• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ప్ర‌తికూల‌ ఆలోచ‌న‌ల‌ను ప‌క్క‌కు నెట్టేయండి!

‘కిందటి ఏడాది మంచి ర్యాంకు సంపాదించలేకపోయా. దాంతో ఇష్టమైన గ్రూప్‌లో సీటూ రాలేదు. కొత్త సబ్జెక్టులు ఎంత చదివినా అర్థంకావడం లేదు. స్నేహితులందరికీ నా కంటే ఎక్కువ మార్కులే వచ్చాయి. నా పరిస్థితి భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటుందేమో...’ ఇలాంటి ప్రతికూల ఆలోచనలతో సతమతం అవుతున్నారా? అయితే మీరు మానసికంగా బలహీనంగా ఉన్నట్టే. దీన్నుంచి బయటపడాలంటే... 

గతాన్ని గురించి పదేపదే ఆలోచించడం వల్ల ఆ ప్రభావం వర్తమానం మీదా పడుతుంది. దాంతో ప్రస్తుతం మీ చేతిలో ఉన్న అమూల్యమైన సమయాన్నీ, అవకాశాలనూ సద్వినియోగం చేసుకోలేరు. అంతేకాదు తరచూ ప్రతికూల ఆలోచనలు రావడం, నిరాశా ధోరణీ పెరిగిపోతుంది. అలాకాకుండా ఉండాలంటే సమస్యల గురించి కాకుండా పరిష్కారాల కోసం ఆలోచించాలి. 

ఇతరుల నుంచి సహకారాన్ని, కృతజ్ఞతలను ఎంత తక్కువగా ఆశిస్తే అంత దృఢంగా ఉండగలుగుతారు. మీ మీద మీకు నమ్మకం ఉండాలిగానీ ఎదుటివాళ్లు మిమ్మల్ని గుర్తించి ప్రశంసించాలని ఆశించకూడదు. ఒకవేళ చదువులో వెనకబడినా ఇంటా బయటా వచ్చే విమర్శల గురించి భయపడి.. అదే విషయాన్ని ఆలోచిస్తూ కూర్చోకూడదు. మంచి మార్కులు సాధించడానికి ప్రయత్నించాలిగానీ మానసికంగా బలహీనపడకూడదు.   

ఒక పనిని ప్రారంభించిన వెంటనే ఫలితం రాలేదని నిరాశపడకూడదు. ఊహించిన ఫలితం రాలేదని ప్రతికూల ఆలోచనలు చేయడమూ మంచిదికాదు. తాత్కాలికంగా ప్రయోజనాలు రాకపోయినా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికతో ముందుకువెళ్లాలి. 

కొంతమంది తమ చుట్టూ ఉన్న సహవిద్యార్థులు, స్నేహితులు, కుటుంబసభ్యులు.. అందరినీ సంతృప్తిపరచాలని ప్రయత్నిస్తుంటారు. దాంతో విలువైన సమయాన్ని నష్టపోయి ముఖ్యమైన పనులను పూర్తిచేయలేకపోతారు. ఫలితంగా ఆత్మవిశ్వాసాన్నీ కోల్పోతుంటారు. 

సమస్యలకు అసలు కారణం తెలుసుకోకుండా మీ మీద మీరు జాలిపడకూడదు. ఇలా సానుభూతి పెరిగిపోతే.. తర్వాత దేంట్లో విఫలమైనా నెపాన్ని ఇతరుల మీదకు నెట్టేస్తారు. ఇదే అలవాటుగా మారే ప్రమాదమూ ఉంటుంది. వివిధ రంగాల్లో విజయం సాధించినవాళ్లను గమనిస్తే.. వాళ్లు బాధితులుగా మిగిలిపోవడానికి ఇష్టపడరనే విషయం అర్థమవుతుంది. వాళ్ల దృష్టి ఎప్పుడూ పరిష్కార మార్గాల మీదే ఉంటుంది. 

మీ నియంత్రణలో ఉన్న విషయాల్లోనే మీరు నిర్ణయం తీసుకోగలుగుతారు. మీ అధీనంలోలేని విషయాలు అనేకం ఉండొచ్చు. ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సభ్యుల అనారోగ్యం, అయినవారు దూరం కావడం, ప్రమాదాలు... ఇవన్నీ మీ చేతుల్లోలేని విషయాలు. వీటి గురించి అదేపనిగా ఆలోచిస్తే మానసికంగా బలహీనులవుతారు. 

చుట్టూ ఉన్న నీటి వల్ల పడవ ఎప్పుడూ మునగదు. అది ఎప్పుడూ లోపలికి నీళ్లు వెళ్లడం వల్లే మునుగుతుంది. మీ చుట్టూ ఎన్నో సమస్యలు ఉండొచ్చు. వాటినే మనసులో పెట్టుకుని భయపడటంతోనే నమ్మకాన్ని కోల్పోతారు. 

బాధ్యతలు తీసుకోవడానికి వెనకాడకూడదు. అవి కొత్తగా మొదలుపెట్టిన కోర్సులు, ఇంటర్న్‌షిప్‌లు, విదేశీ భాష నేర్చుకోవడం.. ఏదైనా కావచ్చు. బాధ్యతలను మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశాలుగా భావించాలి. 

వైఫల్యాలే లేకుండా ఎవరూ విజయ శిఖరాన్ని అధిరోహించలేరు. మరో విధంగా చెప్పాలంటే.. వైఫల్యాలు నిజమైన జీవిత పాఠాలు కూడా. ఒకపనిని ఎలా చేయాలో.. ఎలా చేయకూడదో వీటివల్లే స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. 

భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేక కొంతమంది ఆవేశంతో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తర్వాత వచ్చిన ఫలితాలను చూసి నిరాశతో మానసికంగా బలహీనులవుతారు. ఉదాహరణకు మీకు ఇష్టమైన సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చాయనుకుందాం. ఆ వెంటనే ఆసక్తిలేని కొత్త కోర్సులో చేరిపోతే తర్వాత చదవడానికి ఇబ్బందిపడతారు. 

వాయిదాలు వేయడం అలవాటైతే ఎప్పటి సిలబస్‌ అప్పుడు పూర్తిచేయలేరు. దీంతో పరీక్షల్లో విఫలమై.. ప్రతికూల ఆలోచనలు చేయడం మొదలుపెడతారు. ఈ అలవాటు మానసికంగానూ మిమ్మల్ని బలహీనపరుస్తుంది.  

చేసిన పనులకు ఇతరుల నుంచి ప్రశంసలను ఆశిస్తున్నారంటే.. మానసికంగానూ, బావోద్వేగపరంగా ఇతరుల మీద ఆధారపడుతున్నట్టే. మీరు వెళుతున్న మార్గం సరైందని మీరు భావిస్తేచాలు. ఇతరులు ఏమనుకుంటారోననే సందేహాలు మానసికంగా మిమ్మల్ని బలహీనపరుస్తాయి. 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ విజయం.. ఇలా సాధ్యం!

‣ GATE: గెలుద్దాం.. గేట్‌!

‣ ఉరుముతున్న ఆర్థిక సంక్షోభం

‣ ‘సీపెక్‌’కు నిధుల కటకట

‣ జీవవైవిధ్యం... మనుగడకు ఆధారం!

Posted Date : 17-08-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌