• facebook
  • whatsapp
  • telegram

కొట్టేద్దాం... క్లర్కు కొలువు!

5,830 ఖాళీల భర్తీకి ఐబీపీఎస్ భారీ ప్ర‌క‌ట‌న‌

స‌రైన స‌న్న‌ద్ధ‌త‌తో ఉద్యోగాన్ని దక్కించుకునే వ్యూహం

బ్యాంకుల్లో ఉద్యోగాల‌కు మ‌రో భారీ నోటిఫికేష‌న్ విడులైంది. ఇటీవ‌లే ఆర్ఆర్‌బీ ఖాళీల‌ను ప్ర‌క‌టించిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌నల్ సెల‌క్ష‌న్‌(ఐబీపీఎస్‌) తాజాగా కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌(సీఆర్‌పీ)-XI ద్వారా క్ల‌ర్క్ పోస్టుల భ‌ర్తీకి స‌న్న‌ద్ధ‌మైంది. ఎస్‌బీఐ మిన‌హా దేశంలోని 11 ఇత‌ర ‌ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో 5,830 కొలువులు ఉన్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లో 263 చొప్పున మొత్తం 526 మంది ఉద్యోగాలు సాధించే అవ‌కాశం వ‌చ్చింది. సరైన ప్రణాళికతో కాస్త కష్టపడితే క్లర్కు కొలువును కొట్టేయవచ్చు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ‌ఆంధ్రాబ్యాంకు, యూనియ‌న్ బ్యాంకులో విలీన‌మైనందున అందులోనే ఎక్కువ ఖాళీలు భ‌ర్తీ అవ‌నున్నాయి. దీంతోపాటు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, కెన‌రా బ్యాంక్‌, ఇండియ‌న్ ఓవ‌ర్సీస్ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర, ఇండియ‌న్ బ్యాంకులు ఉన్నాయి.  పెద్ద బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌, ఇండియ‌న్ బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర త‌మ ఖాళీల వివరాల‌ను ఇంకా ఐబీపీఎస్‌కు నివేదించ‌లేదు. కాబ‌ట్టి ఖాళీల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.

అర్హ‌త ఏమిటి?

క్ల‌ర్క్ పోస్టులకు ఏదైనా డిగ్రీ క‌లిగిన అభ్య‌ర్థులు అర్హులు. డిగ్రీ పూర్త‌యి తుది ఫ‌లితాలు వ‌చ్చిన వారు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ప‌రీక్ష‌లు పూర్త‌యినా తుది గ‌డువు లోగా ఫ‌లితాలు రాని వారికి అవ‌కాశం లేదు. అలాగే క‌నీస కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి. వ‌య‌సు జులై 1, 2021 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎస్సీ/ ఎస్టీ అభ్య‌ర్థుల‌కు గ‌రిష్ఠంగా ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్ల స‌డ‌లింపు ఇస్తారు. 

ఎంపిక ఎలా చేస్తారు?

అర్హులైన అభ్య‌ర్థుల‌ను రెండంచెల రాత ప‌రీక్ష‌లు(ప్రిలిమ్స్, మెయిన్) నిర్వ‌హిస్తారు. ప్రిలిమ్స్ కేవ‌లం అర్హ‌త ప‌రీక్ష కాగా.. అభ్య‌ర్థుల‌కు మెయిన్ ప‌రీక్ష‌లో వ‌చ్చిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక‌లు చేప‌డ‌తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం

అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అందుకు 27.10.2021 తుది గ‌డువు. ద‌ర‌ఖాస్తు రుసుము ఎస్సీ/  ఎస్టీ/  పీడ‌బ్ల్యూడీ/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్ అభ్య‌ర్థులకు రూ.175, ఇత‌రులు రూ.850 చెల్లించాలి. 

రాత ప‌రీక్ష‌

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ను మొత్తం 100 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు. 60 నిమిషాల స‌మ‌యం ఉంటుంది. ఇందులో మూడు విభాగాలుంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజీ(30 ప్ర‌శ్న‌ల - 30 మార్కులు), న్యూమెరిక‌ల్ ఎబిలిటీ(35 ప్ర‌శ్న‌లు - 35 మార్కులు), రీజ‌నింగ్ ఎబిలిటీ(35 ప్ర‌శ్న‌లు - 35 మార్కులు) ఉంటాయి. ప్ర‌తి విభాగానికి 20 నిమిషాల చొప్పున స‌మ‌యం కేటాయిస్తారు. అభ్య‌ర్థులు ప్ర‌తి విభాగంలో ఐబీపీఎస్ నిర్ణ‌యించే    క‌ట్ ఆఫ్ మార్కుల‌ను సాధించాల్సి ఉంటుంది. దాన్ని బ‌ట్టి మెయిన్ ప‌రీక్ష‌కు అర్హ‌త సాధిస్తారు.

మెయిన్ ప‌రీక్ష‌ 200 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు. 160 నిమిషాల స‌మ‌యం ఇస్తారు. ఇందులో నాలుగు విభాగాల నుంచి ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. జ‌న‌ర‌ల్/ ఫైనాన్స్ అవేర్‌నెస్(50 ప్ర‌శ్న‌లు - 50 మార్కులు) 35 నిమిషాలు, జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్‌ (40 ప్ర‌శ్న‌లు - 40 మార్కులు) 35 నిమిషాలు, రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూట‌ర్ ఆప్టిట్యూడ్‌(50 ప్ర‌శ్న‌లు - 60 మార్కులు) 45 నిమిషాలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌ (50 ప్ర‌శ్న‌లు - 50 మార్కులు) 45 నిమిషాల స‌మ‌యం ఉంటుంది. ప్రిలిమ్స్‌, మెయిన్ పరీక్ష‌ల్లో రుణాత్మ‌క మార్కులు ఉంటాయి. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు. ప్ర‌శ్నప‌త్రం ఇంగ్లిష్, హిందీ భాష‌ల్లో ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు

ప్రిలిమ్స్‌, మెయిన్ ప‌రీక్ష‌ల‌కు వేర్వేరుగా కేంద్రాల‌ను కేటాయించారు. ప్రిలిమ్స్ ప‌రీక్ష‌కు సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చీరాల‌, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, క‌డ‌ప, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజ‌మండ్రి, శ్రీకాకుళం, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రంలో ఏర్పాటు చేశారు. మెయిన్ ప‌రీక్ష‌ను గుంటూరు, క‌ర్నూలు, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హిస్తారు. ఇక తెలంగాణ‌లో ప్రిలిమ్స్ ప‌రీక్ష కేంద్రాలు హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌లో ఏర్పాటు చేయ‌గా.. మెయిన్ ప‌రీక్షను హైద‌రాబాద్‌లో మాత్ర‌మే నిర్వ‌హిస్తారు. 

సిల‌బ‌స్‌.. ఎలాంటి ప్ర‌శ్న‌లు వ‌స్తాయి?

ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి నిర్ధిష్ట‌మైన సిల‌బస్ అంటూ ఏమీ ఉండ‌దు.  ఆయా విభాగాల్లో ఏయే అంశాల నుంచి ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయో గ‌మ‌నిస్తే అందుకు అనుగుణంగా స‌న్న‌ద్ధం కావచ్చు.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌; ఈ విభాగంలో సింప్లిఫికేషన్స్‌, అప్రాక్సిమేట్ వాల్యూస్, నంబ‌ర్‌సిరీస్‌, క్వాడ్రాటిక్ ఈక్వేష‌న్స్‌, క్వాంటిటేటివ్ కంపేరిజ‌న్స్‌, డేటా ఇంట‌ర్‌ప్రెటేష‌న్‌, డేటా సఫిషియ‌న్సీతోపాటు ఇత‌అరిథ్‌మెటిక్ టాపిక్స్ ప‌ర్సంటేజీ, రేషియో, యావ‌రేజ్‌, ప్రాఫిట్‌లాస్‌, ఇంటెరెస్ట్‌లు, టైమ్‌వ‌ర్స్‌, టైమ్‌డిస్టెన్స్‌, మెన్సురేష‌న్, ఎలిగేష‌న్‌, ప‌ర్మ‌టేష‌న్‌కాంబినేష‌న్‌, ప్రాబ‌బిలిటీ త‌దిత‌ర అంశాల నుంచి ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. 

రీజ‌నింగ్‌; ఇందులో సీటింగ్ అరేంజ్‌మెంట్‌, ప‌జిల్స్ నుంచి దాదాపు స‌గం ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. ఆ త‌ర్వాత ఇనీక్వాలిటీస్‌, ఆల్ఫా న్యూమెరిక‌ల్ సీక్వెన్స్‌, కోడింగ్‌డికోడింగ్‌, బ్ల‌డ్ రిలేష‌న్స్‌, సిలాగిజ‌మ్‌, డైరెక్ష‌న్స్‌, డేటా స‌ఫిషియ‌న్సీ త‌దిత‌ర అంశాల‌తోపాటు మెయిన్ ప‌రీక్ష‌లో ఇన్‌పుట్‌అవుట్‌పుట్‌, లాజిక‌ల్ రీజ‌నింగ్‌(స్టేట్‌మెంట్ సంబంధ ప్ర‌శ్న‌లు) నుంచి ప్ర‌శ్న‌లు ఉంటాయి. 

ఇంగ్లిష్‌; ఈ విభాగంలో ఎక్కువ ప్ర‌శ్న‌లు రీడింగ్ కాంప్ర‌హెన్ష‌న్, క్లోజ్‌టెస్ట్ నుంచే వ‌స్తాయి. అలాగే గ్రామ‌ర్ ఆధారిత ప్ర‌శ్న‌లైన ఫిల్లింగ్ ద బ్లాంక్స్‌, సెంటెన్స్ అరేంజ్‌మెంట్, ఫ్రేజ‌ల్ అరేంజ్‌మెంట్‌, సెంటెన్స్ క‌రెక్ష‌న్స్‌, ఎర్ర‌ర్ ఫైండింగ్స్‌కు సంబంధించి ప్ర‌శ్న‌లు అడుగుతారు. కొత్త త‌ర‌హా ప్ర‌శ్న‌లు కూడా అడిగే అవ‌కాశం ఉంది. వీటితోపాటు సినానిమ్స్‌, యాంటానిమ్స్ కూడా వ‌స్తాయి.  

జ‌న‌ర‌ల్/ ఫైనాన్షియ‌ల్ అవేర్‌నెస్‌; ఇందులో బ్యాంకింగ్‌, ఆర్థిక సంబంధ విష‌యాల‌కు ప్రాధాన్యం ఇస్తూ తాజా విష‌యాల‌(క‌రెంట్ అఫైర్స్‌)పై ఎక్కువ ప్ర‌శ్న‌లు అడుగుతారు. ప‌రీక్ష‌కు 5, 6 నెల‌ల ముందు వ‌ర‌కు జ‌రిగిన విష‌యాల‌పై దృష్టి పెట్టాలి. వాటిపైనే అడిగే ఆస్కారం ఉంది. వాటితోపాటు ముఖ్య‌మైన అంత‌ర్జాతీయ అంశాలు, కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, పుస్త‌కాలు-ర‌చ‌యితలు, వార్త‌ల‌లోని వ్య‌క్తులు, ప్ర‌దేశాలు, క్రీడ‌లు, సైన్స్‌&టెక్నాల‌జీ, దేశీయ‌, అంత‌ర్జాతీయ దినోత్స‌వాలు మొద‌లైన వాటికి సంబంధించిన ప్ర‌శ్న‌లుంటాయి. 

ప్రిప‌రేష‌న్ ప్ర‌ణాళిక‌

ప్రిలిమ్స్ ప‌రీక్ష‌కు సుమారు 45 రోజులు, మెయిన్స్ కు మూడున్న‌ర నెల‌ల‌ స‌మ‌యం ఉంది. ఈ రెండు ప‌రీక్ష‌ల్లోనూ జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ మిన‌హా ఒక‌టే విభాగాలున్నాయి. కాబ‌ట్టి ప్రిప‌రేష‌న్ కూడా ఉమ్మ‌డిగానే ఉండాలి. రెండింటికీ క‌లిపి చ‌ద‌వాలి. ముఖ్యంగా ప్రిలిమ్స్‌లో ఉండే మూడు విభాగాలకు మెయిన్ స్థాయి ప్రిప‌రేష‌న్ అవ‌స‌రం. ఈ ప‌రీక్ష‌ల‌పై ఎలాంటి అవ‌గాహ‌న లేనివారు, మొద‌టిసారి రాసే అభ్య‌ర్థులు బేసిక్స్ నుంచే ప్రారంభించాలి. అరిథ్‌మెటిక్‌, రీజ‌నింగ్‌ల‌లోని టాపిక్స్‌లో స‌మ‌స్య‌ల సాధ‌న‌పై దృష్టి పెడుతూ తేలిక, మ‌ధ్య‌స్థ స్థాయి నుంచి హెచ్చు స్థాయిలో ఉండే ప్ర‌శ్న‌ల‌ను బాగా సాధ‌న చేయాలి. ప్ర‌శ్న‌లకు వేగంగా స‌మాధానాల‌ను గుర్తించే ప‌ద్ధ‌తులు నేర్చుకోవాలి. అందుకు న‌మూనా ప్ర‌శ్న‌ప‌త్రాలు రాయాలి. అప్పుడే నిర్ణీత స‌మ‌యంలో ఎన్ని ప్ర‌శ్న‌లకు స‌మాధానాలు రాయ‌గ‌లుగుతున్నారో తెలుస్తుంది. అందుకు అనుగుణంగా ప్రిప‌రేష‌న్‌లో మార్పులు చేస్తూ ముందుకు సాగొచ్చు. ఇదే సంద‌ర్భంలో స‌న్న‌ద్ధ‌త‌లో ఏమాత్రం అల‌స‌త్వం ప‌నికిరాదు. మొద‌టిరోజు ఎలాంటి ప‌ట్టుద‌ల ప్ర‌ద‌ర్శిస్తారో దాన్ని చివ‌రి రోజు వ‌ర‌కు కొన‌సాగించాలి. అభ్య‌ర్థుల ప్రిప‌రేష‌న్ త్వ‌ర‌లో రాబోయే ఐబీపీఎస్ పీఓ, ఎస్‌బీఐ పీఓ ఉద్యోగ ప‌రీక్ష‌ల‌కు కూడా ఉప‌యోగప‌డుతుంది. 

క‌టాఫ్ మార్కులెన్ని?

గ‌తంలో జ‌రిగిన ప‌రీక్ష‌ల్లో అర్హ‌త సాధించ‌డానికి క‌టాఫ్ ఎంత ఉండేదో తెలిస్తే ప్ర‌స్తుతం ఎన్ని మార్కులు రావాలో ఒక అవ‌గాహ‌న ఏర్ప‌డుతుంది. త‌ద్వారా ప్రిప‌రేష‌న్‌లో మార్పులు చేసుకునే అవ‌కాశం ఉంటుంది. గ‌తేడాది, అంతకు ముందు జ‌రిగిన ప‌రీక్ష‌ల‌ను ప‌రిశీలిస్తే.. క‌టాఫ్ మార్కులు రాష్ట్రాల వారీగా ఖాళీలు, అభ్య‌ర్థుల సంఖ్య‌, ప్ర‌శ్న‌ల స‌ర‌ళిపై ఆధార‌ప‌డి ఉంటాయి. ప్రిలిమ్స్ క‌టాఫ్ మార్కులు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2018లో 75.75, 2019లో 66.25, 2020లో 78గా ఉన్నాయి. తెలంగాణ‌లో 2018లో 58.25, 2019లో 61, 2020లో 74.25గా నిర్ణ‌యించారు.  

ముఖ్య‌మైన తేదీలు

ప్రిలిమిన‌రీ పరీక్ష: డిసెంబరు 2021.

మెయిన్ పరీక్ష: 2022 జనవరి/ ఫిబ్రవరి.

వెబ్‌సైట్‌: https://www.ibps.in/
 

Posted Date : 06-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌