఉన్నాయి. 

పెడగాజి విభాగంలో గణితం నిర్వచనాలు, గణితశాస్త్ర స్వభావం, గణిత బోధన ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు, విద్యాప్రమాణాలు, బోధనా పద్ధతులు, గణితంలో బోధనోపకరణ సామగ్రి, బోధనా ప్రణాళిక, విద్యా ప్రణాళిక, గణిత ఉపాధ్యాయుడు, వనరుల వినియోగం, లోప నిర్ధారణ, లోప నివారణ బోధన, నిరంతర సమగ్ర మూల్యాంకనం ఉన్నాయి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రతి విభాగం నుంచి సగటున 4 చొప్పున ప్రశ్నలు వస్తున్నాయి. ఈ విభాగాల్లో సంఖ్యా వ్యవస్థను నేర్చుకోవడం ద్వారా మిగిలిన అధ్యాయాలను సులువుగా అభ్యసించవచ్చు.

పుస్తకాల సేకరణ

గణితానికి సంబంధించి పేపర్‌-1 అభ్యర్థులు 1 నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు, గణిత పెడగాజికి సంబంధించిన పుస్తకం చదవాలి. 

పేపర్‌-2 అభ్యర్థులు 10వ తరగతి వరకు ప్రభుత్వ గణిత పాఠ్యపుస్తకాలు, బీఈడీ గణిత పెడగాజికి సంబంధించిన పుస్తకం, గత పరీక్షల ప్రశ్నపత్రాలు, మాదిరి ప్రశ్నపత్రాలు చదవాలి. 

పోటీ పరీక్షల్లో సమయాన్ని ఆదా చేసుకోవాలంటే సాధన తప్పనిసరి.

ప్రతి అధ్యాయంలో ఎక్కువ సమస్యలను సాధన చేయాలి.

సాధన చేసేటప్పుడు సులభ మార్గాలు (షార్ట్‌కట్‌ టెక్నిక్స్‌) ఉపయోగించాలి. 

గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రశ్నల సరళి ఎలా ఉందో అర్థం అవుతుంది.

గణితంలో ఫలితాలను సరిచూసుకోవడం ద్వారా కూడా సమస్యలను సాధించవచ్చు. ఈ విధానం పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ఉపయోగపడుతుంది.

రోజూ క్రమం తప్పకుండా గణితాన్ని సాధన చేయాలి.

పెడగాజి విభాగంలో సన్నద్ధత

గణిత పెడగాజికి సంబంధించి గణిత నిర్వచనాలు, గణిత స్వభావం, గణితశాస్త్రజ్ఞుల గురించి తెలుసుకోవాలి. 

బోధన ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, విద్యా ప్రమాణాల గురించి సవివరంగా తెలుసుకోవాలి. 

బోధనా పద్ధతులు - సీసీఈ గురించి పూర్తి అవగాహన అవసరం. 

గణిత బోధనా పద్ధతుల్లో ఆగమన, నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ, ప్రకల్పన, అన్వేషణ, సమస్యా పరిష్కార, ప్రయోగశాల పద్ధతులను సవివరంగా చదవాలి. 

సీసీఈలో నిర్మాణాత్మక మదింపు (ఎఫ్‌ఎ), సంగ్రహాత్మక మదింపు (ఎస్‌ఏ) గురించి అవగాహన ఉండాలి. 

విద్యా ప్రణాళికలో విద్యా ప్రణాళిక నిర్మాణ దశలు, వ్యవస్థాపన విధానాలు, పాఠ్య పుస్తకం, పాఠ్య పుస్తక నాణ్యతను నిర్ధారించే మూల్యాంక సాధనాల గురించి పరిజ్ఞానం ఉండాలి. 

బోధనా ప్రణాళికలో వార్షిక, యూనిట్, పాఠ్య పథకం, బోధనా సోపానాల గురించి అవగాహన ఉండాలి. 

ప్రతి అధ్యాయం చదివిన తర్వాత మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. తద్వారా విషయ పరిజ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవాలో అర్థం అవుతుంది. దాంతో సన్నద్ధతను మెరుగుపరుచుకోవచ్చు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రోజూ క్రమం తప్పకుండా గణితానికి కొంత సమయం కేటాయించాలి. గణిత పెడగాజికి కూడా తగినంత సమయాన్ని కేటాయిస్తూ ఉండాలి. 

ప్రతి అధ్యాయంలో వచ్చే సూత్రాలు అన్నింటినీ ఒకేచోట రాసుకోవాలి. 

సులభ మార్గాలను (షార్ట్‌కట్‌ టెక్నిక్స్‌) అనుసరిస్తే చాలా సమయాన్ని పొదుపు చేయొచ్చు. 

మాదిరి ప్రశ్నపత్రాన్ని సాధించేటప్పుడు నిర్ణీత సమయంలోనే పూర్తి అయ్యేలా చూసుకోవాలి. 

మాదిరి ప్రశ్నపత్రాల సాధనలో చేసిన తప్పులను వెంటనే సరిచేసుకోవాలి. దీంతో భావన (కాన్సెప్ట్‌)ను సరిగా అర్థం చేసుకోవచ్చు. 

గత ప్రశ్నపత్రాల విశ్లేషణ

గత ప్రశ్నపత్రాలను పరిశీలించి విశ్లేషించడం ద్వారా ప్రశ్నల సరళిని అర్థం చేసుకోవచ్చు. 

ఏ అధ్యాయం నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయో ఒక నిర్థారణకు రావచ్చు. 

అభ్యర్థి సన్నద్ధతను పరీక్షించుకోవచ్చు. 

సన్నద్ధతలో లోపాన్ని గుర్తించి తద్వారా సంబంధిత భావనలను సరిగా అభ్యసించవచ్చు. 

సన్నద్ధత విధానం

గణితంలో కంటెంట్‌కు సంబంధించి కింది విధంగా సన్నద్ధమయితే ఫలితం ఉంటుంది.

సంఖ్యావ్యవస్థ
      
అంకగణితం
      
బీజగణితం
      
రేఖాగణితం
      
క్షేత్రగణితం
      
దత్తాంశ వినియోగం

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఐసెట్‌ - 2022కి గురి పెట్టారా?

‣ గ్రూప్‌-1 ఇంటర్వ్యూకి ఇవిగో మెలకువలు!

‣ పర్యాటకంలో బీబీఏ, ఎంబీఏ

‣ లెఫ్టినెంట్‌ అవుతారా?

‣ పట్టపగ్గాల్లేని రాజకీయ ఫిరాయింపులు

‣ సుదృఢ బంధమే ఉభయతారకం

‣ ఉచిత యాప్‌లతో చదివేసుకోండి!

Posted Date : 31-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌