• facebook
  • whatsapp
  • telegram

ఎస్‌బీఐలో 6160 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీ

* ఎగ్జామ్‌ ప్రిపరేషన్‌ ప్లాన్‌ 

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) 6160 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలో 390, తెలంగాణలో 125 పోస్టులు ఉన్నాయి. పరీక్షలో చూపిన ప్రతిభతో అవకాశం కల్పిస్తారు. ఇందులో విజయం సాధించిన వారికి ఏడాది శిక్షణ ఉంటుంది. ఈ వ్యవధిలో ప్రతి నెలా రూ.15,000 స్టైపెండ్‌ చెల్లిస్తారు.  


ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కోరుకున్న రాష్ట్రంలో పోస్టులకు పోటీ పడవచ్చు. అప్రెంటిస్‌గా విజయవంతులైతే ట్రేడ్‌ టెస్టు నిర్వహిస్తారు. వీరికి ఎస్‌బీఐ-నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎస్‌డీసీ) సంయుక్తంగా సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తాయి. ఏడాది తర్వాత అప్రెంటిస్‌లు బాధ్యతల నుంచి వైదొలగాలి. 


ఎస్‌బీఐ జూనియర్‌ అసోసియేట్‌ నియామకాల్లో వీరికి ప్రత్యేక వెయిటేజీ ఉంటుంది. అలాగే ఎస్‌బీఐ అప్రెంటిస్‌ అనుభవంతో ప్రైవేటు బ్యాంకులు, బీమా, ఇతర ఆర్థిక సంస్థల్లో సులువుగానే అవకాశం పొందవచ్చు. అందువల్ల అప్రెంటిస్‌ పోస్టులను తక్కువగా అంచనా వేయకుండా పోటీ పడటమే మంచిది. ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగాలే లక్ష్యంగా ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పరీక్షను ఎదుర్కొంటే సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. తర్వాత రాసే పరీక్షలకు మంచి అనుభవంగానూ ఉపయోగపడుతుంది.  


 తెలుగులోనూ పరీక్ష

పరీక్షను తెలుగులోనూ రాసుకోవచ్చు. ప్రతి సరైన జవాబుకూ ఒక మార్కు. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు. ప్రశ్నపత్రం వంద మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్, జనరల్‌ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ విభాగాల నుంచి ఒక్కో దాంట్లో 25 చొప్పున 100 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ఒక్కో విభాగానికీ 15 నిమిషాలు కేటాయించారు. పరీక్షలో అర్హత సాధించడానికి విభాగాలవారీ కనీస మార్కులు పొందాలనే నిబంధన లేదు. మొత్తం మీద కనీస అర్హత మార్కులు పొందినవారికి అవకాశం కల్పిస్తారు. వీటిని బ్యాంకు నిర్ణయిస్తుంది. ఇలా అర్హుల జాబితా నుంచి రాష్ట్రాలు, కేటగిరీల వారీ మెరిట్‌ ప్రకారం జాబితా రూపొందిస్తారు. పరీక్షలో అర్హులకు స్థానిక భాషలో పరీక్ష నిర్వహిస్తారు. పది లేదా ఇంటర్‌లో ఆ భాషను చదువుకున్నవారు దీన్ని రాయనవసరం లేదు. స్థానిక భాషలో ఉత్తీర్ణులకు.. వైద్య పరీక్షలు నిర్వహించి, అప్రెంటిస్‌గా నియమిస్తారు. 


 

ఏ అంశాల్లో ప్రశ్నలు? 

జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌: ఈ విభాగంలో ఆర్థికాంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. అందువల్ల వాటిపై అవగాహన పెంచుకోవాలి. ఆర్‌బీఐ, బ్యాంకింగ్‌ వ్యవస్థ, బ్యాంక్‌ పదజాలం, బీమా, రెపో, రివర్స్‌ రెపో, వడ్డీరేట్లు, బ్యాంకుల కార్యకలాపాలు, బ్యాంకుల విలీనం, తాజా ఆర్థిక నిర్ణయాలు, బ్యాంకులు-ప్రధాన కార్యాలయాలు-అధిపతులు.. ఇవన్నీ తెలుసుకోవాలి. జనరల్‌ అవేర్‌నెస్‌లో భాగంగా రోజువారీ సంఘటనలే (వర్తమాన వ్యవహారాలు) ప్రశ్నలుగా వస్తాయి. వీటిలో ఎక్కువ ప్రశ్నలకు సాధారణ పరిజ్ఞానంతోనే జవాబులు గుర్తించవచ్చు. దేశ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక వ్యవస్థ, పాలిటీ, సైన్స్‌ల్లో ప్రాథమిక అవగాహనను పరిశీలిస్తారు. వీటికోసం 8,9,10 తరగతుల్లోని ముఖ్యాంశాలు చదువుకుంటే సరిపోతుంది. వర్తమాన వ్యవహారాల కోసం 2023 జనవరి నుంచి పరీక్ష తేదీ వరకు ముఖ్య సంఘటనలు మననం చేసుకోవాలి. పత్రికలు చదువుతున్నప్పుడే ప్రశ్నగా రావడానికి అవకాశం ఉన్నవాటిని నోట్సు రాసుకుంటే.. పరీక్షకు ముందు తక్కువ వ్యవధిలోనే మరోసారి చదువుకోవచ్చు. నియామకాలు, అవార్డులు, విజేతలు, ఎన్నికలు, పుస్తకాలు- రచయితలు, ప్రముఖుల పర్యటనలు, మరణాలు..ఈ అంశాలకు ప్రాధాన్యమివ్వాలి. 


జనరల్‌ ఇంగ్లిష్‌: అభ్యర్థి ప్రాథమిక ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ప్రశ్నలు వస్తాయి. ఖాళీలు పూరించడం, వాక్యంలో తప్పును గుర్తించడం, సమానార్థాలు, వ్యతిరేక పదాలు, తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలుగా మార్చడం, వాక్యంలో పదాలను క్రమ పద్ధతిలో అమర్చడం, కాంప్రహెన్షన్‌..తదితర విభాగాల నుంచే వీటిని అడుగుతారు హైస్కూల్, ఇంటర్మీడియట్‌ స్థాయి ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకున్నవారు ఎక్కువ మార్కులు పొందవచ్చు. 


క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: నంబర్‌ సిస్టమ్, ఫండమెంటల్‌ అరిథ్‌మెటికల్‌ ఆపరేషన్స్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. అరిథ్‌మెటిక్‌ ఆపరేషన్స్‌లో భాగంగా శాతాలు, నిష్పత్తి, సరాసరి, చక్రవడ్డీ, బారువడ్డీ, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం, డిస్కౌంట్‌.. మొదలైనవి బాగా చదవాలి. ముఖ్యమైన సూత్రాలు, వాటిని ఉపయోగించే విధానం తెలుసుకుని వీలైనన్ని ఎక్కువ మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే ఉన్న వ్యవధిలో సమాధానం గుర్తించవచ్చు. 


రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌: రీజనింగ్‌లో వెర్బల్, నాన్‌ వెర్బల్‌ ప్రశ్నలు ఉంటాయి. సెమాంటిక్‌ ఎనాలజీ, సింబాలిక్‌ ఆపరేషన్స్, నంబర్‌ ఎనాలజీ, ట్రెండ్స్, ఫిగర్‌ ఎనాలజీ, వెన్‌ డయాగ్రమ్స్, నంబర్‌ క్లాసిఫికేషన్, సిరీస్, కోడింగ్‌-డీకోడింగ్, వర్డ్‌ బిల్డింగ్‌... తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. ఎక్కువ ప్రశ్నలు తర్కంతో ముడిపడి ఉంటాయి. వీటికి సమాధానం గుర్తించాలంటే గణితంలోని ప్రాథమికాంశాలపై అవగాహన ఉండాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేసినవారు ఎక్కువ మార్కులు పొందవచ్చు. కంప్యూటర్స్‌లో ప్రశ్నలన్నీ ప్రాథమిక స్థాయిలోనే వస్తాయి. అభ్యర్థి కంప్యూటర్‌ ఉపయోగించి, చిన్నచిన్న పనులు పూర్తిచేయగలరా, లేదా తెలుసుకునేలా ఇవి ఉంటాయి. వర్డ్, ఎక్సెల్, ఇంటర్నెట్, వెబ్‌ బ్రౌజింగ్, ఈమెయిల్, యూఆర్‌ఎల్, హెచ్‌టీటీపీ, వెబ్‌సైట్లు.. వీటి గురించి తెలుసుకోవాలి. ఇంజినీరింగ్‌ విద్యార్థులు, డిగ్రీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుకున్నవారు ప్రత్యేకంగా సన్నద్ధం కానక్కర్లేదు. 


అప్రెంటిస్‌ పోస్టులను తక్కువగా అంచనా వేయకుండా పోటీ పడటమే మంచిది. ముఖ్యంగా బ్యాంకు ఉద్యోగాలే లక్ష్యంగా ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పరీక్షను ఎదుర్కుంటే సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. తర్వాత రాసే పరీక్షలకు మంచి అనుభవంగానూ ఉపయోగపడుతుంది. 


ముఖ్య సమాచారం

అర్హత: డిగ్రీ, వయసు ఆగస్టు 1, 2023 నాటికి 20-28 ఏళ్లలోపు ఉండాలి. ఆగస్టు 2, 1995 - ఆగస్టు 1, 2003 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు సడలింపులు వర్తిస్తాయి.  

ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు చెల్లించనవసరం లేదు. మిగిలిన వాళ్లకు రూ.300. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 21 పరీక్ష: అక్టోబరు/నవంబరులో.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌. 

వెబ్‌సైట్‌: https://ibpsonline.ibps.in/sbiaaug23/  సన్నద్ధత ఎలా?

* ఇప్పటికే బ్యాంకు పరీక్షలు రాస్తున్నవారు, శిక్షణలో ఉన్నవారు అదే సన్నద్ధతతో ఈ పరీక్షను ఎదుర్కోవచ్చు. 

* సెక్షన్ల వారీ సమయ నిబంధన ఉంది. అందువల్ల ఉన్న ఆ వ్యవధిలోనే వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. 

* ఒక ప్రశ్నకు గరిష్ఠంగా 36 సెకన్ల వ్యవధే దక్కుతుంది. రీజనింగ్, కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ ప్రశ్నలకు సమయం సరిపోకపోవచ్చు. ఈ విభాగాల్లో వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే పరీక్షలో కొంత సులువవుతుంది. 

* ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నల జోలికి వెళ్లకుండా సులువుగా ఉండి, తక్కువ వ్యవధిలో జవాబు రాబట్టగలిగేవే ప్రయత్నించడం తెలివైన నిర్ణయం అవుతుంది. 

* రుణాత్మక మార్కులు ఉన్నందున ఏమాత్రం తెలియని వాటిని వదిలేయడం మేలు. 

* ఐబీపీఎస్, ఎస్‌బీఐ క్లరికల్‌... పాత, మాదిరి ప్రశ్నపత్రాలు వీలైనన్ని సాధన చేయాలి. 

* కనీసం పది నమూనా పరీక్షలైనా రాసి, జవాబులు విశ్లేషించుకుని.. తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. 

* తొలి పరీక్ష నుంచి చివరి టెస్టు వరకు మీ స్కోరు ఆరోహణ క్రమంలో ఉంటే సన్నద్ధత విజయానికి దగ్గర్లో ఉన్నట్లే. 


మరింత సమాచారం... మీ కోసం!

‣ అకడమిక్‌ యాంగ్జైటీని అధిగమిద్దాం!

‣ ఇంటర్‌తో 7,547 ఎగ్జిక్యూటివ్‌ కానిస్టేబుళ్లు

‣ తీర రక్షక దళంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు

‣ ఇంటర్‌తో ఖగోళ పరిశోధన

‣ ‘పవర్‌ బీఐ’తో బెస్ట్‌ కెరియర్‌

Posted Date : 11-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌