• facebook
  • whatsapp
  • telegram

డిగ్రీతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.

ఖాళీలు 6506  

రాత పరీక్ష ఆధారంగా నియామకాలు

ఇంటర్వ్యూలు లేవు

సెంట్రల్ సెక్రటేరియట్, ఇంటలిజెన్స్ బ్యూరో, సీబీఐ, రైల్వే, పోస్టల్, ఇన్ కమ్ టాక్స్ తదితర విభాగాల్లో ఆఫీసర్లు, అసిస్టెంట్లు, ఇన్ స్పెక్టర్లు మొదలైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సాధించుకునేందుకు చక్కటి అవకాశం వచ్చింది. వీటికి డిగ్రీ అర్హత ఉంటే చాలు. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా నియామకాలు ఉంటాయి. స్కిల్ టెస్టులో అర్హత సాధిస్తే సరిపోతుంది. ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోని వివిధ డిపార్ట్ మెంట్లలో పని చేయడానికి గ్రూప్-బి గెజిటెట్, నాన్-గెజిటెడ్, గ్రూప్-సి ఉద్యోగాలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 

రకరకాల విభాగాల్లో..

కాగ్ పరిధిలోని ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్ మెంట్,  సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసెస్, ఇంటలిజెన్స్ బ్యూరో, రైల్వే మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆర్మ్ డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్, సీబీటీడీ, సీబీఐసీ, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్, డిపార్ట్ మెంట్ ఆఫ్ రెవెన్యూ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, డిపార్ట్ మెంట్ ఆఫ్ పోస్ట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇంకా ఇతర ఎన్నో విభాగాల్లో రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి. 

మొత్తం పోస్టులు 6506: అందులో గ్రూప్-బి గెజిటెడ్ 250 ఖాళీలు ఉన్నాయి. గ్రూప్-బి నాన్-గెజిటెడ్ 3513, గ్రూప్-సి 2,743 పోస్టులు ఉన్నాయి. ఆయా విభాగాల్లోని గ్రూప్-ఎ ఆఫీసర్ల కింద వీళ్లు పనిచేస్తారు. 

ఎవరు అర్హులు?

ఏదైనా విభాగం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.  డిగ్రీ చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థులూ అర్హులే. అయితే 01.01.2021 నాటికి సంబంధిత అర్హ‌త పూర్తి చేసి ఉండాలి. కనిష్ఠ వయసు పరిమితి 18 సంవత్సరాలు.  పోస్టును అనుసరించి గరిష్ఠ వయసు పరిమితి 30-32 ఏళ్ల వరకు ఉంది.  నిబంధనల ప్రకారం సడలింపులు ఉన్నాయి. కొన్ని ఉద్యోగాలకు మార్కుల శాతాలు, తప్పనిసరిగా చదివి ఉండాల్సిన కొన్ని సబ్జెక్టుల వివరాలు ప్రకటనలో ఉన్నాయి. 

దరఖాస్తు ఎలా?

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుం రూ. 100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

పరీక్షా కేంద్రాలు

తెలుగు రాష్ట్రాల్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ల్లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. అభ్యర్థులు తమ సౌకర్యాన్ని అనుసరించి వీటిని ఎంచుకోవచ్చు. 

ఎంపిక ఎలా?

నాలుగు అంచెలుగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. మొదటి రెండు ద‌శ‌ల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మూడోది డిస్క్రిప్టివ్‌ పరీక్ష. నాలుగోది కంప్యూటర్‌ స్కిల్‌టెస్ట్‌(టైపింగ్‌). గతంలో నిర్వహిస్తుండే మౌఖిక పరీక్షను తొలగించి, ఆ స్థానంలో చివరి రెండు అంచెలను ప్రవేశపెట్టారు. ప్రతి పరీక్షలో కనీస అర్హత మార్కులు పొందిన వారిని మాత్రమే తర్వాత జరగబోయే పరీక్షకు అర్హులుగా ప్రకటిస్తారు. ఆన్‌లైన్ ‌రాతపరీక్షలో రుణాత్మక మార్కులు (1/4వ వంతు) ఉన్నాయి.

టైర్‌1 పరీక్ష: దీనిలో 200 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి.  60 నిమిషాలలో పూర్తి చేయాలి. నాలుగు విభాగాలుగా విభజించి ప్రతి విభాగం నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకూ 2 మార్కులు కేటాయించారు. ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో పరీక్ష జరుగుతుంది.  ఇందులో నెగెటివ్ మార్కులు ఉన్నాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి అర మార్కు కోత విధిస్తారు. 

టైర్‌2 పరీక్ష:  ఇందులో క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ (పేపర్-1), ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ (పేపర్-2), స్టాటిస్టిక్స్ (పేపర్-3), జనరల్ స్టడీస్ (పేపర్-4) -ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్  విభాగాల నుంచి నాలుగు పేపర్లు ఉంటాయి. పేపర్-2 మినహా మిగతా పేపర్లలో 200 మార్కులకు 100 ప్రశ్నలు ఇస్తారు.  పేపర్ -2 లో 200 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. ప్రతి పేపర్ కు కేటాయించిన సమయం 2 గంటలు. అన్ని ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. ఇందులోనూ రుణాత్మక మార్కులు ఉన్నాయి. పేపర్ -2 ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ లో తప్పుగా గుర్తించి ప్రతి సమాధానానికి పావు మార్కు చొప్పున, ఇతర పేపర్లలో ప్రశ్నలకు అర మార్కు చొప్పున కోత విధిస్తారు. పేపర్-1, పేపర్-2 అన్ని రకాల పోస్టుల అభ్యర్థులు తప్పనిసరిగా రాయాలి. పేపర్ -1 ప్రశ్నలు టెన్త్ స్థాయిలోనూ, పేపర్-2 ప్రశ్నలు ప్లస్ టు లేదా ఇంటర్మీడియట్ స్థాయిలోనూ ఉంటాయి. 

జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాల అభ్యర్థులు మాత్రం టైర్‌-2లో అద‌నంగా  పేపర్-3 రాయాల్సి ఉంటుంది. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసిన వారు  పేపర్ -4  కూడా హాజరు కావాలి. వీరంత టైర్-1 లో అర్హత మార్కులు సాధించాలి. 

టైర్‌3 పరీక్ష: ఇది డిస్క్రిప్టివ్ విధానంలో జరిగే పరీక్ష. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ఎస్సే రైటింగ్, ప్రిసీస్, లెటర్, అప్లికేషన్ తదితరాలపై ప్రశ్నలు ఉంటాయి. ఒక గంట సమయంలో పరీక్ష పూర్తి చేయాలి.  సగం హిందీ, సగం ఇంగ్లిష్ లో రాస్తే సున్నా మార్కులు ఇస్తారు. 

టైర్‌4 పరీక్ష: దీన్ని కంప్యూటర్‌ప్రొఫిషియన్సీ టెస్ట్ (సీపీటీ) లేదా డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ (డెస్ట్) అంటారు. అభ్యర్థులకు ఉన్న కంప్యూటర్ నాలెడ్జ్ ని, డేటాను టైప్ చేయడంలో ఉండే నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. 

నాలుగు పరీక్షల్లో ప్రతిదానిలోనూ అర్హత మార్కులు సాధించాలి. అన్నింటిలో వచ్చిన మార్కులను కలిపి మెరిట్ నిర్ణయిస్తారు. దాని ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు. 

ప్రిపరేషన్ విధానం?

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షలో ప్రధానంగా నాలుగు సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో జనరల్ ఇంగ్లిష్, జనరల్ ఇంటలిజెన్స్  అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ -న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్ నెస్ ఉన్నాయి.

జనరల్‌ ఇంగ్లిష్‌: ఇందులో అభ్యర్థి ప్రాథమిక ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. ప్రశ్నల స్థాయి గ్రాడ్యుయేషన్ నుంచి పదో తరగతి వరకు ఉండవచ్చు. ఆంగ్ల వ్యాక‌ర‌ణ నియ‌మాలు తెలిస్తే 40 నుంచి 50 శాతం ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు గుర్తించ‌వ‌చ్చు. అందువ‌ల్ల వ్యాక‌ర‌ణంపై ప‌ట్టు పెంచుకోవాలి. ఎర్ర‌ర్ లొకేష‌న్‌, సెంటెన్స్ అరేంజ్‌మెంట్‌, సెంటెన్స్ క‌రెక్ష‌న్ ప్ర‌శ్న‌లు వ్యాక‌ర‌ణ నియ‌మాల‌పైనే ఆధార‌ప‌డి ఉంటాయి. ఒకాబ్యుల‌రీ, యాంట‌నిమ్స్‌, సిన‌నిమ్స్ నుంచి 10 వ‌ర‌కు ప్ర‌శ్న‌లు రావ‌చ్చు. రూట్‌వ‌ర్డ్స్/ మైండ్ మ్యాప్ విధానం పాటిస్తూ స‌న్న‌ద్ధ‌త కొన‌సాగిస్తే ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు గుర్తించ‌డం తేలిక‌వుతుంది. 
కాంప్ర‌హెన్ష‌న్‌, క్లోజ్ టెస్ట్ నుంచి సుమారు 40 శాతం ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. ఈ విభాగంలో రాణించ‌డానికి అభ్య‌ర్థులు త‌క్కువ స‌మ‌యంలో ఇచ్చిన స‌మాచారం చ‌దివి, అందులో ముఖ్య‌మైన/ అవ‌స‌ర‌మైన దాన్ని గుర్తుంచుకోవాలి. కాంప్ర‌హెన్ష‌న్ పాసేజ్ ప్ర‌శ్న‌ల‌కు టెక్నిక్ ఫాలో కావాలి. ముందుగా ప్ర‌శ్న‌ల‌ను చ‌దివి, గుర్తుంచుకుని త‌ర్వాత పాసేజ్‌లో ఇచ్చిన స‌మాచారం చ‌దివితే, అవ‌స‌ర‌మైన‌ది ఏదో గుర్తించ‌డం సుల‌భం అవుతుంది. రోజూ ఆంగ్ల దిన‌ప‌త్రిక‌లో ఎడిటోరియ‌ల్‌, బిజినెస్ స్పోర్ట్స్ పేజీలు చ‌ద‌వాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఒకాబ్యుల‌రీ, వ్యాక‌ర‌ణం, క‌రెంట్ అఫైర్స్‌ల‌పై ప‌ట్టు పెంచుకోవ‌చ్చు. ఆంగ్ల వార్త‌లు రోజూ విన్నా ఫ‌లితం ఉంటుంది. అభ్య‌ర్థులు ఉద్యోగులుగా మార‌డానికి ఆంగ్ల విభాగంలో వ‌చ్చే మార్కులు కీల‌కం. ఈ విభాగంలో మెరుగైన ప్ర‌తిభ చూపిన వారు ఎక్కువ మార్కులు పొందుతారు.  మెరిట్ లిస్ట్‌లో చోటు ద‌క్కించుకుంటారు.

జనరల్‌ ఇంటలిజెన్స్‌ అండ్ రీజనింగ్: టైర్‌1 ప‌రీక్ష‌లో ఈ విభాగం నుంచి 25 ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. 50 మార్కులు కేటాయించారు. సృజ‌నాత్మ‌క‌త‌, వాస్త‌విక ప‌రిస్థితుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండేలా స్పృహ‌తో ఆలోచిస్తే 25లో 20 ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు గుర్తించ‌వ‌చ్చు.  వెర్బల్‌, నాన్‌వెర్బల్‌ అని రెండు రకాల ప్రశ్నలు ఉంటాయి. ‌ అనాల‌జీ, సిరీస్‌, ఆడ్‌మెన్ అవుట్‌, చిత్రాన్ని పూర్తి చేయ‌డం, మిర్ర‌ర్ ఇమేజ్‌, వాట‌ర్ ఇమేజ్‌ల నుంచి 10 ప్ర‌శ్న‌ల‌కు పైగా వ‌స్తాయి. నంబ‌రు, సింబ‌ల్ ఆప‌రేష‌న్స్‌, పేప‌ర్ ఫోల్డ్‌, క‌టింగ్ నుంచీ ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. ప‌జిల్స్‌, ర‌క్త సంబంధాలు, సీటింగ్ అరెంజ్‌మెంట్‌, ఇన్‌పుట్‌-అవుట్‌పుట్‌, గ్రూప్‌గా వ‌చ్చే ప్ర‌శ్న‌ల మీద శ్ర‌ద్ధ చూపితే 10 ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు గుర్తించ‌వ‌చ్చు. సిలాజిజం, స్టేట్‌మెంట్‌-క‌న్‌క్లూజ‌న్‌, స్టేట్‌మెంట్‌-అజంప్ష‌న్‌ల నుంచి 5 ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. సంఖ్యలు, లెట‌ర్లు, ప‌దాలు, చిత్రాల మీద‌ ఎక్కువ ప్రశ్నలు ఇస్తున్నారు. గణితంలోని ప్రాథమికాంశాలపై  అవగాహన పెంచుకొని, సాధన చేస్తే సమాధానాలను సులభంగా గుర్తించవచ్చు.  ప్రశ్నలు అభ్యర్థిలోని సాధారణ తార్కిక, విశ్లేషణాత్మక పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా  ఉంటాయి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి పలు రకాల ప్రశ్నల నమూనాలను తెలుసుకోవాలి. వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్‌చేయాలి. ఈ విభాగంలో మొత్తం 50 మార్కులు సాధించ‌డానికి అవ‌కాశం ఉంటుంది.

క్వాంటిటేటివ్‌, న్యూమరికల్ ఆప్టిట్యూడ్‌: ఈ విభాగంలో అరిథ్‌మెటిక్, మ్యాథ‌మేటిక్స్ నుంచి ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. ఇందులో అరిథ్‌మెటిక్ నుంచి ఎక్కువ ప్ర‌శ్న‌లుంటాయి. డేటా అనాల‌సిస్‌, డేటా ఇంట‌ర్‌ప్రిటేష‌న్ నుంచీ ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. ఈ విభాగాల్లో ప్ర‌శ్న‌లు గ్రూపు(3 నుంచి 5)గా ఉంటాయి. వీటిపై అశ్ర‌ద్ధ చేయ‌కూడ‌దు. ప్ర‌శ్న‌లో ఉన్న స‌మాచారం నుంచి అవ‌స‌ర‌మైన స‌మాచారం ఎలా తీసుకోవాలో తెలిస్తే స‌రైన స‌మాధానం గుర్తించ‌వ‌చ్చు. త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ సమాధానాలు గుర్తించుకోవాలంటే సూక్షీక‌ర‌ణ‌ల మీద ఎక్కువ ప‌ట్టు ఉండాలి. సంప్ర‌దాయ‌బ‌ద్ధ‌మైన ప‌ద్ధ‌తుల్లో కాకుండా చివ‌రి అంకెను గుర్తించ‌డం, గుణకాలు, ఆప్ష‌న్ నుంచి స‌మాధానం గుర్తించ‌డం వంటి సుల‌భ‌మైన ప‌ద్ధ‌తుల ద్వారా స‌మ‌యాన్ని ఆదా చేసుకోవ‌చ్చు.
అరిథ్‌మెటిక్ శాతాలు చాలా కీల‌కం. వీటికి అనుబంధంగా నిష్ప‌త్తి-అనుపాతం, లాభ‌-న‌ష్టాలు, బారువ‌డ్డీ, చ‌క్ర‌వ‌డ్డీ ప్ర‌శ్న‌లుంటాయి. ఇవ‌న్నీ ఒకే లాజిక్ ఆధారంగా ఉంటాయి. వీటి నుంచి క‌చ్చితంగా ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. గ‌సాభా/ క‌సాగు అంశానికి అనుసంధానంగా కాలం-ప‌ని, పైపులు-తొట్టెలు విభాగాలు ఉంటాయి. కాలం-ప‌ని నుంచి ప్ర‌శ్న‌లేకుండా ప్ర‌శ్న‌ప‌త్రం ఉండ‌దు. వీటితోపాటు కాలం-దూరం, రైలు మీద ప్ర‌శ్న‌లు, ప‌డ‌వ‌లు-ప్ర‌వాహాలు ముఖ్య‌మైన చాప్ట‌ర్‌లు. స‌రాస‌రి, నంబ‌ర్ సిస్టం, వ్యాపార భాగ‌స్వామ్యం, వ‌య‌సుల మీద వ‌చ్చే ప్ర‌శ్న‌లు సుల‌భంగా ఉంటాయి. వీటిని విడిచిపెట్ట‌కూడ‌దు. మ్యాథ్స్ విభాగంలో ఆల్జీబ్రా నుంచి ఎక్కువ ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. వైశాల్యాలు, ఘ‌న‌ప‌రిమాణాలు, త్రికోణ‌మితి, ఎత్తులు-దూరాలు ముఖ్య‌మైన‌వి. రేఖాగ‌ణితం నుంచీ ప్ర‌శ్న‌లు అడ‌గొచ్చు. గ‌ణిత సూత్రాల ప‌ట్టిక రాసుకుని గుర్తుంచుకోవాలి. సూత్రాలు తెలియ‌కుండా స‌మాధానం గుర్తించే అవ‌కాశం లేదు. ఆల్జీబ్రా ప్ర‌శ్న‌ల్లో ఇచ్చిన ఆప్ష‌న్ల నుంచి స‌బ్‌స్టిట్యూష‌న్ మెథ‌డ్ ఉప‌యోగించి స‌మాధానం గుర్తించవ‌చ్చు.

జనరల్‌ అవేర్‌నెస్‌: భార‌త‌దేశం, పొరుగుదేశాల‌కు సంబంధించిన ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. చ‌రిత్ర‌, భౌగోళిక‌, రాజ‌కీయ‌, ఆర్థిక సంబంధిత అంశాల నుంచి ప్ర‌శ్న‌లు అడుగుతారు. కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, బ‌డ్జెట్‌, భార‌త్ పాల్గొన్న స‌మావేశాల్లోని ముఖ్యాంశాలు, దేశాలు-రాజ‌ధానులు, క‌రెన్సీలు, ప్ర‌ధానులు/ అధ్య‌క్షులు, యునెస్కో గుర్తించిన ప్ర‌దేశాలు, పొడ‌వైన/ ఎత్తైన/ లోతైన న‌దులు లేదా ప‌ర్వ‌తాలు, వార్త‌ల్లో వ్య‌క్తులు, క్రీడ‌ల్లో విజేత‌లు, క్రీడ‌లు జ‌ర‌గ‌బోయే ప్రాంతాలు, పుస్త‌కాలు-ర‌చ‌యిత‌లు, క‌రోనా వైర‌స్‌, బ్యాక్టీరియా, కెమిక‌ల్ ఫార్ములాలు, సైన్స్ అండ్ టెక్నాల‌జీ నుంచి భార‌త అంత‌రిక్ష ప్ర‌యోగాలు, శాటిలైట్లు వాటి వాహ‌నాలు, కొత్త ప్రాజెక్టుల‌కు సంబంధించిన విశేషాలు తెలుసుకోవాలి. రోజూ దిన‌ప‌త్రిక చ‌దివి ప‌రీక్ష‌కు అవ‌స‌ర‌మైన ముఖ్యాంశాలు రాసుకోవాలి. స్టాటిస్టిక్స్ (పేప‌ర్‌-3), ఫైనాన్స్ అండ్ ఎక‌నామిక్స్ (పేప‌ర్‌-4)‌కు సంబంధించి ఆ స‌బ్జెక్టుల్లో డిగ్రీ పుస్త‌కాల నుంచి ప్ర‌శ్న‌లు ఉంటాయి. వాటిని బాగా చ‌దుకుంటే స‌రిపోతుంది.

టైర్-2 లోని పేపర్-3, పేపర్-4 లకు ప్రత్యేకమైన సిలబస్ ను నిర్ణయించారు. ప్రశ్నలు గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఉంటాయి. 

అభ్యర్థులు ప్రతి టైర్ కు సంబంధించిన సిలబస్ ను, పాత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. ప్రశ్నల సరళిని అర్థం చేసుకొని తమకు అనుకూలమైన ప్రిపరేషన్ విధానాన్ని రూపొందించుకోవాలి. తమకు పట్టులేని అధ్యాయాలను ముందుగా చదవడం మంచిది. తర్వాత తమకు బాగా తెలిసిన వాటిని అధ్యయనం చేయాలి. జనరల్ అవేర్ నెస్ కోసం ప్రతి రోజూ ప్రముఖ దినపత్రికలను చదువుతూ ముఖ్యాంశాలను నోట్ చేసుకోవాలి. సాధారణంగా వర్తమానాంశాల ఆధారంగా జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించినప్పుడు ఈ తరహా ప్రశ్నలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రిపరేషన్ సాగించాలి. ప్రమాణాళికా బద్ధంగా కాస్త కష్టపడితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని చిన్న వయసులోనే సంపాదించుకోవచ్చు. తమ కలలను సాకారం చేసుకోవచ్చు.

దరఖాస్తుకు చివరి తేదీ:  31 జనవరి, 2021.  టైర్-1 పరీక్ష 29 మే 2021 నుంచి 7 జూన్ 2021 వరకు జరుతుంది. టైర్-2 పరీక్ష (డిస్ర్కిప్టివ్) తేదీని వెల్లడించాల్సి ఉంది. 

వెబ్ సైట్: https://ssc.nic.in

Posted Date : 06-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌