• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సూత్రాలు.. సిద్ధాంతాలు నేర్చుకుంటే మార్కులు!

భౌతికశాస్త్రం అంటే చాలా మంది విద్యార్థులు కఠినమైన సబ్జెక్టుగా భావిస్తారు. నిజానికి మనిషి రోజువారి జీవితంలో చేసే ప్రతి పని భౌతిక శాస్త్రానికి సంబంధించిందే. ప్రతి పాఠంలోని సూత్రాలు, ప్రమాణాలు, నిర్వచనాలు, సిద్ధాంతాలను నేర్చుకుంటే ఇచ్చిన ప్రశ్నలకు జవాబులను సులభంగా రాయవచ్చు. ముఖ్యంగా ముందు తరగతుల్లో చదివిన ఫండమెంటల్స్‌ను మరిచిపోవద్దు. ఒక్కో అంశానికి నిర్ణీత సమయాన్ని కేటాయించి సరైన ప్రణాళికను రూపొందించుకొని చదివితే మంచి ఫలితాలు  సాధించవచ్చు.

భౌతికశాస్త్రం మొదటి సంవత్సరం పాఠ్యపుస్తకంలో మొత్తం 14 పాఠ్యాంశాలు ఉన్నాయి. ఈ పాఠ్యాంశాల ఆధారంగా ప్రశ్నపత్రాన్ని మూడు సెక్షన్‌లుగా (అతిస్వల్ప, స్వల్ప,  దీర్ఘ సమాధాన ప్రశ్నలుగా) రూపొందించారు. విషయావగాహన కోసం పాత ప్రశ్నపత్రాలను    చూసుకోవాలి. 

విద్యార్థులు పాటించాల్సినవి

*     మూల సిద్ధాంతాలు (ఫండమెంటల్స్‌), 8, 9, 10వ తరగతుల్లోని అన్ని అంశాలకు సంబంధించిన నిర్వచనాలు, సూత్రాలు, ప్రమాణాలు గుర్తుంచుకున్న విద్యార్థి భౌతికశాస్త్రంపై మంచి పట్టు సంపాదిస్తాడు. 

*     విద్యార్థి ప్రతి అంశాన్ని బట్టి విధానంలో కాకుండా అర్థం చేసుకొని చదవాలి. ఇలా చేస్తే చదివిన అంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. వాటిని అప్పుడప్పుడు స్నేహితులతో చర్చిస్తే ఇంకా మంచిది.

*     భౌతికశాస్త్రంలోని కొన్ని అంశాలు అంత త్వరగా అర్థం కాకపోవచ్చు. అలాంటి సమయంలో ఆ అంశాలకు సంబంధించిన పూర్వపు సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.

*     చదివేటప్పుడు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే లేదా అర్థం కాకపోయినా కాస్త విరామం ఇచ్చి మళ్లీ మొదలుపెట్టాలి.

*     ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి. యోగా, ధ్యానం లాంటివి చేయాలి.  

ఎ) ప్రతి భౌతికరాశిని సూచించే ఆంగ్ల అక్షరాన్ని తెలుసుకోవాలి.

బి) సమస్యలో ఇచ్చిన విలువలకు భౌతిక రాశులు తెలుసుకొని దేన్ని కనుక్కోవాలో గుర్తించాలి.

సి) తగిన సూత్రాన్ని ఎన్నుకోవాలి.

*  భౌతికశాస్త్రంలో మరో ముఖ్య విషయం లెక్కలు - వాటి సాధనలు. లెక్కలు సులభంగా సాధించాలంటే ముందు విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ప్రతి లెక్కని వీలైనన్ని సార్లు సాధన చేయాలి.

డి) సూత్రంలో విలువలు ప్రతిక్షేపించే ముందు ప్రమాణాలన్నీ ఒకే పద్ధతిలో ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని సరిచూసుకోవాలి.

యూనిట్ల వారీగా వెయిటేజి 

1. భౌతిక ప్రపంచం: 2 మార్కులు

2. ప్రమాణాలు - కొలతలు: 2 మార్కులు

3. సరళరేఖాత్మక చలనం: 4 మార్కులు

4. సమతలంలో చలనం: 4 + 2 మార్కులు

5. గమన నియమాలు: 4 + 2 మార్కులు

6. పని, శక్తి, సామర్థ్యం: 8 మార్కులు

7. కణాల వ్యవస్థలు - భ్రమణ చలనం: 4 + 4 మార్కులు

8. డోలనాలు: 8 మార్కులు

9. గురుత్వాకర్షణ: 4 మార్కులు

10. ఘనపదార్థాల యాంత్రిక ధర్మాలు: 4 మార్కులు

11. ప్రవాహాల యాంత్రిక ధర్మాలు: 2 + 2 మార్కులు

12. పదార్థం, ఉష్ణ ధర్మాలు: 4 + 2 + 2 మార్కులు

13. ఉష్ణగతిక శాస్త్రం: 8 మార్కులు

14. అణుచలన సిద్ధాంతం: 2 + 2 మార్కులు

మంచి మార్కులు సాధించడానికి విద్యార్థులు వెయిటేజిపై పట్టు సాధించాలి. వెయిటేజి ఆధారంగా దీర్ఘ సమాధాన ప్రశ్నల కోసం 6, 8, 13వ పాఠ్యాంశాలు; స్వల్ప సమాధాన ప్రశ్నల కోసం 3, 4, 5, 7, 9, 10, 12వ పాఠ్యాంశాలు చదవాలి. అతి స్వల్ప సమధాన ప్రశ్నల కోసం 6, 8, 13వ పాఠ్యాంశాలను మినహా మిగతా అన్నింటినీ చదవాలి. 

 భౌతికశాస్త్రం మొదటి సంవత్సరం పాఠ్యపుస్తకంలో రెండో పాఠం ప్రమాణాలు - కొలతలు. ఈ పాఠ్యాంశాన్ని  విద్యార్థులు 2 మార్కుల కోసమే చదువుతారు. కానీ, ఇందులో ఉన్న సమాచారం చాలా విలువైంది. కాబట్టి ఈ పాఠ్యాంశంలోని పూర్తి సమాచారాన్ని చదివి విషయావగాహన పెంచుకోవాలి. పై నియమాలు పాటిస్తూ ప్రణాళికకు తగినవిధంగా సిలబస్‌ను పూర్తి చేసి పరీక్షలకు ముందు పునశ్చరణ చేసినట్లయితే భౌతికశాస్త్రంలో మంచి మార్కులు సాధించవచ్చు. 

మ‌రింత స‌మాచారం కోసం 

మోడ‌ల్ పేప‌ర్ స‌మాధానాల‌తో

Posted Date : 15-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని