• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పర్యావరణ రసాయన శాస్త్రం

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

అతి ముఖ్యమైన 2 మార్కుల ప్రశ్నలు
1.
 హరిత రసాయన శాస్త్రం అంటే ఏమిటి?
జ: హరిత రసాయన శాస్త్రం: రసాయన శాస్త్రం, ఇతర విజ్ఞానశాస్త్రాల్లోని సూత్రాలను ఉపయోగించి హానికరమైన కాలుష్య కారకాల ఉత్పత్తిని వాడకాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణం కలుషితమవకుండా చేయడాన్ని హరిత రసాయన శాస్త్రం అంటారు.
  ఉదా: పేపర్‌ను విరంజనం చెయ్యడానికి Cl2 బదులు H2O2 ని వాడడం.
బయోగాస్, గోబర్‌గ్యాస్, గాలి, సౌరశక్తుల వినియోగించాలి. తేలిగ్గా జీవి క్షయమయ్యే, పర్యావరణానికి హానికలిగించని జీవసంబంధ ఎరువులు, పురుగుమందుల్ని వాడాలి. మొక్కల్ని పెంచాలి. కలుషితం చేసే పరిశ్రమలను తగ్గించి, పర్యావరణం గురించి ఎప్పటికప్పుడు ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించాలి. శుభ్రత, పచ్చదనం పాటించడం ద్వారా ఆరోగ్యవంతమైన పర్యావరణాన్ని ఆశించవచ్చు.


2. హరితగృహ ప్రభావం (భౌగోళిక తాపం) అంటే ఏమిటి?
జ: వాతావరణంలో CO2, NO, CH4, N2O వాయువుల గాఢత పెరిగినప్పుడు సూర్యుడి నుంచి వచ్చే పరారుణ కాంతి వికిరణాన్ని గ్రహించి భూఉపరితల ఉష్ణోగ్రత క్రమేపీ పెరుగుతుంది.

3. భౌగోళిక తాపం వల్ల కలిగే దుష్ఫలితాలు ఏమిటి?
జ: * భూగర్భ జలాలు అడుగంటుతాయి.
* ధ్రువ ప్రాంతాల్లోని మంచు శిఖరాలు కరిగి, సముద్ర మట్టం పెరిగి పల్లపు ప్రాంత్రాలు ముంపునకు గురవుతాయి.


4. ఆమ్ల వర్షాల దుష్ఫలితాలేమిటి?
జ: * భూసారం తగ్గడం.
* భవనాల జీవిత కాలం తగ్గడం.
* చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరడం.


5. ఆమ్ల వర్షాలు ఎలా వస్తాయి?
జ: NO, NO2, SO2 ఆక్సైడ్‌లు నీటితో చర్య జరిపి, కరిగి HNO3, H2SO4ల నిస్తాయి. ఈ ఆమ్లాలు వర్షపు నీటితో కలసి ఆమ్ల వర్షాలుగా కురుస్తాయి.


6. రసాయన ఆక్సిజన్ అవసరం, జీవ రసాయన ఆక్సిజన్ అవసరం అంటే ఏమిటి?
జ: రసాయనిక ఆక్సిజన్ అవసరం (COD): కలుషిత నీటిలో ఉన్న కర్బన రసాయన పదార్థాలను పూర్తిగా ఆక్సీకరణం చెందించటానికి అవసరమైన ఆక్సిజన్. దీనిని ఆమ్లీకృత (50% H2SO4) పొటాషియం డైక్రోమేట్‌తో నిర్ణయిస్తారు.
జీవ రసాయన ఆక్సిజన్ అవసరం (BOD): 20
oC వద్ద కలుషిత జలంలో ఉన్న సూక్ష్మాంగ జీవులు 5 రోజుల్లో వినియోగించుకునే ఆక్సిజన్ పరిమాణం.         
పరిశుభ్రమైన నీటికి COD 4 PPm , BOD 5PPm కంటే తక్కువ ఉంటాయి. శుద్ధి పరచని మున్సిపల్ నీటికి 100-400 PPm లు ఉంటుంది. కాలుష్య తీవ్రత, స్థాయిలను లెక్కించడానికి BOD, COD లు చాలా అవసరం.


7. కాలుష్య కారకం, మలినాలను నిర్వచించండి.
జ: కాలుష్య కారకం: ప్రకృతిలో లభిస్తూ.. ప్రకృతి, మానవ కార్యకలాపాల వల్ల దాని గాఢతను పెంచుకుంటూ పరిసరాలపై దుష్ప్రభావాన్ని చూపే పదార్థం.
ఉదా: SO2 , CO2.
మాలిన్యం: మానవుల, ప్రకృతి కార్యకలాపాల వల్ల పరిసరాల్లోకి కొత్తగా చేరి వాటిపై దుష్ప్రభావాన్ని చూపే పదార్థం.
ఉదా: MIC, DDC, BHC.


8. గ్రాహకం, సింక్‌లను నిర్వచించండి?
జ: గ్రాహకం: కాలుష్య ప్రభావానికి గురైన మాధ్యమం.
   ఉదా: వాహనాల రద్దీలో కళ్లు ఎర్రగా మారి మండటం.
   సింక్: కాలుష్య కారకంతో చర్య జరిపే మాధ్యమం
   ఉదా: చెట్లు, సముద్రాలు CO2 సింక్‌లు.


9. నల్గొండ పద్ధతిలో ఫ్లోరైడ్‌లను ఎలా తొలగిస్తారు?
జ: నల్గొండ పద్ధతి: నిరపాయకరంగా, తక్కువ ఖర్చుతో ఫ్లోరైడ్‌లను తొలగించే పద్ధతిని నాగపూర్‌కి చెందిన పరిశోధనా సంస్థ NEERI దీన్ని నల్గొండలో ప్రవేశపెట్టింది.
ఈ పద్ధతిలో ఫ్లోరైడ్‌లు అధికంగా ఉండే నీటికి బ్లీచింగ్ పౌడర్, సున్నం, పటికలను అదే క్రమంలో కలిపి కొంతసేపు నిల్వ ఉంచితే ఫ్లోరైడ్‌లన్నీ కాల్షియం, అల్యూమినియం ఫ్లోరైడ్ సంశ్లిష్టాలుగా అవక్షేపం చెందుతాయి. వీటిని వడగట్టడం ద్వారా తాగే నీటిని పొందవచ్చు.


10. మనుషులపై CO ప్రభావం ఎలా ఉంటుంది?
జ: CO విషపూరిత వాయువు. అది ఆక్సీహిమోగ్లోబిన్ కంటే 300 రెట్లు అధికంగా హిమోగ్లోబిన్‌తో కలసి కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనే స్థిర సమ్మేళనాన్నిస్తుంది. రక్తంలో దీని స్థాయి 3-4% కి పెరిగితే ఆక్సిజన్ కొరత ఏర్పడి తలనొప్పి, అలసట, దృష్టి కోల్పోవడం, స్పృహ తప్పడం, ఆయాసం, గుండె జబ్బులు, నెలలు నిండని ప్రసవాలు, గర్భ విచ్ఛిత్తి, అంగవైకల్య శిశు జననాలు సంభవిస్తాయి. వాతావరణంలో CO స్థాయి 1000 PPm ని మించితే మనిషి తక్షణం మరణిస్తాడు.


11. ఆరంభ అవధి విలువ అంటే ఏమిటి?
జ: ఆరంభ అవధి విలువ: కలుషిత వాతావరణంలో ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకి 8 గంటలు పనిచేసినా అతని ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగించని కాలుష్య కారక గరిష్ఠ స్థాయి.
ఉదా: జింక్ ఆరంభ అవధి విలువ: 1 మి.గ్రా. (మీ3).


12. 'జీవాధార గాఢత', 'యూట్రోఫికేషన్' అంటే ఏమిటి?
జ: జీవాధారిత గాఢత (Bio Amplification): DDT, BHC లాంటి విషపూరిత కాలుష్య కారకాల గాఢత అల్పస్థాయి జంతువుల నుంచి, ఉన్నత స్థాయి జంతువులకు.. చివరకు మనిషి శరీరంలోకి ఆహార గొలుసు ద్వారా ప్రవేశించడం.

యూట్రోఫికేషన్: పొలాలు, పరిశ్రమల నుంచి వెలువడే ఫాస్ఫేట్‌లు, కర్బన సంబంధ వ్యర్థాలు సరస్సులు, చెరువులను చేరుతాయి. అక్కడ ఉండే పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి చనిపోయి, అక్కడే వ్యర్థాలుగా పేరుకుపోవడం వల్ల సరస్సులు, చెరువులు ఎండిపోవడం లాంటి ఉపద్రవాలు ఏర్పడతాయి.
వాయుకాలుష్యం: జీవకోటికి శుభ్రమైన గాలి, నీరు, ఆహారం చాలా అవసరం. వాయు కాలుష్యం వల్ల హరితగృహ ప్రభావం, ఆమ్ల వర్షాలు, ఓజోన్ పొర క్షీణతతో పాటు జీవులకు అనేక జబ్బులు వస్తున్నాయి.


13. స్ట్రాటో వరణంలో ఉండే ఓజోన్ పొరకు రంధ్రాలేర్పడితే ఏమవుతుంది?
జ: * మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ దెబ్బతింటుంది.
* కంటి శుక్లాలు, చర్మ క్యాన్సర్ లాంటి జబ్బులొస్తాయి.


14. CFC లంటే ఏమిటి? ఇవి పరిశ్రమలకు వరాలు, పర్యావరణానికి శాపాలు. ఎందువల్ల?
జ: C,F, Clలు ఉన్న కృత్రిమ సమ్మేళనాలను CFC లంటారు. వీటిని పరిశ్రమల్లో శీతలీకరణిగాను, నురగనిచ్చే కారకాలుగా, ఇంకా అనేక విధాలుగా ఉపయోగిస్తారు. అందుకే వీటిని పరిశ్రమలకు వరాలుగా భావిస్తారు. ఇవి స్ట్రాటో వరణంలోని ఓజోన్ పొరకు రంధ్రాలేర్పరచడం ద్వారా జీవుల్లో అనేక జబ్బులకు కారణమవుతున్నందున వీటిని పర్యావరణానికి శాపాలుగా చెప్పవచ్చు.


15. నీటిలో ఫ్లోరైడులుంటే ఏం జరుగుతుంది? దీన్నెలా గుర్తిస్తారు?
జ: నీటిలో ఫ్లోరైడ్‌ల గాఢత 3PPm లను మించితే పళ్లపై పసుపురంగు చుక్కలు ఏర్పడటం,

ఎముకలు బలహీనపడతాయి. (Ca + F2   CaF2 ). ఈ పరిస్థితి వల్ల ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది. జిర్కోనియం ఎలిజరిన్- ఎస్ రంజనాన్ని ఉపయోగించి ఫ్లోరైడ్‌లను గుర్తిస్తారు.

Posted Date : 04-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌