• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కోర్‌ బ్రాంచీలకు త‌గ్గని ఆద‌ర‌ణ‌

* మెకానికల్, సివిల్, ట్రిపుల్‌ఈలపై నిపుణుల సూచ‌న‌లు
 


కానూరు, తాడిగడప, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీ కేటగిరీ సీట్లలో ప్రవేశాలు జరుగుతున్నాయి. దీనికితోడు ఇటీవల ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ర్యాంకుల ఆధారంగా వివిధ కళాశాలల్లో ఏ సీటు వస్తుందోనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తితో ఉన్నారు. ప్రస్తుతం ట్రెండ్‌ అంతా సీఎస్‌ఈ, ఐటీ, ఈసీఈ మీదే నడుస్తోంది. కానీ కోర్‌ బ్రాంచ్‌లుగా ఉన్న మెకానికల్, సివిల్, ట్రిపుల్‌ఈలకు ఆదరణ తగ్గడం సరికాదని, ప్రస్తుత పరిస్థితుల్లో వీటికి కూడా  ప్రాధాన్యం ఇస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 


పెరగనున్న సీట్లు
 

ఉమ్మడి కృష్ణాలో ప్రస్తుతం 19 వేల వరకు సీట్లు ఉన్నాయి. ఇందులో సీఎస్‌ఈ, ఐటీ, ఈసీఈ సీట్లే దాదాపు 16,500 ఉన్నాయి. మిగిలిన 2,500 ట్రిపుల్‌ఈ, మెకానికల్, సివిల్‌ సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో ఇక్కడకు పరిశ్రమలు వచ్చే అవకాశముందని, ఈ ఏడాది ఈ సీట్లు మరిన్ని పెరగనున్నాయని నిపుణులు చెబుతున్నారు. 


అవకాశాలు మెండు
 


‣ ఈఈఈ, మెకానికల్, సివిల్‌ బ్రాంచ్‌ల విద్యార్థులకు కూడా పలు సాఫ్ట్‌వేర్‌ సంస్థలు అవకాశాలు కల్పిస్తున్నాయి.
‣  గ్రీన్‌ ఎనర్జీ, సోలార్‌ ఎనర్జీ తయారీకి ప్రాముఖ్యం ఉన్న నేపథ్యంలో ట్రిపుల్‌ఈ విద్యార్థులకు అవకాశాలు మెండుగా ఉంటాయి.
‣  ఆటోమోటివ్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు వల్ల మెకానికల్‌ విద్యార్థులకు ఉజ్వల భవిత ఉంటుంది. వీరు సీ, జావా, పైథాన్‌ వంటి కోర్సులను అభ్యసించి నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలి.
‣  దేశంలో నవ నిర్మాణ ప్రగతి నేపథ్యంలో సివిల్‌ ఇంజినీర్ల డిమాండు కూడా పెరుగుతుంది.
‣ ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు రంగ సంస్థల్లోనూ కొలువులు సాధించవచ్చు.


 సాఫ్ట్‌వేర్‌ కొలువులకు ఆదరణ
 

గత దశాబ్ద కాలంలో సీఎస్‌ఈలో ఏఐ, సైబర్‌ టెక్నాలజీ, ఐవోటీ వంటి స్పెషలైజేషన్‌ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. సాఫ్ట్‌వేర్‌ రంగంలో రూ.లక్షలు జీతాలు వస్తాయన్న ఆలోచనతో అందరూ సీఎస్‌ఈ, ఐటీ, ఈసీఈ వైపు మొగ్గుచూపుతున్నారు. కానీ కోర్‌ బ్రాంచ్‌లు చదివిన వారు కూడా రూ.20 లక్షల వార్షికవేతనంతో కొలువులు సాధించిన వారు కూడా ఉన్నారన్న విషయాన్ని విద్యార్థులు గ్రహించాలని నిపుణులు సూచిస్తున్నారు. 


వన్నెతగ్గని మెకానికల్‌    
 - కొండపల్లి శివాజీబాబు, ప్రిన్సిపల్‌ 

మెకానికల్‌ బ్రాంచి ఎప్పటికీ ఎవర్‌ గ్రీనే. ఆర్థికమాంధ్యంతో కూడా సంబంధం లేకుండా ఎప్పుడూ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఆటోమొబైల్‌ నుంచి విమానాల తయారీ వరకు ఈ నిపుణుల పాత్ర కీలకం. ఇటీవల కాలంలో మేకిన్‌ ఇండియా, ఎంఎస్‌ఎంల ద్వారా విద్యార్థులకు కొలువులు వస్తున్నాయి. రోబోటిక్స్, ఆటోమేషన్, త్రీడీ డిజైన్‌ వంటి అంశాలపై పట్టు సాధిస్తే  భవిష్యత్తు బాగుంటుంది.
 

ఐదేళ్లలో మూడు లక్షల ఉద్యోగాలు
- జి. నరసింహస్వామి, ఎలక్ట్రానిక్స్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగాధిపతి

ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌లో కూడా మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఈ రంగంలో రానున్న 5 ఏళ్లలో 3 లక్షల కొలువులు అందుబాటులోకి రానున్నాయి. ఈఐ విద్యార్థులకు మెట్‌ల్యాబ్, కెయిల్, మల్టిసమ్, సాఫ్ట్‌వేర్‌ ప్యాకేజ్‌, ఎఫ్‌పీజీఏ డిస్ట్రిబ్యూటెడ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ వంటి హార్డ్‌వేర్‌ సిస్టమ్స్‌లో శిక్షణతో ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు.


సివిల్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు 

-  ధూళిపాళ్ల వెంకటరావు, ఈసీఈ విభాగాధిపతి 

దేశంలో ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణాలు ముమ్మరంగా జరుగుతున్నాయి, వీటితో పాటు నిర్మాణరంగం కూడా ఊపందుకుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగం, మౌలిక వసతులకు ప్రాధాన్యం, హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ వంటి వేదికలు సివిల్‌ రంగ  విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. వీటితోపాటు కంప్యూటర్స్‌తో అనుసంధానమైన సర్టిఫికేషన్‌ కోర్సులు చేయడం వల్ల మంచి కొలువులు వస్తాయి.
 

------------------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్‌

‣ వాయుసేనలో అత్యు్న్నత ఉద్యోగాలకు ఏఎఫ్‌ క్యాట్‌

‣ కోర్సుతోపాటు ఆర్మీ కొలువు

‣ డేటా ప్రపంచంలో సత్తా చాటాలంటే?

Posted Date : 14-06-2024 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.