• facebook
  • whatsapp
  • telegram

నోట్సు తయారీకీ ఓ పద్ధతి! 

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ర్యాంకు సాధించిన ప్రతి అభ్యర్థీ నోట్సు ప్రయోజనం గురించి చెబుతూనే ఉంటారు. ఇది పరీక్షలకు సన్నద్ధం కావడంలో ఎంతో సాయపడుతుంది. ఇంత ప్రాముఖ్యం ఉన్న నోట్సు తయారీలో ఏ కిటుకులు పాటించాలి? 

పరిశీలన శక్తి పెరగటానికీ, సిలబస్‌లోని క్లిష్టమైన అంశాలను గుర్తించడానికీ నోట్స్‌ తయారీ తోడ్పడుతుంది. పరిశీలించిన అంశాలను సమీక్షించుకుని ఆ విషయాన్ని సొంత మాటల్లో చెప్పడానికి ఇది సాయపడుతుంది. పోటీ పరీక్షల అభ్యర్థులు తరగతులకు హాజరైనప్పుడు, పుస్తకాలు చదువుతున్నప్పుడూ నోట్సు రాయడం ఎంతో అవసరం. తరగతి జరుగుతున్నప్పుడు శ్రద్ధగా, ఏకాగ్రతతో వినడానికి నోట్సు రాయడం తోడ్పడుతుంది. అధ్యాపకులు చెప్పే సమాచారంలోని ముఖ్యాంశాలు నోట్స్‌లో ముఖ్యమైన పాయింట్లు అవుతాయి. సబ్జెక్టు అవగాహనకు ఇవెంతో తోడ్పడతాయి. సబ్జెక్టులోని ముఖ్యాంశాలు, క్లిష్టమైన అంశాలను నోట్సు రాయడం వల్ల మెరుగ్గా అర్థం చేసుకోవచ్చు. తయారుచేసుకున్న నోట్స్‌ కాకుండా... పుస్తకాలు మాత్రమే చదవడం వల్ల ఒక్కోసారి విషయం అర్థం కాకపోవచ్చు.

సివిల్స్‌ సిలబస్‌ వైవిధ్యంగా, సంక్లిష్టంగా ఉంటుంది. సిలబస్‌లోని చాలా అంశాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సమాజం ఎదుర్కొంటోన్న సమస్యలే ఉంటాయి. ఏ సమస్యకైనా అందరూ సమ్మతించే పరిష్కారం ఏదీ ఉండదు. అన్ని విషయాలకూ విభిన్న కోణాలుంటాయి. వీటికి పరిష్కారం కనుక్కోవాలంటే వివిధ సబ్జెక్టుల పరిజ్ఞానం అవసరమవుతుంది. ఇండియన్‌ కల్చర్, ఇండియన్‌ పాలిటీ, గవర్నెన్స్, సోషియాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎకనమిక్‌ ప్రాబ్లమ్స్‌ అండ్‌ ఎథిక్స్‌  లాంటి సబ్జెక్టులను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. వివిధ పుస్తకాలను విస్తృతంగా చదవడం ద్వారా ఈ సబ్జెక్టుల మీద పట్టు సాధించే అవకాశం ఉంది. దీనిలో నోట్సు పాత్ర ఉంటుంది.  

రెండు దశలు :

నోట్సు తయారీ రెండు దశల్లో జరుగుతుంది. 

1) తరగతిలో అధ్యాపకులు పాఠ్యాంశాలు బోధిస్తున్నప్పుడు 

2) పాఠ్యపుస్తకం చదువుతున్నప్పుడు. అన్ని రకాల నోట్సులూ పరీక్ష అవసరాలను తీర్చలేకపోవచ్చు. అందుకే దాన్ని సమర్థంగా తయారుచేసుకోవాల్సిన అవసరమెంతో ఉంది. 

తరగతిలో వింటూ...

తరగతిలో సమర్థంగా నోట్సు రాసుకోవడానికి మూడు దశల విధానాన్ని అనుసరించాలి. క్లాసుకు ముందు, క్లాసు జరుగుతున్నప్పుడు, క్లాసు తర్వాత .. ఈ మూడు దశల్లోనూ నోట్సు రాసుకోవచ్చు. 

1. క్లాసు జరగడానికి ముందే...

ఎ) తర్వాతి క్లాసుకు వెళ్లేముందు... అంతకుముందు క్లాసులో రాసిన నోట్సును సమీక్షించుకోవాలి. ముందుగా ఏమేం రాశారో తెలుసుకుని కొత్త విషయాలను చేర్చడానికి ఇది తోడ్పడుతుంది. 

బి) తరగతికి హాజరుకావడానికి ముందే అధ్యాపకులు ఏమైనా చదవమని చెబితే... చదివిన తర్వాతే క్లాసుకు హాజరుకావాలి. 

సి) నోట్సు రాసుకోవడానికి కావాల్సిన పెన్ను, పెన్సిల్, రైటింగ్‌ బోర్డు, పేపర్లను సిద్ధంగా ఉంచుకోవాలి. 

2. క్లాసు జరుగుతుండగా నోట్సు తీసుకోవడం...

ఎ) అధ్యాపకులు చెప్పే విషయాన్ని ఏకాగ్రతతో వినాలి. వారు వివరించిన దాంట్లో ‘సిగ్నల్‌ స్టేట్‌మెంట్స్‌’ను గుర్తించి రాసుకోవాలి. చెప్పిన పాఠంలోని అతి ముఖ్యమైన అంశమే ‘సిగ్నల్‌ స్టేట్‌మెంట్‌’. ‘అతి ముఖ్యమైన పాయింట్‌’, ‘గత పరీక్షలో ఈ ప్రశ్న వచ్చింది’ లాంటివి. అధ్యాపకులు పదేపదే చెప్పిన అంశాన్ని, బోర్డు మీద రాసినదాన్ని నోట్సులో రాసుకోవాలి. 

బి) వేగంగా రాయడాన్ని అలవాటు చేసుకుంటే ముఖ్యమైన విషయాలన్నింటినీ రాసుకోవచ్చు. కొన్ని పదాలకు అబ్రివియేషన్లు రాసుకుంటే వేగంగా రాసే అవకాశం ఉంటుంది. 

3. తరగతి తర్వాత.. 

ఎ) క్లాసు జరుగుతున్నప్పుడు అబ్రివియేషన్‌ రూపంలో రాసిన పదాలను తర్వాత తిరిగి పూర్తిగా రాసుకోవాలి. సింబల్స్‌ను పదాలుగా మార్చుకోవాలి. సంక్షిప్త రూపంలో రాసిన వాక్యాలను పూర్తి వాక్యాలుగా రాసుకోవాలి. 

బి) ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలిగే రీతిలో నోట్సును కచ్చితంగా రాసుకోవాలి. 

సి) ముఖ్యమైన సమాచారాన్ని కోల్పోకుండా ఉండేందుకు సహ విద్యార్థులతో ఒకసారి సరి చూసుకోవాలి. 

తరగతిలో పాఠం బోధన జరగటానికి ముందే.. ఒకసారి ఆ పాఠాన్ని చదువుకోవడం మంచిది. దీంతో పాఠ్యాంశం బాగా అర్థంకావడంతోపాటు వేగంగా నోట్సు రాయగలుగుతారు. ముందే చదవడం వల్ల దాంట్లోని ముఖ్యాంశాలను గుర్తించడం సులువవుతుంది. ఎప్పుడైనా బోధించాల్సి వచ్చినా, మాట్లాడాల్సి వచ్చినా ముందుగానే నోట్సును తయారుచేసుకోవాలి. ఇలా సిద్ధం కావడం వల్ల సమర్థంగా ఉపన్యసించగలుగుతారు. శ్రద్ధగా వినడం, ప్రణాళిక, మానసికంగా సిద్ధం కావడం వల్ల చక్కగా నోట్సు రాయాలనే లక్ష్యాన్ని సాధించగలుగుతారు. 

రాయడంలో పద్ధతులు

పుస్తకం చదువుతూ నోట్సు రాయడంలో రెండు పద్ధతులు ఉన్నాయి. 

1. పుస్తకం చదువుతూనే నోట్సు రాయడం.

2. పుస్తకం చదివిన తర్వాత ముఖ్యాంశాలను నోట్సు రాయడం. పుస్తకంలోని ప్రతి అధ్యాయానికి ఒక ఉద్దేశం ఉంటుంది. దాన్ని గుర్తించి దాంట్లోని ముఖ్యాంశాలను నోట్సుగా రాసుకోవాలి. 

ఉదాహరణకు: చాప్టర్‌-1 ‘చాప్టర్‌లోని విషయం’

1. పాయింట్‌  2. పాయింట్‌  3. పాయింట్‌ 

ఇదే క్రమాన్ని ప్రతి చాప్టర్‌ విషయంలోనూ కొనసాగించాలి. 

1. పాయింట్‌  2. పాయింట్‌

పుస్తకం చదవడం మొత్తం పూర్తయిన తర్వాత రెండో దశలోకి వెళ్లాలి. మొత్తం పాయింట్లను ఒకసారి చూసుకోవాలి. పుస్తకం ప్రధాన ఉద్దేశాన్ని 10 నుంచి 15 పాయింట్లలో రాసుకోవాలి. చివరిగా పుస్తకం సారాన్ని ఒక వాక్యంగా రాసుకోవడం. ఇది కష్టమైన పని. కానీ ఇలా చేయడానికి ప్రయత్నిస్తే.. పరీక్షకు సంబంధించిన వాస్తవాలను అర్థంచేసుకున్నట్టే.

నోట్సు ఎలా ఉండాలంటే...

క్లుప్తంగా, సంక్షిప్తంగా, ప్రథమ పురుషలో (థర్డ్‌ పర్సన్‌) రాసుకోవాలి. 

సబ్జెక్టుకు సంబంధించిన వాస్తవాలు, సంబంధిత విషయాలు మాత్రమే ఉండాలి. సబ్జెక్టుకు తోడ్పడే విధంగా ఎలాంటి దృష్టాంతాలు, వివరణలు, ఉదాహరణలను రాయాల్సిన అవసరం లేదు. అయితే సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సబ్జెక్టులు/ టాపిక్స్‌కు సంబంధించి ఇవన్నీ అవసరం అవుతాయి.  

సమాచారాన్ని పదబంధాలు, పదాలు లేదా చిన్న వాక్యాల్లో రాసుకోవాలి. ప్రత్యేకంగా వ్యాకరణాన్ని అనుసరించాల్సిన అవసరంలేదు. 

సబ్జెక్టుకు సంబంధించిన సమాచారాన్ని తార్కిక క్రమంలో రాసుకోవాలి. 

నోట్సును ముఖ్యాంశాలు, తక్కువ ప్రాధాన్యం ఉన్న అంశాలు, అతి తక్కువ ప్రాధాన్యం ఉన్న అంశాలుగా విభజించుకోవాలి

ఇవీ చిట్కాలు

నోట్సు తయారీకి తగినంత సమయాన్ని కేటాయించాలి. దీంతో సమయం ఆదా అవుతుంది. మళ్లీ మళ్లీ రాయాల్సిన పని ఉండదు. 

నోట్సు తయారీకి సంబంధించి అభ్యర్థికి అనువుగా ఉండే సరైన పద్ధతిని ఎంచుకోవాలి. 

రచయిత చర్చించిన ముఖ్యమైన విషయాలను రాసుకోవాలి. మొదటి, చివరి పేరాల్లో ముఖ్యాంశాలు ఉండేలా చూసుకోవాలి. 

అభిప్రాయాలు, సారాంశం, కొటేషన్లు వేరు; ఫ్యాక్ట్స్‌ వేరు. ఈ భేదాన్ని గుర్తించాలి. ఇలా చేయడం నోట్సు జాగ్రత్తగా రాయడానికీ, చివరిగా నమ్మకంతో సమీక్షించడానికీ తోడ్పడుతుంది. 

రాసుకున్న నోట్సును మరుసటి రోజు, మరికొన్ని రోజుల తర్వాత ఒకసారి చదువుకోవాలి. దీంతో రాసుకున్నవి గుర్తుంటాయి.

చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై నోట్సు

ఉదాహరణకు చిన్న రాష్ట్రాల ఏర్పాటు గురించి నోట్సు తయారుచేయాలి అనుకుందాం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం... అనేది ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ టైప్‌ ప్రశ్నలకు, ఇంటర్వ్యూ సమయంలోనూ ప్రధానాంశమైంది.

ఉదాహరణ:

అంశం: చిన్న రాష్ట్రాల కోసం డిమాండ్‌ 

1. చిన్న రాష్ట్రాల కోసం డిమాండ్‌ ఎందుకు వస్తుంది? ఏ రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తున్నాయి?

ఎ) అభివృద్ధి చెందకపోవడం, ప్రాంతీయ అసమానతలు

బి) తెలంగాణ, సౌరాష్ట్ర (దక్షిణ గుజరాత్‌), విదర్భ (తూర్పు మహారాష్ట్ర), పూర్వాంచల్‌ (తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌), బోడోలాండ్‌ (ఉత్తర అసోం) చిన్న రాష్ట్రాల కోసం డిమాండ్‌ చేస్తున్నాయి.

2. రాష్ట్రాల ఏర్పాటు వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం?

ఎ) స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశంలో 11 బ్రిటిష్‌ ప్రావిన్స్‌లు, 500 ప్రిన్స్‌లీ స్టేట్స్‌ ఉండేవి.

బి) దేశ విభజన తర్వాత 6 ప్రావిన్స్‌లు భారత్‌కూ, 3 బ్రిటిష్‌కు, రెండు భారత్, పాకిస్తాన్‌ల మధ్య కేటాయించారు. ప్రిన్స్‌లీ స్టేట్స్‌ భారత్‌లోనో, పాక్‌లోనో చేరటానికీ లేదా స్వతంత్రంగా ఉండటానికీ స్వేచ్ఛను ఇచ్చారు.

3. స్వాతంత్య్రానంతరం:

ఎ) రాజ్యంగంలోని 3, 4 ఆర్టికల్స్‌ ప్రకారం  పార్లమెంటు సాధారణ మెజారిటీతో ఆమోదించిన చట్టం ద్వారా కొత్త రాష్ట్రాలను ఏర్పాటుచేయొచ్చు. 

బి) స్టేట్స్‌ రీ ఆర్గనైజేషన్‌ కమిషన్‌ను 1956లో స్థాపించారు. 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలను భాషా ప్రాతిపదికన ఏర్పాటుచేశారు. 

4. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలమైన వాదనలు

ఎ) ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సామర్థ్యం చిన్న రాష్ట్రాలకు ఉంటుంది. 

బి) చిన్న రాష్ట్రాలు పాలనాపరంగా, ఆర్థికంగా సమర్థంగా ఉంటాయి. భారతదేశ సమాఖ్య విధానాన్ని బలోపేతం చేస్తాయి.

సి) చిన్న రాష్ట్రాలు బాధ్యతాయుతంగా ఉంటాయి. 

డి) రాష్ట్రాల మధ్య ఆర్థికపరమైన వివక్షకు అవకాశం ఉండదు. ఆర్థిక అసమానతలు లేకుండా చూడటానికి రాజ్యాంగబద్ధమైన పరిష్కారమే చిన్న రాష్ట్రాల ఏర్పాటు. 

ఇ) నాణ్యమైన పాలనకు తోడ్పడతాయి. 

ఎఫ్‌) చిన్న రాష్ట్రాలు అభివృద్ధిలో స్థానిక ప్రజలకు అవకాశం కల్పిస్తాయి.  

5. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు వ్యతిరేక వాదనలు

ఎ) రాష్ట్ర పరిమాణం అభివృద్ధికి ఆటంకం కాదు. 

బి) పెద్ద రాష్ట్రాలు వెనకబడి ఉండటానికి కారణం రాజకీయ వైఫల్యం. 

సి)  చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఆర్థికపరమైన విషయాల్లో కేంద్రానికి భారంగా మారొచ్చు.

డి) దళితులు, బలహీనవర్గాలు తమకు పెద్ద రాష్ట్రాలే సురక్షితమైనవని భావిస్తాయి. 

ఇ) చిన్న రాష్ట్రాల ఏర్పాటు తీవ్రవాదానికి దారితీయొచ్చు. 

ఎఫ్‌) అధిక సంఖ్యలో ఉన్న చిన్న రాష్ట్రాలు కేంద్రాన్ని బలహీనపరచవచ్చు.


 

Posted Date : 06-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌