• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సెలవుల్లో ఇలా చేద్దాం!

చదివి చదివి అలసిపోయారా..? అందుకేగా మీకోసం దసరా సెలవులు వచ్చేశాయి...! సెలవులంటేనే సరదా... అలా అని రొటీన్‌గా సినిమాలు చూడటం, క్రికెట్‌ ఆడటం కాకుండా... ఈసారి సెలవుల్లో ఇంకా కొత్తగా ఏం చేయొచ్చో, ఈ సమయాన్ని ఉపయోగకరంగా ఎలా గడపొచ్చో, రేప్పొద్దున్న ఇంటర్వ్యూలకు వెళ్లేటప్పుడు రెజ్యూమెలో ఆకట్టుకునేలా కనిపించేలా ఏం నేర్చుకోవచ్చో ఓసారి చూడండి... నచ్చినదాన్ని అమలు చేయండి!

ఓ మంచి పుస్తకం చదవండి. సెలవుల్లోనూ పుస్తకాలేనా అనొద్దు! సబ్జెక్ట్‌ బయట మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అనుభవజ్ఞులు, నిపుణులు వాటిని సొంతమాటల్లో పుస్తకరూపంలో మనకు అందిస్తూ ఉంటారు. ఒక అద్భుతమైన పుస్తకం ఇచ్చే జ్ఞానం, రేకెత్తించే ఆలోచన.. మనలో పునరుత్తేజానికి తోడ్పడుతుంది. విద్యార్థి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడంలో ఒక్కో పుస్తకం ఒక్కో ఇటుక లాంటిది!   

సాహసయాత్రలకు వెళ్లండి... ఇవి రోజువారీ జీవితానికి భిన్నంగా ఉండటమే కాదు, కొత్త అనుభవాన్ని ఇస్తాయి. క్లిష్టమైన పరిస్థితులనూ, వివిధ రకాలైన మనుషులనూ ఎదుర్కోవడం మన మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుంది. ట్రెక్కింగ్, రాఫ్టింగ్, పారాగ్లైడింగ్, స్కూబా డైవింగ్, క్యాంపింగ్‌... ఇలా చాలారకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ప్రోత్సహించేందుకు కొన్నిచోట్ల సంస్థలు, సొసైటీలు కూడా నిర్వహిస్తున్నారు. 

వ్యాయామం శరీరాన్నీ మనసునూ రీఛార్జ్‌ చేసే చక్కటి సాధనం. యోగా, ఏరోబిక్స్, సైక్లింగ్, స్విమ్మింగ్‌... ఇలా నచ్చినదాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి. కుదిరితే జిమ్‌లో చేరడం ద్వారా ఆరోగ్యంపై శ్రద్ధ వహించడానికే కాక, మెరుగైన శరీర సౌష్టవానికీ ఉపయోగపడుతుంది. 

వంట ప్రతి ఒక్కరికీ అవసరమైన కనీస నైపుణ్యం. ఎప్పుడూ అమ్మ వండి పెట్టడమేనా! సరదాగా మీరూ గరిట తిప్పండి. ముందు సులువుగా అయిపోయే వంటకాలతో ప్రారంభించి... ఆపైన కూరలు, పిండివంటల లాంటివి ప్రయత్నించవచ్చు. కటింగ్, క్లీనింగ్‌ వంటివీ తెలుసుకోవడం వల్ల తర్వాత ఎప్పుడైనా యూనివర్సిటీలు, విదేశాలకు వెళ్లి ఒంటరిగా ఉండాల్సి వస్తే చాలా ఉపయోగపడుతుంది. 

స్వల్పకాల వ్యవధిగల ఏదైనా కోర్సులో చేరండి. ఏ అంశం మీదనైనా సరే కనీస అవగాహన ఏర్పడేందుకు ఈ సర్టిఫికెట్‌ కోర్సులు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ - మెషిన్‌ లెర్నింగ్, ప్రోగ్రామింగ్, ఎథికల్‌ హ్యాకింగ్, పిక్సల్‌ ఆర్ట్, బిజినెస్‌ మేనేజ్‌మెంట్, డిజైనింగ్, ఫొటోగ్రఫీ... ఇలా ఎన్నో రకాల కోర్సులు ఉన్నాయి. మీకు నచ్చినదాన్ని ఎంపిక చేసుకోండి.  

బంధుమిత్రుల్ని కలవండి. నలుగురితో నడవడాన్ని మించిన ప్రయాణం ఏం ఉంటుంది చెప్పండి? అందుకే గతంలో సెలవులంటే చాలు... అమ్మమ్మ, తాతయ్యల ఊళ్లకు పరుగులుపెట్టేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది... దూరం పెరిగింది... ఇలా ఇళ్లకు వెళ్లడం తగ్గిపోయింది. ఈసారి సరదాగా వెళ్లి రండి. అనుబంధాలు పెంచుకోవడంలో ఈ ఆత్మీయ కలయికలు ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తాయి. 

ఇతరులకు సాయం చేయడం కచ్చితంగా నేర్చుకోవాల్సిన విషయం మాత్రమే కాదు, మనసుకు సంతోషాన్నిచ్చే అంశం కూడా. మన చుట్టూ ఎన్నో స్వచ్ఛంద సంస్థలున్నాయి. పేదలు, వ్యాధిగ్రస్థులు, అనాథలు, వృద్ధులు... ఇలాంటి వారి కోసం పనిచేసే సంస్థల్లో వాలంటీర్లుగా చేరడం ద్వారా సమాజాన్ని మరోకోణంలో చూసే అవకాశం దక్కుతుంది.

ఇవేకాక ఏదైనా కొత్త భాష నేర్చుకోవడం,  సంగీత వాద్యం సాధన చేయడం, నచ్చిన ఆటలు ఆడటం, క్రాఫ్ట్స్‌ చేయడం, మొక్కలు పెంచడం, ఇంటిని పూర్తిగా శుభ్రం చేయడం - అలంకరించడం... ఇలా బోలెడన్ని ఉన్నాయి. మీకు నచ్చినదేదో చూసేసి చేసేయడమే ఆలస్యం!

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 1,00,000 స్కాలర్‌షిప్‌లు

‣ వేగంగా నేర్చుకోవాలంటే!

‣ ఏఐ - ఎంఎల్‌ ఎందుకు నేర్చుకోవాలి?

‣ వాతావరణశాఖలో నాన్‌-గెజిటెడ్‌ ఉద్యోగాలు

‣ నొప్పి నివారణలో నేర్పరులు!

‣ ఇప్పుడు ట్రెండింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌!

‣ ఔషధ మొక్కల నిపుణులకు డిమాండ్‌!

Posted Date : 04-10-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌