• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఉచిత యాప్‌లతో చదివేసుకోండి!

 

 

హోంవర్క్‌లో సందేహమా?.. పాఠం ఎంత చదివినా అర్థం కావడం లేదా?.. కొత్త భాష నేర్చుకునే ఆసక్తి ఉందా? అయితే ఈ యాప్స్‌ మీకోసమే! విద్యార్థులకు చదువులో సహాయపడేందుకు కొత్త కొత్త యాప్స్‌ అందుబాటులోకి వచ్చాయిప్పుడు. ఎలాంటి రుసుము చెల్లించకుండానే వీటిని వినియోగించుకోవచ్చు. ఈ యాప్‌లతో మీ ప్లానింగ్‌ సులభం కావడమే కాదు.. గ్రేడ్లు కూడా మెరుగుపడతాయి!

 

స్కూల్‌ ప్లానర్‌: అన్ని వయసుల విద్యార్థులకూ సరిపోయే చక్కని యాప్‌ ఇది. పేపర్‌ డైరీతో అవసరం లేకుండా ఇందులోనే అన్ని విషయాలనూ భద్రపరుచుకోవచ్చు. హోంవర్కు ఏం చేయాల్సి ఉందో రాసుకోవడం, పరీక్షల వివరాలు - చదవాల్సిన సబ్జెక్టులు - పాఠాలు నోట్‌ చేసుకోవడం, రిమైండర్లు పెట్టడం, టైం టేబుల్‌ వేయడం, మార్కులు - గ్రేడ్లు అనలైజ్‌ చేసుకోవడం వంటి పనులన్నీ చేయొచ్చు. ఆరోజున్న పనులన్నీ ఒక జాబితాలా రాసి మొబైల్‌ హోం స్క్రీన్‌ మీద కనిపించేలా చేసుకునే వీలుంది. టీచర్ల ఫోన్‌ నంబర్లు, తరగతుల వేళలూ రాసుకోవచ్చు. పాఠం వినేటప్పుడు దాన్ని రికార్డు చేసుకుని తిరిగి కావాల్సినప్పుడు వినే సౌకర్యమూ ఉంది.

 

సింపుల్‌ మైండ్‌: ఆరేడు సబ్జెక్టులు చదవాలి... రకరకాల హోంవర్క్స్, అసైన్‌మెంట్స్‌ ఉండనే ఉంటాయి. ఇక పరీక్షలప్పుడైతే ఒత్తిడికి అంతే ఉండదు! అదనంగా మ్యూజిక్, డ్యాన్స్‌ వంటివి నేర్చుకుంటున్నా, ట్యూషన్లకు వెళుతున్నా సమయాన్ని ప్రణాళికా   బద్ధంగా వాడుకోవడం, అన్నింటినీ సమన్వయం చేసుకోవడం కష్టమవుతూ ఉంటుంది. అలాంటప్పుడు తెలీకుండానే కొన్ని సబ్జెక్టుల్లో వెనకబడిపోతుంటాం. అలా జరగకుండా అన్నీ సరిగ్గా ప్లాన్‌ చేసుకునేలా, మన ఆలోచనలను ఒక క్రమపద్ధతిలో క్రోడీకరించే మైండ్‌ మ్యాప్‌లను తయారుచేసేదే ‘సింపుల్‌ మైండ్‌’ యాప్‌. ఇందులో మనం ఏ అంశాలను ప్లాన్‌ చేసుకోవాలో సమాచారం ఇస్తే దానికి తగిన మ్యాప్‌లను యాప్‌ సిద్ధం చేసి చూపిస్తుంది. వాటిని పాటించడం వల్ల టైం ఆదా అవ్వడమే కాక, అన్నింటిలోనూ సమర్థంగా ముందుకెళ్లగలం.

 

స్టడీ స్మార్టర్‌: విద్యార్థులకు ఉపయోగపడే మరో చక్కని యాప్‌ ఇది. మనం సబ్జెక్టుకు సంబంధించి ఏదైనా విషయాన్ని, లేదా సూత్రాన్ని మర్చిపోతున్నాం అనుకుంటే దాన్ని ఫ్లాష్‌కార్డ్‌గా చేసి ఇందులో సేవ్‌ చేసుకోవచ్చు. ఖాళీ ఉన్నప్పుడల్లా ఆ కార్డ్స్‌ ఒక్కసారి తిరగేస్తే సందేహం ఉన్న విషయాలపై కూడా పట్టు సాధించగలం! ఇతర విద్యార్థుల కార్డ్స్‌ సైతం మనం చూడొచ్చు. నోట్స్‌ రాసుకోవడం, ఎప్పుడు ఏం చదవాలో ప్లాన్‌ చేసుకోవడం కూడా ఇందులోనే చేయొచ్చు. మనం కావాలనుకున్న విషయాలు రిమైండర్‌ వచ్చేలా సెట్‌ చేసుకునే వీలుంది. ఇతర విద్యార్థులతో బృందంగా ఏర్పడి గ్రూప్‌ స్టడీ చేసే వెసులుబాటు ఉంది. అలాగే సబ్జెక్ట్‌ మీద నిపుణుల సలహాలు తీసుకోవడం, క్విజ్‌ పోటీల్లో పాల్గొనడం చేయొచ్చు.

 

క్విజ్లెట్‌: చరిత్ర, సైన్స్, లెక్కలు, ఆర్ట్స్, విదేశీ భాషలు నేర్చుకోవాలనుకునే విద్యార్థులకు ఇది బాగా నచ్చుతుంది. పాఠ్యపుస్తకాల్లో ఉండే జవాబులు కలిగి ఉండటం దీని ప్రత్యేకత. ఇందులోనూ ఫ్లాష్‌ కార్డ్స్‌ ఉంటాయి. ఏ అంశాన్ని అయినా చిన్న చిన్న పాయింట్ల రూపంలో వివరంగా నేర్చుకునే వీలుంటుంది. చివర్లో టెస్ట్‌లు రాసి మనల్ని మనం పరీక్షించుకోవచ్చు.

 

గ్రేట్‌ లెర్నింగ్‌: టెక్నాలజీపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ప్రాథమిక అంశాలు నేర్పించే యాప్‌ ఇది. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్‌ ఉన్న కోర్సుల గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. డేటా సైన్స్, మెషీన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డిజిటల్‌ మార్కెటింగ్‌..ఇలాంటి 700కు పైగా విభిన్నమైన కోర్సులను ఇందులో నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ యాప్‌ స్టాన్‌ఫోర్డ్, ఐఐటీ మద్రాస్, ఐఐఐటీ హైదరాబాద్‌ వంటి ప్రముఖ విద్యాసంస్థలతో సంయుక్తంగా పనిచేస్తుండటం వల్ల విద్యార్థులకు నాణ్యమైన సమాచారం దొరుకుతుంది. ఏదైనా కోర్సు పూర్తిచేస్తే ఆఖర్లో ధ్రువపత్రం కూడా అందుతుంది. 
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రివిజన్‌కు సొంత నోట్సు

‣ బీటెక్‌ చదివినా.. గెలుపు ఆర్ట్స్‌తోనే!

‣ మార్పు అనివార్యం!

‣ మేనేజ్‌మెంట్‌ విద్యలో ప్రపంచస్థాయి బోధన

‣ రెండు పరీక్షలకూ ఉమ్మడి వ్యూహం!

‣ కేంద్ర కొలువులకు సిద్ధమా?

‣ రక్షణ రంగంలో ఉన్నత ఉద్యోగాలు!

Posted Date : 28-05-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌