• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పైలట్లకు పెరుగుతోంది డిమాండ్‌!

శిక్షణ కోర్సులు పూర్తిచేస్తే పలు అవకాశాలు

విమాన యానం (ఏవియేషన్‌).. శరవేగంగా విస్తరిస్తోన్న రంగాల్లో ఒకటి. దేశీయంగా, అంతర్జాతీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య, సర్వీసులు పెరుగుతున్నాయి. మధ్యస్థాయి పట్టణాలకూ సేవలు విస్తరిస్తున్నాయి. ఇటీవలే ఎయిర్‌ ఇండియా 470 విమానాల కొనుగోలుకు బోయింగ్, ఎయిర్‌ బస్‌ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. తాజా పరిణామాలన్నీ పైలట్ల అవసరాన్ని తెలుపుతున్నాయి. ఆసక్తి ఉన్నవారు శిక్షణ కోర్సులు పూర్తిచేసుకుని, లోహ విహంగాలను నడుపుతూ గగన మార్గంలో దూసుకుపోవచ్చు! 

వచ్చే రెండు దశాబ్దాలకు 2210 విమానాలు దేశానికి అవసరమని ఏవియేషన్‌ నిపుణుల అంచనా. విమానయానంలో పైలట్ల సేవలు అత్యంత కీలకం. ఒక్కో విమానానికీ పది నుంచి పన్నెండు మంది అవసరం. భారీస్థాయి, అధునాతన విమానాలైతే ఈ సంఖ్య మరింత ఎక్కువ. ప్రస్తుతం సుశిక్షితులైన పైలట్ల కొరతను ఈ రంగం ఎదుర్కొంటోంది. దేశంలో 141 ఎయిర్‌ పోర్టులు వాడుకలో ఉన్నాయి. 2026 నాటికి మరో 60 అందుబాటులోకి వస్తాయని అంచనా. పైలట్‌ కావాలనుకునేవాళ్లు కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ (సీపీఎల్‌) పొందడం తప్పనిసరి. దీనికోసం సుమారు రూ.50 లక్షలు ఖర్చవుతుంది. ఈ శిక్షణ ఉచితంగా పొంది, వెంటనే ఉద్యోగం చేసుకునేందుకూ మార్గాలున్నాయి. 

కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ పొందడానికి బాగా శ్రమించాలి. లైసెన్స్‌ చేతికందిన తర్వాత ఉద్యోగం వచ్చేస్తుందనుకోవడానికి లేదు. మార్కెట్‌ పరిస్థితులపై అవకాశాలు ముడిపడి ఉంటాయి.

శిక్షణ ఎలా?

స్టూడెంట్‌ పైలట్‌ లైసెన్స్‌ (ఎస్పీఎల్‌)తో సివిల్‌ పైలట్‌ శిక్షణ మొదలవుతుంది. ఇందులో భాగంగా నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు. కొన్నాళ్ల శిక్షణ అనంతరం ప్రైవేటు పైలట్‌ లైసెన్స్‌ (పీపీఎల్‌) మంజూరు చేస్తారు. ఈ దశలో వీరు చిన్నపాటి శిక్షణ విమానాన్ని నడపాలి. మరికొంత అదనపు శిక్షణ, అనుభవం అనంతరం కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ (సీపీఎల్‌)ను డీజీసీఏ ప్రదానం చేస్తుంది. ఈ లైసెన్స్‌తో ప్రయాణికులను చేరవేసే విమానాలు నడపడానికి అర్హత పొందుతారు. అభ్యర్థి ఏ తరహా విమానాన్ని నడపగలరో సీపీఎల్‌ తెలుపుతుంది. వీరిని ఎయిర్‌ లైన్స్‌ సంస్థలు కో పైలట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటాయి. స్పెషలైజేషన్‌తో సంబంధం లేకుండా వేరే తరహా విమానాన్ని నడపాలంటే కొద్ది రోజులు అదనపు శిక్షణ తీసుకోవాలి. ఆశావహులు వాతావరణం అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లోని శిక్షణ కేంద్రాలనే ఎంచుకోవాలి. డబ్బు సమస్య కానివాళ్లు మెరుగైన శిక్షణ నిమిత్తం కెనడా, అమెరికా వెళ్లవచ్చు. తెలంగాణలో ప్రభుత్వ ఆధ్వర్యంలో.. తెలంగాణ స్టేట్‌ ఏవియేషన్‌ అకాడెమీ ద్వారా పైలట్‌ శిక్షణ అందిస్తున్నారు. ప్రైవేటులో.. ఆసియా పసిఫిక్‌ ఫ్లైట్‌ ట్రైనింగ్‌ అకాడెమీ లిమిటెడ్, వింగ్స్‌ ఏవియేషన్, ఫ్లైటెక్‌ ఏవియేషన్‌ అకాడెమీ సంస్థలు పైలట్‌ శిక్షణ నిర్వహిస్తున్నాయి. ఇవన్నీ హైదరాబాద్‌ (బేగంపేట/ శంషాబాద్‌)లోనే ఉన్నాయి. 

ఏఎఫ్‌ క్యాట్‌

ఎయిర్‌ ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్టు (ఏఎఫ్‌ క్యాట్‌) ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తున్నారు. ఇందులో పలు రకాల పోస్టులు ఉంటాయి. వీటిలో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ (పైలట్‌) ఒకటి. ఈ విధానంలో ఎంపికైనవారు 14 ఏళ్లపాటు విధుల్లో కొనసాగుతారు. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో ఈ పోస్టులు భర్తీ చేస్తారు. అలాగే ఎన్‌సీసీ సి సర్టిఫికెట్‌ ఉన్నవారు ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీతో పైలట్‌ కావచ్చు. ఈ నియామకాలూ ఏఎఫ్‌ క్యాట్‌తోనే ఉంటాయి. ఫ్లయింగ్‌ బ్రాంచ్‌ పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా సాధారణ డిగ్రీ లేదా బీఈ/ బీటెక్‌ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ చదివుండడం తప్పనిసరి. చివరి ఏడాది కోర్సులు చదువుతున్న విద్యార్థులూ అర్హులే. వయసు 20 నుంచి 24 ఏళ్లలోపు, ఎత్తు: కనీసం 162.5 సెం.మీ. ఉండాలి. పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి ఆరు నెలల ప్రాథమిక శిక్షణ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడెమీ - దుండిగల్, హాకింపేట్, ఎలహంక, బీదర్‌ల్లో చేపడతారు. అనంతరం అభ్యర్థుల ప్రతిభ ప్రకారం ఫైటర్‌ పైలట్, ట్రాన్స్‌పోర్ట్‌ పైలట్, హెలికాప్టర్‌ పైలట్లగా విడదీసి అందుకుతగ్గ శిక్షణను రెండు దశల్లో నిర్వహిస్తారు. శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఆ తర్వాత వీరు ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో విధుల్లో చేరతారు. 

ఎస్‌ఎస్‌సీ 

షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో ఇండియన్‌ నేవీ పైలట్‌ పోస్టులను భర్తీ చేస్తుంది. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు అర్హులు. పదోతరగతి, ఇంటర్, ఇంజినీరింగ్‌ అన్నింట్లోనూ 60 శాతం మార్కులు తప్పనిసరి. 162.5 సెం.మీ ఎత్తుతో, 21-24 ఏళ్లలోపు వారు అర్హులు. ఎస్‌ఎస్‌బీ ఇంట ర్వ్యూతో నియామకాలుంటాయి. ఎంపికైనవారికి ఎయిర్‌ ఫోర్స్‌ అకాడెమీల్లో పైలట్‌ శిక్షణ ఉంటుంది. వీరు నౌకాదళం తరఫున యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు నడుపుతారు. గరిష్ఠంగా 14 ఏళ్లపాటు సేవల్లో కొనసాగుతారు. ఏడాదికి రెండుసార్లు నియామక ప్రకటన వెలువడుతుంది. 

ఉద్యోగంలో..

ఎన్‌డీఏ, సీడీఎస్‌ఈ, ఏఎఫ్‌క్యాట్, ఎస్‌ఎస్‌సీ.. ఏ విధానంలో అభ్యర్థులు ఎంపికైనప్పటికీ విజయవంతంగా పైలట్‌ శిక్షణ ముగించుకుని, ఉద్యోగంలో చేరిన తర్వాత లెవెల్‌-10 వేతన శ్రేణి (రూ.56,100 మూలవేతనం) అందుతుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. వేతన రూపంలో ప్రతినెలా రూ.లక్షకు పైగా అందుకోవచ్చు. ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో ఎయిర్‌ ఫోర్స్‌లో చేరినవారు రెండేళ్ల అనుభవంతో ఫ్లయిట్‌ లెఫ్టినెంట్‌గా పదోన్నతి పొందుతారు. ఆరేళ్ల అనుభవం ఉన్నవారు స్క్వాడ్రన్‌ లీడర్‌ అవుతారు. పదమూడేళ్ల సర్వీస్‌తో వింగ్‌ కమాండర్‌ స్థాయికి చేరుకుంటారు. అత్యున్నత ప్రతిభావంతులు భవిష్యత్తులో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ (ఎయిర్‌ ఫోర్స్‌లో అత్యున్నత ఉద్యోగం) హోదాతో భారతీయ వాయు సేనకు దిశానిర్దేశం చేయవచ్చు.  

వెబ్‌సైట్లు:

https://www.upsc.gov.in/

https://careerairforce.nic.in/

https://www.joinindiannavy.gov.in/

ఇంటర్‌తో..

ఉచితంగా పైలట్‌ మొదటి అవకాశం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ (ఎన్‌డీఏ)తో సాధ్యమవుతుంది. ఈ పరీక్షను ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు లభిస్తాయి. పైలట్‌ కావాలనుకునేవాళ్లు ఎయిర్‌ ఫోర్స్‌ విభాగాన్ని ఎంచుకోవాలి. ఫిజిక్స్, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు ఎయిర్‌ ఫోర్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సైతం అర్హులే. వయసు 16 1/2 నుంచి 19 1/2 ఏళ్లలోపు, ఎత్తు 162.5 సెం.మీ. ఉండాలి.  

రాత పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి. ఎంపికైనవారికి నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ (ఎన్‌డీఏ) పుణెలో శిక్షణ, కోర్సు అందిస్తారు. అనంతరం పైలట్‌ శిక్షణ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడెమీ (ఏఎఫ్‌ఏ) - హైదరాబాద్‌ (దుండిగల్‌)తో పాటు పలు కేంద్రాల్లో సుమారు 18 నెలల వరకు నిర్వహిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారు ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో ఎయిర్‌ ఫోర్స్‌లో సేవలందిస్తారు.   

డిగ్రీతో..

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలకు యూపీఎస్సీ ఏడాదికి రెండు సార్లు కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌ఈ) నిర్వహిస్తోంది. పైలట్‌ కావాలనుకున్నవారు ఎయిర్‌ ఫోర్స్‌ విభాగాన్ని ఎంచుకోవాలి. ఏదైనా సాధారణ డిగ్రీ లేదా బీఈ/బీటెక్‌ ఉండాలి. ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ చదివుండడం తప్పనిసరి. చివరి ఏడాది డిగ్రీ కోర్సులు చదువుతున్నవాళ్లూ దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయసు 20-24 ఏళ్లలోపు, ఎత్తు 162.5 సెం.మీ. ఉండాలి. పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి 74 వారాల పాటు ఎయిర్‌ ఫోర్స్‌ అకాడెమీలో శిక్షణ ఇచ్చి, ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో ఎయిర్‌ ఫోర్స్‌లో విధుల్లోకి తీసుకుంటారు.

సివిల్‌ పైలట్‌ 

సివిల్‌ పైలట్‌ కావాలనుకున్నవారు ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ చదివుండడం తప్పనిసరి. 17 ఏళ్లు వయసు నిండినవారికి అవకాశం లభిస్తుంది. దేశంలో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) గుర్తింపు పొందిన 35 పైలట్‌ శిక్షణ సంస్థలు ఉన్నాయి. వీటిలో 18 నెలల కోర్సు పూర్తిచేసుకుని కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ (సీపీఎల్‌) అందుకోవచ్చు. ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్‌ అకాడెమీ (ఐజీఆర్‌యూఏ) జాతీయ సంస్థ. ఇక్కడ సీపీఎల్‌ కోర్సు పూర్తిచేయడానికి 45 లక్షల రూపాయిలకు పైగా వెచ్చించాలి. 

కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ పొందడానికి బాగా శ్రమించాలి. సీపీఎల్‌ చేతికందిన తర్వాత ఉద్యోగం వచ్చేస్తుందనుకోవడానికి లేదు. మార్కెట్‌ పరిస్థితులపై అవకాశాలు ముడిపడి ఉంటాయి. ‘మా సంస్థలో చేరితే ఉద్యోగం గ్యారెంటీ’ అని ఎవరైనా చెప్పితే నమ్మడానికి లేదు. విమానం నడపడం కారు తోలడం లాంటిది కాదు. అంతా సాంకేతికతతో ముడిపడి ఉంటుంది. కష్టపడితేగానీ పరీక్షల్లో గట్టెక్కడం తేలిక కాదు. పెద్ద మొత్తంలో డబ్బుతో ముడిపడిన వ్యవహారం కాబట్టి సివిల్‌ పైలట్‌ కోర్సుల్లో చేరాలనుకునేవాళ్లు మంచీ, చెడూ రెండూ బేరీజు వేసుకుని నిర్ణయానికి రావాలి. పైలట్‌ వృత్తిలో చేరిన తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి మెడికల్‌ టెస్టుల్లో ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాలి. 
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఫార్మసీలో పీజీకి జీప్యాట్‌!

‣ మహిళలకు యూనిఫామ్‌ సర్వీసెస్‌ కోర్సులు!

‣ ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఏంచేయాలి?

‣ విదేశీ విద్యకు సిద్ధమవుతున్నారా?

‣ మిలిటరీ కాలేజీలో ఉద్యోగాలు

Posted Date : 28-02-2023 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం