• facebook
  • twitter
  • whatsapp
  • telegram

బాగా రాసేవాళ్ల‌కు బోలెడు ఉద్యోగాలు!

కంటెంట్ రైట‌ర్స్‌కి పెరగ‌నున్న డిమాండ్‌

1 రోడ్డు మీద వెళ్తుంటాం... ఎదురుగా ఒక ప్రచార చిత్రం. ఆకట్టుకునే పంచ్‌ డైలాగ్‌తో కనిపిస్తూ ఉంటుంది. ఆ సంస్థ పేరు చెబితే వెంటనే ఈ వ్యాఖ్య గుర్తొచ్చేంతలా ఫేమస్‌ అయిపోయి ఉంటుంది.

2 ఏదో వస్తువు కొని ఇంటికి తీసుకువస్తాం. అదెలా ఉపయోగించాలో తెలియక తికమకపడుతున్నప్పుడు... అమ్మకందారు ఇచ్చిన చిన్న పుస్తకం గుర్తొస్తుంది. అందులో ఏదేంటో పూర్తిగా, చక్కగా వివరిస్తూ చిత్రాలతో సహా వివరణ ఉంటుంది. వెంటనే అది చూసి సందేహాలు నివృత్తి చేసుకుంటాం.

3 ఆన్‌లైన్‌లో దేని గురించి వెతికినా బోలెడంత సమాచారం. సరళమైన భాషలో, చదవగానే అర్థమయ్యేలా దేనికైనా జవాబులు లభిస్తాయి.

...ఇవన్నీ ఇలా రాసేదెవరా అని ఎప్పుడైనా ఆలోచించారా? వారే కంటెంట్‌ రైటర్స్‌. ప్రపంచంలో దేని గురించైనా కానీ... విపులంగా అందమైన భాషలో రాసేవారి అవసరం ఉంది. అందులోనూ అంతా ఆన్‌లైన్‌ అవుతున్న ఈ సమయంలో... వీరికి మరింత డిమాండ్‌ పెరిగింది.

   చీపురుపుల్ల నుంచి చైనా గోడ వరకూ ఏ విషయం గురించైనా సరే... ఆద్యంతం ఆసక్తికరంగా, ఆసాంతం చదివించేలా రాయడం ఒక కళ. రాతపూర్వకంగా ఉండే అంశాలు అన్నీ ఇలా ఎవరో ఒక కంటెంట్‌ రైటర్‌ కుదురుగా కూర్చుని బాగా రిసెర్చ్‌ చేసి రాసినవే! ముఖ్యంగా ప్రస్తుతం ప్రొడక్ట్‌ కంపెనీలు, వెబ్‌సైట్లు, వివిధ రకాల సంస్థలు, సోషల్‌ మీడియాలో వీరికి ఎక్కువగా అవకాశాలు లభిస్తున్నాయి. 

  ఇవనే కాదు... పీఆర్‌ విభాగాలు, డాక్యుమెంటేషన్‌ చేయాల్సిన అవసరం ఉన్నవి... ఏ కంపెనీలకైనా ఎంతోకొంత వీరి సేవలు అవసరం అవుతాయి. వార్తాపత్రికలు, టీవీ చానెళ్లు, డిజిటల్‌ మీడియా రంగంలోనూ ఇలా రాయడం తెలిసినవారికి మంచి అవకాశాలున్నాయి. అందుకే దీన్ని ఉద్యోగార్థులు కెరియర్‌ ఆప్షన్‌గా ఆలోచించవచ్చు.

అవ్వడం ఎలా?

కంటెంట్‌ రైటింగ్‌లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే... ప్రత్యేకంగా ఈ డిగ్రీలు చదివిన వారే అర్హులు అనే నిబంధనలు ఏవీ లేవు. ఎలాంటి విద్యార్హతలు ఉన్నా సరే... ఇందులో రాణించే అవకాశం ఉంది. అయితే దానికి ముందుగా చేయాల్సినది... ఎక్కువగా చదవడం. ఎంత చదివితే అంత బాగా రాయడం వస్తుంది. రాయాలి అనుకుంటున్న భాషలో ఉన్న సాహిత్యం చదివేందుకు ప్రయత్నించాలి. ప్రసిద్ధ రచయితలు రాసిన వివిధ రకాల సాహితీ ప్రక్రియల పుస్తకాలు చదవడం వల్ల వాటిపై అవగాహన పెరుగుతుంది. అంతర్లీనంగా అవి చూపే ప్రభావంతో రచనాశైలి మెరుగుపడుతుంది. భాషలో విరుపు, మెరుపు పట్టుకుంటే ఎంతటి సాధారణమైన విషయాన్ని అయినా అసాధారణంగా చెప్పగలిగే ప్రతిభ సొంతమవుతుంది!

 ఆ తర్వాత సొంతంగా రాయడం సాధన చేయాలి. నచ్చిన అంశాన్ని తీసుకుని దాన్ని పూర్తిస్థాయిలో విశ్లేషణాత్మకంగా చదువరులకు సమర్పించేలా రాయగలుగుతున్నామో లేదో చూడాలి. కుదిరితే రాసిన కాపీని వేరే వాళ్లకు చూపించి అభిప్రాయాలు అడగాలి. తప్పులను సరిచేసుకుంటూ కొత్తకొత్త ఎత్తుగడలతో రాసేందుకు ప్రయత్నించాలి.

వివిధ రకాలు 

కంటెంట్‌ అనేక రకాలు. వెబ్‌సైట్లు, బ్లాగులు, ఆర్టికల్స్, ఈ-బుక్స్, సోషల్‌ మీడియా పోస్టులు, ఆన్‌లైన్‌ అడ్వర్టైజింగ్‌ మెటీరియల్స్, ప్రొడక్ట్‌ డిస్క్రిప్షన్స్, పబ్లిక్‌ రిలేషన్స్‌ మెటీరియల్, మార్కెటింగ్‌ ఈ-మెయిల్స్, వీడియో కాపీ, పాడ్‌కాస్ట్‌ స్క్రిప్ట్‌.. ఇలా చెబుతూ పోతే ఈ జాబితా చాలా పెద్దది. ప్రస్తుతం వాణిజ్య అవసరాల కోసం ఆన్‌లైన్‌ అడ్వర్టైజింగ్, మార్కెటింగ్‌ పెరగడంతో డిజిటల్‌గా కాపీలు రాసేవారికి డిమాండ్‌ పెరుగుతోంది.

ఏ నైపుణ్యాలు కావాలి?

ఇందులో రాణించాలంటే... మొట్టమొదట కావాల్సినది భాషపై పట్టు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ... ఇలా ఎంచుకున్న భాషలో అర్థవంతంగా, తప్పుల్లేకుండా, సరైన సమాచారాన్ని ఆసక్తిరేపేలా రాసేంత భాషాజ్ఞానం సంపాదించాలి. పదసంపద పెంపు, వ్యాకరణంపై  దృష్టిసారించాలి. అదే సమయంలో రాసే అంశంపై లోతైన పరిశోధన చేసే ఓపిక, అప్పటికే ఉన్న సమాచారాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసే తీరు అలవరుచుకోవాలి. దేనిగురించైనా నలుగురికీ చెప్పాలి అనుకున్నప్పుడు ముందు మనకు దానిపై పూర్తి అవగాహన, అభిప్రాయాలు ఏర్పడాలి. ఆ భావనలను ఇతరులకు అర్థమయ్యే రీతిలో వివరంగా చెప్పేందుకు భాషానైపుణ్యం కావాలి. వీటిని అలవరుచుకున్న వారు కంటెంట్‌ రైటింగ్‌లో తిరుగులేని విధంగా రాణించగలరు.

ఎస్‌ఈవో 

ఎస్‌ఈవో (సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌) అనేది అధికశాతం మంది రైటర్లు ఉపయోగించే పద్ధతి. ఆన్‌లైన్‌ కంటెంట్‌ రాసేవారికి ఇది బాగా సహాయకారిగా ఉంటుంది. రాయాలి అనుకుంటున్న సబ్జెక్టులో కీలక పదాలు (కీవర్డ్స్‌) వాడుతూ సబ్జెక్ట్‌ రాయడం వల్ల ఎక్కువమందికి మనం రాసిన అంశాలు చేరువవుతాయి. దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకునేందుకు అంతర్జాలంలో ట్యుటోరియల్స్, సమాచారం దొరుకుతుంది. దీని సహాయంతో కంటెంట్‌ను మరింత బలంగా పాఠకుల్లోకి తీసుకెళ్లవచ్చు.

ఇవి ఉంటే...

ఇందులో కెరియర్‌ను నిర్మించుకోవాలి అనుకునే వారికి... విశ్లేషణ సామర్థ్యాలతోపాటు, రకరకాల సోర్సుల నుంచి సమాచారం సేకరించడం, దాన్ని క్రోడీకరించి సొంత శైలితో రాసే నేర్పు, క్రిటికల్‌ థింకింగ్, బిగి సడలని ఎడిటింగ్, సరిపడా టైపింగ్‌ వేగం, అన్నింటికీ మించి సృజనాత్మకత ఉండాలి. ముందే ఇవన్నీ లేకపోయినా... మెల్లమెల్లగా అలవరుచుకునే ఏకాగ్రత, ఆసక్తి కావాలి.

కోర్సులు 

భాష - సాహిత్యాల్లో డిగ్రీ, పీజీ, జర్నలిజం, కమ్యూనికేషన్స్‌ వంటివి కంటెంట్‌ రైటింగ్‌కు సంబంధించి సంప్రదాయ కోర్సులుగా చెప్పవచ్చు. ఆన్‌లైన్‌లో అయితే దీని కోసం వారాల నుంచి నెలల వ్యవధి గల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు కంటెంట్‌ మార్కెటింగ్‌ స్ట్రాటజీ, ప్రొమోషనల్‌ ఆడియో - వీడియో మేకింగ్, స్క్రిప్ట్‌ రైటింగ్‌ వంటి అనేక విభాగాల్లో కోర్సులు చేసేందుకు అవకాశం ఉంది. కోర్సెరా, యుడెమీ, సింప్లీలెర్న్‌ వంటి ప్రముఖ సంస్థలు వీటిని వివిధ యూనివర్సిటీలతో అనుసంధానమై అందిస్తున్నాయి. పూర్తిస్థాయిలో రైటింగ్‌ నేర్చుకున్నాక ఏదైనా సంస్థలో ఉద్యోగానికి కానీ, ఫ్రీలాన్సర్‌గా కానీ ప్రయత్నించవచ్చు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ అందరి అవసరాలకు అందుబాటులో కోర్సులు!

‣ ఐఐటీలో ఎంబీఏ, ఎంహెచ్‌ఆర్‌ఎం

‣ నీట్‌లో మేటిస్కోరుకు మెలకువలు!

‣ బీఆర్‌ఓలో 567 ఉద్యోగాలు

‣ పాదాలు పదిలం... కొలువులు పుష్కలం!

Posted Date : 20-01-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌