• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అనుభవం అక్కర్లేదు అందుకోండి ఉద్యోగాలు!

అధిక వేతనాలు అందించే కొలువుల నియామకాల్లో నయాట్రెండ్‌!

ప్రోగ్రామింగ్‌ అంటే ఆసక్తా... కోడింగ్‌ భాషల్లో అదరగొడతారా.. మ్యాథమేటిక్స్‌లో సత్తా  చాటగలరా..? అయితే ఇప్పుడు అనుభవంతో పనిలేకుండానే  ఏడంకెల జీతాన్ని అందుకోవచ్చు. ఇండీడ్, నౌకరీ లాంటి ప్రముఖ జాబ్‌ సెర్చ్‌ సంస్థలు చేసిన సర్వేలో వీటి సంబంధిత ఉద్యోగాలు అగ్రస్థానంలో నిలిచాయి. అత్యధిక వేతనాలు అందిస్తున్న ట్రెండింగ్‌ ఐటీ/ఐటీయేతర ఉద్యోగాల వివరాలేంటో మీరూ ఓ లుక్కేయండి మరి!

ఎథికల్‌ హ్యాకర్‌..

ఈ ఉద్యోగానికి చాలా రంగాల్లో డిమాండ్‌ ఉంది. టాప్‌ రిక్రూటింగ్‌ సంస్థల్లో ఒక్కటైన యాక్సెంచర్‌ చేసిన ఓ సర్వే ప్రకారం... ఐటీతోపాటు ప్రభుత్వరంగ, ఫైనాన్స్‌ సంస్థలు, నిఘా విభాగాల్లో ఈ ఎథికల్‌ హ్యాకర్లకు ఎక్కువ డిమాండ్‌ ఉన్నట్లు తేలింది. దీనికోసం బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో కంప్యూటర్‌ సైన్స్‌ లేదా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చేసివుండాలి. ఆపై సైబర్‌ సెక్యూరిటీలో పీజీ డిప్లొమా స్పెషలైజేషన్‌ పూర్తి చేసినవారు ఈ ఉద్యోగంలో స్థిరపడొచ్చు. నెలకు సుమారుగా రూ.90వేల నుంచి అత్యధికంగా ఏడాదికి రూ.30 లక్షల వరకు వేతనం  అందుకోవచ్చు. కొన్ని ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లు, టెక్నికల్‌ నైపుణ్యాలు అవసరం.

ఏఐ/మెషిన్‌ లర్నింగ్‌ ఆర్కిటెక్ట్‌..

వీరినే ఏఐ/ఎంల్‌ ఇంజినీర్‌ లేదా ఏఐ ఆర్కిటెక్ట్‌గా వ్యవహరిస్తారు. వీరికి ఐటీ రంగంలో చాలా డిమాండ్‌ ఉంది. పైతాన్, ఆర్‌ వంటి ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలతోపాటు గణాంక, రోబోటిక్‌ నైపుణ్యాలు అవసరం. జాబ్‌లో చేరిన సంవత్సరానికే ఏడాదికి రూ.17 లక్షలు, అనుభవమున్న వారికైతే రూ.22.5- 28.8 లక్షల వరకు వేతనాలు అందుతున్నాయి. ఇందుకు మ్యాథమేటిక్స్, కంప్యూటర్‌ సైన్స్, స్టాటిస్టిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఉండాలి. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌లో సర్టిఫికెట్‌ అవసరం. నౌకరీ.కామ్‌ చేసిన ఓ సర్వేలో... దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ ఎంఎల్‌ ఇంజినీర్లకు ప్రారంభ దశలోనే రూ.15 లక్షల వరకు కనీస వేతనాన్ని అందుకునే అవకాశముందని తేలింది.

ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌..

ఇటీవల మన దేశంలో 20శాతం మేర డిమాండ్‌ పెరిగిన ఉద్యోగమిది. ఫ్రంట్‌ ఎండ్, బ్యాక్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌ నైపుణ్యాలు కలిగినవారు ఐటీ విభాగాల్లో రాణించగలుగుతున్నారు. కోడింగ్, క్లౌడ్, డేటా బేస్‌ నైపుణ్యాలు అవసరం. పైథాన్, జావా, సీఎస్‌ఎస్, రెయిల్స్‌ వంటి కోడింగ్‌ లాంగ్వేజ్‌లలో ప్రావీణ్యం ఉన్నవారికి కొన్ని సంస్థలు.. కొత్తవారికి రూ.5-8 లక్షలు, అనుభవమున్న వారికైతే రూ.12-18 లక్షల వరకు వేతనాలు ఇస్తున్నాయి.

డేటా సైంటిస్ట్‌..

డేటా ప్రామాణికమైన ఈ రోజుల్లో డేటా సైంటిస్ట్‌ల హవా నడుస్తోంది. బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో కంప్యూటర్‌ సైన్స్, మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్‌ చదివినవారు అర్హులు కాగా, ప్రాజెక్టు అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. డేటా సైంటిస్ట్‌తోపాటు, డేటా ఎనలిస్ట్, డేటా ఆర్కిటెక్ట్‌లకు మంచి డిమాండ్‌ ఉందని చెప్పొచ్చు. ఫ్రెషర్లు అయితే ఏడాదికి రూ.7-11 లక్షల వరకు, అనుభవజ్ఞులు రూ.12-25 లక్షల వరకు వేతనం అందుకునే అవకాశముంది. ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలు, డేటా విజువలైజేషన్, మెషీన్‌ లర్నింగ్‌ నైపుణ్యాలు అవసరం. ఇండీడ్‌ చేసిన ఒక సర్వేలో.. ఈ ఉద్యోగానికి ఏటికేడు 29శాతం మేరకు డిమాండ్‌ పెరుగుతున్నట్లు తేలింది.

ప్రొడక్ట్‌ మేనేజర్‌

టెక్నాలజీ రంగంలో ఈ ఉద్యోగం చాలా కీలకమైంది. ప్రొడక్ట్‌ ప్లానింగ్‌ దశ నుంచి మార్కెటింగ్‌ అయ్యేవరకు వీరిదే బాధ్యతవుతుంది. ఫ్లిప్‌కార్ట్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, అమెజాన్‌ వంటి కంపెనీలు ఫ్రెషర్లకు రూ.15 లక్షలు, అనుభవమున్నవారికి అత్యధికంగా రూ.20-28 లక్షలదాకా వేతనాలు అందిస్తున్నాయి. డిగ్రీ లేదా పీజీ స్థాయిలో బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్‌ సైన్స్, ఫైనాన్స్‌ ఇంజినీరింగ్, ఎకనమిక్స్‌ను పూర్తిచేసి ఉండాలి. డొమైన్, కమ్యూనికేషన్‌ స్కిల్స్, వ్యాపార, ఇండస్ట్రీ స్థాయిలో నైపుణ్యాలున్నవారు ఉద్యోగంలో త్వరగా రాణిస్తారు.

చార్టర్డ్‌ అకౌంటెంట్‌: ఐటీయేతర ఉద్యోగాల్లో బాగా క్రేజ్‌ ఉన్న జాబ్‌ ఇది. ఆడిటింగ్, వాల్యుయేషన్, అకౌంటింగ్, ఆర్థికాంశాల విశ్లేషణలు వీరి విధి. కమ్యూనికేషన్‌ స్కిల్స్, విశ్లేషణాత్మక, సంఖ్యాపరమైన నైపుణ్యాలు అవసరం. ఇంటర్‌ స్థాయిలో కామర్స్‌ను సబ్జెక్టుగా చదివుండాలి. ఆపై సీఏ  పూర్తి చేయాలి. వీరికి కనీసం వేతనం రూ.15 లక్షలుకాగా, సీనియర్లైతే రూ.25-45 లక్షల వరకు అందుకోవచ్చు.

మార్కెటింగ్‌ ప్రొఫెషనల్‌: డిజిటల్, వెబ్, సోషల్‌ మీడియాలాంటి పలు సంస్థలకు మార్కెటింగ్‌ల్లో ప్రొఫెషనల్స్‌ అవసరం చాలా ఉంది. డిగ్రీలో ఎంబీఏ చదివుండాలి. సృజనాత్మకత, మార్కెట్‌పై కనీస అవగాహన, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అవసరం. వీరు ఫ్రెషర్‌ అయితే రూ.7 లక్షలు, సీనియర్‌ అయితే రూ.12 లక్షల వరకు వేతనం అందుకుంటున్నారు.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పోలీసు ఉద్యోగ పరీక్షలకు ఇదీ సిలబస్‌!

‣ టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌ సిలబస్‌, పరీక్షావిధానం, పోస్టుల వర్గీకరణ

‣ రాజ్యాంగంలో ఏవి ప్రధానం?

‣ నీట్‌లో ఏ సబ్జెక్ట్‌ ఎలా చదవాలి?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-04-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌