• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఫీజులు తక్కువ నాణ్యత ఎక్కువ!

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు ప్రకటన విడుదల

మనదేశంలో పాఠశాల విద్యకు కేంద్రీయ విద్యాలయాలు చిరునామాగా నిలుస్తున్నాయి. ఒకటో తరగతిలో ప్రవేశం లభిస్తే చాలు- ప్లస్‌ 2 వరకూ నిశ్చింతగా చదువుకోవచ్చు. ఒత్తిడి లేని నాణ్యమైన విద్యను నామమాత్రపు రుసుములతో అందించడంలో ఈ సంస్థలు పేరు గడించాయి. ఇక్కడ సీబీఎస్‌ఈ కరిక్యులమ్‌ అమలవుతోంది. సువిశాల ప్రాంగణాలు, సుశిక్షితులైన బోధనా సిబ్బంది, ఆటస్థలం, అన్ని రకాల సౌకర్యాలు...కేవీల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ సంస్థల్లో ప్రవేశాలకు ఇటీవల ప్రకటన వెలువడింది! 

చదువుతోపాటు ఇతర అంశాలకూ ప్రాధాన్యమివ్వడం కేవీల ప్రత్యేకత. పిల్లల సమగ్ర వికాసం ఆశించే తల్లిదండ్రులు వీటిలో చేర్చడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. వీటికి ఉన్న గిరాకీ దృష్ట్యా ప్రవేశం దక్కడం కష్టమైనప్పటికీ ఎంపిక పారదర్శకంగా ఉంటుంది. ఇందుకోసం లాటరీ విధానాన్ని అనుసరిస్తారు. అందువల్ల ఒకటో తరగతిలో తమ పిల్లలను చేర్చాలనుకున్నవారు ప్రయత్నం చేయవచ్చు. మిగిలిన తరగతుల్లో ఖాళీలు ఉంటేనే అవకాశం కల్పిస్తారు. 

తాజా మార్పు

గత ఏడాది వరకు అయిదేళ్లు పూర్తయితే ఒకటో తరగతిలో ప్రవేశం లభించేది. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020 ప్రకారం ఒకటో తరగతిలో ప్రవేశానికి ఆరేళ్లు నిండడం తప్పనిసరి. ఈ విద్యా సంవత్సరం అంటే 2022-23 నుంచి కేంద్రీయ విద్యాలయాలు దాన్ని అమలు చేస్తున్నాయి. అలాగే గతంలో గరిష్ఠంగా ఏడేళ్లలోపు వారికే ఒకటో తరగతిలో ప్రవేశం లభించేది. ఇప్పుడు ఎనిమిదేళ్ల వరకు ఆ అవకాశం ఉంది.  

సీట్ల భర్తీ ఇలా...

ప్రతి పాఠశాలలోనూ ఒకటో తరగతిలో ఒక సెక్షన్‌ ఉంటుంది. ఒక్కో సెక్షన్‌లోనూ ఆ పాఠశాల ఉన్న ప్రాంతాన్ని బట్టి కనీసం 20 నుంచి 60 వరకు సీట్లు లభిస్తున్నాయి. పలు పాఠశాలల్లో ఒకటో తరగతిలో రెండు నుంచి అయిదు వరకు సెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఉదయం, మధ్యాహ్నం షిఫ్ట్‌ విధానంలో తరగతులు నిర్వహిస్తున్నారు. సెక్షన్లు, షిఫ్ట్‌ల కారణంగా ఎక్కువమంది విద్యార్థులకు అవకాశం దక్కుతోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లను ముందుగా భర్తీ చేస్తారు. ఇందుకోసం వచ్చిన అన్ని దరఖాస్తులను కలిపి డ్రా తీస్తారు. ఈ విధానంలో ఎంపికైనవారికి ఫీజు నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది. 15 శాతం సీట్లు ఎస్సీలకు, 7.5 శాతం ఎస్టీలకు కేటాయించారు. అలాగే 27 శాతం సీట్లు ఓబీసీ నాన్‌ క్రీమీ లేయర్‌ వారితో నింపుతారు. రెండు సీట్లు సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ (తల్లిదండ్రులకు సంతానంగా ఒక కుమార్తె మాత్రమే ఉన్నవారు)కు ఉన్నాయి. దివ్యాంగులకు 3 శాతం సీట్లు లభిస్తున్నాయి. వీటిని ఆయా విభాగాలకు చెందిన దరఖాస్తుల నుంచి లాటరీ విధానంలో భర్తీ చేస్తారు. అన్ని కేటగిరీల్లోనూ భర్తీ చేయగా ఒకవేళ సీట్లు మిగిలితే వచ్చిన దరఖాస్తులన్నీ కలిపి లాటరీ విధానంలోనే కేటాయిస్తారు. 

ఒకటో తరగతి ప్రవేశాలకు ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. రెండో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్న ఖాళీలకు ఆ పాఠశాల ప్రిన్సిపల్, కమిటీ సభ్యుల సమక్షంలో ఆఫ్‌లైన్‌ విధానంలో లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. తొమ్మిదో తరగతిలో చేరడానికి పరీక్ష నిర్వహిస్తారు. అలాగే ప్లస్‌ 1లో ప్రవేశాలు పదో తరగతి పరీక్షల్లో సాధించిన మార్కులతో చేపడతారు. తొలి ప్రాధాన్యం కేంద్రీయ విద్యాలయాల్లో చదివినవారిని తీసుకుంటారు. సీట్లు మిగిలితే ఇతర బోర్డులవారికి అవకాశం కల్పిస్తారు.

వీరికి ప్రాధాన్యం...

సీట్ల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ, పారా మిలటరీలో పనిచేస్తున్నవారి పిల్లలకు ప్రాధాన్యం లభిస్తుంది. తరచూ బదిలీలు జరిగేవారు, పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీలు, స్వయంప్రతిపత్తి సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు... మొదలైన చోట్ల పనిచేసే ఉద్యోగుల చిన్నారులకు ఆ తర్వాతి ప్రాధాన్యం లభిస్తుంది. ప్రతి ఎంపీ (లోక్‌సభ) తన పరిధిలోని కేంద్రీయ విద్యాలయకు ఏడాదికి పది మందిని సిఫార్సు చేయవచ్చు. రాజ్యసభ సభ్యులైతే వారు ప్రాతినిధ్యం వహిస్తోన్న రాష్ట్రం పరిధిలో ఉన్న కేవీల్లోకి పది మందికి అవకాశం కల్పించవచ్చు. ఇలా ఎంపీలు ఎంపిక చేసిన విద్యార్థుల వివరాలను కేవీ కేంద్ర కార్యాలయానికి పంపిస్తారు. అక్కడి నుంచి ఆయా కేవీలకు అనుమతి పత్రాలు వస్తే సీట్లను కేటాయిస్తారు. అలాగే కేంద్ర మానవ వనరుల శాఖ, ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్‌ ఉన్నతోద్యోగులు, రిసెర్చ్‌ అండ్‌ ఎనాలసిస్‌ వింగ్‌...తదితర విభాగాలవారీ కొన్నేసి సీట్లు చొప్పున కోటా ఉంటుంది.

దరఖాస్తు ఇలా...

ఒకటో తరగతిలో ప్రవేశానికి విద్యార్థి వయసు మార్చి 31, 2022 నాటికి ఆరేళ్లు పూర్తికావాలి (ఏప్రిల్‌ 1 నాటికి పూర్తయినా పరిగణనలోకి తీసుకుంటారు) అలాగే ఎనిమిదేళ్లకు మించరాదు. తర్వాతి తరగతులకు ఒక్కో ఏడాదీ కలుపుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా ప్రాథమిక సమాచారంతో వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత లాగిన్‌తో మిగిలిన వివరాలు చేర్చాలి. వీటికి అవసరమైన పత్రాలు (వయసు ధ్రువీకరణ..మొదలైనవి) జత చేయాలి. అన్ని వివరాలు, పత్రాలు నమోదుచేసిన తర్వాత వాటిని ఒకసారి సరిచూసుకుని సబ్మిట్‌ చేయాలి. దరఖాస్తు చేసుకున్నప్పుడే చేరాలనుకుంటున్న మూడు కేవీలను ఎంపిక చేసుకోవాలి. మొదటి, రెండో, మూడో ప్రాధాన్యంగా వీటిని నమోదు చేయాలి. 

ఫీజు సంగతి?

విద్యా హక్కు చట్టం ద్వారా ప్రవేశాలు పొందినవారు ప్లస్‌ 2 వరకు ఎలాంటి ఫీజూ చెల్లించాల్సిన పనిలేదు. వీరికి పాఠ్యపుస్తకాలు, నోట్సులు, యూనిఫారం, పాఠశాలకు చేరడానికి అవసరమయ్యే ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. 

కేవీల్లో చేరిన బాలికలు ఫీజు చెల్లించనవసరం లేదు. 

బాలురైతే ఏడో తరగతి వరకు ఫీజు ఉండదు. 

ఎస్సీ, ఎస్టీ బాలబాలికలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

9, 10 తరగతులకు బాలురు నెలకు  రూ.200 ఫీజు చెల్లించాలి. 

11, 12 తరగతులకు కామర్స్, హ్యుమానిటీస్‌ కోర్సులైతే రూ.300, సైన్స్‌ కోర్సులకు రూ.400 చెల్లించాలి. 

కంప్యూటర్‌ తరగతులుంటే అన్ని విభాగాల విద్యార్థులూ నెలకు రూ.వంద చెల్లించాలి.  11, 12 తరగతుల వారైతే రూ.150 చెల్లించాలి.

ముఖ్య తేదీలు...

ఒకటో తరగతిలో ప్రవేశానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఏప్రిల్‌ 11 సాయంత్రం 7 వరకు స్వీకరిస్తారు. 

రెండు, ఆపైన తరగతుల్లో ఖాళీ సీట్లలో ప్రవేశానికి: ఏప్రిల్‌ 8 నుంచి 16 వరకు సంబంధిత విద్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

ప్లస్‌ 1లో ప్రవేశాలు: పదో తరగతి ఫలితాలు వెలువడిన 10 రోజుల తర్వాత నుంచి 

వెబ్‌సైట్‌: https://kvsangathan.nic.in/
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ టెన్త్‌తో సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగం

‣ నకిలీ ఉద్యోగ ప్రకటనలను గుర్తించడం ఎలా?

‣ ఆలోచన భిన్నమైతే అందుతాయి అవకాశాలు

‣ పర్సనాలిటీ పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు రావచ్చు?

‣ రెండు పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి?

‣ ఇప్పుడే మొదలుపెట్టండి... టెట్‌ సన్నద్ధత!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-03-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌