• facebook
  • whatsapp
  • telegram

పోస్టులు పెరగడం... పోటీకి అనుకూలం!

సివిల్స్‌ నోటిఫికేషన్‌పై సందేహాలు-సమాధానాలు


ప్రజా కోణంలో విభిన్న అంశాలను లోతుగా అధ్యయనం చేసి, పరిష్కరించే సామర్థ్యమున్న యువత కోసం యూపీఎస్‌సీ ఏటా సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షను నిర్వహిస్తుంటుంది. పరిణతికీ, విస్తృత విషయ పరిజ్ఞానానికీ సవాలు విసిరే పరీక్ష ఇది. జాతీయస్థాయిలో మూడంచెల్లో నిర్వహించే ఈ పరీక్షలో నెగ్గాలని ఎందరో విద్యార్థులు కలలు కంటుంటారు. తాజాగా సివిల్స్‌ నోటిఫికేషన్‌ వెలువడిన సందర్భంగా ఈ పరీక్ష గురించి తరచూ తలెత్తే సందేహాలూ..వాటికి సరైన సమాధానాలూ పరిశీలిద్దాం! 

గత రెండేళ్లతో పోలిస్తే ఈ సంవత్సరం సివిల్‌ సర్వీసెస్‌ పోస్టుల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది 1011 ఖాళీలు ఉన్నట్లు ప్రకటించారు. ఈ సంఖ్య 2021లో 712, 2020లో 796గా ఉంది. పోస్టులు పెరగటానికి కారణాలు ఎన్నో. ఉదాహరణకు... కొత్త డిపార్ట్‌మెంట్లను నెలకొల్పడం, పదవీ విరమణ చేసినవారి సంఖ్య మొదలైనవి. పోస్టులు పెరగటం అనేది అభ్యర్థులు సర్వీసుకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతుంది!   2020 సంవత్సరంలో మాదిరిగానే ఈ ఏడాది 19 సర్వీసులను నోటిఫై చేశారు. గత ఏడాది నాన్‌-యూనిఫామ్డ్‌ రైల్వే సర్వీసెస్‌ను ఈ పరీక్ష నుంచి మినహాయించారు. ఈ సర్వీసులకు విడిగా పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. కిందటి సంవత్సరం నుంచీ సర్వీసుల సంఖ్య తగ్గటానికి కారణం ఇదే.

అర్హతలు.. ధ్రువపత్రాలు 

‣ సివిల్స్‌ పరీక్ష రాయాలంటే ఉండాల్సిన అర్హతలు ఏమిటి?

డిగ్రీ చదివిన ఏ విద్యార్థికి అయినా.. వయసు 21 ఏళ్లుంటే సివిల్స్‌ రాయటానికి అర్హత ఉన్నట్టే.  

‣ డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు రాశాను. ఇంకా ఫలితాలు వెలువడలేదు. నాకు సివిల్స్‌ పరీక్ష రాయడానికి అర్హత ఉందా?

అర్హత ఉంది. గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన/ పూర్తికాబోతున్న అభ్యర్థులు సివిల్స్‌ రాయటానికి అర్హులే. ప్రిలిమ్స్‌కు దరఖాస్తు చేసేటప్పుడు డిగ్రీ సర్టిఫికెట్‌ పెట్టాల్సిన అవసరం లేదు. మెయిన్‌ పరీక్షకు అర్హత సాధిస్తే డిగ్రీ ఉత్తీర్ణులైనట్టు ధ్రువపత్రం చూపించాలి. మెయిన్‌ పరీక్షకు దరఖాస్తు చేసే నాటికి డిగ్రీ పాసై ఉండాలి. లేకపోతే అభ్యర్థిత్వం తిరస్కరణకు గురవుతుంది. 

‣ మిగతావారితో పోలిస్తే ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేయడానికి ఎక్కువ సమయం పడుతుంది కదా? వీరికి ఏమైనా మినహాయింపులు ఉంటాయా? 

ఉంటాయి. ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం పాసై ఇంటర్న్‌షిప్‌ పూర్తికాని అభ్యర్థులు సివిల్స్‌ మెయిన్‌ పరీక్షకు హాజరు కావచ్చు. అయితే ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నట్టుగా సంబంధిత అధికారులు ఇచ్చే సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ అభ్యర్థులు ఇంటర్వ్యూకు అర్హత సాధించినట్లయితే.. ఎంబీబీఎస్‌ పరీక్ష పాసయినట్టూ, ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసినట్టూ ఇంటర్వ్యూకు ముందే ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

అంచెలు... భాషా మాధ్యమం 

‣ ప్రిలిమినరీ పరీక్షను ఏ భారతీయ భాషలోనైనా రాయొచ్చా? 

ప్రిలిమినరీ అనేది ఆబ్జెక్టివ్‌ టైప్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ పరీక్ష. కరెక్టు సమాధానాన్ని ఓఎంఆర్‌ షీట్‌ మీద గుర్తించాలి. ప్రశ్నలను ఇంగ్లిష్, హిందీ భాషా మాధ్యమాల్లో మాత్రమే ఇస్తారు. కాబట్టి ఆ ఇంగ్లిష్‌/ హిందీ భాషలో అడిగే ప్రశ్నలను అర్థం చేసుకుంటే సరిపోతుంది. సాధారణంగా ఆ ప్రశ్నలు సులువుగానే అవగాహన అవుతాయి.  

మెయిన్‌ పరీక్షను మాతృభాషలో రాసే అవకాశం ఉంటుందా?

అవకాశం ఉంటుంది. మెయిన్‌ పరీక్షను రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న భాషలన్నింటిలోనూ రాసే అవకాశం ఉంది. 

1. క్వాలిఫైయింగ్‌ పేపర్లైన మోడ్రన్‌ ఇండియన్‌ లాంగ్వేజ్, ఇంగ్లిష్‌లను పేర్కొన్న భాషలోనే రాయాలి. 

2. మిగతా పేపర్లన్నీ అభ్యర్థులు ఎంచుకున్న భాషలోనే రాయొచ్చు. ఉదాహరణకు అభ్యర్థి తెలుగు భాషలో రాయాలనుకుంటే ఆప్షనల్స్‌ సహా అన్ని పేపర్లూ తెలుగులోనే రాయొచ్చు. 

3. కామన్‌ పేపర్లయిన జనరల్‌ ఎస్సే, జీఎస్‌ పేపర్‌-1, జీఎస్‌ పేపర్‌-2, జీఎస్‌ పేపర్‌-3, జీఎస్‌ పేపర్‌-4లను ఏ భారతీయ భాషలోనైనా (ఉదాహరణకు తెలుగు) రాసి ఆప్షనల్స్‌ను ఇంగ్లిష్‌లో రాయవచ్చు. దీంతో అభ్యర్థులకు టెక్నికల్‌ సబ్జెక్టులను ఆప్షనల్స్‌గా ఎంచుకోవడానికి వెసులుబాటు ఏర్పడింది. 

4. అభ్యర్థి ఆప్షనల్స్‌ను మాతృభాషలో రాసినప్పుడు సాంకేతిక పదాలను బ్రాకెట్లో ఇంగ్లిష్‌లో రాయవచ్చు. కొన్ని సాంకేతిక పదాలకు సరిగ్గా సరిపోయే అనువాదం మాతృభాషలో ఉండదు కాబట్టే ఈ వెసులుబాటును కల్పించారు. 

మెయిన్‌ పరీక్ష మాతృభాషలో రాసి, ఇంటర్వ్యూ జవాబులు ఇంగ్లిష్‌లో చెప్పవచ్చా? అలాగే... మెయిన్‌ పరీక్షను ఇంగ్లిష్‌లో రాసి, ఇంటర్వ్యూ జవాబులను తెలుగులో చెప్పవచ్చా?  

యూపీఎస్‌సీ ఈ సౌలభ్యాన్ని కల్పిస్తోంది. విద్యార్థి తాను ఎంచుకున్న ఏ భాషలోనైనా ఇంటర్వ్యూ సమాధానాలను ఇవ్వొచ్చు. 

గరిష్ఠ వయసు

గత సంవత్సరాలతో పోలిస్తే వయఃపరిమితిలో ఏమైనా తేడాలు ఉన్నాయా?

సివిల్స్‌ రాయాలంటే జనరల్, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఉండాల్సిన వయసు కనీసం 21 సంవత్సరాలు; గరిష్ఠ వయసు 32 సంవత్సరాలు. ఓబీసీ అభ్యర్థులకు గరిష్ఠ వయసు 35 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 37 సంవత్సరాలు. వయఃపరిమితిలో కొత్తగా ఎలాంటి మార్పూ రాలేదు.

‣ వయఃపరిమితికి సంబంధించి భవిష్యత్తులో ఏమైనా మార్పు రావచ్చా?

వరుస సంస్కరణ కమిషన్లు గరిష్ఠ వయః పరిమితిని తగ్గించాలని సిఫారసు చేశాయి గానీ  ప్రభుత్వం ఎలాంటి మార్పులూ చేయలేదు. అయినా.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇలాంటి మార్పులు ఏమీ జరగవు. అందుకని ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే గరిష్ఠ వయఃపరిమితి ఉంటుందిలే అని తాత్సారం చేయకుండా వీలైనంత త్వరగా పరీక్షకు సిద్ధం కావడం అన్నివిధాలా మేలు.

ఆరు అవకాశాలు

‣ తాజా నోటిఫికేషన్‌ ప్రకారం.. అభ్యర్థులు ఎన్నిసార్లు సివిల్స్‌ను రాయటానికి అనుమతి ఉంది? 

ఎన్నిసార్లు ప్రయత్నించవచ్చనే విషయంలోనూ ఎలాంటి మార్పూ లేదు. జనరల్‌ అభ్యర్థులు ఆరుసార్లు ప్రయత్నించవచ్చు. ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు ఆరుసార్లు, ఓబీసీ అభ్యర్థులు తొమ్మిది సార్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎన్నిసార్లయినా ప్రయత్నించవచ్చు. 

ఇవి గుర్తుంచుకోండి!

1. ప్రిలిమినరీ ఫారంలో ఒకసారి అభ్యర్థి పేర్కొన్న పుట్టిన తేదీని ఆ తర్వాతి ప్రయత్నాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చరు.

2. ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలకు పరీక్షా కేంద్రాన్ని ప్రిలిమినరీ ఫారం పూర్తిచేస్తున్నప్పుడే ఎంచుకోవాలి. ఆ తర్వాత దాన్ని మార్చరు. 

3. ప్రిలిమినరీ ఫారం పూర్తిచేస్తున్నపుడే.. మెయిన్స్‌లో రాసే ఆప్షనల్‌ సబ్జెక్టులను ఎంచుకోవాలి. ఏడాదిపాటు వీటిలో ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదు. తదుపరి సంవత్సరాల్లో వీటిని మార్చుకోవచ్చు. 

4. మెయిన్స్‌ను ఏ మాధ్యమంలో రాయాలో ప్రిలిమినరీ పరీక్ష సమయంలోనే ఎంచుకోవాలి. దీన్ని మళ్లీ మార్చరు. 

5. పరీక్ష రాయడం ఇష్టంలేకపోతే అభ్యర్థులు తాము పంపిన దరఖాస్తును ఉపసంహరించుకోవచ్చు. దరఖాస్తును 2022 మార్చి 1- 7 తేదీల మధ్య ఉపసంహరించుకోవచ్చు. 

దరఖాస్తుదారుల్లో రాసేది సగం మందే

‣ ప్రిలిమినరీ పరీక్షకు ఎంతమంది హాజరవుతారు? మెయిన్‌ పరీక్షకు ఎంతమంది ఎంపికవుతారు?

సుమారు 5 లక్షలమంది ప్రిలిమినరీ పరీక్ష రాస్తే దాదాపు 10,000 మంది మెయిన్‌ పరీక్షకు ఎంపికవుతారు. మెయిన్స్‌కు ఎంతమంది ఎంపికవుతారు అనేది ప్రకటించిన ఖాళీల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది.

సుమారు 10 లక్షల మంది సివిల్స్‌ పరీక్షకు దరఖాస్తు చేస్తే.. దాంట్లో 50 శాతం మందే పరీక్షకు హాజరవుతారని చదివాం. ఇంత వ్యత్యాసం ఉండటానికి కారణం?

గ్రాడ్యుయేట్లు అందరూ సివిల్స్‌ పరీక్ష రాయడానికి అర్హులే (మార్కుల శాతంతో నిమిత్తం లేకుండా). డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా రాయవచ్చు కాబట్టి ఎక్కువమంది దరఖాస్తు చేస్తుంటారు. పరీక్ష ఫీజు తక్కువగా ఉండటం కూడా ఎక్కువ దరఖాస్తులకు ఓ కారణం. దీనికో ఉదాహరణ చెప్పాలంటే..కామన్‌ ఎడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌) పరీక్ష ఫీజు రూ.1,000-2,000 ఉంటుంది. దాంతో పరీక్ష రాయాలని బలంగా నిర్ణయించుకున్నవాళ్లే ఫీజు కట్టి పరీక్షకు హాజరవుతారు.

ఒకటికి మించిన దరఖాస్తులు

అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు పంపొచ్చా? ఒకవేళ అలా పంపితే దేన్ని పరిగణనలోకి తీసుకుంటారు?

అభ్యర్థి ఒక్క దరఖాస్తు మాత్రమే పంపితే మంచిది. ఏమైనా కొన్ని మార్పులు చేసినట్లయితే.. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులను పంపొచ్చు. అలాంటప్పుడు చివరిగా పంపినదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

‣ త్వరగా దరఖాస్తు చేయడం అవసరమా?

అవసరమే. చాలా పరీక్ష సెంటర్ల సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అందుకని ముందుగా దరఖాస్తు చేసినవారికి వారి ప్రాంతానికి సమీపంలో ఉన్న పరీక్ష కేంద్రాల కేటాయింపులో ప్రాధాన్యమిస్తారు. చివరి నిమిషంలో దరఖాస్తు చేస్తే మీకు అనుకూలంగా ఉండే సెంటర్‌ను కేటాయించకపోవచ్చు. అప్పుడు వేరే పట్టణం లేదా నగరానికి వెళ్లి పరీక్ష రాయాల్సివుంటుంది. దీంతో ఎంతో అసౌకర్యానికి గురికావాల్సి వస్తుంది.

సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ - 2022

నోటిఫికేషన్‌ తేది : 02.02.2022

దరఖాస్తుకు చివరి తేది : 22.02.2022 (ఆన్‌లైన్‌)

ప్రిలిమినరీ పరీక్ష తేది : 05.06.2022

మెయిన్‌ పరీక్ష తేది : 16.09.2022

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రిలిమ్స్‌ పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం 


 

Posted Date : 20-02-2022

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు