• facebook
  • whatsapp
  • telegram

తొలిసారీ గెలుపు సాధ్య‌మే

ఐబీపీఎస్‌ పీఓ పరీక్ష తొలిసారి రాసినా విజయం సాధించగలిగేంత సమయముంది. దాన్ని సరిగా ఉపయోగించుకోవడం ప్రధానం. ఇందుకుపయోగపడే 10 సూత్రాలు... 
1. ఎంత శ్రద్ధ: అభ్యర్థులు తమకు తాము వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న ఇది. దీనిని బట్టే విజయం
సాధించడానికి సరిపడా శ్రమించగలరో లేదో తమను తాము తెలుసుకోవడం సులువవుతుంది.
2. పరీక్షపై అవగాహన: తొలిసారి పరీక్ష రాస్తున్నట్లయితే దానిగురించి పూర్తిగా తెలుసుకోవాలి. పరీక్ష విధానం, సిలబస్‌, సబ్జెక్టులు, ప్రశ్నల సరళి మొదలైన వాటిపై అవగాహన ఏర్పరచుకోవాలి.
3. ప్రణాళిక: సన్నద్ధతకు ఎంత సమయం కేటాయించగలరో చూసుకుని, ప్రణాళిక తయారు చేసుకోవాలి.
4. అంశాలవారీ సన్నద్ధత: సబ్జెక్టుల్లోని అంశాలు ముఖ్యంగా అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌ల్లోని వాటిని నేర్చుకుని, ప్రశ్నలను సాధన చేయాలి. ముందుగా సులువైనవాటిపై, తర్వాత కఠినమైనవాటిపై దృష్టిపెట్టాలి.
5. షార్ట్‌కట్‌లు: అంశాలపై పట్టు వచ్చాక వాటిని వేగంగా చేయడంపై దృష్టిపెట్టాలి. ఇందుకు సాధ్యమైనన్ని షార్ట్‌కట్‌ పద్ధతులను నేర్చుకోవాలి. కాల్‌క్యులేషన్స్‌ వేగంగా
చేయడానికి స్పీడ్‌ మేథ్స్‌ పద్ధతులను సాధన చేయాలి.
6. వేగాన్ని మెరుగుపరచుకోవడం: ఐబీపీఎస్‌ పీఓ ప్రిలిమ్స్‌ పరీక్షలో 100 ప్రశ్నలు సాధించడానికి గంట సమయం మాత్రమే ఉంటుంది. సగటున ఒక ప్రశ్న సాధించడానికి అందుబాటులో ఉన్నది 36 సెకన్లు మాత్రమే. వేగంగా ప్రశ్నలు సాధించడం అత్యంత అవసరం. దీనిని వీలైనంత సాధన చేయాలి.
7. ఇంగ్లిష్‌పై పట్టు: సాధారణంగా ఎక్కువమంది అభ్యర్థులు విఫలమయ్యేది ఇంగ్లిష్‌ విభాగంలోనే. ఐబీపీఎస్‌ పీఓ పరీక్షలో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌తోపాటు మెయిన్స్‌లోని డిస్క్రిప్టివ్‌లోనూ ఇంగ్లిష్‌ విభాగం ఉంది. దీనిపై గట్టి పట్టు తప్పనిసరి. ఇందుకుగానూ గ్రామర్‌పై పట్టు సాధించాలి. లెటర్‌ రైటింగ్‌, ఎస్సేలు బాగా సాధన చేయాలి.
8. మాదిరి ప్రశ్నపత్రాలు: చివరి వరకూ నేర్చుకోవడంపైనే దృష్టిపెట్టొద్దు. పరీక్షపై అవగాహనా ఏర్పరచుకోవాలి. ఇందుకు పూర్తిస్థాయి పరీక్షలు సాయపడతాయి. నిర్ణీత సమయంలో కనీసం రెండు నుంచి మూడు పరీక్షలైనా రాయాలి. దీని ద్వారా నిర్దేశిత సమయంలో ఏ విభాగంలో ఎన్ని ప్రశ్నలను సాధించగలుగుతున్నారో, వేటిని మెరుగుపరచుకోవాలన్న దానిపై అవగాహన ఏర్పడుతుంది.
9. ముందు తేలికవి: పరీక్ష సమయంలో అభ్యర్థులు తాము సులువుగా భావించే విభాగాన్ని ముందుగా మొదలుపెట్టాలి. వాటిలోనూ తేలికైన వాటిని ముందుగా సాధించి, కఠినమైన/ ఎక్కువ సమయం తీసుకునేవాటిని తరువాత చేయాలి. సమయం ఉంటే తిరిగి వాటిని సాధించే ప్రయత్నం చేయాలి.
10. ప్రాక్టీస్‌.. ప్రాక్టీస్‌: ఇదే మొత్తం ప్రక్రియలో కీలకం. ఎంత ఎక్కువ సాధన చేశారన్నదానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. తెలిసిన ప్రశ్నలు/ విభాగమైనా సాధన చేస్తూనే ఉండాలి. ఇదే అభ్యర్థిని విజయంవైపు నడిపిస్తుంది.

Posted Date : 09-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌