• facebook
  • whatsapp
  • telegram

ఉద్యోగ ఖాతా తెరుస్తారా!

‣ ప్రిలిమ్స్‌తో పాటే మెయిన్స్‌ సన్నద్ధత

బ్యాంకు కొలువు...ఎందరో ఉద్యోగార్థుల కల! విధుల తీరు, చక్కని జీతం, ఆకర్షణీయమైన రుణ సదుపాయాలు దీని ప్రత్యేకత. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్న గ్రాడ్యుయేట్లందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్‌ పరీక్ష ముగిసేలోపే దానికీ, మెయిన్స్‌కు రెండింటికీ కలిపి సమగ్రంగా సిద్ధమైతే విజయ పథంలో ఉన్నట్టే!

ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించే రెండంచెల ఆబ్జెక్టివ్‌ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. దీనిలో మొదటి అంచె (ప్రిలిమినరీ) కేవలం అర్హత పరీక్ష. రెండో అంచె (మెయిన్స్‌)లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

అభ్యర్థులు ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలు రెండింటిలోని ప్రతి విభాగంలో కనీస మార్కులతో ఉత్తీర్ణులవ్వాల్సివుంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో నాలుగో వంతు మార్కులను వారి మొత్తం మార్కుల నుంచి తగ్గిస్తారు.

ఎల్‌పీటీ... ఉండేలా!
మొదటిసారిగా బ్యాంకు పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు తమ ప్రిపరేషన్‌ పట్ల స్పష్టత, ప్రణాళిక ఉండాలి. ముందుగా పరీక్షా విధానం, సబ్జెక్టులు, సిలబస్‌లపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. ఆ తరువాత పరీక్షకు ఎలా సిద్ధమవ్వాలో చూడాలి.

పరీక్షలో విజయం సాధించాలంటే ఎల్‌పీటీ సూత్రం పాటించాలి. L- Learning (నేర్చుకోవడం), P-Practice (సాధన చేయడం), T-Tests (మోడల్‌ పరీక్షలు రాయడం). పరీక్షకున్న సమయంలోగా వీటన్నింటితో సిద్ధమవ్వాలి.

క్లర్కు పరీక్షకు సిద్ధమవడమంటే ‘ముందుగా ప్రిలిమ్స్‌ పరీక్ష, దానిలో క్వాలిఫై అయ్యాక మెయిన్స్‌ పరీక్ష’ అనుకోకూడదు. రెండింటికీ కలిపి తయారవ్వాలి. ప్రిలిమ్స్‌ పరీక్షలోగా రెండింటికీ సిద్ధమవ్వాలి. అభ్యర్థులు తాము ప్రతిరోజూ నిర్దేశించుకున్న సమయంలో (కనీసం 8-10 గంటలు) ఎల్‌పీటీ ఉండేలా చూసుకోవాలి. అన్ని విభాగాల్లో ఒక్కో టాపిక్‌ నేర్చుకుంటూ దానిలో ఉండే వివిధ తరహా ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేయాలి. మొదటి రోజునుండే ఐబీపీఎస్‌ క్లర్కు పరీక్ష తరహాలో పూర్తిస్థాయి మోడల్‌పేపర్‌ను సమయాన్ని నిర్దేశించుకుని సాధించాలి. దీనివల్ల ప్రతి విభాగంలో నిర్దిష్ట సమయంలో ఎన్ని ప్రశ్నలు సాధించగలుగుతున్నారో వారికి అవగాహన ఏర్పడుతుంది. మొదట్లో మోడల్‌ పేపర్‌లో తక్కువ మార్కులు వచ్చినా ప్రతిరోజూ కొత్త అంశాలు నేర్చుకుంటూ సాధన చేయడంవల్ల క్రమేపీ మోడల్‌ పేపర్‌లో కూడా ఎక్కువ మార్కులు వస్తాయి. అభ్యర్థులు చేయాల్సిన మరొక పని- ప్రశ్నలను వేగంగా సాధించే మెలకువలను నేర్చుకోవడం. వీలైనన్ని షార్ట్‌కట్‌ పద్ధతులను నేర్చుకుంటూ వాటిని ప్రశ్నను సాధించే సమయంలో ఉపయోగించేలా చూసుకోవాలి.

జనరల్‌/ ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌, కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ మినహా ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలో ఒకే విధమైన సబ్జెక్టులున్నాయి. అయితే ఆయా పరీక్షలననుసరించి ప్రశ్నల స్థాయుల్లో భేదముంటుంది. అభ్యర్థులు పూర్వ ప్రశ్నపత్రాలు పరిశీలిస్తే అది అర్థమవుతుంది. అందుకే వీలైనన్ని పూర్వ ప్రశ్నపత్రాలను సాధించాలి. దీనివల్ల పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నల సరళిలోని మార్పులను కూడా గమనించే అవకాశమేర్పడుతుంది. దానికి అనుగుణంగా ప్రిపరేషన్‌ కొనసాగించవచ్చు.

ఈవిధంగా అభ్యర్థులు ఎవరికి వారు తమకు నప్పే పరీక్షా ప్రణాళికను ఏర్పరుచుకుని శ్రద్ధగా సంసిద్ధం కావాలి. ఇలా చేస్తే ఎక్కువ సంఖ్యలో పోస్టులున్న ఈ సమయంలో ప్రభుత్వరంగ బ్యాంకులో క్లర్కు ఉద్యోగం సులువుగా సాధించవచ్చు!

Posted Date : 07-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌