• facebook
  • whatsapp
  • telegram

మాస్కుతోనే మాక్‌ టెస్టులు!

 సివిల్స్‌ ప్రిలిమ్స్‌కు తుది మెరుగులు


మారిన పరిస్థితుల్లో రాసే పరీక్షకు తగ్గట్టుగానే  సన్నద్ధతను కూడా మల్చుకోవాలి. నమూనా (మాక్‌) టెస్టులంటే వాటిని ఏదోవిధంగా రాయటం కాదు. అసలు పరీక్ష ఎలా రాస్తామో వీటినీ అలాగే.. అంతే శ్రద్ధతో రాయాలి. సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ తేదీ     దగ్గర పడుతున్న ఈ తరుణంలో అభ్యర్థులు పరీక్ష వ్యవధిని కచ్చితంగా పాటిస్తూ.. పరీక్ష పరిస్థితుల్లోనే మాక్‌టెస్టులను సాధన చేయాలి. మధ్యలో విరామం తీసుకోకూడదు.   పరీక్ష జరిగినంతసేపూ మాస్కును పెట్టుకునే ఉండటం అలవాటు చేసుకోవాలి!

ఈ ఏడాది జరగబోయే సివిల్స్‌ ప్రిలిమ్స్‌ గత సంవత్సరాల్లో కంటే భిన్నమైనది. కొవిడ్‌-19 మూలంగా సాధారణ జీవనం అస్తవ్యస్తమై అభ్యర్థుల సన్నద్ధతపై ప్రభావం చూపింది. పరీక్ష అనిశ్చిత స్థితి, సోషల్‌మీడియాలో వదంతుల జోరు...వీటి మధ్య చివరకు పరీక్షల తేదీని ప్రకటించారు. అసాధారణ పరిస్థితులకు అసాధారణ చర్యలు అవసరం. సన్నద్ధతలో పరిస్థితులకు తగ్గ మార్పులు చేసుకోవాలి.

 గత ఏడాది కంటే అభ్యర్థుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. అనిశ్చితి మూలంగా చాలామంది మానసికంగా సిద్ధంగా లేమంటూ తమ ప్రయత్నాలను వాయిదా వేసుకున్నారు. అందువల్ల కిందటి సంవత్సరం కంటే పోటీ స్వల్పంగా తగ్గుతుందని ఆశించవచ్చు.
 పోస్టుల సంఖ్య (796) కూడా గత ఏడాది కంటే వంద తక్కువ. అంటే మెయిన్స్‌కు ఎంపికయ్యే అభ్యర్థుల సంఖ్య సుమారు 10,500 ఉండొచ్చు. కిందటి సంవత్సరం కంటే ఈ సంఖ్య తక్కువ. అంటే.. ఈ విషయంలో పోటీ ఎక్కువన్నమాట. 

వ్యూహం ఎలా ఉండాలి?
 సిలబస్‌ పరిశీలన: పరీక్షకు నిర్దేశించిన సిలబస్‌ను పైనుంచి కిందదాకా ఓసారి చూసుకోండి: ఇప్పటివరకూ సిలబస్‌ను ఎన్నోసార్లు చూసివుంటారు. ఇప్పుడు మరోసారి సిలబస్‌లో ఏ అంశాలనైనా చదవలేదేమో చూడండి. ఒకవేళ అలాంటివి ఉంటే ఆ టాపిక్‌లో ఉన్న ముఖ్యమైన అంశాలపై చకచకా దృష్టిపెట్టండి.    
 కరంట్‌ అఫైర్స్‌ మననం: ఈ టాపిక్‌పై ఇప్పటికే సిద్ధమైవుంటారు. ఇప్పుడు అన్ని అంశాలనూ ఓసారి చూసుకుని వాటిలో ముఖ్యమైనవి గుర్తించండి. ప్రతిదీ ముఖ్యమేననిపించవచ్చు. కానీ మీరు సివిల్స్‌ కదా రాసేది! ఈ పరీక్ష లక్ష్యం- అభ్యర్థులకు తగిన ఆప్టిట్యూడ్, ప్రజాసేవపై దృష్టి, ప్రజలకు సమర్థంగా సేవలందించేవారిని ఎంపిక చేయటం (మిషన్‌ కర్మయోగి). దీన్ని మనసులో ఉంచుకుంటే - ప్రజా ప్రయోజనాలతో అత్యధిక సంబంధమున్న అంశాలను గుర్తించి, వాటిపై ఎక్కువ దృష్టిపెట్టవచ్చు.
ఉదాహరణకు: కొవిడ్‌తో సంబంధమున్న మొత్తం సాంకేతిక పదజాలం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి ముఖ్యం. ఎపిడమిక్స్, పాన్‌డమిక్స్‌కు వాక్సిన్‌ తయారుచేసే ప్రామాణిక ప్రక్రియ కూడా ప్రధానమే. అలాగే ఆర్థిక వ్యవస్థపై.. ముఖ్యంగా వలస కార్మికులపై కొవిడ్‌ పెను ప్రభావం. దీనిపై ఎక్కువ వివరాలు సంపాదించి చదవాలి. కచ్చితమైన గెసింగ్‌: గెసింగ్, కచ్చితత్వం.. ఈ రెండూ పరస్పర విరుద్ధమైన మాటలు కదా అనిపిస్తోందా? కానీ సివిల్స్‌లో ఇవెంతో ముఖ్యం. చాలామంది అభ్యర్థులు అన్ని ప్రశ్నలూ రాస్తుంటారు. ఇలాంటపుడు అభ్యర్థి కటాఫ్‌ మార్కును చేరుకోవటమూ, లేకపోవటమూ అనేది కచ్చితమైన గెసింగ్‌ల సంఖ్యపైనే ఆధారపడివుంటుంది. మరి కచ్చితంగా సమాధానం ఊహించçమనేది సాధనతోనే వస్తుంది. అందుకే బాగా ప్రాక్టీస్‌ చేయాలి.

 మారిన పరిస్థితులు: అనివార్యమైపోయిన కొత్త పరిస్థితులు మీరు పరీక్ష రాయటంపై నేరుగా ప్రభావం చూపుతాయి. పరీక్ష రాసినంతసేపూ (ఉదయం 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు) మాస్కును విధిగా కట్టుకునేవుండాలి. అందుకే మాక్‌ టెస్టులు రాస్తున్నపుడు కూడా మాస్కును ధరించడం మానవద్దు. పరీక్షార్థులు కొత్త పరిస్థితికి అలవాటయ్యేలా చేస్తుందిది. పరీక్ష రోజున అదనంగా మరో మాస్కును తీసుకువెళ్లటం మేలు.

5 W ఫార్ములా
పరీక్ష పరంగా- ప్రభుత్వ మంత్రిత్వశాఖలు (మినిస్ట్రీస్‌) అన్నీ ముఖ్యమే. కానీ వాటిలో సంక్షేమ మంత్రిత్వశాఖలు మాత్రం మరింత ముఖ్యం. అన్ని సంక్షేమ పథకాలు/కార్యక్రమాలపై పట్టు పెంచుకోవాలి. వాటిలోనూ అతిముఖ్యమైనవాటిని వివరంగా తెలుసుకోవాలి. పథకాలపై సంపూర్ణ అవగాహనకు ‘5' W ఫార్ములా’ను అనుసరించాలి. ఆ ఐదూ... What, Why, Who లబ్ధిదారులు, అమలు చేసేవారు),  When (పథకం మొదలైన తేదీ, పూర్తయ్యే వ్యవధి), Where  (పథకం ఎక్కడ ఆరంభమయింది?).

 పేపర్‌-2ను నిర్లక్ష్యం చేయొద్దు: రెండో పేపర్‌ అర్హత కోసమేనని దాని సన్నద్ధతను నిర్లక్ష్యం చేయకూడదు. గత సంవత్సరాల్లోని ఒకటి రెండు ప్రశ్నపత్రాలను రాస్తే.. ఎలా ముందుకు సాగాలో తెలుస్తుంది. నేరుగా జవాబులుండే మ్యాథ్స్‌ ప్రశ్నలు మొదట రాసి, ఆ తర్వాతే సుదీర్ఘంగా ఉండే ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ను రాయటం సముచితం.

 ఓఎంఆర్‌ షీట్లు: చాలామంది అభ్యర్థులు ఓఎంఆర్‌ షీట్లపై సాధన చేయటాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇది చాలా ముఖ్యం. ఏదైనా ప్రశ్నను వదిలి, తర్వాతి ప్రశ్నకు సమాధానం గుర్తించేటపుడు తప్పు వరసలో సర్కిల్‌ చేసే ప్రమాదం ఉంటుంది. ఇది జరగకుండా అత్యంత జాగ్రత్త అవసరం.

ప్రశ్నపత్రాల సాధన
ప్రామాణికమైన 8-10 పేపర్‌-1 ప్రశ్నపత్రాలు తీసుకుని సాధన చేయాలి. సబ్జెక్టువారీ పేపర్ల ప్రాక్టీసుకు ఇది సమయం కాదు. సమాధానాలు రాసేటప్పుడు..
1. ఆన్‌లైన్‌లో ఆన్సర్‌ చేయవద్దు. డౌన్‌లోడ్‌ చేసుకుని అవసరమైతే ప్రింటవుట్‌ తీసుకుని- హార్డ్‌కాపీ రూపంలో జవాబులు రాయండి.
2. పేపర్లను అసలు పరీక్ష జరిగే సమయాల్లోనే రాయండి. 
3. పరీక్ష మొదలుపెట్టాక పూర్తయ్యేలోపు ఆపొద్దు. ‘మాక్‌ టెస్టేగా.. మధ్యలో కాసేపు ఆగితే ఏం పోతుందిలే’ అనిపించవచ్చు. కానీ ఆ ఆలోచన పక్కనపెట్టి శ్రద్ధగా పరీక్షను పూర్తిచేయండి. పరీక్ష పూర్తయినవెంటనే మార్కులు ఎన్ని వచ్చాయో చూసుకోవాలి. 
4. పరీక్ష రాశాక.. మీ ప్రతిభాప్రదర్శన ఎలా ఉందో కాగితమ్మీద అంకెల రూపంలో రాసుకోండి. ఏ టాపిక్‌లో ఎన్ని ప్రశ్నలు వచ్చాయి, రాసినవాటిలో ఎన్ని సరైనవి, ఎన్ని తప్పులు; రాయనివి ఎన్ని, ఊహించి (గెస్‌) రాసినవాటిలో ఎన్ని సరైనవి, ఎన్ని తప్పులు.. ఇలా!  
5. రెండు పేపర్లకంటే మించి ఏ అంశంలోనైనా నిలకడగా తక్కువ మార్కులు వస్తే ఆ అంశాన్ని పునశ్చరణ చేసుకోవాలి. ఆ అంశంలో కరంట్‌ అఫైర్స్‌ ఉంటే వాటిపై శ్రద్ధ తీసుకోవాలి.

Posted Date : 03-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌