• facebook
  • whatsapp
  • telegram

రైల్వే రక్షణ వ్యవస్థలో మీరు భాగమవుతారా?

4208 ఆర్‌పీఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు



దేశ రవాణాలో కీలకం రైల్వే. ఇందులో భద్రత అత్యంత ముఖ్యమైంది. ప్రయాణికులు, రైల్వే స్టేషన్లు, రైల్వే ఆస్తులు.. వీటి రక్షణ బాధ్యత రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌)దే. ఇందులో ఎగ్జిక్యూటివ్‌ కానిస్టేబుళ్లు భాగమవుతారు. ఇటీవలే ఈ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. దేశ   వ్యాప్తంగా 4208 ఖాళీలున్నాయి. పదో తరగతి విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్టులతో నియామకాలుంటాయి. 


మేటి ఉద్యోగ భద్రత అందించే రైల్వే ఉద్యోగాలకు లక్షల మంది పోటీ పడుతుంటారు. పదో తరగతి విద్యార్హతతోనే ఎగ్జిక్యూటివ్‌ కానిస్టేబుల్‌ అవకాశం కాబట్టి మరింత మంది పోటీలో ఉంటారు. ఎంపికైన వారికి లెవెల్‌-3 జీతాలు చెల్లిస్తారు. వీరికి రూ.21,700 మూల వేతనం దక్కుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, టీఏ మొదలైనవి అదనంగా ఉంటాయి. అన్నీ కలిపి మొదటి నెల నుంచే సుమారు రూ.40 వేలు అందుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఖాకీ లేదా రైల్వే ఉద్యోగాలపై ప్రత్యేకమైన ఇష్టం ఉన్నవారు, ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో పోలీస్‌ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నవారికి ఈ నోటిఫికేషన్‌ మంచి అవకాశం. ఆర్‌పీఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కానిస్టేబుల్, రాష్ట్ర స్థాయి పోలీస్‌ ఉద్యోగాల సిలబస్‌ చాలా వరకు ఒకటే. 


కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష  

ముందు ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు (సీబీటీ) నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ ప్రకారం విభాగాల వారీ ఉన్న ఖాళీలకు పది రెట్ల మందిని ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్టు (పీఈటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్టు (పీఎంటీ), ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేస్తారు. అన్ని విభాగాల్లోనూ విజయవంతమైన వారికి మార్కుల మెరిట్‌ ప్రకారం ముందు శిక్షణకూ, తర్వాత ఉద్యోగానికీ అవకాశం కల్పిస్తారు. 

సీబీటీ పదో తరగతి స్థాయిలోనే ఉంటుంది. 120 ప్రశ్నలు వస్తాయి. అరిథ్‌మెటిక్‌ 35, జనరల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 35, జనరల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. తప్పు సమాధానానికి 1/3 మార్కు తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ఇందులో అర్హత సాధించడానికి ఎస్సీ, ఎస్టీలు 30, మిగిలిన వారంతా 35 శాతం మార్కులు పొందాలి. అంటే ఎస్సీ, ఎస్టీలకు కనీసం 36, మిగిలిన వారికి 42 మార్కులు రావాలి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే వస్తాయి. పరీక్ష రాయడానికి తెలుగు మాధ్యమాన్నీ ఎంచుకోవచ్చు. 



సిలబస్‌ ఏమిటి?

అరిథ్‌మెటిక్‌: అంకెలు, సంఖ్యలు, పూర్ణాంకాలు, భిన్నాలు, శాతాలు, సగటు, అంకెల మధ్య సంబంధాలు, కూడికలు, గుణింతాలు, తీసివేతలు, భాగహారం, వడ్డీ, లాభ-నష్టాలు, రాయితీ, కాలం-దూరం, రేషియో అండ్‌ ప్రపోర్షన్, టేబుల్స్‌ అండ్‌ గ్రాఫ్స్, మెన్సురేషన్‌.

జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌: అనాలజీ, పోలికలు-భేదాలు, స్పేషియల్‌ విజువలైజేషన్, స్పేషియల్‌ ఓరియెంటేషన్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ ఎనాలిసిస్, జడ్జిమెంట్, డెసిషన్‌ మేకింగ్, విజువల్‌ మెమరీ, డిస్క్రిమినేటింగ్‌ అబ్జర్వేషన్, రిలేషన్‌షిప్‌ కాన్సెప్ట్స్, అరిథ్‌మెటికల్‌ రీజనింగ్, వెర్బల్‌ అండ్‌ ఫిగర్‌ క్లాసిఫికేషన్, అరిథ్‌మెటిక్‌ నంబర్‌ సిరీస్, నాన్‌-వెర్బల్‌ సిరీస్, కోడింగ్‌ అండ్‌ డీకోడింగ్, స్టేట్‌మెంట్‌-కన్‌క్లూజన్, సిలాజిస్టిక్‌ రీజనింగ్‌.

జనరల్‌ అవేర్‌నెస్‌: దైనందిన జీవితంతో ముడిపడే రోజువారీ సంఘటనలే (వర్తమాన వ్యవహారాలు) ప్రశ్నలుగా వస్తాయి. పర్యావరణాంశాలు, భారతీయ చరిత్ర, కళలు, సంస్కృతి, భూగోళం, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, భారత రాజ్యాంగం, క్రీడలు, జనరల్‌ సైన్స్‌ అంశాల్లో వీటిని అడుగుతారు. 8, 9, 10 తరగతుల సైన్స్, సోషల్‌ పుస్తకాలు బాగా చదివి ముఖ్యమైన విషయాలు నోట్సు రాసుకోవాలి. వర్తమాన వ్యవహారాల కోసం 2023 జులై నుంచి పరీక్ష తేదీ వరకు ముఖ్య సంఘటనలు మననం చేసుకోవాలి. పత్రికలు చదువుతున్నప్పుడే ప్రశ్నగా రావడానికి అవకాశం ఉన్నవాటిని నోట్సు రాసుకుంటే.. పరీక్షకు ముందు తక్కువ వ్యవధిలోనే మరోసారి పునశ్చరణ చేసుకోవచ్చు. నియామకాలు, అవార్డులు, విజేతలు, ఎన్నికలు, పుస్తకాలు-రచయితలు, ప్రముఖుల పర్యటనలు, మరణాలు.. ఇలా విభాగాల వారీ ముఖ్యమైనవి తెలుసుకుంటే ఎక్కువ మార్కులు పొందవచ్చు. ఎత్తైనవి, లోతైనవి, పెద్దవి, చిన్నవి, దేశాలు-రాజధానులు, కరెన్సీ, అధ్యక్షులు...ఇలా స్టాక్‌ జీకే అంశాలనూ బాగా చదువుకుంటే వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. 


‣ ఖాకీ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవారు, ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో వాటికోసం సన్నద్ధమవుతున్నవారికి ఈ నోటిఫికేషన్‌ మంచి అవకాశం. 


‣ ఆర్‌పీఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కానిస్టేబుల్, రాష్ట్ర స్థాయి పోలీస్‌ ఉద్యోగాల సిలబస్‌ దగ్గరగా ఉండటం అభ్యర్థులకు కలిసొచ్చే అంశమే!


సన్నద్ధత సూత్రాలు

1 నోటిఫికేషన్‌లో విభాగాల వారీ సిలబస్‌ వివరాలు  ప్రకటించారు. వాటిని పరిశీలించాలి. ఆ ఆంశాలకే పరిమితం కావాలి. 

2 ప్రాథమికాంశాల నుంచే కనీసం సగం ప్రశ్నలు రావచ్చు. అందువల్ల ముందు వాటిపైనే ఎక్కువ దృష్టి సారించాలి. ఆ తర్వాత ప్రతి విభాగంలోనూ అంశాలవారీ వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. 

3 రెండు లేదా మూడు పుస్తకాలనే ఎంచుకుని, వాటినే బాగా చదవాలి. 

4 గత ప్రశ్నపత్రాలు గమనించాలి. ఏ అంశాల్లో, ఏ తరహాలో ప్రశ్నలు వస్తున్నాయో పరిశీలించి, సన్నద్ధత అందుకు తగ్గట్టు ఉండేలా చూసుకోవాలి. 

5 పరీక్షకు ముందు వీలైనన్ని మాక్‌ టెస్టులు రాయాలి. ఇలా రాస్తున్నప్పుడు సమయ నిబంధనను కచ్చితంగా పాటించాలి. జవాబులను సరిచూసుకుని, వెనుకబడిన విభాగం/ అంశాలకు అదనపు సమయం కేటాయించి, తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. 

6 మొత్తం 120 ప్రశ్నలకు 90 నిమిషాల్లో జవాబులు గుర్తించాలి. అంటే ప్రతి ప్రశ్నకూ 45 సెకన్ల సమయమే ఉంటుంది. అరిథ్‌మెటిక్, జనరల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌లో ఎక్కువ ప్రశ్నలకు ఈ వ్యవధి సరిపోదు. వీలైనన్ని మాదిరి ప్రశ్నల సాధనతోనే ఈ విభాగాల్లో సమస్యలను తక్కువ సమయంలో పూర్తి చేయగలరు.

7 పరీక్షలో జనరల్‌ అవేర్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఉంది. అందువల్ల ఆ విభాగాన్ని ప్రాధాన్యంతో చదవాలి. సన్నద్ధతకు ఎక్కువ సమయం కేటాయించాలి. పరీక్షలో ఈ విభాగాన్ని తక్కువ వ్యవధిలో పూర్తిచేసుకోవాలి. మిగిలిన సమయాన్ని అరిథ్‌మెటిక్, రీజనింగ్‌లకు కేటాయించాలి. 

8 అరిథ్‌మెటిక్, రీజనింగ్‌ల్లో కొన్ని ప్రశ్నలకు జవాబు రాబట్టడం తెలిసినప్పటికీ, అందుకోసం ఎక్కువ సమయం తీసుకోవచ్చు. ఈ తరహావి ఆఖరులోనే ప్రయత్నించాలి. సులువుగా, తక్కువ వ్యవధిలో పూర్తయ్యే వాటికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. 

9 రుణాత్మక మార్కులు ఉన్నందున అభ్యర్థులు తమకు సమాధానం తెలియని ప్రశ్నలను వదిలేయాలి. 

10 పీఈటీలో అర్హత కోసం పరీక్ష తర్వాత తగిన సాధన చేస్తే సరిపోతుంది.



పీఈటీ, పీఎంటీ:

పురుషులు: 1600 మీటర్ల దూరాన్ని 5 నిమిషాల 45 సెకన్లలో చేరుకోవాలి. 14 అడుగులకు లాంగ్‌ జంప్, 4 అడుగుల హైజంప్‌ చేయాలి. వీరు 165 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలైతే 160 సెం.మీ. సరిపోతుంది. ఛాతీ ఊపిరి పీల్చకముందు 80, పీల్చిన తర్వాత 85 సెం.మీ. విస్తీర్ణం ఉండాలి. ఎస్సీ, ఎస్టీలైతే పీల్చక ముందు 76.2, పీల్చిన తర్వాత 81.2 సెం.మీ. అవసరం. 

మహిళలు: 800 మీటర్ల దూరాన్ని 3 నిమిషాల 40 సెకన్లలో చేరుకోవాలి. 9 అడుగుల లాంగ్‌ జంప్, 3 అడుగుల హైజంప్‌ చేయగలగాలి. 

ఎత్తు 157 సెం.మీ. ఉండాలి. ఎస్సీ, ఎస్టీలైతే 152 సెం.మీ. సరిపోతుంది. 

పురుషులు, మహిళలకు లాంగ్‌జంప్, హైజంప్‌ ఒక్కో దానికీ రెండు ప్రయత్నాలు ఉంటాయి. పీఈటీ, పీఎంటీల్లో అర్హత సాధిస్తే సరిపోతుంది. వీటికి మార్కులు లేవు. వీటిలో అర్హత పొందినవారికి పరీక్ష మార్కుల మెరిట్, రిజర్వేషన్లు అనుసరించి ధృవపత్రాలు పరిశీలించి, శిక్షణకు తీసుకుంటారు. అందులోనూ విజయవంతమైనవారికి ఉద్యోగానికి అవకాశం కల్పిస్తారు.  

పోస్టు: ఆర్‌పీఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కానిస్టేబుల్‌

ఖాళీలు: 4208. వీటిలో 631 మహిళలకు.

అర్హత: పదో తరగతి/ సమాన ఉత్తీర్ణత. బీ1 వైద్య ప్రమాణాలు అవసరం. దివ్యాంగులు అనర్హులు.

వయసు: జులై 1, 2024 నాటికి 18-28 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మే 14 వరకు స్వీకరిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.500. పరీక్షకు హాజరైతే రూ.400 వెనక్కి ఇస్తారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ/ఈబీసీలకు రూ.250. వీరు పరీక్షకు హాజరైతే ఫీజు మొత్తం వెనక్కి వస్తుంది. 

పరీక్ష తేదీ: ప్రకటించలేదు.

వెబ్‌సైట్‌: www.rrbapply.gov.in/#/auth/landing


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

‣ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!

‣ పుస్తక పఠనం ఆస్వాదిస్తున్నారా.span>

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

Posted Date : 23-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌