• facebook
  • whatsapp
  • telegram

పరీక్ష నెగ్గితే పైలట్‌ కావచ్చు

‣  వాయుసేనలో ఉన్నత ఉద్యోగాలకు ప్రకటన విడుదల

రక్షణ రంగంలో ఉద్యోగాలు ఆశించేవారిలో ఎక్కువమంది వాయుసేనపై మక్కువ చూపుతారు. ఇందులో పట్టభద్రుల కోసం మేటి ఉద్యోగాలెన్నో ఉన్నాయి. ఉమ్మడి పరీక్షతో వాటిలో ప్రవేశానికి అవకాశం వచ్చింది. ఇటీవల ఏఎఫ్‌ క్యాట్‌ ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఆ వివరాలు చూద్దాం...

యూపీఎస్‌సీ నిర్వహించే ఎన్‌డీఏ, సీడీఎస్‌ఈ మాదిరిగానే ఏటా రెండుసార్లు క్రమం తప్పకుండా ఏర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్టు (ఏఎఫ్‌ క్యాట్‌) ప్రకటన వెలువడుతోంది. వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు ఆశించేవారు రాయాల్సిన పరీక్షల్లో ముఖ్యమైంది ఇదే. ఇందులో విజయం సాధించినవారు పైలట్‌ ఉద్యోగాన్నీ సొంతం చేసుకోవచ్చు. అలాగే గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌ విభాగాల్లో ఉన్నత హోదాతో సేవలు అందించవచ్చు. మొదటి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనం, ప్రోత్సాహకాలు పొందవచ్చు. భవిష్యత్తులో అత్యున్నత స్థాయిని చేరుకోవచ్చు. ఏఎఫ్‌ క్యాట్‌ను ముందుగానే లక్ష్యంగా చేసుకున్నవారు మొదటి ప్రయత్నంలోనే మెరవవచ్చు. తాజా అభ్యర్థులు చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తే రెండు మూడు ప్రయత్నాల్లో కొలువును ఖాయం చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలను శాశ్వత, 14 ఏళ్ల వ్యవధితో తాత్కాలికంగా కొనసాగే ప్రాతిపదికన భర్తీ చేస్తారు. మహిళలకూ అవకాశం ఉంది. పరీక్ష, ఇంటర్వ్యూల్లో ప్రతిభ చూపినవారికి శిక్షణ నిర్వహించి, విధుల్లోకి తీసుకుంటారు. 

ఖాళీలు: అన్ని విభాగాల్లోనూ కలుపుకుని 283.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ: జూన్‌ 30 సాయంత్రం 5 వరకు

వెబ్‌సైట్‌: https://afcat.cdac.in/AFCAT/index.html

పరీక్షలు: ఆగస్టు 26,27,28 తేదీల్లో.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌.

పరీక్ష ఇలా..

ఇందులో ఫ్లయింగ్, గ్రౌండ్‌ డ్యూటీ-టెక్నికల్, నాన్‌ టెక్నికల్, మెటీరియాలజీ బ్రాంచీలు ఉన్నాయి. అయితే వీటిలో ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పరీక్ష మాత్రం అందరికీ ఉమ్మడిగానే ఉంటుంది. దీన్ని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. మొత్తం వంద ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు. అలాగే తప్పు జవాబుకు ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. జనరల్‌ అవేర్‌నెస్, వెర్బల్‌ ఎబిలిటీ, రీజనింగ్, న్యూమరికల్‌ ఎబిలిటీ, మిలటరీ ఆప్టిట్యూడ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. టెక్నికల్‌ బ్రాంచ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు అదనంగా ఇంజినీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ (ఈకేటీ) రాయాలి. ఇందులో 50 ప్రశ్నలు వస్తాయి. వీటిని 45 నిమిషాల్లో పూర్తిచేయాలి. ప్రతి ప్రశ్నకూ 3 మార్కులు.  

అంశాలు...సన్నద్ధత

‣  జనరల్‌ అవేర్‌నెస్‌: ఈ విభాగంలో చరిత్ర, క్రీడలు, భూగోళశాస్త్రం, పర్యావరణం, కళలు, సంస్కృతి, వర్తమానాంశాలు, రాజకీయాలు, పౌరశాస్త్రం, రక్షణ రంగం, సామాన్యశాస్త్రంలోని ప్రాథమికాంశాల నుంచి ప్రశ్నలుంటాయి. సాధారణ అవగాహనతో వీటికి జవాబులు గుర్తించవచ్చు. ఈ విభాగంలో రాణించడానికి హైస్కూల్‌ సోషల్, సైన్స్‌ పుస్తకాల్లోని ప్రాథమికాంశాలు చదువుకోవాలి. వర్తమానాంశాల కోసం పత్రికా పఠనం ఉపయోగపడుతుంది. ముఖ్యాంశాలను నోట్సుగా రాసుకుని పరీక్షకు ముందు ఒకసారి చదువుకుంటే ఎక్కువ మార్కులు పొందవచ్చు.

‣  వెర్బల్‌ ఎబిలిటీ: కాంప్రహెన్షన్, ఎర్రర్‌ డిటెక్షన్, సెంటెన్స్‌ కంప్ల్లీషన్, సిననిమ్స్, యాంటనిమ్స్, వొకాబ్యులరీల నుంచి ప్రశ్నలడుగుతారు. అభ్యర్థి ఆంగ్లం ఎలా అర్థం చేసుకుంటున్నాడో తెలుసుకునేలా ఇవి ఉంటాయి. రాణించడానికి ఎనిమిది నుంచి ఇంటర్‌ వరకు ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకుని, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. 

‣  న్యూమరికల్‌ ఎబిలిటీ: సగటు, లాభనష్టాలు, శాతాలు, సూక్ష్మీకరణ, భిన్నాలు, నిష్పత్తి- అనుపాతం, బారు వడ్డీ అంశాల్లో ప్రశ్నలుంటాయి. హైస్కూల్‌ గణిత పాఠ్యపుస్తకాల్లోని ఈ అధ్యాయాలు బాగా చదువుకుని, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధనచేసినవాళ్లు ఎక్కువ మార్కులు పొందవచ్చు.

‣  రీజనింగ్, మిలటరీ ఆప్టిట్యూడ్‌: వెర్బల్‌ స్కిల్స్, స్పేషియల్‌ ఎబిలిటీ (మెంటల్‌ ఎబిలిటీ) అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలు తర్కంతో ముడిపడి ఉంటాయి. వీటికి బాగా ఆలోచించడం ద్వారా సమాధానం గుర్తించవచ్చు.

‣  ఇంజినీరింగ్‌ నాలెడ్జ్‌: ఈ టెస్టులో సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటికోసం ఆ బ్రాంచీకి చెందిన బీటెక్‌ పాఠ్యపుస్తకాలు బాగా చదువుకుంటే సరిపోతుంది. గేట్‌ పేపర్లూ ఉపయోగపడతాయి. 

ఏ అర్హతలుండాలి?

‣  ఫ్లయింగ్‌ బ్రాంచ్, ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ: ఈ పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌ / ప్లస్‌ 2లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ చదివుండడం తప్పనిసరి. ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ విభాగంలో దరఖాస్తు చేసుకున్నవారికి ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ సి సర్టిఫికెట్‌ ఉండాలి.   

వయసు: జులై 1, 2023 నాటికి 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. అంటే జులై 2, 1999 - జులై 1, 2003 మధ్య జన్మించినవాళ్లు అర్హులు. ఎత్తు: కనీసం 162.5 సెం.మీ ఉండాలి. ఎలాంటి దృష్టి దోషం ఉండరాదు.

‣  గ్రౌండ్‌ డ్యూటీ - టెక్నికల్‌ బ్రాంచ్‌: ఇందులో ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రానిక్స్‌/ మెకానికల్‌) పోస్టులు ఉన్నాయి. సంబంధిత లేదా అనుబంధ బ్రాంచీల్లో 60 శాతం మార్కులతో బీటెక్‌/ బీఈ పూర్తిచేసినవాళ్లు వీటికి అర్హులు. ఇంటర్‌/+2లో ఫిజిక్స్, మ్యాథ్స్‌ల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

‣  గ్రౌండ్‌ డ్యూటీ - నాన్‌ టెక్నికల్‌ బ్రాంచ్‌: ఇందులో అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ లాజిస్టిక్స్, అకౌంట్స్, ఎడ్యుకేషన్, మెటీరియాలజీ విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. అడ్మిన్‌ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు, అకౌంట్స్‌ పోస్టులకు బీకాం లేదా ఏదైనా డిగ్రీలో ఫైనాన్స్‌ స్పెషలైజేషన్‌గా చదువుకున్నవారు లేదా సీఏ, సీఎంఏ, సీఎస్, సీఎఫ్‌ఏల్లో ఏదైనా పూర్తిచేసుకున్నవారు అర్హులు. ఎడ్యుకేషన్‌ బ్రాంచీ పోస్టులకు ఏదైనా పీజీ పూర్తిచేసుకున్నవారు, మెటీరియాలజీ విభాగానికి నిర్దేశిత సబ్జెక్టుల్లో సైన్స్‌ పీజీ చదువుకున్నవారు అర్హులు.

వయసు: గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌ పోస్టులకు జులై 1, 2023 నాటికి 20 నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి. అంటే జులై 2, 1997 - జులై 1, 2003 మధ్య జన్మించినవారు అర్హులు. ఈ రెండు పోస్టులకు పురుషులు 157.5, మహిళలు 152 సెం.మీ. ఎత్తు తప్పనిసరి.

స్టేజ్‌ 1, 2 ఇలా...

రాత పరీక్షలో ఉత్తీర్ణులను స్టేజ్‌ 1, 2 పరీక్షలకు పిలుస్తారు. వీటిని ఏర్‌ఫోర్స్‌ సెలక్షన్‌ బోర్డు (ఏఎఫ్‌ఎస్‌బీ) నిర్వహిస్తుంది. అభ్యర్థులు 1.6 కి.మీ. దూరాన్ని 10 నిమిషాల్లో చేరుకోవాలి. అలాగే 10 పుష్‌ అప్స్, 3 చిన్‌ అప్స్‌ తీయగలగాలి. స్టేజ్‌-1 స్క్రీనింగ్‌ టెస్టు. ఇందులో ఆఫీసర్‌ ఇంటెలిజెన్స్‌ రాటింగ్‌ టెస్టు, పిక్చర్‌ పర్సెప్షన్‌ అండ్‌ డిస్కషన్‌ టెస్టు ఉంటాయి. చిన్న అసైన్‌మెంట్స్, పజిల్స్‌ లాంటి వాటి ద్వారా అభ్యర్థి మేధను పరీక్షిస్తారు. ఏదైనా చిత్రాన్ని చూపించి దాన్ని విశ్లేషించమంటారు. ఇందులో అర్హత సాధించినవారే స్టేజ్‌-2కి వెళ్తారు. ఈ దశలో సైకాలజిస్టు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారు. 

అనంతరం ఇండోర్, అవుట్‌ డోర్‌ ఇంటరాక్టివ్‌ గ్రూపు టెస్టులు ఉంటాయి. వీటిలో మానసిక, శారీరక పనులు మిళితమై ఉంటాయి. ఆపై వ్యక్తిగత మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు. ఫ్లయింగ్‌ బ్రాంచ్‌ (పైలట్‌)కు దరఖాస్తు చేసుకున్నవారికి ఇంటర్వ్యూ అనంతరం కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలక్షన్‌ సిస్టం (సీపీఎస్‌ఎస్‌) పరీక్ష ఉంటుంది. ఈ దశలన్నీ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి మెడికల్‌ పరీక్షలు చేపడతారు. అందులోనూ విజయవంతమైనవారిని మెరిట్‌ లిస్టు తయారుచేసి శిక్షణ కోసం ఎంపిక చేస్తారు. 

శిక్షణ..

అభ్యర్థులకు సంబంధిత విభాగంలో జులై, 2023 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. ఫ్లయింగ్, గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌ బ్రాంచ్‌ అభ్యర్థులకు 74 వారాలు, గ్రౌండ్‌ డ్యూటీ నాన్‌ టెక్నికల్‌ విభాగాల వారికి 52 వారాలు వైమానిక దళ కేంద్రాల్లో శిక్షణ నిర్వహిస్తారు. ఫ్లయింగ్‌ బ్రాంచ్‌కు ఎంపికైనవారికి ముందుగా ఆరు నెలల పాటు ప్రాథమిక శిక్షణ ఉంటుంది. అనంతరం అభ్యర్థుల ప్రతిభ ప్రకారం..ఫైటర్‌ పైలట్,  ట్రాన్స్‌పోర్ట్‌ పైలట్, హెలికాప్టర్‌ పైలట్లగా విడదీసి అందుకుతగ్గ శిక్షణను ఒక్కో దశలో 6 నెలలు చొప్పున ఏడాది పాటు నిర్వహిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు. 

ప్రోత్సాహకాలు

శిక్షణ సమయంలో ప్రతి నెల రూ.56,100 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఉద్యోగంలో చేరినవారికి లెవెల్‌-10 వేతనశ్రేణి అమలవుతుంది. దీని ప్రకారం రూ.56,100 మూలవేతనం, డీఏ, హెచ్‌ఆర్‌ఎ ఇతర అలవెన్సులు ఉంటాయి. అలాగే మిలటరీ సర్వీస్‌ పే (ఎంఎస్‌పీ)లో భాగంగా ప్రతి నెలా రూ.15,500 చెల్లిస్తారు. దీంతోపాటు పైలట్లకు ఫ్లయింగ్‌ అలవెన్సు కింద నెలకు రూ.పాతిక వేలు అదనంగా అందుతాయి. టెక్నికల్‌ బ్రాంచీలవారికి టెక్నికల్‌ అలవెన్సు ఉంటుంది. అన్నీ కలుపుకుని రూ.లక్షకు పైగా వేతనం లభిస్తుంది. ఇవే కాకుండా ఇతర సౌకర్యాలూ, ఎన్నో ప్రయోజనాలూ వాయుసేన కల్పిస్తుంది.  

ఇలా చేయండి

1.  సిలబస్‌ వివరాలు ప్రకటనలో పేర్కొన్నారు. ఆ అంశాలనే బాగా చదువుకోవాలి. ప్రతి విభాగంలోనూ ఉన్న అంశాల్లో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. 

2.  ఏఎఫ్‌ క్యాట్‌ వెబ్‌సైట్‌లో మాదిరి ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉన్నాయి. సన్నద్ధత పూర్తయిన తర్వాత వాటిని పరిశీలించాలి. 

3.  పరీక్షకు కొద్ది రోజుల ముందు వెబ్‌సైట్‌లో మాక్‌టెస్టు అందుబాటులో ఉంటుంది. దాన్ని రాయాలి.

4.  కనీసం పది మాదిరి ప్రశ్నపత్రాలు సాధన చేసి, ఫలితాలు విశ్లేషించుకోవాలి. వెనకబడిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 

5.  రుణాత్మక మార్కులు ఉన్నందున ఏ మాత్రం తెలియని ప్రశ్నల జోలికి వెళ్లకపోవడమే మంచిది. అలాగే సమాధానం రాబట్టడానికి ఎక్కువ సమయం అవసమయ్యే ప్రశ్నలను చివరలో ప్రయత్నించాలి. 

6.  మార్కెట్‌లో పేరున్న పబ్లిషర్ల ఏఎఫ్‌క్యాట్‌ పుస్తకాలు లభిస్తున్నాయి. అవన్నీ కాకుండా వాటిలో ఏదో ఒకటే తీసుకుని బాగా సాధన చేస్తే సరిపోతుంది.  
 

Posted Date : 07-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌