• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సరైన రివిజన్‌ సక్సెస్‌ సూత్రం!

పునశ్చరణ ఎలా చేయాలి?

పాఠాలు వినడం పూర్తయ్యింది... ఇక పరీక్షలకు కూర్చోవడమే తరువాయి! అయితే అంతకంటే ముందు విద్యార్థులంతా దృష్టి పెట్టాల్సిన మరో ముఖ్యమైన విషయం రివిజన్‌! ఏడాదంతా చదివిన సిలబస్‌ను పునశ్చరణ చేసేందుకు ఇదే సరైన సమయం. తరగతి ఏదైనా, పరీక్ష స్థాయి ఎలా ఉన్నా... సరైన రివిజన్‌తోనే అనుకున్న విజయాన్ని సాధించగలం. మరి దీనికి పాటించాల్సిన చిట్కాలు ఏంటో... ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఒకసారి చూద్దామా...!

పునశ్చరణ... విద్యాసంవత్సరం అంతా చదివిన సిలబస్‌ను ఏకమొత్తంలో సరిచూసుకునే ప్రక్రియ. అందుకే దీనికి సరైన ప్రణాళిక అవసరం. పరీక్ష తేదీలకు ఇంకా మిగిలి ఉన్న రోజులు, చదవాల్సిన సబ్జెక్టులు, అందులో ముఖ్యమైన అంశాలు... ఇలా అన్నింటినీ గుర్తించాలి. దాన్ని అనుసరించి ఒక టైంటేబుల్‌ సిద్ధం చేసుకోవాలి. క్రమం తప్పకుండా ఆచరించేందుకు వీలుగా ఆ ప్రణాళిక ఉండాలి. దీనివల్ల ఆఖరి నిమిషంలో హడావుడి పడకుండా... సన్నద్ధత ముందు నుంచీ సరైన దిశగా సాగుతుంది. ఇదేసమయంలో చదవడం కష్టంగా అనిపించే అంశాలకు ఎక్కువ సమయం కేటాయించేలా ప్లాన్‌ చేసుకోవాలి. ఇలా ప్రణాళిక ప్రకారం చదివేందుకు ఇప్పటికే కొన్ని ‘ప్లానర్‌ టెంప్లెట్స్‌’ ఆన్‌లైన్‌లో విద్యార్థుల కోసం అందుబాటులో ఉన్నాయి. వీటిని డౌన్‌లోడ్‌ చేసుకుని ఉపయోగించడం ద్వారా సులువుగా ప్రణాళిక వేసుకోవచ్చు.

ముందే మొదలు...

పరీక్షలకు ఇంకా చాలా సమయం ఉందిలే అనుకుని రివిజన్‌ను వాయిదా వేయడం, ఆఖర్లో కంగారు పడటం... మనలో చాలామంది చేస్తుంటారు. కానీ దీనివల్ల ఎన్ని సమస్యలో పరీక్షలో కూర్చున్నాక కానీ అర్థం కాదు. చివర్లో ఒత్తిడి వల్ల చదివింది సరిగ్గా గుర్తుండదు, అన్ని టాపిక్స్‌నూ కవర్‌ చేయడానికి సమయం సరిపోదు, ఆ హైరానా వల్ల బాగా వచ్చిన అంశాలను కూడా మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే తగినంత ముందుగా పునశ్చరణను ప్రారంభించాలి. ముందే మొదలుపెట్టడం, మళ్లీ మళ్లీ చదవడం మంచిదేననే విషయం గుర్తించాలి.

పాత ప్రశ్నపత్రాలు...

గత సంవత్సరాల ప్రశ్నపత్రాలు చూడటం, అందులో ఉన్న ప్రశ్నలను సాధన చేయడం కూడా పునశ్చరణలో ముఖ్యమైన భాగం. వాటితోపాటు పాఠ్యపుస్తకాల్లో పాఠాలకు చివర ఇచ్చే ప్రశ్నలు, ఇప్పటికే రాసిన నెలవారీ, త్రైమాసిక పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయడం సాధన చేయాలి. అలాగే ఈ ఏడాది ప్రశ్నపత్రం సరళి ఎలా ఉండబోతోంది, ఏయే ప్రశ్నలు ఎన్నేసి చొప్పున వస్తాయనే పూర్తి అవగాహన పెంచుకోవాలి.

జవాబులు రాయడం...

ఎంత చదివినా... రాయడం సాధన చేయకపోతే అది వృథానే. ఏది ఎంతమేరకు రాయాలనే విషయంపై అవగాహన వస్తే అధిక మార్కులు సాధించేందుకు అవకాశం కలుగుతుంది. ఎన్ని మార్కుల ప్రశ్నలకు ఎంత మేరకు జవాబు రాయాలనే విషయం తెలియాలంటే సాధనతోనే సాధ్యం. అప్పుడే ఉన్న తక్కువ సమయంలో అన్ని జవాబులూ రాసేలా ఏ ప్రశ్న దగ్గర ఎంత సేపు నిలవాలో తెలుస్తుంది. కేవలం జవాబు తెలిస్తే సరిపోదు, అది వీలైనంత తక్కువ సమయంలో రాయగలిగేలా కూడా ఉండాలి. అందుకే పరీక్షకు మందు నమూనా పరీక్షలు ఎన్ని రాస్తే అంత మంచిది.

విరామం తప్పనిసరి...

రివిజన్‌ చేయడం అంటే ఏకధాటిగా కూర్చుని చదివేస్తూ ఒత్తిడి పెంచేసుకోవడం కాదు. అందుకే ప్రతి అరగంటకో గంటకో కచ్చితంగా విరామం తీసుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే చదివేది బాగా గుర్తుంటుంది. ఎంత కఠిన ప్రణాళిక అమల్లో ఉన్నా సరే క్రమం తప్పకుండా విరామం తీసుకోవాలి. 

పునశ్చరణలో ఫ్లాష్‌ కార్డ్స్‌ ఉపయోగించడం, వేరే వాళ్లకు అర్థమయ్యేలా వివరించడం, మైండ్‌ మాప్స్‌ గీయడం, తోటి విద్యార్థులతో కలిసి చదవడం, పదే పదే పాఠాలను వినడం... ఇలా రకరకాల పద్ధతులున్నాయి. మీకు ఏది బాగా నప్పుతుందో దాన్నే ఫాలో అవ్వండి. 

అలాగే మీకు బాగా వచ్చిన పాఠాలు వెనక్కి ఉంచేసి అంతగా రాని వాటిని మొదట రివిజన్‌ చేయడమే ముఖ్యం. అయితే అది ఈ సమయంలో మాత్రమే. పరీక్ష దగ్గర అయ్యేకొద్దీ కొత్త అంశాలను చదవడం కంటే బాగా వచ్చిన వాటినే మళ్లీ మళ్లీ రివిజన్‌ చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. 

రివిజన్‌ సమయంలో వీలైనంతగా టెక్నాలజీకి దూరంగా ఉండటం మంచిది. ఫోన్, ల్యాప్‌టాప్‌లను పక్కన పెట్టేసి పుస్తకం చూస్తూ చదవడం, మళ్లీ మళ్లీ చేత్తో రాయడం వల్ల విషయం బాగా గుర్తుంటుంది. ఫోకస్‌ పెరుగుతుంది. 

చదవాల్సిన పోర్షన్‌ ఎంత ఉన్నా సరే... కనీసం ఆరు గంటలపాటు మంచినిద్ర ఉండేలా చూసుకోవాలి. చదివింది గుర్తుండటానికి, మెదడులో నిక్షిప్తం కావడానికి ఆమాత్రం నిద్ర చాలా అవసరం.

షార్ట్‌నోట్సుతో...

తరగతులు జరిగేటప్పుడు రాసిన రన్నింగ్‌/ షార్ట్‌ నోట్స్‌ను చూడటం వల్ల ఏ టాపిక్‌లో ఏ అంశాలు ముఖ్యమైనవనే విషయం తెలుస్తుంది. దీన్ని చదవడం ఇంపార్టెంట్‌ పాయింట్లను గుర్తుంచుకోవడంలో తోడ్పడుతుంది.  మొదట ఒకసారి పూర్తిగా చదివేయడం, తర్వాత క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ చదవడం, మూడోసారి గుర్తుంచుకోవడానికి ప్రయత్నించేలా చదవడం వల్ల విషయం బాగా అవగాహనకు వస్తుంది. ఉపశీర్షికలు (సబ్‌ హెడ్డింగ్స్‌), అంకెలు, పేర్లు, తేదీలు వంటివి గుర్తుంచుకోవాల్సి వచ్చినప్పుడు ఒకటికి నాలుగుసార్లు రాస్తూ రివిజన్‌ కొనసాగించాలి.

ఆసక్తికరంగా... 

ఎంత కాదనుకున్నా... చదివినదాన్నే మళ్లీ మళ్లీ చదువుతూ కుస్తీ పట్టడం కొంత బోర్‌ కొడుతుందనే చెప్పాలి. అలాంటప్పుడు ఈ చిన్న చిన్న ఫన్‌ టిప్స్‌ పాటించడం ద్వారా పునశ్చరణను మరికొంచెం ఆసక్తికరంగా మార్చవచ్చు.

మీరు నేర్చుకున్న అంశాలపై మీ స్నేహితులతో కలిసి క్విజ్‌ పోటీ నిర్వహించుకోవచ్చు. అలాగే ఒక్కొక్కరు ఒక్కో టాపిక్‌ను ఎక్స్‌ప్లెయిన్‌ చేయవచ్చు. దీనిపైనే వేరే ఏమైనా ఆటలు కూడా ఆడవచ్చు. అయితే పూర్తిగా సబ్జెక్టులోనే ఉండాలి సుమా!

వివిధ రంగులు, చిత్రాలు విషయాలను విజువల్‌గా గుర్తుంచుకోవడంలో సహాయం చేస్తాయి. మీకు ముఖ్యమైనవి అనుకున్న పాయింట్లను రంగులతో హైలైట్‌ చేయడం, ఒక క్రమపద్ధతిలో జరిగిన విషయాలను మీకు నచ్చినట్టుగా బొమ్మలు వేయడం వంటివి చేయవచ్చు. ఇది సబ్జెక్టును మీకు మరింత చేరువ చేస్తుంది.

క్లిష్టమైన తేదీలు, అంకెలు, పేర్లు వంటివి గుర్తుంచుకోవాల్సి వచ్చినప్పుడు మీకు నచ్చినట్టు, గుర్తుండేవిధంగా దాన్ని కొంత మార్చుకోవచ్చు. ఉదాహరణకు మీకు ఏదైనా తేదీ గుర్తుండటం లేదు అనుకుంటే మీదో మీ ఇంట్లోవాళ్లదో పుట్టినరోజుతో లింక్‌ అవుతుందేమో చూడండి. అప్పుడు సులభంగా గుర్తుంటుంది. అదేవిధంగా సబ్జెక్టును సరదా మాటల్లో మీకు మీరే చెప్పుకోండి. మీకు బాగా కనెక్ట్‌ అయ్యేవాటిని అలా అన్వయించుకోండి. నచ్చిన టీవీ షోతోనో, ఫేవరెట్‌ హీరో లేదా సినిమాతోనో పోల్చుకోండి. అప్పుడు వద్దన్నా టాపిక్‌ గుర్తుండిపోతుంది!

చరిత్ర, బయాలజీ వంటివి చదివేటప్పుడు... టాపిక్స్‌కు సంబంధించి ఏవైనా డాక్యుమెంటరీలు దొరికితే చూడవచ్చు. కష్టపడి చదవడం కంటే ఇలా చూడటం వల్ల సులభంగా నేర్చేసుకోవచ్చు.

రివిజన్‌ చేయకపోతే..?

రివిజన్‌ చేయకపోతే అది మన మార్కులపై తీవ్ర ప్రభావం చూపగలదు. ఇదివరకే సబ్జెక్టు మొత్తం చదివేసి ఉన్నా... రివిజన్‌ చేయకపోతే చిన్నచిన్న విషయాలు, నంబర్లు, సూత్రాలు వంటివి మర్చిపోతాం. పరీక్ష ముందు పునశ్చరణ చేయని విద్యార్థుల్లో పరీక్ష పట్ల ఆత్మవిశ్వాసం తగ్గి ఒత్తిడి, యాంగ్జైటీ పెరుగుతున్నట్లు గతంలో జరిగిన పరిశోధనల్లో తేలింది. ఎలా రాస్తామోనన్న కంగారు వారిలో ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. అందుకే రివిజన్‌ లేకుండా పరీక్షకు వెళ్లడం ఎంతమాత్రం ఆచరణీయం కాదు.

మొత్తంగా చెప్పాలంటే...

మనం ఏడాదంతా చదివిన సబ్జెక్టును ఎలా నేర్చుకున్నాం, పరీక్షల్లో ఎలా రాయబోతున్నాం అనేది ఈ రెండు మూడు నెలలు చేసే రివిజన్‌పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే సరైన ప్రణాళికతో ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుందాం!
 

********************************************************

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎన్‌సీసీ క్యాడెట్లకు ఆర్మీ ఆహ్వానం

‣ మెయిన్స్‌లో విజయానికి మెలకువలు! (ఆంధ్రప్రదేశ్‌)

‣ గెయిల్‌లో కొలువులు

‣ మెయిన్స్‌లో విజయానికి మెలకువలు! (తెలంగాణ)

Posted Date : 27-01-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌