• facebook
  • whatsapp
  • telegram

రైల్వే కొలువులకు.. మీరు సిద్ధమేనా?

అసిస్టెంట్‌ లోకో పైలట్లల‌కు,  టెక్నీషియన్లల‌కు ఉమ్మడి రాతపరీక్షకు ఉంటుంది. సమగ్రంగా ఎలా సన్నద్ధం కావాలో తెలుసుకుందాం! అసిస్టెంట్‌ లోకో పైలట్స్‌కు విద్యార్హత పదో తరగతితోపాటు ఐ.టి.ఐ. / మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లలో 3 సంవత్స‌రాల డిప్లొమా, ఉన్నతస్థాయి కోర్సులు పూర్తిచేసినవారు కూడా అర్హులే. టెక్నీషియన్‌ సిగ్నల్‌ గ్రేడ్‌-3, టెలికమ్యూనికేషన్‌ మెయింటైనర్‌ గ్రేడ్‌-3 పోస్టులకు పదో తరగతితోపాటు ఐటీఐ ఉండాలి. లేదా మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత అవసరం. లేదా డిప్లొమా ఉండాలి. టెక్నీషియన్‌ గ్రేడ్‌-3 పోస్టులకు పదో తరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తిచేసుండాలి.
 

మక్కువ ఎక్కువ... 
అసిస్టెంట్‌ లోకో పైలట్లకు ఆకర్షణీయమైన జీతం ఉంటుంది. అందుకే ఎక్కువమంది అభ్యర్థులు ఈ పోస్టులపై మక్కువ చూపిస్తారు. ముందుగానే పరీక్ష తేదీని ప్రకటించడం వల్ల నియామకాలు త్వరగా జరిగే అవకాశం ఉంది. జోన్‌లవారీగా ఉద్యోగ నియామకాలు జరుగుతాయి కాబట్టి ఎవరికి నచ్చిన బోర్డుకు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని పరీక్షలూ ఒకేరోజునే జరుగుతాయి.
టెక్నీషియన్‌, అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్టులకు ఉమ్మడి రాత పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు మాధ్యమంలో ఉంటుంది. ఐ.టి.ఐ. అభ్యర్థులు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం 
అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్టులకు మొదటి స్థాయిలో రాత పరీక్ష, ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రెండో స్థాయిలో ఆప్టిట్యూడ్‌ పరీక్ష నిర్వహిస్తారు. మూడో దశలో A-1 మెడికల్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు B-1/C-1 మెడికల్‌ పరీక్ష ఉంటుంది.
రాత పరీక్ష: అసిస్టెంట్‌ లోకోపైలట్‌, టెక్నీషియన్‌ పోస్టులకు ఉమ్మడి రాతపరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. పరీక్షలో 100 లేదా 120 ప్రశ్నలుంటాయి. ప్రతి తప్పు సమాధానానికీ 1/3 వంతు మార్కు కోత విధిస్తారు. ప్రశ్నపత్రంలో టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ ప్రశ్నలు సమంగా ఉంటాయి.
పదోన్నతులు: రాబోయే కాలంలో పదవీ విరమణలు ఎక్కువగా ఉండటం వల్ల కొత్తగా ఈ పోస్టుల్లో చేరినవారు త్వరగా పదోన్నతులు పొందే అవకాశాలున్నాయి. అసిస్టెంట్‌ లోకో పైలట్‌గా చేరిన అభ్యర్థే తరువాత సీనియర్‌ అసిస్టెంట్‌ లోకో పైలట్‌, లోకో పైలట్‌, సీనియర్‌ లోకో పైలట్‌గా పదోన్నతి పొందుతారు.లోకో పైలట్లు ప్రతిభ ఆధారంగా లోకో ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశాలుంటాయి. టెక్నీషియన్‌ గ్రేడ్‌-3 భర్తీ అయిన అభ్యర్థులకు తరువాత స్థాయిలో గ్రేడ్‌-II, గ్రేడ్‌-I, సీనియర్‌ టెక్నీషియన్లుగా పదోన్నతులుంటాయి.

సిలబస్‌ 
టెక్నికల్‌ విభాగం: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ల నుంచి ప్రశ్నలు ఉంటాయి. అందరికీ ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తున్నారు. కాబట్టి అన్ని బ్రాంచిల నుంచీ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

నాన్‌ టెక్నికల్‌ విభాగం
అరిథ్‌మెటిక్‌: సంఖ్యలు, గ.సా.భా. & క.సా.గు., సూక్ష్మీకరణం, వర్గమానాలు, సగటు, శాతం, నిష్పత్తి- అనులోమానుపాతం, వయసులు, భాగస్వామ్యాలు, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం, రైళ్ళు, పడవలు-ప్రవాహాలు, పైపులు-తొట్టెలు, వడ్డీలు, క్షేత్రగణితం, ఎత్తులు-దూరాల మీద ప్రశ్నలు ఉంటాయి.

 

రీజనింగ్‌: కోడింగ్‌-డీకోడింగ్‌, శ్రేణులు, భిన్న పరీక్ష, పోలిక పరీక్ష, రక్త సంబంధాలు, దిశ పరీక్ష, వెన్‌ డయాగ్రమ్స్‌, మ్యాథమేటికల్‌ ఆపరేషన్స్‌, మిసింగ్‌ నంబర్స్‌ మీద ప్రశ్నలుంటాయి. గమనిక: ఈ రెండు విభాగాల్లో అభ్యర్థులు 100% మార్కులు సాధించే అవకాశం ఉంది.
 

జనరల్‌ స్టడీస్‌: స్టాక్‌ జనరల్‌నాలెడ్జ్‌: రైల్వే సంబంధిత ప్రశ్నలుంటాయి. ఇంకా భారత భూగోళశాస్త్రం, ప్రపంచ భూగోళశాస్త్రం, అంతర్జాతీయ సరిహద్దులు, భారత రాజ్యాంగ సంబంధిత ప్రశ్నలు, జాతీయ చిహ్నాలు, క్రీడలు, బిరుదులు, రచయితలు, పక్షి సంరక్షణ కేంద్రాలు, కేంద్ర సంస్థలు, విద్యుత్‌ కేంద్రాలు, నదులు, డ్యాములు, కాల్వలు, సరస్సులు, ప్రసిద్ధ కట్టడాలు, మొదటి వ్యక్తులు, భారత ఆర్థిక వ్యవస్థ మొదలైనవాటి నుంచి ప్రశ్నలుంటాయి. 
భారతీయ ప్రాచీన చరిత్ర: స్వాతంత్య్ర ఉద్యమం వరకు ప్రశ్నలు అడుగుతారు. ఆధునిక చరిత్ర నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

 

పాలిటీ: భారత రాజ్యాంగం గురించి ప్రాథమిక భావనలు, రాజ్యాంగ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు, చట్టబద్ధ సంస్థలు, చట్టబద్ధేతర సంస్థల గురించి తెలుసుకోవాలి.
 

జాగ్రఫీ: విశ్వం, భూమి, ఖండాలు, మహాసముద్రాలు, నదులు, ఖనిజాలు, రవాణా వ్యవస్థ, జనాభా, వ్యవసాయం, భూకంపాలు, తుపానులు, గడ్డిభూములు, పర్వతాలు, పీఠభూములు, జలసంధులు, కాలువల గురించి తెలుసుకోవాలి.
 

జనరల్‌సైన్స్‌: భౌతిక, రసాయన, జీవశాస్త్ర అంశాలను చదవాలి. ముఖ్యంగా భౌతికశాస్త్ర అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
 

కరెంట్‌ అఫైర్స్‌: పరీక్ష జరిగేముందు ఒక ఏడాది కాలంలో జరిగిన ప్రధాన సంఘటనలు, సమావేశాలు, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, క్రీడా పతకాల గురించి తెలుసుకోవాలి.

Posted Date : 07-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌