• facebook
  • whatsapp
  • telegram

తెరుస్తారా.. కొలువుల ఖాతా?

డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌ విద్యార్హతలతో బ్యాంకుల్లో వివిధ రకాల ఉద్యోగాలను సాధించే అవకాశం ఇప్పుడొచ్చింది. గత నోటిఫికేషన్లకు సప్లిమెంటరీ నోటిఫికేషన్లు ఇవ్వటం ద్వారా తాజా గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. ఇక ఐబీపీఎస్‌ స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల పోస్టులకు తాజాగా ప్రకటన వెలువడింది. బ్యాంకు ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్నవారు తమ కల నెరవేర్చుకోవటానికి అద్భుతమైన అవకాశాలివి!  
 

రీజనల్‌ రూరల్‌ బ్యాంకుల్లో అసిస్టెంట్, స్కేల్‌-1 పోస్టులకు గతంలో (జులై 1, 2020) వచ్చిన నోటిఫికేషన్‌కు అనుబంధంగా సప్లిమెంటరీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అదేవిధంగా ఐబీపీఎస్‌ పీఓ- శ్రీ నోటిఫికేషన్‌కూ సప్లిమెంటరీ నోటిఫికేషన్‌ విడుదలయింది.   ఐబీపీఎస్‌ స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు- శ్రీ నోటిఫికేషన్‌ ద్వారా 11 జాతీయ బ్యాంకుల్లో 647 పోస్టుల భర్తీ జరగనుంది. 
 

ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్‌ పీఓ పోస్టులకు సంబంధించి...గత నోటిఫికేషన్‌కు అనుబంధంగా ఇచ్చిన సప్లిమెంటరీ నోటిఫికేషన్‌ ద్వారా 2020లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసినవారు ఇప్పుడు ఆయా నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసే అవకాశం లభించింది. అలాగే అన్ని అర్హతలూ ఉండి, గతంలో చేయలేకపోయినవారూ ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు!
 

ప్రిలిమినరీ పరీక్ష
150 ప్రశ్నలకు 125 మార్కులు. ఈ ప్రశ్నలను 120 నిమిషాల (2 గంటలు) వ్యవధిలో పూర్తిచేయాలి. తప్పు సమాధానాలకు 1/4 వంతు రుణాత్మక మార్కులున్నాయి. మొత్తం 3 సెక్షన్లు. ప్రతి సెక్షన్‌కు 50 ప్రశ్నలు. వీటిని పూర్తిచేయడానికి 40 నిమిషాల సెక్షనల్‌ టైం కేటాయించారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ సెక్షన్‌లోని 50 ప్రశ్నలకు 25 మార్కులూ, రీజనింగ్‌ సెక్షన్‌లోని 50 ప్రశ్నలకు 50 మార్కులు కేటాయించారు. ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నవారికైనా మొదటి రెండు సెక్షన్లు కామన్‌గా ఉంటాయి. మూడోది మాత్రమే మారుతుంది.
 లా ఆఫీసర్, రాజ్‌భాష అధికారి పోస్టుకు దరఖాస్తు చేకున్నవారికి జనరల్‌ అవేర్‌నెస్‌ (బ్యాంకింగ్‌ పరిశ్రమ) సెక్షన్‌ నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. వీటికి 50 మార్కులు కేటాయించారు. 
 ఐటీ, అగ్రికల్చర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్, హెచ్‌ఆర్, మార్కెటింగ్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 50 ప్రశ్నలకు 50 మార్కులు కేటాయించారు.
ప్రతి సెక్షన్‌లో క్వాలిఫయింగ్‌ మార్కులతోపాటు మొత్తం అర్హత మార్కులు సాధించినవారికి మెయిన్స్‌ ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు.

 

ఎంపిక ప్రక్రియ
మూడంచెల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మొదటగా అభ్యర్థులు ప్రిలిమినరీ ఆన్‌లైన్‌ పరీక్ష రాయాలి. దీనిలో అర్హత సాధించినవారు మెయిన్స్‌ పరీక్ష రాస్తారు. మెయిన్స్‌లోనూ అర్హత సాధించినవారికి మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) నిర్వహిస్తారు. దీనిలోనూ అర్హత సాధిస్తే.. మెయిన్స్, మౌఖిక పరీక్షల్లో వచ్చిన మెరిట్‌ మార్కుల ఆధారంగా పోస్టులను కేటాయిస్తారు.

 

మెయిన్స్‌ పరీక్ష
పోస్టులను బట్టి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు వారు గ్రాడ్యుయేషన్‌లో చదివిన సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. పోస్టులనుబట్టి ఏయే సబ్జెక్టులు చదవాలో నిర్ణయించుకోవాలి. ఉదా: ఐటీ ఆఫీసర్‌ పోస్టుకు నెట్‌వర్కింగ్, ఆపరేటింగ్‌ సిస్టమ్స్, డేటా స్ట్రక్చర్స్, డీబీఎంఎస్, వెబ్‌ అప్లికేషన్‌ తదితర సబ్జెక్టుల్లోని విషయాలు, వారి గ్రాడ్యుయేషన్‌లో చదివిన పుస్తకాలను రిఫరెన్స్‌ (ప్రామాణికంగా) తీసుకోవాలి. 
రాజ్‌భాష అధికారి పోస్టుకు దరఖాస్తు చేసుకున్నవారికి మెయిన్స్‌లో 45 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలతోపాటు 2 డిస్క్రిప్టివ్‌ ప్రశ్నలు ఇస్తారు. వీటికి 60 మార్కులు. 60 నిమిషాల వ్యవధిలో పూర్తిచేయాలి.
మిగిలిన పోస్టులు (రాజ్‌భాష అధికారి పోస్టు మినహా) వారికి 60 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలను 60 నిమిషాల వ్యవధిలో పూర్తిచేయాలి. మెయిన్స్‌లోనూ కనీస అర్హత మార్కులు సాధించినవారికి మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు. దీనిలోనూ అర్హత సాధించినవారికి మెరిట్‌ మార్కుల ఆధారంగా పోస్టులు భర్తీ చేస్తారు.

 

సన్నద్ధత విధానం
అభ్యర్థులు కామన్‌గా ఉన్న సబ్జెక్టులు- ఇంగ్లిష్, రీజనింగ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌తో సన్నద్ధత మొదలుపెట్టాలి. రోజుకు కనీసం 6 గంటల సమయం ప్రిలిమినరీ పరీక్షకు సన్నద్ధమవుతూ రెండు గంటల సమయం మెయిన్స్‌కు కేటాయించాలి. పరీక్ష ఏదైనా సిలబస్‌ మాత్రం ఒక్కటే అన్న విషయాన్ని గమనించాలి. మొదటగా సిలబస్‌ పూర్తి చేయాలి. సబ్జెక్టులు చాప్టర్లవారీగా అందుబాటులో ఉన్న తాజా పుస్తకాలను ఎంచుకుని వాటిలోని అన్ని చాప్టర్లను పూర్తిచేయాలి. తరువాత మాదిరి పరీక్షలు సాధన చేయాలి.

 

ప్రిలిమినరీ పరీక్షలోని ప్రశ్నలు సులువుగా సమాధానాలు గుర్తించేలా ఉంటాయి. సన్నద్ధత సరైన దిశగా సాగితే 150 ప్రశ్నలకు 150 సమాధానాలు సులువుగా గుర్తించవచ్చు. కానీ మెయిన్స్‌ పరీక్షలో మాత్రం ప్రశ్నలస్థాయి కఠినంగా ఉంటుంది. పుస్తకాల్లో ఉండే ప్రశ్నలు అదేవిధంగా మెయిన్స్‌లో రావు. లాజిక్‌ ఆధారంగా, అప్లికేషన్‌ ఓరియెంటెడ్‌గా వస్తాయి. ఏకాగ్రత, సమయస్ఫూర్తి ఉన్నవారు మాత్రమే మెయిన్స్‌లోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించగలుగుతారు. కేటాయించిన సమయంలో ఎక్కువ ప్రశ్నలు ఎలా పూర్తిచేయాలనే విషయాలు సన్నద్ధత సమయంలో నేర్చుకోవాలి. సులభంగా ఉండే ప్రశ్నలతోపాటు కఠినంగా ఉండేవాటినీ సాధన చేయాలి. 
 

రీజనింగ్‌ నుంచి నంబర్‌ సిరీస్, కోడింగ్‌-డీకోడింగ్, పజిల్స్, ఇన్‌పుట్‌- అవుట్‌పుట్, సిలాజిజం నుంచి 90% మార్కులకు ప్రశ్నలు వస్తాయి.
 

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి డేటా అనాలిసిస్, డేటా సఫిషియన్సీ, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్, న్యూమరికల్‌ ఎబిలిటీ నుంచి వచ్చే ప్రశ్నలకు సులువుగా మార్కులు పొందొచ్చు. చాప్టర్లకు సంబంధించి శాతాలు, నిష్పత్తి, చక్రవడ్డీ, బారువడ్డీ, లాభనష్టాలు ఒక కోవకు చెందినవి. కాలం-దూరం, పడవలు-ప్రవాహాలు, ట్రైన్స్‌ ఒక కోవకు చెందినవి. కాలం-పని, పైపులు-సిస్టన్స్, ఎల్‌సీఎం-హెచ్‌సీఎఫ్‌ ఒక కోవకు చెందినవి. వీటిల్లో అభ్యర్థులు ఏయే అంశాల్లో పట్టు సాధించాలో నిర్ణయించుకుని, మిగిలిన అంశాల్లో సబ్జెక్టు మీద పట్టు సాధించేలా సన్నద్ధత కొనసాగించాలి.
 

ఇంగ్లిష్‌ విభాగం నుంచి గ్రామర్‌తోపాటు రీడింగ్‌ స్కిల్స్‌ కూడా ముఖ్యమైనవి. రీడింగ్‌ కాంప్రహెన్షన్, క్లోజ్‌ టెస్ట్, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్, జంబుల్డ్‌ సెంటెన్సెస్, సెంటెన్స్‌ అరేంజ్‌మెంట్, కరెక్షన్, సిననిమ్స్, యాంటనిమ్స్‌ ప్రశ్నలు ఎక్కువ సాధన చేయాలి.
 

ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ సబ్జెక్టుకు అభ్యర్థులు తమ గ్రాడ్యుయేషన్‌ చదివిన పుస్తకాల్లోని అంశాలు ఏమైనా కలిస్తే, వాటిని ఆబ్జెక్టివ్‌ ప్రశ్నల రూపంలో ఏవిధంగా అడిగే వీలుందో గమనించుకుని సన్నద్ధమవ్వాలి.
 

అభ్యర్థులు ముఖ్యంగా గమనించాల్సింది- ప్రశ్నల సాధన చాలా ముఖ్యం. మాదిరి ప్రశ్నలు ఎన్ని సాధన చేస్తే అంత మంచిది. కనీసం 50 ప్రశ్నపత్రాలు సాధన చేస్తే మంచి ఫలితాలను ఆశించవచ్చు.
 

ఆర్‌ఆర్‌బీ స్కేల్‌-1 అండ్‌ అసిస్టెంట్‌
 విద్యార్హతలు: 09.11.2020 నాటికి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినవారు సప్లిమెంటరీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
 దరఖాస్తు చివరితేదీ: 09.11.2020
 ప్రిలిమినరీ కంప్యూటర్‌ రాతపరీక్ష (ఆన్‌లైన్‌ పరీక్ష): స్కేల్‌-1: 31.12.2020
అసిస్టెంట్‌: 02.01.2021 లేదా 04.01.2021

 

ఐబీపీఎస్‌ క్లర్క్‌- X
 విద్యార్హతలు: 6.11.2020 నాటికి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసివుండాలి. 2.9.2020- 23.9.2020 తేదీల్లో ఐబీపీఎస్‌ క్లర్క్‌- X నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేయనివారూ ఇప్పుడు సప్లిమెంటరీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
 దరఖాస్తు చివరితేదీ: 6.11.2020
 ప్రిలిమినరీ ఆన్‌లైన్‌ రాతపరీక్ష తేదీలను ఇంకా ప్రకటించలేదు. 

 

ఐబీపీఎస్‌ పీఓ - X
 విద్యార్హతలు: 11.11.2020 నాటికి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసివుండాలి. 05.08.2020- 26.08.2020 తేదీల్లో దరఖాస్తు చేయనివారూ ఇప్పుడు సప్లిమెంటరీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
 దరఖాస్తు చివరితేదీ: 11.11.2020
 ప్రిలిమినరీ కంప్యూటర్‌ రాతపరీక్ష (ఆన్‌లైన్‌ పరీక్ష): 05.01.2021 లేదా 06.01.2021
గమనిక: గతంలో (04.08.2020) ఐబీపీఎస్‌ పీఓ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సమయంలో 1167 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. 11 బ్యాంకుల్లో 4 బ్యాంకులవారు భర్తీ చేయాల్సిన/ కావాల్సిన పోస్టులను ప్రకటించలేదు. ఈ 4 బ్యాంకులూ గతంలో కేటగిరీ ఎన్‌ఆర్‌ (నాన్‌ రిపోర్టెడ్‌) గా ప్రకటించారు. ఇప్పుడు కెనరా బ్యాంకులో 2100 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. మహారాష్ట్ర బ్యాంకులో కూడా 250 పోస్టులను భర్తీ చేయనున్నారు. అన్నీ కలిపి 3517 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇండియన్‌ బ్యాంకు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులకు సంబంధించి ఇప్పటికీ ఎన్ని పోస్టులను భర్తీ చేయనున్నారో ప్రకటించలేదు. ఏప్రిల్‌ 1, 2021లోపు ఈ పోస్టుల వివరాలను కచ్చితంగా ప్రకటిస్తారు.

 

ఐబీపీఎస్‌ స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు - X
నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేయాలనుకునేవారు 20-30 మధ్య వయసువారై ఉండాలి. అభ్యర్థులు వారి వయసును నవంబరు 1, 2020 తేదీతో పోల్చుకోవాలి.
 ప్రిలిమినరీ ఆన్‌లైన్‌ రాతపరీక్ష: 26.12.2020, 27.12.2020
 ఆన్‌లైన్‌ మెయిన్స్‌ రాతపరీక్ష: 24.01.2021
 దరఖాస్తు చివరితేదీ: 23.11.2020
 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్‌ ఆఫీసర్, రాజ్‌భాష అధికారి, లా ఆఫీసర్, హెచ్‌ఆర్‌ ఆఫీసర్, మార్కెటింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. ఆయా వివరాలకు ఐబీపీఎస్‌ విడుదల చేసిన నోటిఫికేషన్‌ను చూడాలి.

Posted Date : 11-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌