• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కోస్ట్‌గార్డ్‌ కొలువు కావాలా?

అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

భారతీయ తీర గస్తీ దళం (ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌) తాజాగా అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ)/ డెప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఎస్‌పీ) స్థాయులకు ఇది సమాన హోదా. ఎంపికైనవాళ్లు నేరుగా గ్రూప్‌-ఎ గెజిటెడ్‌ ఆఫీసర్‌ పోస్టు సొంతం చేసుకోవచ్చు. ఆకర్షణీయ వేతనం అందుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు. 

అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హులకు ఆప్టిట్యూడ్‌ టెస్టు ఆబ్జెక్టివ్‌ తరహాలో ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. ప్రశ్నపత్రానికి 400 మార్కులు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు చొప్పున మొత్తం వంద ప్రశ్నలు అడుగుతారు. తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. జనరల్‌ డ్యూటీ, సీపీఎల్‌ విభాగాలకు దరఖాస్తు చేసుకున్నవారికి... ఇంగ్లిష్, రీజనింగ్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ, జనరల్‌ సైన్స్‌ అండ్‌ మ్యాథమెటికల్‌ ఆప్టిట్యూడ్, జనరల్‌ నాలెడ్జ్‌ ఒక్కో సబ్జెక్టులోనూ 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. ఇంజినీరింగ్‌ పోస్టులకు పైన పేర్కొన్న ఒక్కో విభాగం నుంచి 10 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. సంబంధిత ఇంజినీరింగ్‌ బ్రాంచీ నుంచి 60 ప్రశ్నలు వస్తాయి. 

ఇందులో అర్హత సాధించినవారికి స్టేజ్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా కంప్యూటరైజ్డ్‌ కాగ్నిటివ్‌ బ్యాటరీ టెస్టు(సీసీబీటీ), పిక్చర్‌ పెర్సెప్షన్‌ అండ్‌ డిస్కషన్‌ టెస్టు (పీపీఅండ్‌డీటీ) ఉంటాయి. సీసీబీటీ ఆంగ్ల మాధ్యమంలో, ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. పీపీ అండ్‌ డీటీ కోసం ఆంగ్లం/ హిందీలో మాట్లాడాలి. స్టేజ్‌-2 అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో ఎంపికైనవారికి స్టేజ్‌-3 నిర్వహిస్తారు. ఇందులో సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ టాస్క్, ఇంటర్వ్యూ ఉంటాయి. స్టేజ్‌-3లోనూ మెరిస్తే స్టేజ్‌-4లో భాగంగా మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో నిలిచినవారికి స్టేజ్‌-5లో భాగంగా స్టేజ్‌-1, 3ల్లో సాధించిన మార్కుల ప్రకారం మెరిట్‌ లిస్టు తయారు చేసి, ఖాళీలకు అనుగుణంగా అర్హులను శిక్షణకు తీసుకుంటారు. ఉద్యోగానికి ఎంపికైనవారి వివరాలు కోస్టు గార్డు వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.  

ఉద్యోగంలో...

వీరికి ఐఎన్‌ఏ, ఎజమాళలో జనవరి 2024 నుంచి శిక్షణ మొదలవుతుంది. దాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని అసిస్టెంట్‌ కమాండెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఈ సమయంలో రూ.56,100 మూలవేతనం చెల్లిస్తారు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. అన్నీ కలిపి ప్రారంభం నుంచే రూ.లక్షకుపైగా జీతం అందుకోవచ్చు. తక్కువ వ్యవధిలోనే డెప్యూటీ కమాండెంట్, కమాండెంట్‌  హోదాలు పొందవచ్చు. భారత సముద్ర తీరాన్ని వీరు పర్యవేక్షిస్తారు. విధుల్లో భాగంగా వీరు... తీరం వెంబడి శత్రువుల రాకను సమర్థంగా అడ్డుకుంటారు. ప్రమాదంలో చిక్కుకున్న మత్స్యకారులకు సహాయపడతారు. కింది స్థాయి ఉద్యోగులకు దిశానిర్దేశం చేస్తారు.

విద్యార్హత, వయసు 

పోస్టు: అసిస్టెంట్‌ కమాండెంట్లు (గ్రూప్‌-ఎ గెజిటెడ్‌ ఆఫీసర్‌)

1) జనరల్‌ డ్యూటీ (పురుషులు)

అర్హత: కనీసం 60శాతం అగ్రిగేట్‌ మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ఇంటర్మీడియట్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులు పొంది ఉండాలి.  

వయసు: అభ్యర్థులు 01.07.1998 - 30.06.2002 మధ్య జన్మించి ఉండాలి. 

2) కమర్షియల్‌ పైలట్‌ ఎంట్రీ (పురుషులు/ మహిళలు)

అర్హత: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతోపాటు కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ ఉండాలి.

వయసు: 01.07.1998 - 30.06.2004 మధ్య జన్మించి ఉండాలి.  

3) టెక్నికల్‌ పురుషులు (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌)

అర్హత: కనీసం 60శాతం అగ్రిగేట్‌ మార్కులతో నిర్దేశిత బ్రాంచీల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. అలాగే ఇంటర్‌ ఎంపీసీ లేదా డిప్లొమాలోనూ 55 శాతం మార్కులు ఉండాలి. 

వయసు: 01.07.1998 - 30.06.2002 మధ్య జన్మించి ఉండాలి.  

4) లా (పురుషులు, మహిళలు)

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో లా డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 01.07.1994 - 30.06.2002 మధ్య జన్మించి ఉండాలి. 

ఈ అన్ని పోస్టులకూ ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. 

ఎత్తు: కమర్షియల్‌ పైలట్‌ ఎంట్రీకి 162.5 సెం.మీ. మిగిలిన విభాగాలకు 157 సెం.మీ. ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతోన్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 71 (జనరల్‌ డ్యూటీ/ కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ 50, ఇంజినీరింగ్‌ 20, లా 1) 

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ: ఫిబ్రవరి 9 సాయంత్రం 5 గంటల వరకు.

పరీక్ష ఫీజు: రూ.250. ఎస్సీ, ఎస్టీలు చెల్లించనవసరం లేదు.

పరీక్షలు: స్టేజ్‌-1 మార్చిలో స్టేజ్‌-2 మే-జూన్‌లో, స్టేజ్‌-3 జూన్‌-సెప్టెంబరు, స్టేజ్‌-4, 5 డిసెంబరులో.

వెబ్‌సైట్‌: https://www.joinindiancoastguard.gov.in/
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ జీవితబీమాలో ఆఫీసర్‌ ఉద్యోగాలు

‣ ఉన్నత విద్యకు ఉపకారవేతనం!

‣ పది పాసయ్యారా.. ఇదిగో మీకే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

‣ బాగా రాసేవాళ్ల‌కు బోలెడు ఉద్యోగాలు!

Posted Date : 30-01-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌