• facebook
  • whatsapp
  • telegram

పట్టపగ్గాల్లేని రాజకీయ ఫిరాయింపులు

నిషేధ చట్టం నవ్వులపాలు

నాయకుల మూకుమ్మడి గోడ దూకుళ్లను అడ్డుకోవడంలో పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం విఫలమవుతున్న సంగతి తెలిసిందే. అందువల్ల ఆ శాసనంలో తగిన మార్పులు చేసి దాన్ని మరింత పటిష్ఠం చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇటీవల సూచించారు. ఏదో ఒక సందర్భంలో ఫిరాయింపులను ప్రోత్సహించిన దుష్ట చరిత్ర దాదాపుగా ప్రతి రాజకీయ పక్షానికీ ఉంది. ఫిరాయింపుల నిషేధ చట్టంలోని అతి పెద్ద లొసుగు, స్పీకర్‌కు నిర్ణయాధికారం అప్పగించడం. సభాధిపతిగా ఎన్నికైన వ్యక్తి నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. కానీ, స్పీకర్‌ అనివార్యంగా పాలక పార్టీ సభ్యుడే కాబట్టి తమ అధిష్ఠానం అభీష్టం వైపే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. ఎవరైనా సభ్యుడు పార్టీ ఫిరాయించినప్పుడు చట్ట ప్రకారం ఆయనను సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలి. కానీ, అనర్హతా పిటిషన్‌పై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్‌ జాప్యంచేస్తూ, సభ పదవీ కాలం ముగిసేవరకు దాన్ని తొక్కిపడతారు. ఆ విధంగా పాలక పార్టీ- అనర్హతా పిటిషన్లను మురిగిపోయేలా చేస్తుంది. ఫిరాయింపుల అంశంపై స్పీకర్‌ను ఎవరూ ప్రశ్నించలేరు. తత్ఫలితంగా సభ్యులను పోగొట్టుకున్న ప్రతిపక్షం ఏమీ చేయలేక చేతులు ముడుచుకు కూర్చోవాల్సి వస్తోంది. ఇటువంటి కేసుల్లో స్పీకర్‌ నిర్ణయం వెలువడేవరకు న్యాయస్థానాలు కూడా ఏమీ చేయలేవు. దాన్ని అలుసుగా తీసుకుని అధికార పక్షాలు ఫిరాయింపుదారులకు పదవులు కట్టబెట్టి, సభ పదవీ కాలం పూర్తయ్యేవరకు వారు రాజభోగాలు అనుభవించేలా చూడగలుగుతున్నాయి.

న్యాయపాలిక చొరవ

మూడున్నర దశాబ్దాల క్రితం 52వ సవరణ ద్వారా ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని రాజ్యాంగంలోని పదో షెడ్యూలులో చేర్చారు. ఇన్నేళ్లుగా చాలామంది స్పీకర్లు తమ పార్టీ నాయకత్వం కనుసన్నల్లో ఆ శాసనాన్ని నిర్వీర్యం చేస్తూనే వస్తున్నారు. అయితే 2020లో టి.శ్యామ్‌ కుమార్‌ సింగ్‌ కేసుతో పరిస్థితి కాస్త మారసాగింది. శ్యామ్‌ కుమార్‌ 2017లో కాంగ్రెస్‌ టికెట్‌పై మణిపుర్‌ శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ వెంటనే భారతీయ జనతా పార్టీలోకి ఫిరాయించారు. అందుకు ప్రతిఫలంగా ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టారు. పట్టణ ప్రణాళిక, అడవులు, పర్యావరణం తదితర శాఖలను ఆయనకు అప్పగించారు. దానిపై మణిపుర్‌ హైకోర్టులో కాంగ్రెస్‌ పార్టీ పిటిషన్‌ వేసింది. సమస్యను సముచిత గడువులోపల పరిష్కరించేట్లు స్పీకర్‌ను ఆదేశించాలని కోరింది. కానీ, అలా ఆదేశించే అధికారం హైకోర్టుకు ఉందా లేదా అనే అంశం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉందంటూ న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. పిటిషన్‌దారు 2018లో మళ్ళీ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. స్పీకర్‌ పాక్షిక న్యాయాధికారి కాబట్టి సభ పదవీ కాలం ముగిసే లోపు, అంటే అయిదేళ్లలోగా ఫిరాయింపు సమస్యపై తన నిర్ణయం వెలువరించడం ఉచితంగా ఉంటుందని హైకోర్టు 2019లో వ్యాఖ్యానించింది. దానిపై సాధికార ఉత్తర్వు జారీచేయడానికి మాత్రం నిరాకరించింది. తరవాత కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. మణిపుర్‌ స్పీకర్‌ ఖేమ్‌ చంద్‌ నాలుగు వారాల్లో ఫిరాయింపు వ్యతిరేక పిటిషన్‌పై నిర్ణయం ప్రకటించాలని జస్టిస్‌ నారిమన్‌ నేతృత్వంలోని త్రిసభ్య సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అలా స్పీకర్‌కు ఒక గడువు నిర్ణయించడం న్యాయ చరిత్రలో అదే మొదటిసారి. అయినా, స్పీకర్‌ ఖేమ్‌చంద్‌ నాలుగు వారాల్లో తన నిర్ణయం వెలువరించలేదు. అందుకు మరో పది రోజుల వ్యవధి కావాలన్నారు. అదీ గడచిపోయాక మరికొంత సమయం అడిగారు. అందుకు సుప్రీం ధర్మాసనం అంగీకరించలేదు. శ్యామ్‌ కుమార్‌ సింగ్‌ను మంత్రి పదవి నుంచి తొలగించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఆయన మణిపూర్‌ శాసనసభలో అడుగుపెట్టకూడదనీ ఆదేశించింది. ఆ తరవాత కొద్ది రోజులకు శ్యాంకుమార్‌పై స్పీకర్‌ అనర్హత వేటు వేశారు.

అటువంటివారికి పదవులా?

చట్టసభల వ్యవహారాల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోకూడదని 212వ రాజ్యాంగ అధికరణ నిర్దేశిస్తోంది. దాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ నేతలు పలు నాటకాలకు తెరతీస్తున్నారు. దాంతో సుప్రీంకోర్టు 142వ రాజ్యాంగ అధికరణ కింద తనకున్న విశేష అధికారాన్ని ప్రయోగించింది. ఎటువంటి అంశంలోనైనా న్యాయం జరిగేలా చూడటానికి తగిన ఆదేశాలు జారీ చేసే అధికారాన్ని ఈ అధికరణ సుప్రీంకోర్టుకు ఇస్తోంది. మణిపుర్‌ ఉదంతం జరిగిన ఏడాదికి సుప్రీంకోర్టు మళ్ళీ ఫిరాయింపుల వ్యవహారంలో జోక్యం చేసుకుంది. ఈసారి గోవా ఫిరాయింపులు కోర్టు పరిశీలనలోకి వచ్చాయి. ఆ రాష్ట్రంలో 2019 జులైలో పది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఇద్దరు మహారాష్ట్రవాది గోమంతక్‌ పార్టీ శాసన సభ్యులు భారతీయ జనతా పార్టీలోకి ఫిరాయించారు. బహుమతులుగా మంత్రి పదవులు, ఇతరాలు వారిని వరించాయి. ఆ ఎమ్మెల్యేలను శాసన సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించాలనే పిటిషన్లను స్పీకర్‌ ఒకటిన్నరేళ్ల పాటు తొక్కిపట్టారు. దానిపై కాంగ్రెస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నిర్దేశిత గడువులోగా స్పీకర్‌ తన నిర్ణయం ప్రకటించాలంటూ ఆ మేరకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. పశ్చిమ్‌ బెంగాల్లో భాజపా టికెట్‌పై గెలిచిన ముకుల్‌ రాయ్‌ ఆ తరవాత తృణమూల్‌ కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు. ఆయన అనర్హతా పిటిషన్‌పైన కూడా కలకత్తా హైకోర్టు అలాంటి ఉత్తర్వులే ఇచ్చింది.

‘రాజ్యాంగవిహిత కర్తవ్య దీక్షలో తటస్థంగా ఉండాల్సిన స్పీకర్లు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు’ అని న్యాయపాలిక గతంలో వ్యాఖ్యానించింది. ఏతావతా నిర్దిష్ట గడువులోగా ఫిరాయింపుల వ్యవహారాన్ని తేల్చే స్వతంత్ర, నిష్పాక్షిక సంఘం మాత్రమే రాజకీయ పార్టీల కపట నాటకాలకు చెక్‌ పెట్టగలుగుతుంది. అనర్హతా పిటిషన్‌పై తుది నిర్ణయం వెలువరించడానికి మూడు నెలల గడువు ఉండాలి. అవసరమైతే దాన్ని మరో మూడు నెలలపాటు పొడిగించే వెసులుబాటూ కల్పించాలి. ఫిరాయింపుదారులకు పదవులు, ఇతర వరాలు దక్కకుండా చట్టాన్ని సవరించాలి. ప్రతిఫలం లేకపోతే ఎవరూ పార్టీలు మారరు. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకునేలా అన్ని పార్టీలూ ముందుకు రావాలి. ముఖ్యంగా కేంద్రంలోని అధికార పక్షమే అందుకు చొరవ తీసుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టాలి.

స్వతంత్ర వ్యవస్థతోనే సాధ్యం

ఫిరాయింపుల నిషేధ చట్టం సమర్థంగా పనిచేయాలంటే అనర్హతా పిటిషన్లపై స్పీకర్‌కున్న నిర్ణయాధికారాన్ని కచ్చితంగా తొలగించాల్సిందే. ఆ అధికారాన్ని ఒక స్వతంత్ర వ్యవస్థకు అప్పగించాలి. రిటైర్డు సుప్రీం జడ్జి లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి లేదా ఇతర ప్రముఖుల సారథ్యంలో శాశ్వత ట్రైబ్యునల్‌ను నెలకొల్పాలి. ఆ విషయాన్ని పార్లమెంటు పరిశీలించాలని శ్యామ్‌ కుమార్‌ సింగ్‌ కేసులో సుప్రీంకోర్టు సూచించింది. కాలానుగుణంగా స్పీకర్ల అధికారాన్ని పునర్‌ నిర్వచించాలని లోక్‌ సభాపతి ఓం బిర్లా సైతం లోగడ అభిప్రాయపడటం గమనార్హం.

- అరుణ్‌ సిన్హా 

(సామాజిక రాజకీయ విశ్లేషకులు)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉచిత యాప్‌లతో చదివేసుకోండి!

‣ హైదరాబాద్‌ ట్రిపుల్‌ఐటీలో ఎంఎస్‌ఐటీ

‣ రివిజన్‌కు సొంత నోట్సు

‣ బీటెక్‌ చదివినా.. గెలుపు ఆర్ట్స్‌తోనే!

‣ మార్పు అనివార్యం!

Posted Date: 28-05-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం