• facebook
  • whatsapp
  • telegram

సులువుగా... సమగ్రంగా రాజ్యాంగాన్ని చదివేద్దాం!

పోటీ పరీక్షల కోణంలో ప్రిపరేషన్‌

సివిల్స్‌ లాంటి పోటీ పరీక్షల కోణంలో భారత రాజ్యాంగం చాలా ముఖ్యమైనది. చట్టపరమైన పరిభాష, సాంకేతిక అంశాలు అధికంగా ఉండే రాజ్యాంగాన్ని సమగ్రంగా, సులువుగా అర్థం చేసుకోవటం అవసరం. 

రాజ్యాంగం చదివే విధానాన్ని నాలుగు భాగాలుగా విభజించుకోవాలి. క్రమపద్ధతిలో అంచెలంచెలుగా అవగాహన చేసుకుంటూ ముందుకు సాగాలి.

1. భావనలు (కాన్సెప్ట్స్‌): దీంట్లో ప్రాథమిక నిబంధనలు ఉంటాయి. రాజ్యాంగ నిర్మాణం, పీఠిక, పౌరసత్వం, ప్రాథమిక హక్కులు, నిర్దేశక సూత్రాలు, రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ, ప్రధానమంత్రి, న్యాయవ్యవస్థ, రాష్ట్ర శాసనసభ, గవర్నర్, ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, పట్టణ స్థానిక ప్రభుత్వం... వీటన్నింటికీ సంబంధించిన ప్రాథమిక సమాచారం సరిపోతుంది. చదివేటప్పుడు ఒక అంశం మొత్తాన్నీ ఒక విడతలో పూర్తి చేయాలి. చదవడం పూర్తయిన తర్వాత ఆ అంశం ఎంతవరకు అర్థమైందో ఒకసారి  చూడాలి. ఏ సందేహం వచ్చినా మళ్లీ ఒకసారి చదువుకోవాలి. ఆ తర్వాత మరో అంశం చదవడం ఆరంభించాలి. 

2. అడ్వాన్స్‌డ్‌ నోట్సు: రెండో భాగంలో వివరంగా చదవొచ్చు. దీన్నే అడ్వాన్స్‌డ్‌ నోట్సు/ ఇన్ఫర్మేషన్‌ అంటారు. మొదటి భాగంలో అంటే.. కాన్సెప్ట్స్‌లో చదివినదానికి అదనపు సమాచారాన్ని దీంట్లో జోడించాలి. వ్యవస్థ పనితీరుతో సంబంధమున్న ఇండియన్‌ పాలిటీ అంశాలను ఇక్కడ చదవాలి. అడ్వాన్స్‌డ్‌ నోట్సులో చేర్చదగ్గ అంశాల్లో... ప్రస్తుత రాజ్యాంగ నిబంధనలకు దారితీసిన రాజ్యాంగ పరిణామాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా విధానం, జమ్మూ కశ్మీర్, శాసనసభ్యుల అనర్హత, వివిధ రకాల బిల్లులు, బడ్జెట్, సవరణలు, ఇంకా- ఫైనాన్స్‌ కమిషన్, ప్లానింగ్‌ కమిషన్‌ లాంటి ముఖ్యమైన అంగాలు వస్తాయి. 
రాజ్యాంగంలో భావనలు చదివి, అడ్వాన్స్‌డ్‌ రీడింగ్‌తో అదనపు పరిజ్ఞానం సంపాదించాక కొన్ని సందేహాలు రావొచ్చు. తికమకపడొచ్చు. నిజానికి ఇది విద్యార్థులందరూ ఎదుర్కొనే సమస్యే. ఇది క్లిష్టమైన, సమగ్రమైన రాజ్యాంగానికి సంబంధించిన విషయం కాబట్టి ఇది సహజం. 

3. పోలికలు: ఈ సందర్భంలో ‘పోలికల’ పరిశీలన ద్వారా చిక్కుల్లోంచి బయటపడొచ్చు. ఉదాహరణకు ప్రాథమిక హక్కులు, నిర్దేశక సూత్రాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం. అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కార్యాలయాలు, లోక్‌సభ, రాజ్యసభ, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ, రాష్ట్రపతి, గవర్నర్‌ మొదలైన వ్యవస్థల మధ్య ఉండే తేడాలను గుర్తిస్తే మొత్తం రాజ్యాంగంపై స్పష్టత వస్తుంది. దాంతో రాజ్యాంగ అధ్యయనంపై ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది.

4 ప్రశ్నలు: చివరగా ప్రశ్నలను ప్రయత్నించి అవగాహన స్థాయిని పరీక్షించుకోవచ్చు. ఈ ప్రశ్నలు మీ పరిజ్ఞానాన్ని పునర్విమర్శ చేసుకోవడానికి తోడ్పడతాయి. ఈ ప్రయత్నంలో కచ్చితత్వం, స్పష్టత కోల్పోకుండా అప్రమత్తం చేస్తాయి. 

ఉద్యోగం చేస్తూ సన్నద్ధత... సాధ్యమేనా?


సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు సంబంధించి దరఖాస్తు విధానం, అర్హతలు, సిలబస్, ఆప్షనల్స్, మెటీరియల్, ప్రిపరేషన్‌. ఇలా ఎన్నో అంశాలపై స్పష్టత కోసం విద్యార్థులు ఎదురుచూస్తుంటారు. ఎక్కువమంది ప్రస్తావించే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం! 

ఉద్యోగం చేసుకుంటూ సివిల్‌ సర్వీసెస్‌లో నెగ్గడం సాధ్యమేనా?

ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌ పరీక్షలు రాసి విజయం సాధించినవాళ్లు చాలామంది ఉన్నారు. సివిల్స్‌ సన్నద్ధతకు ఉద్యోగం చేయడమనేది ఆటంకం కాదు. సాధారణంగా ఏ ఉద్యోగానికైనా ఎక్కువ పని గంటలు అవసరమవుతాయి. దాంతోపాటుగా తగినంత సమయాన్ని సివిల్స్‌ పరీక్షకు సన్నద్ధం కావడానికి కూడా వినియోగించగలగాలి. గ్రాడ్యుయేషన్‌లో చదివిన ఒక సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చు లేదా సొంతంగా చదివి, సిద్ధంకాగలిగే దాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. పొలిటికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, సోషియాలజీ, తెలుగు లిటరేచర్‌... ఈ కేటగిరీలోకి వస్తాయి. 

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో బీఏ చదువుతున్నాను. నేను సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాయొచ్చా? ఏ పుస్తకాలు చదవాలో సూచించగలరు? 

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాయడానికి అర్హత సంపాదించాలంటే.. ముందుగా మీరు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేయాలి. బీఏలో మీరు చదువుతున్న మూడు సబ్జెక్టుల్లోని ఏవైనా రెండు సబ్జెక్టులను ఎంచుకోవాలి. మీ యూనివర్సిటీలో పీజీ చేయడానికి అవకాశమున్న సబ్జెక్టులనే ఎంచుకోండి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ అందించే స్టడీ మెటీరియల్‌ అద్భుతంగా ఉంటుంది. అది సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు సన్నద్ధం కావడానికి సరిపోతుంది. 

బీటెక్‌ లేదా బయోటెక్‌ నేపథ్యం ఉన్నవారు ఏ ఆప్షనల్‌ ఎంచుకుంటే మంచిది? సివిల్స్‌ పాత ప్రశ్నపత్రాలు ఎక్కడ లభ్యమవుతాయి? 

ఆప్షనల్స్‌ ఎంపిక అనేది... వివిధ అంశాల మీద ఆధారపడి ఉంటుంది. బయోటెక్‌ నేపథ్యమున్న విద్యార్థులు తాము చదివిన సైన్స్‌ సబ్జెక్టుగానీ, హ్యుమానిటీస్‌ సబ్జెక్టుగానీ ఆప్షనల్‌గా ఎంచుకోచ్చు. బీటెక్‌ నేపథ్యమున్నవారు ఇంజినీరింగ్‌ సబ్జెక్టు గానీ, హ్యుమానిటీస్‌ సబ్జెక్టుగానీ ఎంచుకోవచ్చు. పాత ప్రశ్నపత్రాలు ఇంటర్నెట్‌లో వెతికితే లభిస్తాయి. 

మెయిన్‌ పరీక్ష కోసం మళ్లీ దరఖాస్తు చేయాలా? 

దరఖాస్తు చేయాలి. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను యూపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో (www.upsc.gov.in) ప్రచురిస్తారు. అర్హత పొందిన అభ్యర్థులందరికీ యూపీఎస్‌సీ నుంచి తాజా అప్లికేషన్లు వస్తాయి. వీటిని చాలా జాగ్రత్తగా పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందులోని సమాచారం కీలకంగా ఉంటుంది. తర్వాత మార్చడానికి అవకాశం ఉండదు. దరఖాస్తు పత్రాన్ని పూర్తిచేసేటప్పుడు సీనియర్ల/ అధ్యాపకుల సహాయం తీసుకుంటే మంచిది. 

వ్యాస రచన కష్టమా? 

జనరల్‌ ఎస్సే (వ్యాసం) రాయడానికి ఎలా సన్నద్ధం కావాలి? ఈ పేపర్‌ తెలుగులో రాయొచ్చా? 

సైన్స్‌ నేపథ్యం ఉన్న విద్యార్థులకు ఎస్సే కష్టమా? 

జనరల్‌ ఎస్సే.. పేరులో సూచించిన విధంగానే స్వభావరీత్యా నిర్దిష్ట అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా జనరల్‌గానే ఉంటుంది. 1979 వరకు ఎస్సే పేపర్‌ను ఇంగ్లిష్‌లో రాయడం తప్పనిసరిగా ఉండేది. 1979లో పరీక్ష విధానం నుంచి దీన్ని తీసేశారు. 1993లో దీన్ని తిరిగి ప్రవేశపెట్టారు. ఆలోచనల వ్యక్తీకరణతోపాటు.. అభ్యర్థుల విశ్లేషణ సామర్థ్యాన్ని అంచనా వేయడమే ఈ పేపర్‌ ఉద్దేశం. విస్తృత స్థాయి అంశాల నుంచి ఎనిమిది వేర్వేరు అంశాలను ఇస్తారు. మీరు తెలుగు మాథ్యమాన్ని ఎంచుకున్నట్లయితే వ్యాసాన్ని తెలుగులోనే రాయొచ్చు. 

జనరల్‌ ఎస్సే పేపర్‌ రాయడమనేది కష్టమేమీ కాదు. మ్యాథ్స్, ఫిజిక్స్‌ లాంటి ఆప్షనల్స్‌ను ఎంచుకున్నట్లయితే దీనికి ప్రత్యేకంగా సన్నద్ధంగా కావాల్సి ఉంటుంది. పొలిటికల్‌ సైన్స్, ఎకనామిక్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ.. లాంటి సోషల్‌ సైన్సెస్‌ను ఎంచుకున్నట్లయితే ఎస్సేకు ఉపయోగపడే వివిధ అంశాలు వాటిలో ఉంటాయి. అందుకని ఎస్సే కోసం ప్రత్యేక సన్నద్ధత అవసరం ఉండకపోవచ్చు. 

ఈ పేపర్‌కు సన్నద్ధంకావడానికి ఉత్తమ మార్గం.. దినపత్రికలనూ, అవుట్‌లుక్, వీక్, ఇండియా టుడే లాంటి మేగజీన్లలో వచ్చే ప్రామాణిమైన వ్యాసాలను చదవడం. దీంతో వర్తమానాంశాల మీద కూడా పట్టు సాధించవచ్చు. తగినంత సన్నద్ధత తర్వాత రాయడాన్ని సాధన చేయడం మొదలుపెట్టాలి. మొదట్లో ఇది కష్టంగానే అనిపిస్తుందిగానీ కొన్ని అంశాలను రాసిన తర్వాత పరిస్థితి మెరుగవుతుంది. ఆలోచనల ప్రవాహం తేలిగ్గా వస్తుంది. మీరు రాసిన వాటిని అనుభవజ్ఞులైన అధ్యాపకులతో దిద్దించుకుని.. వారి సూచనలతో తగిన మార్పులు చేసుకుంటే రాసే నైపుణ్యం మెరుగవుతుంది.

అన్నీ చదవాలా?

 పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లోని చాప్టర్లలో అత్యంత ముఖ్యమైనవి ఏవి? ఐదు నెలల్లో సిలబస్‌ పూర్తిచేయొచ్చా?  

పాత ప్రశ్న పేపర్లను విశ్లేషించినట్లయితే.. ప్రశ్నలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నట్టు గుర్తిస్తారు. పైగా అన్ని చాప్టర్ల నుంచీ ప్రశ్నలు వస్తున్నాయి. అందుకని కొన్ని చాప్టర్లను వదిలేసి కొన్నింటి మీదే దృష్టి కేంద్రీకరించటం సముచితం కాదు. మొత్తం సిలబస్‌ను నాలుగు నెలల్లో చదవడం పూర్తిచేయాలి. మరో నెలలో పాత ప్రశ్న పేపర్లను రాయడం సాధన చేయాలి. ఇలాచేస్తే సన్నద్ధత ఏకీకృతం కావడంతోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కూడా. సిలబస్‌ ఏమిటన్నది తెలిస్తే... సబ్జెక్టులోని విషయాలకు వర్తమానాంశాల అనుసంధానం సులువే. 


 

Posted Date : 10-03-2022

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు