• facebook
  • whatsapp
  • telegram

SBI POs: పీఓ కొలువులకు ఎస్‌బీఐ పిలుపు

2056 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల 

ప్రిపరేషన్ విధానం

 

 

బ్యాంకు కొలువు లక్ష్యంగా ఉన్న అభ్యర్థులకు శుభవార్త! ఎప్పటినుంచో ఉద్యోగార్థులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) పీఓ నియామక ప్రకటన వెలువడింది. దీని ద్వారా 56 బ్యాక్‌లాగ్‌ పోస్టులతో కలిపి.. 2056 పీఓ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు అసిస్టెంట్‌ మేనేజర్‌ హోదాతో విధుల్లో కొనసాగవచ్చు. 

 

వేతనం, ఇతర ప్రోత్సాహకాల కారణంగా ఎస్‌బీఐ పీఓ పోస్టులకు పోటీ ఎక్కువగా ఉంటోంది. ఈసారి ప్రిలిమ్స్, మెయిన్స్‌ల్లో సెక్షన్ల వారీ కటాఫ్‌ మార్కుల నిబంధన లేకపోవడం అభ్యర్థులకు మేలుచేసే అంశంగానే చెప్పుకోవచ్చు. నవంబరు చివర్లో లేదా డిసెంబరు మొదట్లో ప్రారంభమయ్యే ఈ పరీక్షలు ఫిబ్రవరితో ముగుస్తాయి. ఫలితాలు మార్చిలో వెలువడతాయి. అందువల్ల పీఓలుగా ఎంపికైనవారు ఏప్రిల్‌ నుంచే విధుల్లో చేరే అవకాశం ఉంది. 

 

డిగ్రీ ఉత్తీర్ణులకే కాకుండా.. ఇప్పుడు సెమిస్టర్‌/ తుది సంవత్సరంలో ఉండి డిసెంబరు 31 నాటికి డిగ్రీ పరీక్షలు పూర్తయి ఫలితాలు వచ్చే అవకాశమున్న అభ్యర్థులకూ ఇది చక్కని అవకాశం. 

 

ఫేజ్‌-1 (ప్రిలిమినరీ) 

ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్‌ పరీక్ష. ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. వంద ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. ప్రశ్నపత్రాన్ని గంటలో పూర్తిచేయాలి. మొత్తం 3 విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. అవి.. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 35, రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగానికీ 20 నిమిషాల చొప్పున సమయం కేటాయించారు. 

అర్హత కోసం: కేటగిరీలవారీ ఉన్న ఖాళీలకు పది రెట్ల సంఖ్యలో అభ్యర్థులను మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు. అంటే 20,560 మందికి మెయిన్స్‌ రాసే అవకాశం దక్కుతుంది. సెక్షన్ల వారీ కటాఫ్‌ మార్కులు లేవు.   

 

ఫేజ్‌-2 (మెయిన్‌ ఎగ్జామ్‌)  

200 మార్కులకు ఆబ్జెక్టివ్‌ పరీక్ష, 50 మార్కులకు డిస్క్రిప్టివ్‌ పరీక్షను నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌తోపాటు డిస్క్రిప్టివ్‌ పరీక్ష కూడా ఆన్‌లైన్‌లోనే రాయాలి. ఆబ్జెక్టివ్‌ పరీక్ష పూర్తయిన వెంటనే డిస్క్రిప్టివ్‌ పరీక్ష మొదలవుతుంది. ఆబ్జెక్టివ్‌ పరీక్షకు 3 గంటల సమయాన్ని కేటాయించారు. 4 విభాగాలుంటాయి. రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 45 ప్రశ్నలు 60 మార్కులు. గంట వ్యవధిలో పూర్తిచేయాలి. డేటా ఎనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ నుంచి 35 ప్రశ్నలు 60 మార్కులు. 45 నిమిషాల్లో పూర్తిచేయాలి. జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ నుంచి 40 ప్రశ్నలు 40 మార్కులకు ఉంటాయి. వీటికి 35 నిమిషాలు కేటాయించారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో 35 ప్రశ్నలకు 40 మార్కులు. 40 నిమిషాల్లో పూర్తిచేయాలి. డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌వ్యవధి 30 నిమిషాలు. పరీక్షలో ఇంగ్లిష్‌లో లేఖ, వ్యాసం రాయాలి. 

అర్హత సాధించాలంటే: కేటగిరీలవారీ ఉన్న ఖాళీలకు 3 రెట్ల సంఖ్యలో అభ్యర్థులను తర్వాత దశకు ఎంపికచేస్తారు. సెక్షన్లవారీ కటాఫ్‌ మార్కులు లేవు. మొత్తం 6168 మందికి ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌ (జీడీ)లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. 

 

ఫేజ్‌-3 (గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ)

ఫేజ్‌-3 పరీక్షకు 50 మార్కులు కేటాయించారు. ఇందులో 20 మార్కులు గ్రూప్‌ డిస్కషన్‌కు, 30 మార్కులు ఇంటర్వ్యూకు ఉంటాయి. అయితే ఆ సమయానికి కోవిడ్‌ తీవ్రతపై ఇందులో స్వల్ప మార్పులు చోటుచేసుకోవచ్చు. కొవిడ్‌ ఉధృతి ఎక్కువగా ఉంటే 50 మార్కులకు ఒక్క ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో అర్హత మార్కులు పొందడం తప్పనిసరి. వాటిని బ్యాంకు నిర్ణయిస్తుంది.   

ప్రిలిమ్స్, మెయిన్స్‌లో రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో పావు శాతం తగ్గిస్తారు. ఎస్‌బీఐ పీఓలకు సివిల్‌ సర్వీసెస్‌ మాదిరి ప్రయత్నాల నిబంధన వర్తిస్తుంది. గరిష్ఠ వయసుకు లోబడి, జనరల్‌ అభ్యర్థులైతే 4 సార్లు, ఓబీసీలు 7, ఎస్సీ, ఎస్టీలు ఎన్నిసార్లైనా ఈ పరీక్షను రాసుకునే అవకాశం ఉంది.

 

ఎంపిక ఇలా

ఫేజ్‌-2, ఫేజ్‌-3ల్లో అభ్యర్థి సాధించిన మొత్తం మార్కుల ద్వారా నియామకాలు చేపడతారు. ఫేజ్‌-1 మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. ఫేజ్‌-2 250 మార్కులను 75 మార్కులకు, ఫేజ్‌-3 50 మార్కులను 25కి కుదిస్తారు. అంటే 100 మార్కులను స్కేల్‌గా తీసుకుంటారు. మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన తుది నియామకాలు చేపడతారు. 

 

ఎంపికైతే 

ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకుల పీఓ ప్రారంభ మూలవేతనం రూ.36,000గా ఉంది. కానీ ఎస్‌బీఐకి ఎంపికైనవారు అదనంగా 4 ఇంక్రిమెంట్లు పొందుతారు. అందువల్ల వీరి బేసిక్‌ రూ.41,960తో మొదలవుతుంది. దీనికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. మూడేళ్లు విధుల్లో కొనసాగడం తప్పనిసరి. ఇందుకోసం ఉద్యోగంలో చేరినప్పుడే రూ.2 లక్షల విలువైన ఒప్పంద పత్రాన్ని సమర్పించాలి. 

 

వేతనాలు - పదోన్నతులు

ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ఎస్‌బీఐలో వేతనాలు ఎక్కువగానే ఉంటాయి. ప్రొబేెషనరీ ఆఫీసర్‌గా చేరిన వారు రూ.41,960 మూల వేతనంతో దాదాపు రూ.70,000కు పైగా నెల జీతం పొందే అవకాశం ఉంది. 

పదోన్నతుల కూడా ఎస్‌బీఐలో చాలా వేగంగా ఉంటాయి. ప్రొబేెషనరీ సమయం పూర్తయ్యాక స్కేల్‌-1 స్థాయిలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా మొదలై క్రమంగా వారి సామర్థ్యం మేరకు మేనేజర్‌ (స్కేల్‌-2), సీనియర్‌ మేనేజర్‌ (స్కేల్‌-3), చీఫ్‌ మేనేజర్‌ (స్కేల్‌-4), అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (స్కేల్‌-5), డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (స్కేల్‌-6), జనరల్‌ మేనేజర్‌ (స్కేల్‌-7), డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్, మేనేజింగ్‌ డైరెక్టర్, ఛైర్మన్‌ దాకా చేరుకోగలిగే అవకాశం ఉంటుంది. 

 

ప్రిపరేషన్‌ ఏ విధంగా?

ప్రిలిమినరీ పరీక్ష నవంబరు చివరి వారంలో/ డిసెంబరు మొదటి వారంలో నిర్వహిస్తారు. మెయిన్స్‌ పరీక్షను డిసెంబరు చివరి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. అభ్యర్థులు ప్రిలిమ్స్, మెయిన్స్‌కు కలిపి ఉమ్మడిగా ప్రిపరేషన్‌ కొనసాగించాలి. రెండింట్లో కలిపి ముఖ్యంగా నాలుగు సబ్జెక్టులు ఉంటాయి. జనరల్‌/ ఫైనాన్స్‌ అవేర్‌నెస్‌ మినహా మిగిలిన మూడు సబ్జెక్టులు ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండింటిలో ఉంటాయి. ఈ నాలుగు సబ్జెక్టులు ప్రిలిమ్స్‌ సమయానికే మెయిన్స్‌ స్థాయిలో పూర్తయ్యేలా చూడాలి.

ఈ పరీక్ష రాసే అభ్యర్థులు ముందుగా ఈ సబ్జెక్టుల్లో ఉన్న అన్ని టాపిక్స్‌ చదవటం ఆరంభించాలి. కాన్సెప్ట్‌ పూర్తయ్యాక దానిలో ఉన్న సాధారణ స్థాయి ప్రశ్నల నుంచి వివిధ స్థాయుల్లో ఉన్న ప్రశ్నలను బాగా సాధన చేయాలి. ప్రిలిమినరీ పరీక్షకు దాదాపు 40-45 రోజుల సమయం ఉంటుంది. 20-25 రోజులలోగా అన్ని టాపిక్స్‌ పూర్తయ్యేలా చూసుకోవాలి. ఆ తర్వాత వివిధ స్థాయుల్లో ప్రశ్నలను వేగంగా సాధించేలా ప్రాక్టీస్‌ చేయాలి. 

 

మాదిరి ప్రశ్నపత్రాల సాధన

పరీక్షకు ప్రిపేర్‌ అయ్యేటప్పుడు వివిధ స్థాయుల్లోని ప్రశ్నల సాధన ఎంత ముఖ్యమో, మాదిరి ప్రశ్నపత్రాల సాధన కూడా అంతే ముఖ్యం. పోటీ పరీక్షల్లో ముఖ్యంగా బ్యాంకు పరీక్షల్లో నిర్ణీత సమయంలో ప్రశ్నలను సాధించడం చాలా ముఖ్యం. అందువల్ల ప్రశ్నలను సాధించడమే కాకుండా వాటిని ఎంత సమయంలో సాధిస్తున్నారనే దానిపైనే వారి విజయం ఆధారపడి ఉంటుంది. మాదిరి ప్రశ్నపత్రాలను సాధన చేయడం వల్ల నిర్ణీత సమయంలోగా ఎన్ని ప్రశ్నలను సాధించగలుగుతున్నారో అభ్యర్థులకు అవగాహన ఏర్పడుతుంది. తదనుగుణంగా సాధనలో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల మొదటి రోజు నుంచే ప్రతిరోజూ ఒక మాదిరి ప్రశ్నపత్రాన్ని తప్పకుండా సాధన చేయాలి. దీనివల్ల పరీక్ష రాసే పద్ధతి కూడా అలవాటవుతుంది. రాసిన మాదిరి ప్రశ్నపత్రాన్ని విశ్లేషించుకుని దానికి అనుగుణంగా సాధన మెరుగుపరుచుకోవాలి.

ఇలా ఒక ప్రణాళికతో సాధన చేసినప్పుడే దేశంలో నంబర్‌వన్‌ స్థానంలో ఉన్న బ్యాంకులో ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది. 

 

నోటిఫికేషన్‌ క్లుప్తంగా:

 

మొత్తం ఖాళీలు: 2056

 

విభాగాలవారీ: ఎస్సీ 324, ఎస్టీ 162, ఓబీసీ 560, ఈడబ్ల్యుఎస్‌ 200, జనరల్‌ 810 పోస్టులు కేటాయించారు.

 

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత.  

 

వయసు: ఏప్రిల్‌ 1, 2021 నాటికి 21 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.   

 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 25

 

ఫేజ్‌-1 ప్రిలిమినరీ పరీక్షలు: నవంబరు/ డిసెంబరులో

 

ఫేజ్‌-2 మెయిన్‌: డిసెంబరులో

 

ఫేజ్‌-3 ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్క షన్‌లు: ఫిబ్రవరిలో

 

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. జనరల్, ఓబీసీ, ఈబీసీలు రూ.750 చెల్లించాలి. 

 

ఫేజ్‌-1 పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో..హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌. 

 

వెబ్‌సైట్‌: https://sbi.co.in/

 


 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎస్ బీఐ 2056 పీఓ పోస్టుల నోటిఫికేషన్

‣ ఎస్ బీఐ పీఓ - ఇంగ్లిష్ లాంగ్వేజ్

‣ ఎస్ బీఐ పీఓ - క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

‣ ఎస్ బీఐ పీఓ - రీజనింగ్ ఎబిలిటీ

‣ ఎస్ బీఐ పీఓ - రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్

‣ ఎస్ బీఐ పీఓ - డేటా ఇంటర్ ప్రిటేషన్

‣ ఎస్ బీఐ పీఓ - జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్ నెస్

Posted Date : 06-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌