‣ డైటీషియన్, న్యూట్రిషన్ కోర్సులు, ఉద్యోగాలు
‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనేది వంద శాతం వాస్తవం. చాలావరకు ఆరోగ్య సమస్యలకు మనం తీసుకునే ఆహారమే కారణమవుతుందనేది కాదనలేని నిజం. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎలాంటి ఆహారం తినాలి, ఎదుర్కొంటోన్న ఆరోగ్య సమస్యలకు ఏ ఆహారం తగినది, బరువు పెరగాలంటే ఏం తీసుకోవాలి, దాన్ని అదుపులో ఉంచడానికి ఏం తినాలీ...ఇలా ప్రతి దానికీ కచ్చితమైన నియమాలున్నాయి. ఆ శాస్త్రీయ సమాచారాన్ని మనకు సూచించేవారే న్యూట్రిషనిస్టులు, డైటీషియన్లు. ఇప్పుడు వీరికి గిరాకీ పెరుగుతోంది. ఆసక్తి ఉంటే మీరూ ఈ పోషకాహార నిపుణులు కావచ్చు. అదెలాగో చూద్దాం!
మారుతున్న జీవనశైలి ఎన్నో సమస్యలకు కారణమవుతోంది. అలాగే ఆరోగ్యం, శరీరాకృతి మీద అన్ని వయసులవారికీ ఇప్పుడు శ్రద్ధ పెరుగుతోంది. అందుకే ‘డైట్’ అనే పదం తరచూ వినిపిస్తోంది. ఏ మోతాదులో ఏమేం తినాలి అని సూచించేవాళ్లే డైటీషియన్లు, న్యూట్రిషనిస్టులు. అయితే ఈ హోదాలకు సంబంధించి అర్హతలు, విధులు వేర్వేరుగా ఉంటాయి. న్యూట్రిషనిస్టులు బరువు తగ్గడానికి లేదా పెరగడానికి తీసుకునే ఆహారం పట్ల సలహాలిస్తారు. డైటీషియన్లు రోగి ఆరోగ్య సమస్యను అనుసరించి ఏ ఆహారం తీసుకోవాలో సూచిస్తారు. డైటీషియన్లు.. న్యూట్రిషనిస్టులుగా పనిచేయగలరు. కానీ న్యూట్రిషనిస్టులు మాత్రం డైటీషియన్ల విధుల్ని నిర్వర్తించలేరు.
ప్రవేశం ఇలా...
బోటనీ, జువాలజీ (బయాలజీ), ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న తర్వాత మూడేళ్ల డిగ్రీలో భాగంగా న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ కోర్సులు చదువుకోవచ్చు. ఆ తర్వాత ఆసక్తి ఉంటే రెండేళ్ల ఎమ్మెస్సీలో చేరవచ్చు. కొన్ని సంస్థలు ఏడాది వ్యవధితో డిగ్రీ అర్హతతో పీజీ డిప్లొమా కోర్సులనూ అందిస్తున్నాయి. పీజీ అర్హతతో న్యూట్రిషనిస్టుగా రాణించవచ్చు. ఒకవేళ డైటీషియన్ కావాలనుకుంటే కోర్సు పూర్తయిన తర్వాత 6 నెలల ఇంటర్న్‌షిప్‌తోపాటు, ఇండియన్ డైటెటిక్ అసోసియేషన్(ఐడీఏ) నిర్వహించే రిజిస్టర్డ్ డైటీషియన్(ఆర్‌డీ) పరీక్ష రాయాలి. అందులో అర్హత సాధించినవారికి డైటీషియన్ హోదా దక్కుతుంది.
బీఎస్సీ లైఫ్‌సైన్సెస్/ అప్లయిడ్ న్యూట్రిషన్/ అప్లయిడ్ న్యూట్రిషన్ అండ్ పబ్లిక్ హెల్త్/ క్లినికల్ న్యూట్రిషన్ డైటెటిక్స్/ ఫుడ్ అండ్ న్యూట్రిషన్/ ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్/ ఫుడ్ టెక్నాలజీ/ న్యూట్రిషన్/ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్/ కమ్యూనిటీ సైన్స్.. తదితర పేర్లతో బీఎస్సీ స్థాయిలో పలు డిగ్రీ కళాశాలలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, అటానమస్ సంస్థలు కోర్సులు అందిస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తిచేసుకున్నవారు పీజీలో భాగంగా ఎమ్మెస్సీ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్‌లో చేరవచ్చు. జాతీయ స్థాయి సంస్థల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి సీయూసెట్ యూజీ/పీజీ రాయాలి. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పలు సంస్థలు యూజీ స్థాయిలో న్యూట్రిషన్ కోర్సులు అందిస్తున్నాయి. ఇంటర్ మార్కుల మెరిట్‌తో దోస్త్ వెబ్‌సైట్ ద్వారా ప్రవేశం పొందవచ్చు.
బీఎస్సీ న్యూట్రిషన్: కోర్సు వ్యవధి మూడేళ్లు. ఇందులో భాగంగా.. మానవ శరీరధర్మశాస్త్రం, న్యూట్రిషన్‌లోని ప్రాథమికాంశాలు, ఫుడ్ బయోటెక్నాలజీ, ఆరోగ్యం, బరువు తగ్గే వ్యూహాల గురించి చదువుతారు. కోర్సు పూర్తయ్యేసరికి బీఎంఐ(బాడీమాస్ ఇండెక్స్)ను అనుసరించి డైట్ చార్ట్‌లు, బరువు తగ్గేందుకు తోడ్పడే డైట్ ప్రణాళికలను ఎలా రూపొందించాలో నేర్చుకుంటారు.
బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ: ఈ కోర్సు కాలవ్యవధి మూడేళ్లు. ఇందులో భాగంగా ఆహారాన్ని ఎంపిక చేయడం, భద్రపర్చడం, ప్యాకింగ్, పంపిణీలు..ఫుడ్ టెక్నాలజీ కిందకు వస్తాయి. ఈ కోర్సులో భాగంగా ఫుడ్ టెక్నాలజీ ప్రాథమికాంశాలు, ఫుడ్ సైన్స్ నియమాలు, న్యూట్రిషన్, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇంజినీరింగ్, ఆహార తయారీ గురించి నేర్చుకుంటారు. ఆహార నాణ్యత, నిర్వహణలపై శిక్షణ పొందుతారు. ఈ కోర్సు ద్వారా ఫుడ్ అండ్ న్యూట్రిషన్‌లో దాగివున్న శాస్త్రీయ కోణాన్ని, న్యూట్రిషన్ చుట్టూ ఉన్న అవకాశాల గురించి తెలుసుకుంటారు.
ఎమ్మెస్సీ: డిగ్రీలో థియరీ, ప్రాక్టికల్ తరగతులు, పీజీలో ఇంటర్న్‌షిప్, పరిశోధనల వల్ల సబ్జెక్టుపై పూర్తి పట్టు దక్కుతుంది. ఎమ్మెస్సీలో నచ్చిన స్పెషలైజేషన్ ఎంపిక చేసుకోవచ్చు. క్లినికల్ హెల్త్, చైల్డ్/ అడాలసెంట్, పబ్లిక్ హెల్త్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటివి. ఈ కోర్సు ఎక్కువగా అడ్వాన్స్డ్ హ్యుమన్ న్యూట్రిషన్, థెరప్యూటిక్ న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్, క్వాలిటీ కంట్రోల్ అంశాల మీద దృష్టి సారిస్తుంది. కోర్సు పూర్తయ్యాక 6-8 నెలల ఇంటర్న్‌షిప్ చేయడం తప్పనిసరి. పరిశోధన రంగంవైపు వెళ్లాలనుకునే విద్యార్థులు తమకు నచ్చిన విషయం/ అంశం పట్ల పరిశోధన జరపడం వల్ల పుస్తకాల్లో చదివిన అంశాలను స్వీయానుభవంలోకి తెచ్చుకునే వీలుంటుంది. పీజీ కోర్సుల్లో చేరడానికి ప్రవేశ పరీక్ష రాయాలి.
ఉపాధి అవకాశాలు
మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు, హెల్త్‌కేర్ సెంటర్లు, కార్పొరేట్ వ్యాయామ శాలలు, వెల్‌నెస్ సెంటర్లు, నర్సింగ్ హోమ్‌లు, హోటళ్లు, పాఠశాలలు, కాలేజీలు, పరిశోధనా కేంద్రాలు, ఆహార తయారీ కేంద్రాలు/ పరిశ్రమలు, అంతర్జాతీయ ఏజెన్సీల్లో న్యూట్రిషనిస్టులు, డైటీషియన్లకు ఉద్యోగాలుంటాయి. భారత్‌లోనే కాక ఇతర దేశాల్లోనూ వీరికి గణనీయమైన డిమాండ్ ఉంది. ఇప్పుడు సెలబ్రిటీలు, పారిశ్రామిక దిగ్గజాలు ప్రత్యేకంగా వీరిని నియమించుకుంటున్నాయి.
‣ న్యూట్రిషనిస్ట్: ఏవి ఎంత మోతాదులో తీసుకోవాలి, ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యం మీద ఎలా ప్రభావం చూపిస్తున్నాయో తెలియజేసే నిపుణులు న్యూట్రిషనిస్టులు. వీరు వ్యక్తిగతంగా ఆరోగ్యవిధానాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.
‣ డైటీషియన్: వ్యాధి బారిన పడిన రోగి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిననుసరించి, త్వరగా కోలుకునేందుకు వీలుగా పోషకవిలువలు ఉండే ఆహారాన్ని సూచిస్తారు.
‣ క్లినికల్ డైటీషియన్: ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌ల్లో పనిచేస్తారు. ఉదాహరణకు క్యాన్సర్ వంటి దీర్ఘకాలికవ్యాధితో బాధపడుతున్న రోగులు తీసుకునే ఆహారం విషయంలో సాయపడటం. రోగి తీసుకునే ఆహారంలోని పోషకవిలువల్ని అంచనా వేయడం, వారి రుచి, అభిరుచులమేర పోషకాలు తగ్గకుండా సమతులాహారాన్ని సూచించడం వీరి విధి.
‣ కమ్యూనిటీ డైటీషియన్: వీరు ఫిట్‌నెస్ క్లబ్‌లు, పబ్లిక్ హెల్త్ ఏజెన్సీలు, ప్రభుత్వ ప్రాజెక్టుల్లో భాగంగా వ్యాధులను నివారించేందుకు పోషకాహారం/ సమతులాహారం గురించి అవగాహన కల్పిస్తారు. వీరు బృందం లేదా కమ్యూనిటీలుగా ఏర్పడి పనిచేస్తారు.
‣ పీడియాట్రిక్ డైటీషియన్: వీరు పసిపిల్లల నుంచి టీనేజ్ వయసువారు తీసుకునే ఆహారం విషయంలో సూచనలిస్తారు. ఆసుపత్రుల్లో పీడియాట్రిక్ డైటీషియన్లుగా విధులు నిర్వర్తించొచ్చు లేదంటే ప్రైవేటుగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నగరాల్లో వీరికి మంచి అవకాశాలు అందుతున్నాయి.
‣ స్పోర్ట్స్ అండ్ హెల్త్ డైటీషియన్: వీరు స్పోర్ట్స్ శిక్షణ కేంద్రాలు/ క్లబ్‌లు, స్పోర్ట్స్ హాస్టళ్లు, అథ్లెటిక్ టీమ్‌ల్లో పనిచేస్తారు. ఆటగాళ్ల బరువు, శరీరతీరుని అనుసరించి పోషకాహార డైట్‌ను సూచిస్తారు.
డైటీషియన్లు ఆహార తయారీ కేంద్రాల్లోనూ సేవలు అందించవచ్చు. వీరు ఆహార పదార్థాల నాణ్యత, పోషక విలువల గురించి అక్కడ పరిశోధనలు నిర్వర్తిస్తారు. అలాగే పాఠశాలలు, కాలేజీల్లో న్యూట్రిషన్/పోషణ సబ్జెక్టు గురించి అవగాహన కల్పించేలా హోమ్ సైన్స్ టీచర్‌గా, లెక్చరర్‌గా తరగతులు చెప్పవచ్చు. న్యూట్రిషన్ స్పెషలిస్ట్, ఫుడ్ ప్రాసెసింగ్ మేనేజర్, వ్యక్తిగత డైటీషియన్, ఫుడ్ క్వాలిటీ ఇన్‌స్పెక్టర్, ఫుడ్ సైంటిస్టులుగా రాణించొచ్చు లేదంటే సొంతంగా ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు.
విద్యా సంస్థలివీ...
హైదరాబాద్ కేంద్రంగా జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్)- ఎమ్మెస్సీ(న్యూట్రిషన్/ స్పోర్ట్స్ న్యూట్రిషన్), ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం, కె.వి.రంగారెడ్డి మహిళా డిగ్రీ కళాశాల- బీఎస్సీ అప్లైడ్ న్యూట్రిషన్, సెయింట్ ఆన్స్ మహిళా కళాశాల- బీఎస్సీ(ఏఎన్‌జెడ్‌సీ), ఎమ్మెస్సీ(క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్), సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల- బీఎస్సీ(ఏఎన్‌జెడ్‌సీ), ఎమ్మెస్సీ(న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్) కోర్సులు అందిస్తున్నాయి. ఇవే కాకుండా మరెన్నో సంస్థల్లో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీజీ డిప్లొమా స్థాయిల్లో న్యూట్రిషన్‌కు సంబంధించిన కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
జాతీయ స్థాయిలో.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమ్ ఎకనామిక్స్-న్యూదిల్లీ, ఎస్‌ఎన్‌డీటీ ఉమెన్స్ యూనివర్సిటీ-ముంబై, ఉమెన్ క్రిస్టియన్ కాలేజ్-చెన్నై, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్-ముంబై, లేడీ ఐర్విన్ కాలేజ్-న్యూదిల్లీ... తదితర సంస్థలు న్యూట్రిషన్ చదువుల్లో పేరొందాయి.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఆరోగ్య రక్షణలో కోర్సుల్లోకి ఆహ్వానం