• facebook
  • whatsapp
  • telegram

మైండ్ కాలిక్యులేష‌న్స్ ముఖ్యం

పోలీసు ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌, మెయిన్స్ రాత‌ప‌రీక్ష‌ల్లో రెండింటిలో అరిథ్‌మెటిక్, రీజనింగ్ ఉంటాయి. ఈ స‌మ‌స్య‌ల సాధ‌న‌కు షార్ట్‌క‌ట్స్ నేర్చుకుంటే ప‌రీక్ష‌లో స‌మ‌యాన్ని త‌గిన విధంగా స‌ద్వినియోగం చేసుకోవ‌చ్చు. 

అరిథ్‌మెటిక్‌: వ్యాపార గణిత అంశాలైన శాతాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, చక్రవడ్డీ, బారువడ్డీ, కాలం-పని, కాలం-దూరం, వ్యాపార భాగస్వామ్యం, వైశాల్యాలు, చుట్టుకొలత, ఘనపరిమాణం, కసాగు, గసాభా వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటిని గ్రూపులుగా విభజించి సన్నద్ధమైతే చాలా సులభంగా నేర్చుకోవచ్చు. శాతాలు, నిష్పత్తి, లాభనష్టాలు, చక్రవడ్డీ, బారువడ్డీ ప్రశ్నలు ఒకే కోవకు చెందినవి. పదసరళిలో మాత్రమే మార్పు ఉంటుంది. శాతాలను క్షుణ్ణంగా నేర్చుకుంటే మిగిలిన అంశాలన్నీ సులభంగా ఉంటాయి. శాతాల్లో ఉన్న విలువను భిన్నాలుగా రాస్తే దాన్ని నిష్పత్తిగా గుర్తించవచ్చు.

                             కసాగు అంశాన్ని కాలం-పని, పైపులు-తొట్టెల్లో ఉపయోగిస్తాం. కాలం-దూరంలోని పదసరళిని మార్చి గమనిస్తే.. రైళ్లు, పడవలు-ప్రవాహాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. ఈ మూడు చాప్టర్లను అనుసంధానిస్తూ సన్నద్ధత కొనసాగించాలి. వైశాల్యాలు, ఘనపరిమాణాల ఫార్ములాలను పట్టిక రూపంలో రాసుకుని చదవాలి. ఫార్ములాల్లో ‘పై’ ఉన్నచోట సమాధానం 11తో భాగించేలా ఉంటుంది. ఇలాంటి టెక్నిక్‌లను వాడుతూ తక్కువ సమయంలో సమాధానాన్ని గుర్తించేలా సిద్ధమవ్వాలి.

డేటా అనాలిసిస్‌, డేటా సఫిషియన్సీ నుంచి 5 ప్రశ్నలు ఒకే పట్టిక/ వెన్‌చిత్రాలు, బార్‌చార్ట్‌, గ్రాఫ్‌లపై వస్తాయి. ఇచ్చిన, అందుబాటులో ఉన్న సమాచారం నుంచి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఈ క్రమంలో శాతాలు, నిష్పత్తి, సరాసరి అంశాలను ఉపయోగించాలి. సింప్లిఫికేషన్‌ తక్కువ సమయంలో పూర్తిచేసేలా షార్ట్‌కట్స్‌, మైండ్‌ కాలిక్యులేషన్స్‌ వాడాలి.

మేథమేటిక్స్‌ అంశాల్లో మాత్రికలు, త్రికోణమితి, ఎత్తు-దూరం, సర్డ్స్‌, ఇండిసెస్‌, ఆల్జీబ్రా అంశాలు చూసుకోవాలి. గత రెండేళ్లలో ఎక్కువ ప్రశ్నలు ఇవ్వనప్పటికీ అంతకుముందు పరీక్షల్లో 50 వరకూ ప్రశ్నలు మేథమేటిక్స్‌ అంశాల నుంచి వచ్చాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.

 

రీజనింగ్‌: దీనిలోని ప్రశ్నలన్నీ లాజిక్‌తో ముడిపడి ఉంటాయి. సృజనాత్మకతను పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. విధి నిర్వహణలో కేసులను విచారించే సమయంలో పోలీసులు తార్కికంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఒక లాజిక్‌ ఆధారంగా సమాధానం గుర్తించలేని సమయంలో లాజిక్‌ను మార్చి ప్రయత్నించాల్సి ఉంటుంది. నంబర్లు, లెటర్ల ఆధారంగా వచ్చే ప్రశ్నలను లాజికల్‌ రీజనింగ్‌గా పరిగణిస్తారు. నంబర్‌ సిరీస్‌, లెటర్‌ సిరీస్‌, అనాలజీ, కోడింగ్‌-డీకోడింగ్‌, ఆడ్‌మాన్‌ అవుట్‌ అంశాలు ఈ కోవకు చెందుతాయి. సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, రక్తసంబంధాలు, దిక్కులు, పజిల్స్‌ అనలిటికల్‌ రీజనింగ్‌ కిందకి వస్తాయి. అందుబాటులో ఉన్న పూర్తి సమాచారాన్ని వాడుతూ పజిల్స్‌, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ పూర్తిచేయాలి.

గడియారాలు, క్యాలెండర్‌, క్యూబ్స్‌, డైస్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. గడియారాల్లో చిన్నముల్లు, పెద్దముల్లు గంట వ్యవధిలో ఎన్నిసార్లు 90, 180, 0 డిగ్రీల కోణాలను చూపిస్తాయో గుర్తించాలి. అదేవిధంగా సమయం ఇచ్చినపుడు గంటలు, నిమిషాల ముల్లుల మధ్య ఉండే కోణాన్ని డిగ్రీల్లో కనుక్కోగలగాలి. క్యాలెండర్ల నుంచి వచ్చే ప్రశ్నల్లో తేదీ ఆధారంగా వారంలో ఏరోజు అవుతుందో చెప్పగలగాలి.

బొమ్మల ఆధారంగా ప్రశ్నలు ఇస్తే వాటిని నాన్‌వెర్బల్‌ రీజనింగ్‌గా పరిగణిస్తాం. సిరీస్‌ ప్రశ్నల్లో బొమ్మల మధ్య ఉండే సంబంధాన్ని బట్టి అదే లాజిక్‌ వాడుతూ సమాధానం గుర్తించాలి. సిలాజిజం, అసంప్షన్స్‌, ఇన్ఫరెన్సెస్‌, కోర్సెస్‌ ఆఫ్‌ యాక్షన్‌, ఆర్గ్యుమెంట్స్‌, కన్‌క్లూజన్స్‌, కాజ్‌-ఎఫెక్ట్‌, అసర్షన్‌-రీజన్‌, డెసిషన్‌ మేకింగ్‌.. హైలెవల్‌ రీజనింగ్‌ అంశాలు. ఈ ప్రశ్నలకు సమాధానం గుర్తించాలంటే భాష మీద పట్టుండాలి. హైలెవల్‌ రీజనింగ్‌ ఉద్యోగ నిర్వహణలో తీసుకునే నిర్ణయాలకు కూడా ఉపయోగపడుతుంది.

Posted Date : 14-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌