‣ మౌఖిక పరీక్షకు ముందస్తు సన్నద్ధత
సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)కు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ మౌఖిక పరీక్షపై సివిల్స్ అభ్యర్థుల్లో, ఈ సర్వీస్‌ను లక్ష్యంగా నిర్దేశించుకుంటున్నవారిలో కొన్ని అపోహలు ఉంటున్నాయి. ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై సందేహాలూ ఉంటాయి. వీటిని నివృత్తి చేసుకుందామా?
పర్సనాలిటీ టెస్ట్‌లో అడిగే ప్రశ్నలు అభ్యర్థుల నేపథ్యం, కరెంట్ అఫైర్స్ మీద ఆధారపడి ఉంటాయి. అభ్యర్థులు తమ నేపథ్యానికి సంబంధించిన వివరణాత్మక సమాచారాన్ని దరఖాస్తు ఫారం-1, దరఖాస్తు ఫారం-2 అందిస్తాయి. ప్రశ్నలన్నీ అభ్యర్థులు అందజేసిన సమాచారం ఆధారంగానే ఉంటాయి. డీ…టేయిల్డ్ అప్లికేషన్ ఫామ్-1ని మెయిన్ పరీక్షకు ముందూ; ఫామ్-2ను ఇంటర్వ్యూకు ముందూ వివరాలతో భర్తీ చేయాలి. వీటిని అప్రమత్తతతో నింపాల్సి ఉంటుంది.
యూపీఎస్‌సీకి సమర్పించిన సమాచారం అంతటినీ అభ్యర్థులు తమకు అందుబాటులో ఉంచుకోవాలి. ఆ సమాచారం ఆధారంగా ఎలాంటి ప్రశ్నలు అడగొచ్చనే దాని మీద దృష్టి సారించాలి. అనుభవజ్ఞులైన సీనియర్లను సంప్రదించి ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నల విషయంలో సలహాలు తీసుకోవచ్చు. ప్రశ్నలను సరిగా అంచనా వేయగలిగే వయసు, అనుభవం మీకు ఉండవు. ఒకటి లేదా రెండుసార్లు ఇంటర్వ్యూలకు హాజరైన సీనియర్ల అనుభవం కొంతవరకు ఉపయోగపడొచ్చు. కానీ అంతిమంగా అదే సరిపోదు.
‣ కొన్ని నమూనా ఇంటర్వ్యూలకు హాజరుకావాలి. అప్పుడు వాళ్లు వెలిబుచ్చిన అభిప్రాయాలను రాసుకోవాలి. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తులు సందేహాలు వ్యక్తపరిచిన విషయాలను మెరుగుపరుచుకోవాలి. ఆ తర్వాత వారి దగ్గరే మళ్లీ ఇంటర్వ్యూకు హాజరై మీరు ఎంతవరకు మెరుగుపడ్డారో తెలుసుకోవాలి. మీరు ఏయే అంశాల్లో బలహీనంగా ఉన్నారో గ్రహించి మెరుగుపరుచుకోవాల్సి బాధ్యత మీదే!
‣ వివిధ వార్తాపత్రికల్లో ఒకే అంశం మీద వచ్చిన సంపాదకీయాలను చదవడం మొదలుపెట్టాలి. అలాగే మ్యాగజీన్లలో వచ్చే వ్యాసాలనూ చదవాలి. ఈ వ్యాసాలు విషయాన్ని సమగ్రంగా రాస్తాయి. ఇంటర్వ్యూ బోర్డులో 55 ఏళ్లు పైబడినవారు సభ్యులుగా ఉంటారు. సాధారణంగా ఆ తరం వారందరికీ వార్తాపత్రికలు చదివే అలవాటు ఉంటుందని గుర్తుంచుకోవాలి.
‣ ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు సాధించాలనే లక్ష్యం పెట్టుకోవాలనేది చాలామంది సందేహం. గత కొన్నేళ్ల ఇంటర్వ్యూలను విశ్లేషిస్తే.. ఎక్కువమంది అభ్యర్థులు 275 మార్కులకు 170 నుంచి 179 సాధించారు. మంచి సన్నద్ధతతో ఈ మార్కులను సాధించవచ్చు. చక్కని దిశానిర్దేశంతో సన్నద్ధమైతే 180 నుంచి 199 మార్కుల వరకు సాధించవచ్చు.
‣ ఏ ప్రశ్నలు అడుగుతారని అంచనా వేస్తున్నారో వాటిని ఒకచోట రాసి పెట్టుకోండి. సమాధానాలు కూడా రాసుకోండి. సమాధానం రాయటం చాలా ముఖ్యం. ఇలా సమాధానం చెప్పొచ్చని ఆలోచించి ఊరుకోకుండా దాన్ని అక్షరరూపంలో పెట్టాలి. రాయడం వల్ల మీకో స్పష్టత వస్తుంది. ఆ స్పష్టత వచ్చేవరకు రాస్తూనే ఉండాలి. ఒక్కోసారి మీరు రాసిన సమాధానం మీకే నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు దాన్నే ఇంటర్వ్యూలో చెబితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.
ఏం చేయకూడదు?
1. హాజరుకావాల్సిన ఇంటర్వ్యూకు చాలా సమయం ఉన్నప్పటికీ.. నమూనా ఇంటర్వ్యూను వాయిదా వేయకూడదు. ఎంత త్వరగా హాజరైతే అంత మంచిది. ఒక నిపుణుడు మీతో ముఖాముఖి నిర్వహించేలా చూడండి. దాంతో మీ బలాలు, బలహీనతల గురించి స్పష్టంగా తెలుస్తుంది. మీ పొరపాట్ల గురించి చెప్పాలంటే ఇంటర్వ్యూ చేసేవారికి సహనం, ఆసక్తి ఉండాలి. మీ సామర్థ్యాలను అంచనా వేసే వ్యక్తికి మీరు బాగా చేస్తున్నారని చెప్పడం చాలా సులువు. తప్పులు చేస్తున్నారనే విషయం చెప్పాలంటే ఎంతో సహనంతో పరిశీలించాల్సి ఉంటుంది. మీ బలహీనతలను అంగీకరించి వాటిని సరిదిద్దుకోవడానికి కృషిచేయాలి.
2. అదేపనిగా నమూనా ఇంటర్వ్యూలకు వెళ్లాలని అనుకోకూడదు. అనుభవజ్ఞులైన వ్యక్తులు ఒక్కసారి ఇంటర్వ్యూ చేసినా సరిపోతుంది. అసలైన ఇంటర్వ్యూకు సన్నద్ధం కాకుండా, మోడల్ ఇంటర్వ్యూలకు వెళుతూ సమయాన్ని వృథా చేయకూడదు.
3. ప్రతిరోజూ వార్తాపత్రికలు చదవడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఏ రోజు పేపర్లను ఆరోజే చదివేయాలిగానీ ఒకచోట పేర్చి ఆ తర్వాత చదువుదామని వాయిదా వేయకూడదు.
4. ఆన్‌లైన్ గ్రూప్స్‌లో సభ్యులుగా ఉండి ఎక్కువ సమయాన్ని వృథా చేయకూడదు. కొంతమంది విద్యార్థులు ఇతరుల నుంచి నేర్చుకోవాలనే ఉద్దేశంతో గ్రూప్స్‌లో చేరుతుంటారు. ఇది అందరికీ ఉపయోగించదు. దీంట్లో కొంతమంది తామే అధికులమనే ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తారు. మరికొందరు తమకంటే ఇతరులే ప్రతిభావంతులని భావించి ఆత్మన్యూనతకు గురవుతారు. ఈ రెండు పద్ధతులూ ఆరోగ్యకరం కాదు. మీకు మీరే ప్రత్యేకమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అవసరమైతే గ్రూప్‌ను ఏర్పాటుచేసుకోవచ్చుగానీ దాంట్లో వెచ్చించే సమయం పరిమితంగా ఉండేలా చూసుకోవాలి.
5. మీ సమాధానాలు సరిదిద్దమని స్నేహితులను అడగొద్దు. అలాగే వారి మూల్యాంకనం మీద ఆధారపడొద్దు. మీ మిత్రులు అనుభవజ్ఞులకూ, నిపుణులకూ సమానులు కారు కదా? పైగా వాళ్లు మీ సమాధానాలన్నీ సరిగ్గానే ఉన్నాయని చెప్పే అవకాశం ఉంది.
యూట్యూబ్‌లో ఇంటర్వ్యూలు చూశాక..
యూట్యూబ్‌లో నేను కొన్ని ఇంటర్వ్యూలు చూశాను. వాటి ప్రకారం.. అభ్యర్థులకు చాలా విషయాలు తెలుసనీ, నాకు అంత పరిజ్ఞానం లేదనీ అనిపిస్తోంది. నేను ఆ స్థాయికి చేరుకోగలనా?
‣ అవన్నీ వివిధ శిక్షణ సంస్థలు/ సంస్థలు నిర్వహించే నమూనా ఇంటర్వ్యూలు. యూపీఎస్‌సీ నిర్వహించే నిజమైన ఇంటర్వ్యూలను రికార్డు చేయరనే విషయం గుర్తించాలి. ఎడిటింగ్ చేసిన తర్వాత.. అభ్యర్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఇంటర్వ్యూలను మాత్రమే మీరు చూసి ఉంటారు. అభ్యర్థులు చేసిన తప్పులను తెలియజేసే భాగాలను ఎడిట్ చేస్తారు. వాటిని అందరి ముందూ ప్రదర్శించరు. కాబట్టి అభ్యర్థులు తమ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసుకుని నిరుత్సాహపడకూడదు. మీరు చూసిన ఇంటర్వ్యూల్లోని అభ్యర్థులు చాలాసార్లు మెయిన్ పరీక్ష రాసినవారై ఉంటారు (ఎవరో కొందరు తప్ప). ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయానికి అభ్యర్థి వివిధ అంశాల మీద మాట్లాడగలిగే పరిజ్ఞానాన్ని సంపాదించి ఉంటారు. భావవ్యక్తీకరణ సామర్థ్యం ఉంటే చక్కగా సమాధానం చెప్పగలుగుతారు. కాబట్టి ఏ అభ్యర్థీ ఎవరికంటే తక్కువ కాదు.
ప్రభుత్వానికి అనుకూలంగానే చెప్పాలా? వ్యతిరేకంగా చెప్పకూడదా?
‣ ప్రభుత్వానికి అనుకూలంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. అనుకూలంగా, వ్యతిరేకంగా ఎలాగైనా మాట్లాడొచ్చు. కానీ సమస్యకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఉండే పాయింట్లను దృష్టిలో ఉంచుకుని సమతూకం దెబ్బతినకుండా మీ అభిప్రాయాన్ని వెల్లడించాలి.
ఎలా చెప్పటం సరైనది?
విభిన్న రకాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పేలా ముందస్తుగా తయారవటానికి ఎంత సమయం ఎంత వెచ్చిస్తే అంత మంచిది. వాటిని నిత్యం మెరుగుపరుచుకుంటూ ఉండాలి.
ప్రశ్న: మీరు ఎలా ఉన్నారు?
యూపీఎస్‌సీ ఇంటర్వ్యూల్లో ఊహించని ప్రశ్న ఇది. ఇలాంటి ప్రశ్నలకు మీ స్పందన ఎలా ఉంటుందో ప్యానల్ చూడాలనుకుంటుంది. నిజమైన ఇంటర్వ్యూ మొదలయ్యేముందు మిమ్మల్ని సౌకర్యవంతంగా ఉంచేందుకు ఇలా అడగొచ్చు. సాధారణంగా బాగున్నాననే సమాధానాన్ని మీ నుంచి ప్యానల్ ఆశిస్తుంది.
♦ ‘సర్, ఈ స్థాయి వరకు రాగలిగినందుకు గర్వపడుతున్నాను. ఇంటర్వ్యూను ఎదుర్కొనేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను’.
► ‘సర్, రాత్రంతా సన్నద్ధమవుతూనే ఉన్నాను. ఇంటర్వ్యూ ఎలా ఉంటుందోనని ఆందోళన పడుతున్నాను’
► (ముక్తసరిగా) ‘నేను బాగున్నాను సర్’ .
ప్రశ్న: బోర్డును ఏమైనా అడగాలనుకుంటున్నారా?
ఇలాంటి ప్రశ్నలు సాధారణంగా అడుగుతుంటారు. వీటికి సమాధానం చెప్పడానికి అభ్యర్థులు ఇబ్బందిపడుతుంటారు. ఈ ప్రశ్న అడుగుతారని ఊహించి జవాబుతో ముందస్తుగానే సిద్ధంగా ఉండటం మంచిది.
ఊహించని ప్రశ్న ఎదురైనప్పుడు అభ్యర్థి ప్రతిస్పందనను బోర్డు తెలుసుకోవాలనుకుంటుంది. పరిస్థితులకు అనుగుణంగా స్పందించే స్వభావాన్ని పరీక్షించాలనుకుంటుంది.
♦ ‘సర్, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే అడ్మినిస్ట్రేటర్లను ఎంపికచేసే ఈ స్థాయిలో ఉండటం మీకెలాంటి అనుభూతినిస్తోంది?’
(దీనికి దగ్గరగా ఉండే ప్రశ్నను మీరు ప్రయత్నించవచ్చు).
► బదులివ్వకుండా - ప్రశ్న ఏదీ అడగకుండా మౌనంగా ఉండిపోవడం.
► ‘సీనియర్లను ప్రశ్న అడిగే స్థాయి నాకు లేదు. నేనంత పెద్దవాడిని కాదు’.

‣ Read Latest job news, Career news, Education news and Telugu news
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.