• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పాఠ్యపుస్తక పఠనమే కీలకం 

ఈ విద్యా సంవత్సరం (2020  21) 30% సిలబస్‌ను తొలగించారు. కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి పరీక్షకు సిద్ధం కావాలి.  

ప్రథమ సంవత్సరం తెలుగు వార్షిక ప్రశ్నపత్రంలో నాలుగు భాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

సిలబస్‌ విశ్లేషణ

పద్యభాగం 

పద్యభాగం రెండు రకాలు. 

1) ప్రాచీన పద్యభాగం 

(1, 2, 3 పాఠ్యాంశాలు) 

2) ఆధునిక పద్యభాగం 

(4, 5 పాఠ్యాంశాలు). 

ఈ ఏడాది 6వ పాఠ్యాంశాన్ని (మహైక) తొలగించారు. 

    దీనిలో ‘*’ గుర్తున్న పద్యాలను అసంపూర్తిగా ఇస్తారు. వాటిలో ఒకదాన్ని పాదభంగం లేకుండా (ప్రాస నియమాన్ని పాటిస్తూ) పూరించి రాయాలి. భావం కూడా రాయాలి. దీనికి 6 మార్కులు కేటాయించారు.

దీని నుంచి వ్యాసరూప సమాధాన ప్రశ్నలు అడుగుతారు. వాటిలో ఒకదానికి 20 పంక్తుల్లో సమాధానం రాయాలి. దీనికి 6 మార్కులు.  

    ఇచ్చిన సందర్భ సహిత వ్యాఖ్యల్లో రెండింటికి సమాధానాలు రాయాలి. ఒక్కోదానికి 3 మార్కులు. ఇందులో కవి పరిచయానికి ఒక మార్కు, సందర్భానికి ఒక మార్కు, భావం (వివరణ)కు ఒక మార్కు కేటాయిస్తారు. 

    సంగ్రహ రూప ప్రశ్నల్లో ఏవైనా రెండింటికి మాత్రమే సంక్షిప్త సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు. 

   ఏకవాక్య సమాధాన ప్రశ్నల్లో అయిదింటికి సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు.

తెలుగులో మంచి మార్కులు పొందాలంటే పాఠ్యాంశాలన్నీ పూర్తిగా 

చదవాలి. అప్పుడే ప్రశ్నలు, సందర్భ సహిత వ్యాఖ్యలకు సులువుగా 

సమాధానాలు రాయవచ్చు. పద్యాలను కంఠస్థం చేయాలి. వ్యాకరణాంశాలపై దృష్టి సారించాలి. ముఖ్యంగా అక్షరదోషాలు లేకుండా జాగ్రత్త పడాలి. ఇవన్నీ పాటిస్తేనే తెలుగులో మంచి మార్కులు పొందవచ్చు.

గద్యభాగం  

గద్యభాగంలోని పాఠ్యాంశాలు 3, 4, 5, 6. ఈ ఏడాది 

సిలబస్‌ నుంచి 1, 2 పాఠ్యాంశాలను తొలగించారు. (పాల్కురికి సోమనాథుడు, తెలంగాణ తెలుగు పదాలు - ఉర్దూ మూలాలు)

వ్యాసరూప సమాధాన ప్రశ్నల్లో ఒకదానికి 20 పంక్తుల్లో సమాధానం రాయాలి. దీనికి 6 మార్కులు ఉంటాయి. 

సంగ్రహ రూప ప్రశ్నల్లో రెండింటికి సమాధానాలు రాయాలి. ఒక్కో సమాధానానికి 3 మార్కులు. 

ఒక వాక్య సమాధాన ప్రశ్నల్లో అయిదింటికి¨ సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 5 మార్కులు పొందవచ్చు. 

* సంగ్రహ రూప ప్రశ్నల్లో భాగంగా (పద్యభాగం, గద్యభాగం) కవుల గురించి అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు.

ఉపవాచకం

ఉపవాచకంలో 1, 3, 4 పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ ఏడాది సిలబస్‌ నుంచి బిచ్చగాడు పాఠాన్ని తొలగించారు. 

    ఇచ్చిన వ్యాసరూప ప్రశ్నల్లో రెండింటికి సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు 20 పంక్తుల్లో జవాబు రాయాలి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు కేటాయిస్తారు. 

వ్యాకరణాంశాలు  

సంధులు 

    ఇచ్చిన వాటిలో నాలుగింటిని విడదీసి సంధిపేరు, సూత్రం రాయాలి. ఒక్కోదానికి 3 మార్కులు. సంధి విడదీస్తే ఒక మార్కు, పేరు రాస్తే ఒక మార్కు, సూత్రం రాస్తే ఒక మార్కు కేటాయిస్తారు. 

సమాసాలు

    ఇచ్చిన పదాల్లో నాలుగింటికి విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయాలి. ఒక్కోదానికి 2 మార్కులు. విగ్రహ వాక్యానికి ఒక మార్కు, సమాసం పేరు రాస్తే ఒక మార్కు కేటాయిస్తారు. 

లేఖా రచన

దీనిలో మూడు లేఖలు ఉంటాయి. ఒకదానికి సమాధానం రాయాలి. దీనికి 5 మార్కులు. లేఖలో ఊరిపేరు, తేది, సంబోధన, ప్రధాన విషయం (చెప్పదలిచిన విషయం), కృతజ్ఞతలు, ధన్యవాదాలు, భవదీయుడు, విశ్వసనీయులు, చిరునామా అనేవి ప్రధాన అంశాలు. వీటికి కూడా మార్కులు ఉంటాయి.

కాబట్టి విద్యార్థులు వీటిని దృష్టిలో ఉంచుకుని లేఖ రాయాలి. 

సాధారణ వ్యాసాలు

ఇచ్చిన వాటిలో ఒక దానికి వ్యాసం రాయాలి. దీనికి అయిదు మార్కులు. వ్యాసాన్ని అనుసరించి ఉపోద్ఘాతం, విషయ విశ్లేషణ, ప్రయోజనాలు, ముగింపు ప్రధానాంశాలుగా రాయాలి.

    అనువాదం    

    ఆంగ్లంలో ఇచ్చిన అయిదు వాక్యాలను తెలుగులోకి అనువదించాలి. ఒక్కోదానికి ఒక మార్కు చొప్పున అయిదు మార్కులు పొందవచ్చు.  

స్థూల అవగాహన 

    ఇచ్చిన పేరాను ఒకటికి రెండుసార్లు చదివి అవగాహన చేసుకొని అయిదు ప్రశ్నలకు ఒక మాటలో సమాధానం రాయాలి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు పొందవచ్చు. 

విద్యార్థులు చేసే పొరపాట్లు 

* పద్యాన్ని ప్రాసనియమం పాటించకుండా రాయడం. 

* సందర్భ సహిత వ్యాఖ్యలు రాసేటప్పుడు కవి, గ్రంథం, పాఠ్యభాగం పేరు రాయకపోవడం.

* కవుల గురించి రాసేటప్పుడు ప్రశ్నను అనుసరించి వారి బిరుదులు, గ్రంథాలు రాయకపోవడం.

* ఒక మార్కు ప్రశ్నల్లో సూటిగా సమాధానం రాయకపోవడం.

* లేఖలో ఊరి పేరు, తేది, కామాలు, ఫుల్‌స్టాప్‌లు, సంబోధన, చిరునామా, కృతజ్ఞత, విషయ విశ్లేషణ లాంటివి సరిగా రాయకపోవడం.

* పదాలు విడదీయలేకపోవడం, సంధిని సరిగా గుర్తించకపోవడం, సూత్రం రాయకపోవడం.

* సమాసాలు, విగ్రహ వాక్యాలు సరైన విధంగా రాయకపోవడం, సమాసం పేరు గుర్తించలేకపోవడం.

* వ్యాసం రాసేటప్పుడు ఉపోద్ఘాతం, విషయం, విషయ విశ్లేషణ, ప్రయోజనాలు (లాభాలు, నష్టాలు), ముగింపు లాంటివి లేకుండా పేరా మాదిరి రాయడం.

* ఆంగ్ల పదాలకు సరైన భావాన్ని గుర్తించి అనువదించలేకపోవడం.

 * ఇచ్చిన పేరాలోని ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించలేకపోవడం. 

* విద్యార్థులు ఇలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త వహించాలి.
 

మ‌రింత స‌మాచారం కోసం 

మోడ‌ల్ పేప‌ర్ స‌మాధానాల‌తో

Posted Date : 15-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌