• facebook
  • twitter
  • whatsapp
  • telegram

chartered accountant: నాన్నా నేను సీఏ సాధించా!

ఆ తండ్రికి పుత్రికోత్సాహం!
 


అసలే మురికివాడ.. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. ఇలాంటి ఆర్థిక పరిస్థితుల మధ్య చదువుకోవడమే గగనమనుకుంటే.. ఏకంగా సీఏ (ఛార్టర్డ్‌ అకౌంటెంట్) కావాలనుకుంది ఆ అమ్మాయి. ‘చాయ్‌ అమ్ముతూ నీ కూతురిని అంత పెద్ద కోర్సు ఎలా చదివిస్తావ్‌?’ అంటూ ఆమె తండ్రిని ఇరుగుపొరుగు వాళ్లు హేళన చేసేవారు. అయినా ఇవేవీ పట్టించుకోకుండా తన కూతురు కలను నిజం చేయాలనుకున్నాడా తండ్రి. ఇలా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇటీవలే తన కలను నెరవేర్చుకుంది అమిత ప్రజాపతి. ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు పదేళ్ల శ్రమ తనను సీఏను చేసిందంటూ కన్న తండ్రిని కౌగిలించుకొని ఎమోషనల్‌ అయిందామె. ఈ వీడియోను లింక్డిన్‌లో పోస్ట్‌ చేస్తూ.. తన పదేళ్ల సీఏ జర్నీని అక్షరీకరించింది. ప్రస్తుతం ఆమె పోస్ట్‌, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.


   నాన్నా.. పడరాని మాటలు పడ్డావు!  

‘నాన్నా నా కల ఫలించింది. నేను సీఏ అయ్యాను. నా పదేళ్ల శ్రమ ఫలితమిది. రోజూ ఈ కలను నిజం చేయాలని పరితపించేదాన్ని. నన్ను సీఏలో చేర్పించేందుకు నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు! ఎంతోమందితో పడరాని మాటలు పడ్డావు. ‘ఎందుకు నువ్వు నీ కూతురిని ఇంత పెద్ద కోర్సులో చేర్పించావు? డబ్బు వృథా.. నీ కూతురు సీఏ కాలేదు.. ఎందుకంటే తనకు ఆ తెలివితేటలు లేవు..’ అని ఇరుగుపొరుగు వాళ్లు, బంధువులు అంటుంటే.. వాళ్ల మాటలు నువ్వు పట్టించుకోలేదు.. పైగా నాపై పూర్తి నమ్మకముంచి నన్ను ప్రోత్సహించావు. ‘టీ అమ్ముతూ కూడబెట్టిన డబ్బుతో నీ కూతురిని చదివించే కంటే ఉండడానికో ఇల్లు కట్టుకో! ఎన్నాళ్లు ఇలా వీధుల్లో తిరుగుతూ నీ కూతుళ్లను పెంచుతావు? ఏదో ఒక రోజు వాళ్లు నిన్నొదిలి వేరే ఇంటికి వెళ్లాల్సిందే! అప్పుడు వాళ్ల సంపాదన అత్తింటి వారిది అవుతుంది.. కానీ నీకు మాత్రం ఏమీ మిగలదు..’ అని ఎంతమంది నిన్ను దెప్పి పొడిచినా మమ్మల్ని బాధ్యతగానే భావించావు తప్ప ఏనాడూ బరువనుకోలేదు..’

  అవును.. క్రేజీగానే ఆలోచించా!  

‘నిజానికి నేను మురికివాడకు చెందిన అమ్మాయినే కావచ్చు.. అందుకు నేను సిగ్గుపడట్లేదు. ‘మురికివాడల్లో ఉండే వాళ్లకే సీఏ కావాలన్న క్రేజీ ఆలోచనలొస్తాయి..’ అంటూ మాట్లాడిన వాళ్లూ ఎంతోమంది! అవును.. వాళ్ల మాటలు నిజమే! ఎందుకంటే నేను ఇంత క్రేజీగా ఆలోచించకపోతే ఈ స్థాయికి చేరుకునేదాన్నే కాదు. ఒకప్పుడు మా వల్లే నా తండ్రి సొంతిల్లుకు నోచుకోలేకపోతున్నాడని అన్నారు చాలామంది. ఇప్పుడు నా తండ్రికి సొంతిల్లు కానుకగా ఇవ్వగలిగే సామర్థ్యం నాకు ఉంది. అంతేకాదు.. ఆయన ఆశయాలన్నీ నెరవేర్చుతా. నాన్నను ఇలా కౌగిలించుకొని ఎమోషనల్‌ అవడం ఇదే తొలిసారి.. ఈ ప్రేమలో ఎంతో ప్రశాంతత ఉంది. ఈ క్షణం కోసం పదేళ్లు నిరీక్షించా. నా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఇది నిజమైంది. ఏదో ఒక రోజు నేను వాళ్లను విడిచిపెట్టి వెళ్లిపోతానని అనుకోకుండా.. మేము మా కూతురిని చదివించి ప్రయోజకురాలిని చేశామని వాళ్లు సంతృప్తి పడితే చాలు. అందుకే అందరికీ నేను చెప్పాలనుకున్నది ఒక్కటే.. ఇప్పటికైనా మించి పోయింది లేదు.. కన్న కలల్ని సాకారం చేసుకోండి..

ఇతరుల మాటలు పట్టించుకోకుండా మీ మనసు మాట వినండి..’ అంటూ తన మనసులోని మాటల్ని అక్షరీకరించింది అమిత.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పొరపాట్లు దిద్దుకుంటే.. పక్కా గెలుపు!

‣ రోజుకో గంట చదివితే... రూ.34లక్షల జీతం!

‣ ఆర్థిక రంగ నిపుణులకు ఆహ్వానం!

‣ జాబ్‌ మార్కెట్‌లో ఏఐ జోరు!

‣ పాఠాలు అర్థం కావడం లేదా?

Posted Date : 23-07-2024 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం