• facebook
  • whatsapp
  • telegram

సుదృఢ బంధమే ఉభయతారకం

భారత్‌-ఆస్ట్రేలియా మైత్రిపై ఆశాభావం

ఆస్ట్రేలియాలో ఇటీవలి సాధారణ ఎన్నికల్లో లేబర్‌ పార్టీ అత్యధిక స్థానాలు సాధించింది. ఆ పార్టీ నాయకుడు ఆంటొనీ ఆల్బనీస్‌ (59) ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆస్ట్రేలియన్లకు ‘ఆల్బో’గా సుపరిచితులైన ఆయన ప్రధాని అయిన వెంటనే జపాన్‌లో జరిగిన ‘క్వాడ్‌’ సమావేశానికి హాజరయ్యారు. సభ్య దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను యథాతథంగా కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. లేబర్‌ పార్టీ గతంలో పలు సందర్భాల్లో చైనా అనుకూల వైఖరి అవలంబించిన మాట వాస్తవం. కొంతకాలంగా అల్బనీస్‌ చైనాను దూరం పెడుతూ భారత్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. పైగా ఇటీవలి కాలంలో ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భారత్‌తో ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఇండియాతో దౌత్య సంబంధాలను ముందుకు తీసుకెళ్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

బలపడిన సంబంధాలు

ఆస్ట్రేలియా 31వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆల్బనీస్‌ గతంలో రెండుసార్లు భారత్‌ను సందర్శించారు. 1991లో యువకుడిగా ఉన్నప్పుడు ఇండియాలో విహారయాత్రకు వచ్చారు. అనంతరం 2018లో ఆస్ట్రేలియా పార్లమెంటరీ ప్రతినిధి బృందం నాయకుడిగా భారత్‌లో పర్యటించారు. 2018లో ఓ ముఖాముఖిలో ‘అందరూ చైనా గురించి మాట్లాడతారు. కానీ, మాకు భారత్‌తో మంచి సంబంధాలున్నాయి. ఎందుకంటే అది ప్రజాస్వామ్య దేశం’ అంటూ తొలిసారి ఇండియాను కొనియాడారు. ఇటీవలి ఎన్నికల ప్రచారంలోనూ ఆస్ట్రేలియాలో ప్రవాస భారతీయుల మన్నన పొందేందుకు ఎంతగానో ప్రయత్నించారు. ‘మీరు లేని ఆస్ట్రేలియాను ఊహించుకోలేను. భారతీయ సంస్కృతి, విలువలు, వేడుకలను ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని సుసంపన్నం చేశారు’ అంటూ బ్లాక్‌టౌన్‌లోని హిందూ ఆలయంలో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. భారతీయులపై గతంలో అక్కడ జరిగిన జాత్యహంకార దాడులను ఖండించారు. అయితే, ఆల్బనీస్‌ గతంలో భారత్‌ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన సందర్భాలూ ఉన్నాయి. 2011లో భారత్‌కు అణుఇంధనం సరఫరాకు అణు సరఫరాదారుల కూటమి (ఎన్‌ఎస్‌జీ) సుముఖత తెలిపినప్పటికీ, ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు యురేనియం విక్రయాన్ని ఆల్బనీస్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. 2018లో విక్టోరియా రాష్ట్రంలోని లేబర్‌ పార్టీ ప్రభుత్వం చైనా ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌’లో భాగస్వామి అవుతూ ఒడంబడిక కుదుర్చుకుంది. ఆ ఒప్పందం విదేశాంగ విధానానికి విరుద్ధంగా ఉందంటూ స్కాట్‌ మోరిసన్‌ నేతృత్వంలోని లిబరల్‌ పార్టీ ఫెడరల్‌ ప్రభుత్వం రద్దు చేసింది.

కామన్‌వెల్త్‌ సభ్య దేశాలైన భారత్‌, ఆస్ట్రేలియా మధ్య విదేశీ, దౌత్య సంబంధాలు మొదటినుంచీ స్థిరంగా కొనసాగుతున్నాయి. 2009, 2014లో రెండు దేశాల మధ్య భద్రతా సహకారానికి ఒప్పందాలు కుదిరాయి. అరుణాచల్‌ప్రదేశ్‌ సహా చైనాతో ఉన్న సరిహద్దు వివాదాల విషయంలో ఇండియాకు మద్దతివ్వడాన్ని ఆస్ట్రేలియా తన విధాన నిర్ణయంగా మార్చుకుంది. గత నాలుగేళ్లలో ఇరు దేశాల ప్రధానులు మోదీ-మోరిసన్‌ల స్నేహం కారణంగా ద్వైపాక్షిక, రక్షణ సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి. ఇరు దేశాల విమానాలు, యుద్ధ నౌకలు ఇంధనం నింపుకోవడానికి, నిర్వహణకు ఒకరి సైనిక స్థావరాలను మరొకరు వినియోగించుకోవడంపై 2020 జూన్‌లో కీలక ఒప్పందం కుదిరింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన సాంస్కృతిక సంపదను తిరిగి పొందేందుకు భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఆస్ట్రేలియా సంఘీభావం తెలిపింది. ఈ ఏడాది మార్చిలో 29 పురాతన వస్తువులను ఇండియాకు తిరిగి అప్పగించింది. ఇటీవలి ఎన్నికల్లో ద్రవ్యోల్బణ ప్రభావం మోరిసన్‌ విజయావకాశాలను దెబ్బతీసింది.

‘ఏక్తా’పై సందిగ్ధత

కాన్‌బెర్రా-దిల్లీ మధ్య ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పదం-ఏక్తా’ కుదిరింది. గత పదేళ్లలో ఓ అభివృద్ధి చెందిన దేశంతో భారత్‌ కుదుర్చుకున్న మొదటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇదే. ఇది అమలులోకి రావాలంటే నూతన ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించాలి. ఈ ఒప్పందం ప్రకారం భారత్‌కు ఆస్ట్రేలియా నుంచి దిగుమతి అయ్యే 85శాతం వస్తువులపై సుంకాలు రద్దవుతాయి. ఆసీస్‌ సైతం భారత్‌ నుంచి వచ్చే 96శాతం వస్తువులపై పన్నులను మినహాయిస్తుంది. భారత్‌కే అధిక ప్రయోజనాలున్నట్లు కనిపిస్తున్న ఈ ఒప్పందాన్ని నూతన ప్రభుత్వం యథాతథంగా ఆమోదిస్తుందా, లేదా అన్నదే ఇప్పుడు ప్రశ్న. పైగా దేశానికే తొలి ప్రాధాన్యం అంటూ అధికారంలోకి వచ్చిన ఆల్బనీస్‌- ‘ఏక్తా’ను సమీక్షించే అవకాశాలనూ కొట్టి పారేయలేం. అదే సమయంలో కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తామని ఆయన చెబుతుండటం, ఆస్ట్రేలియా బొగ్గు ఎగుమతులపై ప్రభావం చూపవచ్చు. భారత్‌కు అధిక బొగ్గు ఎగుమతిదారుగా ఆస్ట్రేలియా నిలుస్తోంది. ‘ఉమ్మడి ఆసక్తులు, వ్యూహాత్మక సముద్ర ప్రాంతాలు ఉద్భవించిన సహజ భాగస్వామ్యం మనది. ప్రాంతీయ శాంతి, సుస్థిరతను కాపాడుకొనేందుకు, ఉగ్రవాదం పీచమణిచేందుకు ఇరు దేశాల మధ్య సంబంధాలు దృఢంగా ఉండాలి’ అని మోదీ గతంలో ఆస్ట్రేలియా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఆమోదం పొందేలా మోదీ-ఆల్బో జోడీ కుదరాల్సి ఉంది.

- మదన్‌ మోహన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉచిత యాప్‌లతో చదివేసుకోండి!

‣ హైదరాబాద్‌ ట్రిపుల్‌ఐటీలో ఎంఎస్‌ఐటీ

‣ రివిజన్‌కు సొంత నోట్సు

‣ బీటెక్‌ చదివినా.. గెలుపు ఆర్ట్స్‌తోనే!

‣ మార్పు అనివార్యం!

Posted Date: 28-05-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం