• facebook
  • whatsapp
  • telegram

పట్టాతో పాటు పదిలమైన ఉద్యోగం 

10+2 టెక్నికల్‌ ఎంట్రీ

ఉచితంగా బీటెక్‌ చదువుకుని, లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగం! అద్భుతమైన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌ విద్యార్థులను భారతీయ సైన్యం 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ ద్వారా ఆహ్వానిస్తోంది. 

జేఈఈ మెయిన్‌ స్కోరు ప్రకారం దరఖాస్తులు షార్ట్‌లిస్ట్‌ చేసి, రెండు దశల్లో వివిధ పరీక్షలు నిర్వహించి కోర్సులోకి తీసుకుంటారు. ఎంపికైనవారికి బీటెక్‌ కోర్సు, లెఫ్టినెంట్‌ కొలువులకు సంబంధించిన ఉచిత శిక్షణ అయిదేళ్ల పాటు కొనసాగుతుంది. జనవరి, 2022 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. విజయవంతంగా శిక్షణ, కోర్సు పూర్తి చేసుకున్నవారికి బీటెక్‌ డిగ్రీతోపాటు ఆర్మీలో లెఫ్టినెంట్‌ ఉద్యోగం సొంతమవుతుంది. విధుల్లో చేరినవారికి నెలకు లక్ష రూపాయల వేతనం లభిస్తుంది!  

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను జేఈఈ మెయిన్స్‌లో సాధించిన స్కోరు ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఇలా వడపోతలో నిలిచినవారికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో బెంగళూరులో అయిదు రోజులపాటు రెండు దశల్లో సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. తొలిరోజు స్టేజ్‌-1 స్క్రీనింగ్‌ (ఇంటలిజెన్స్‌) పరీక్షల్లో అర్హత సాధించినవారిని స్టేజ్‌-2కి ఎంపిక చేస్తారు. నాలుగు రోజుల పాటు నిర్వహించే వివిధ పరీక్షల్లో అన్ని విభాగాల్లోనూ రాణించినవారిని శిక్షణకు ఎంపికచేస్తారు. 

శిక్షణ ఇలా

మొత్తం శిక్షణ అయిదేళ్లు కొనసాగుతుంది. ఇందులో ఏడాది పాటు ఆఫీసర్‌ ట్రైనింగ్‌ అకాడమీ - గయలో బేసిక్‌ మిలిటరీ ట్రైనింగ్‌ నిర్వహిస్తారు. అనంతరం నాలుగేళ్లపాటు టెక్నికల్‌ ట్రైనింగ్‌ పుణె, సికింద్రాబాద్, మావ్‌ల్లోని ఆర్మీ కేంద్రాల్లో ఏదో ఒకచోట కొనసాగుతుంది. ఇందులో రెండు దశలు...ఫేజ్‌-1 మూడేళ్ల ప్రీ కమిషన్‌ ట్రైనింగ్, ఫేజ్‌-2 ఏడాది పోస్ట్‌ కమిషన్‌ ట్రైనింగ్‌ ఉంటాయి. మూడేళ్ల ఫేజ్‌-1 శిక్షణ అనంతరం అభ్యర్థులకు నెలకు రూ.56,100 చొప్పున స్టైపెండ్‌ అందుతుంది. 

నాలుగేళ్ల శిక్షణ అనంతరం లెఫ్టినెంట్‌ హోదా సొంతమవుతుంది. శిక్షణ, కోర్సు పూర్తయిన తర్వాత వీరికి ఇంజినీరింగ్‌ (బీటెక్‌) డిగ్రీని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రదానం చేస్తుంది. అనంతరం వీరిని పూర్తిస్థాయిలో విధుల్లోకి తీసుకుంటారు. లెవెల్‌-10 మూలవేతనం రూ.56,100తోపాటు మిలటరీ సర్వీస్‌ పే కింద రూ.15,500 ప్రతి నెలా అందుతాయి. వీటికి డీఏ, హెచ్‌ఆర్‌ఎ, ప్రోత్సాహకాలు దక్కుతాయి. విధుల్లో చేరిన మొదటి నెల నుంచే వీరు అన్ని ప్రోత్సాహకాలూ కలుపుకుని సీటీసీ రూపంలో నెలకు దాదాపు లక్ష రూపాయలు అందుకోవచ్చు. తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. విధుల్లో చేరిన రెండేళ్ల తర్వాత కెప్టెన్, ఆరేళ్ల సర్వీస్‌తో మేజర్, పదమూడేళ్ల అనుభవంతో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలను అందుకోవచ్చు.   

ఖాళీలు: 90 

అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. జేఈఈ మెయిన్స్‌ స్కోరు తప్పనిసరి. పురుషులు మాత్రమే అర్హులు.

వయసు: 16 1/2 ఏళ్ల నుంచి 19 1/2 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 2002 జులై 2 కంటే ముందు; 2005 జులై 1 తర్వాత జన్మించినవాళ్లు అనర్హులు.  

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: నవంబరు 8

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/Authentication.aspx
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సైన్యంలో సాంకేతిక పోస్టులు!

‣ ఆర్మీలో అవకాశం!

‣ ఏ పుస్తకాలు.. ఎంత మేలు?

Posted Date : 20-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌