• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నేర్చుకుందాం నిరంతరం!

వివిధ పరీక్షల్లో విజయానికి సూచనలు

 

 

వార్షిక పరీక్షలు, వివిధ రకాల పోటీ పరీక్షల్లో గెలుపొందాలంటే తగినంత పరిజ్ఞానం ఉండాలి. ఆ పరిజ్ఞానాన్ని సమగ్రంగా, మెరుగ్గా సంపాదించాలంటే వివిధ విషయాలను శ్రద్ధగా అభ్యసించాలి. నేర్చుకోవాలనే తపన పుష్కలంగా ఉంటేనే... విద్యార్థులైనా, ఉద్యోగులైనా అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు! 

 

నేర్చుకోవడం అనే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. అప్పుడు దృష్టి కోణం విస్తృతమవుతుంది. సంపాదించిన పరిజ్ఞానంతో పోటీ ప్రపంచంలో సత్తా చాటి నిలదొక్కుకోగలుగుతారు. వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో విజయం సాధించాలంటే నేర్చుకోవడాన్ని ఆపేయకూడదు. దీన్ని కొనసాగించడానికి ఏమేం చేయాలో తెలుసుకుందామా...

 

నేర్చుకోవాలనే తపన అంతర్లీనంగా ఎప్పుడూ ఉండాలి. నేర్చుకోవడమనేది నిరంతరంగా సాగి అదొక అభిరుచిలా మారిపోవాలి.

 

పుస్తక పఠనం

జ్ఞాన తృష్ణను చల్లార్చుకోవడానికి పుస్తకాన్ని మించిన సాధనం లేదంటారు. అందుకే ఏమాత్రం సమయం చిక్కినా మంచి పుస్తకం చదవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎలాంటి పుస్తకం చదవాలనేది మీ వ్యక్తిగత ఇష్టాలు, వృత్తిపరమైన అవసరాలను బట్టి నిర్ణయించుకోవచ్చు. విద్యార్థిగా, ఉద్యోగిగా మీ ఎదుగుదలకు ఉపకరించే పుస్తకాలను చదవొచ్చు. లేదా అభిరుచులకు అద్దం పట్టే పుస్తకాలనూ చదువుకోవచ్చు. వారానికి ఒక పుస్తకం చదవాలనే నియమం పెట్టుకుంటే క్రమం తప్పకుండా చదవొచ్చు. లేదా ఎలాంటి నియమాలతోనూ పనిలేకుండా ఏ కాస్త సమయం చిక్కినా పుస్తకం అందుకోవచ్చు. పుస్తకం పఠనంతో కొత్త విషయాలు ఎన్నో తెలుస్తాయి. తద్వారా మీ ఆలోచనా పరిధీ విస్తరిస్తుంది. ఆలోచనల్లో స్థిరత్వం, పరిపక్వత కనిపిస్తుంది.

 

రాతపూర్వకంగా

ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని సాధనకు ఎలా ప్రయత్నించాలో ఒకచోట రాసుకుంటారు కదా. సరిగ్గా అలాగే ఏమేం నేర్చుకోవాలో కూడా రాసుకోవాలి. కొన్ని విషయాల్లో మీ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలంటే ఇంకా ఏమేం చదవాలో రాసుకోవాలి. కొత్త భాష లేదా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. అలాగే స్ఫూర్తిదాయక వాక్యాలను ఒకచోట రాసుకుని అప్పుడప్పుడూ చదువుకున్నా సానుకూల దృక్పథం పెరుగుతుంది. అది కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచుతుంది.

 

సొంత ఆలోచనల జోడింపు

కొంతమంది ఎక్కువగా చదువుతుంటారు. కానీ చదివిన దాన్ని అర్థం చేసుకోవడానికి మెదడును ఉయోగించరు. దీంతో ఆలోచించాలంటేనే బద్ధకం పెరిగిపోతుంది. ఇతరుల ఆలోచనలు, భావాలను చదివితేనే సరిపోదు. వాటిని అర్థం చేసుకోవాలంటే మీ సొంత ఆలోచనలను కూడా జోడించాలి. చదివిన విషయాన్ని అర్థం చేసుకుని, దానిపై ఒక అవగాహనకు రావడానికి కాస్త సమయం పడుతుంది. అందుకే ఉదయం పూట చదివితే మనసు ప్రశాంతంగా ఉండి చదివింది త్వరగా అర్థమవుతుంది.

 

బోధిస్తే స్పష్టత

మీరు నేర్చుకున్న విషయాన్ని ఇతరులకు బోధించగలగాలి. ఇలా చేయడం వల్ల నేర్చుకున్న విషయం మీకెంత వరకూ అర్థమైందో తెలుస్తుంది. దీని కోసం ట్యూషన్లు చెప్పొచ్చు, ఎవరికైనా మీరు మెంటర్‌గా పనిచేయొచ్చు, బ్లాగ్‌ రాయొచ్చు. వీటన్నింటివల్లా నేర్చుకున్న విషయాలను ఇతరులకు బోధించే నైపుణ్యం మీకు అలవడుతుంది.

 

ఆచరణ, సాధన

ఎన్ని కొత్త విషయాలు నేర్చుకున్నా అది ఆచరణలోకి రాకÛపోతే వ్యర్థమే. కోడింగ్‌ గురించి ఎంత చదివినా ప్రోగ్రామ్‌ రాయలేకపోతే అది నిరుపయోగమే అవుతుంది. ఉదాహరణకు పెయింటింగ్‌ ఎలా వేయాలనే దాని గురించి పుస్తకాలెన్నో చదివి కూడా చేత్తో బ్రష్షే పట్టుకోలేదనుకోండి... ఎంత చదివినా ఉపయోగం ఉండదు కదా. చదివినది సార్థకం కావాలంటే ఆచరణ, సాధన ఎంతో అవసరం.

 

అనుభవ పాఠాలు

నేర్చుకోవడానికి పుస్తకాలు చదవడం ఒక్కటే మార్గం కాదు. కొన్ని రకాల సంస్థల్లో చేరడం వల్ల అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. అక్కడి వ్యక్తులు బోధించే అనుభవ పాఠాల నుంచీ ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. వర్క్‌షాప్‌లు, సంస్థల్లో చేరి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. అవసరాలు, అభిరుచులను బట్టి ఏయే నైపుణ్యాలు అవసరం అనేదాన్ని ఎంచుకోవచ్చు.

 

ప్రోత్సహించే ఉద్యోగం

కొత్త నైపుణ్యాలను నేర్చుకునే ఉద్యోగులను కొన్ని సంస్థలు ప్రోత్సహిస్తాయి. అలాంటి సంస్థలను ఎంచుకోవడానికి ప్రాధాన్యమివ్వాలి. ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించడంతోపాటు కొత్తగా ఏమైనా నేర్చుకోవడం పైనా దృష్టిని నిలపాలి. సాంకేతిక పరిజ్ఞానానికి మెరుగులు దిద్దుకోవచ్చు. కొత్త సామర్థ్యాలను నేర్చుకోవచ్చు. దీంతో పనులను మరింత వేగంగా పూర్తిచేసి సమయాన్నీ ఆదా చేయొచ్చు.

 

సానుకూల దృక్పథం 

ఈ దృక్పథం ఉన్నవాళ్లు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఒక లక్ష్యాన్ని సాధించిన తర్వాత నేర్చుకోవడానికి అంతటితో ముగింపు పలకరు. మరో కొత్త లక్ష్యాన్ని ఏర్పాటుచేసుకుని దాన్ని సాధించే క్రమంలో కొత్త విషయాలెన్నింటినో నేర్చుకుంటారు. అంటే కొత్త విషయాలను నేర్చుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. అందుకే ఈ తరహా దృక్పథం పెంచుకోవాలి.

 

నిరంతర ప్రయత్నం

వృత్తిపరంగా కొత్త విషయాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటప్పుడు తప్పనిసరిగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిందే. అలాకాకుండా నేర్చుకోవాలనే తపన అంతర్లీనంగా ఎప్పుడూ ఉండాలి. నేర్చుకోవడమనేది నిరంతరంగా సాగి అదొక అభిరుచిలా మారిపోవాలి. నేర్చుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకుని దాని సాధనకు ప్రణాళిక వేసుకోవాలి. దాన్ని ఆచరణలో పెట్టడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. వారానికో కొత్త విషయం తెలుసుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నా ఎన్నో విషయాలను నేర్చుకోగలుగుతారు. 
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పీజీ ప్రవేశాలకు ఉమ్మడి పరీక్ష

‣ సిలబస్‌ గుట్టు తెలిస్తే.. సగం గెలిచినట్టే!

Posted Date : 14-10-2021 .

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌