• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఏకాగ్రతతో ప్రిపరేషన్‌కు కొన్ని మెలకువలు

సర్కారీ కొలువు సాధ్యం ఇలా!

పోటీ పరీక్షలకు మాత్రమే కాదు, అకడమిక్‌ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల్లో కూడా సాధారణంగా కనిపించే సమస్య ఏమిటంటే- పాఠ్యాంశాల మీద పూర్తిగా మనసును లగ్నం చేయలేకపోవడం. ఇది అధిగమించగలిగినదే! ఏకాగ్రతతో చదువుపై దృష్టి నిలిపేందుకు కొన్ని మెలకువలున్నాయి. వాటిని పాటిస్తే మేలు జరుగుతుంది! 

ఎలాగైనా లక్ష్యాన్ని సాధించాలనీ, మంచి మార్కులు పొందాలనీ ప్రారంభంలో ప్రతి విద్యార్థిలో దృఢ సంకల్పం, బలమైన కోరిక ఉంటాయి. అయితే యౌవన ప్రాయంలో ఎదురయ్యే వివిధ రకాల పరిస్థితులు, హార్మోన్ల ప్రభావం వల్ల చాలా సందర్భాల్లో పాఠ్యాంశాల మీద దృష్టి నిలపడంలో విఫలమవుతుంటారు. పర్యవసానంగా మంచి మార్కులు, లక్ష్యాన్ని సాధించలేక అపజయాన్ని పొందుతారు. సమయం వృథా అవటమే కాకుండా శారీరక ఆర్థికపరమైన నష్టాలనూ పొందుతారు. ఇటువంటి పరిస్థితుల నుంచి బయట పడినప్పుడే అనుకున్న ప్రయత్నం నెరవేరుతుంది. 

అందుకే .. నిర్దేశించుకున్న లక్ష్య దిశగా మనసును నిలిపే మెలకువలు గ్రహించాలి. పాటించాలి. 

బిగ్గరగా చదవండి

పూర్వ పాఠశాల స్థాయిలో, ప్రాథమిక పాఠశాలలో అభ్యసన సందర్భాల్లో విద్యార్థులందరిలో కనిపించే ఉమ్మడి లక్షణం ఏమిటంటే... పెద్దగా చదవడం. అంటే చదువును బయటికి వినిపించేలా పఠించటం. ఇలా చదవాలి అంటే- పుస్తకంలోని సమాచారం కన్ను అనే జ్ఞానేంద్రియం ద్వారా మెదడుకి వెళ్లి మెదడు ఇచ్చే ఆదేశాల ప్రకారం గొంతు, నోరు కదలాల్సిఉంటుంది. అందువల్ల బిగ్గరగా చదివే క్రమంలో తప్పనిసరిగా కన్ను పుస్తకం మీద దృష్టి నిలపాల్సి ఉంటుంది. ఎప్పుడైతే దృష్టి పుస్తకం మీద స్థిరంగా ఉంటుందో ఆ సమాచారం మెదడుకు సులభంగా చేరుతుంది. ఫలితంగా మెదడులో స్మృతి (జ్ఞాపకశక్తి)  ఏర్పడుతుంది. అదేవిధంగా గొంతుకి ఆదేశాలు వెళ్తాయి. ఈ చిన్న టెక్నిక్‌ని పాటిస్తారు. కాబట్టి ఆ చిన్న వయసులో జ్ఞాపకశక్తి బలంగా ఏర్పడుతుంది. 

వయసు పెరుగుతున్న కొద్దీ అలా పెద్దగా చదవటం  అవమానకరమని భావన ఏర్పడుతుందో ఏమో, మొత్తం మీద ఎక్కువమంది విద్యార్థులు పుస్తకం మీద కంటిని నిలిపినప్పటికీ ,మౌనంగా మనసులో అధ్యయనం చేస్తుంటారు. కానీ ఈ ప్రక్రియలో చాలా సందర్భాల్లో ఏకాగ్రత లోపిస్తుంది. ఫలితంగా ఆలోచనలు ఎటో వెళ్లి పోతాయి.. అసలు లక్ష్యమైన చదువును వదిలేసి! 

లేనిపోని ఆలోచనలు ముసరకుండా పాఠాలపై స్థిర దృష్టి ఏర్పడాలంటే తప్పనిసరిగా పెద్దగా చదవడం అలవాటు చేసుకోవాలి. చుట్టుపక్కల వాళ్లకు  ఇబ్బంది అనుకుంటే తలుపులు బిగించుకుని ఒక రూమ్‌ లో కూర్చుని చదవచ్చు. ఇతరులకు ఇబ్బంది కలగని ప్రదేశానికి వెళ్లి కూడా ఈ ప్రాక్టీస్‌ చేయవచ్చు.

రాయండి... రాయండి 

మనసును స్థిరంగా నిలిపేందుకూ, జ్ఞాపకశక్తి బలంగా ఏర్పడేందుకూ పరిశోధనల్లో తేలిన అత్యుత్తమమైన మరొక మెలుకువ- చదువుతున్న విషయాన్ని కాగితమ్మీద రాయటం. చదువుతున్న విషయాన్ని సంక్షిప్తంగా గానీ,  విస్తృతంగా గానీ కాగితమ్మీద రాసిన విద్యార్థుల్లో బలమైన జ్ఞాపకశక్తి ఏర్పడిందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. 

ఈ ప్రక్రియలో ఏం జరుగుతుందంటే- కంటి ద్వారా గ్రహించిన సమాచారం మెదడుకు వెళుతుంది. రాయాలి అనే నిర్ణయం మెదడులో ఉన్నప్పుడు కంటి ద్వారా వచ్చిన సమాచారం మెదడు చేతికి చేరవేస్తుంది. అప్పుడు తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఈ అనుసంధానంలో ఎక్కడ అవరోధం ఏర్పడినా రాయటం అనే ప్రక్రియ మందగిస్తుంది..అన్యమనస్కంగా రాస్తున్నప్పుడు మన రాత ఎలా ఉంటుందో గమనించే ఉంటారు. చేతన స్థితిలో రాసిన అక్షరాల మాదిరిగా శుభ్రంగా ఉండకపోవటం, ఒకే లైన్లో రాయలేకపోవడం, అసలు రాయకపోవడం గమనించవచ్చు. ఇలాంటి స్థితి ఏర్పడిందని గమనించగానే తాము చేస్తున్న తప్పు ఏంటో అర్థం చేసుకుంటారు. ఫలితంగా మరల చదువు మీద దృష్టి పెడతారు. 

అందువల్ల మౌనంగా చదివే పరిస్థితి కంటే పెద్దగా చదువుతూ రాస్తూ ఉంటే జ్ఞాపకశక్తితో పాటు మనసు ఇతరేతర విషయాలకు చలించకుండా చదువు మీద దృష్టి పడుతుంది. ఈ టెక్నిక్‌ ప్రారంభదశలోనే కాదు- పునశ్చరణ (రివిజన్‌) దశలో కూడా అనుసరించాలి. రివిజన్‌ దశలో సంక్షిప్తంగా రాసే ప్రయత్నం చేయాలి. అందువల్ల సమయం వృథా కాకుండా మనసును చలింపచేయకుండా విజయవంతం అవ్వచ్చు.

నాటి పరిస్థితుల స్మరణ

గ్రూప్‌-1 ఆఫీసర్‌ అవటం, సివిల్స్‌లో విజయం, ఎస్‌ఐ/ టీచర్‌/ లెక్చరర్‌ అవటం.. ఇలా ఒక లక్ష్యంతో సన్నద్ధత ప్రారంభించారు. ఆ ఉద్యోగం పొందాలని అనుకోవడం వెనుక అభ్యర్థుల సామాజిక, ఆర్థిక, ఇతర అనేక కారణాలు ప్రేరణగా ఉంటాయి. ఆ ఉద్యోగం పొందే క్రమంలో తొలిదశలో మనసును స్థిరంగా ఉంచినప్పటికీ కాలం గడుస్తున్నకొద్దీ మనసు చలిస్తూవుండటం సర్వసాధారణం. ఫలితంగా లక్ష్య సాధన నుంచి పక్కకు వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువ. 

మనోవైజ్ఞానిక శాస్త్రం ప్రకారం- లక్ష్యాన్ని ఎంచుకునేందుకూ, చేరేందుకూ ఉన్న ప్రారంభ పరిస్థితుల్ని తరుచూ మననం చేసుకుంటూ ఉండేవారిలో బలమైన పట్టుదల, ప్రేరణ ఉంటాయి. మన వాడుక భాషలో చెప్పాలంటే ‘కసి’ ఉంటుంది. ఫలితంగా అలాంటి అభ్యర్థులు ఎటువంటి మనసు విచలనాలకూ అవకాశం ఇవ్వకుండా నిరంతరం తమ లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంలో మునిగి ఉంటారు. 

అందువల్ల ఎప్పుడైనా మీ మనస్సు చలిస్తే ఆనాటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి. అనుకున్న లక్ష్యం నుంచి బయటకు వెళ్లకుండా ఉండేందుకు చైనీయులు ఫెంగ్‌ షుయ్‌ మెలకువలు పాటిస్తారు. దీనిలో భాగంగా సాధించాలనుకున్న విషయాన్ని ఒక పేపర్‌ మీద రాసి పర్సులో పెట్టుకుని ఎప్పుడైతే మనసు చలిస్తుందో అప్పుడు ఆ పేపర్‌ని చూస్తుంటారు. పోటీ పరీక్షల అభ్యర్థులు కూడా తమ లక్ష్యాన్ని తరచూ మనం చేసుకోవడం, ఆ లక్ష్యాన్ని చేరగలిగితే అందుకునే ప్రయోజనాలు ఏమిటని స్మరించుకోవడం చేయాలి. అంతే! ఎటో వెళ్లిపోతూ ఉండే  మనసు పుస్తకం మీదికి తిరిగి వచ్చేస్తుంది.

విఫలమైతే వచ్చే నష్టాలను ఊహించడం

మనసు చదువు మీద దృష్టి పెట్టలేని స్థితికి వెళితే, ఎంత ప్రయత్నించినా ఏకాగ్రత కుదరకపోతుంటే తిరిగి దృష్టిని నిలిపేందుకు ఒక నెగిటివ్‌ టెక్నిక్‌ కూడా ఉంది. 

అదేమిటంటే-  విఫలమయితే వచ్చే నష్టాలను ఊహించుకోవడం! అపజయం పాలైతే ఎదురయ్యే పర్యవసానాలను ఆలోచించుకోవడం, కోల్పోయే ధనాన్నీ, సమయాన్నీ జ్ఞాపకం చేసుకోవడం. సమాజంలో వచ్చే చిన్న చూపును అర్థం చేసుకోవటం. 

అయితే ఒక విషయం- ఈ రుణాత్మక ప్రక్రియలు మరీ ఎక్కువైతే వ్యక్తులలో నిరాశ మితిమీరి అసలుకే మోసం వచ్చే ప్రమాదమూ ఉంటుంది. అందువల్ల ఈ మెలకువను చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా మాత్రమే ఉపయోగించుకోవాలి. సందర్భోచితంగా ఉపయోగించే విషం కూడా ఔషధంగా పనిచేస్తుందని గమనించండి. జాగ్రత్తగా ఈ నెగిటివ్‌ టెక్నిక్‌ను వినియోగించండి. పాఠ్యాంశాల అధ్యయనంపై ఏకాగ్రత పెంచుకోండి! 


 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భౌతికశాస్త్రంలో భళా!

‣ కొత్త సిలబస్‌తో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ - 2023

‣ ఫ్యాషన్‌ ప్రపంచంలోకి.. స్వాగతం!

‣ ఇంజినీరింగ్‌తో పాటు.. ఇవి నేర్చుకోవాలి!

‣ ప్రిపరేషన్‌కు కొన్ని పద్ధతులు!

Posted Date : 21-12-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌