‣ యూపీఎస్సీ ప్రకటన విడుదల
‣ కనీస విద్యార్హత ఇంటర్మీడియట్
‣ త్రివిధ దళాల్లో కొలువులు

భారత రక్షణ రంగంలో సేవలందించడం చాలామంది కల. జవాన్ అనే పదంలోనే ఓ ఉద్వేగం.. గర్వం.. బాధ్యత కనిపిస్తాయి. అందుకే సైనికుడని పిలిపించుకోవాలని ఎంతోమంది తహతహలాడుతుంటారు. ఇంటర్ పూర్తి చేసిన అలాంటి యువతకు భారత రక్షణ రంగం ఆహ్వానం పలుకుతోంది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో చేరి భారత కీర్తి పతాకను ఎగురవేసే అవకాశం అందిస్తోంది. ఉద్యోగంతోపాటు చదువునూ కొనసాగించే అవకాశం కల్పిస్తోంది.
యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ(ఎన్డీఏ అండ్ ఎన్ఏ-2) ప్రకటన విడుదల చేసింది. 2021 సంవత్సరానికి రెండో విడత కింద 400 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ఆర్మీ-208, నేవీ-42, ఎయిర్ ఫోర్స్, క్యాడెట్ ఎంట్రీ స్కీమ్(10+2)-30 పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు జులై 2, 2022 నుంచి ప్రారంభమయ్యే 148వ కోర్సులో, 109వ ఇండియన్ నావల్ అకాడమీ(ఐఎన్ఏ) కోర్సులో ప్రవేశాలు పొందుతారు. మూడేళ్ల అనంతరం కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఉద్యోగం ఇస్తారు. అలాగే జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం-దిల్లీ నుంచి బ్యాచిలర్స్‌డిగ్రీ/బీటెక్‌పట్టా అందజేస్తారు.
ఏమిటీ అర్హత!
కేవలం బాలురు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వారూ అవివాహితులై ఉండాలి. ఆర్మీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గ్రూపులో ఇంటర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ) ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారూ అర్హులే. 2003 జనవరి 2 నుంచి 2006 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక తీరు
అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో ఉంటుంది. రాత పరీక్ష(ఆబ్జెక్టివ్ తరహా), ఇంటెలిజెన్స్ - పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఇలా..
అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఎస్సీ/ ఎస్టీలతోపాటు సైనిక్ పాఠశాలలో చదువుతున్న ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసే కొన్ని కేటగిరీలకు చెందిన ఉద్యోగుల పిల్లలకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇతరులు రూ.100 చెల్లించాలి. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 29, 2021. దరఖాస్తుల ఉసంహరణకు జులై 6 నుంచి 12 వరకు అవకాశం కల్పించారు. నవంబరు 14న పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.
రాత పరీక్ష విధానం
రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 900 మార్కులకు నిర్వహిస్తారు. పేవర్-1 మ్యాథ్స్- 300 మార్కులు (సమయం రెండున్నర గంటలు), పేపర్-2 జనరల్ ఎబిలిటీ- 600 మార్కులుంటాయి(సమయం రెండున్నర గంటలు). దీంట్లో ఇంగ్లిష్కు 200, జనరల్ నాలెడ్జ్కు 400 మార్కుల చొప్పున కేటాయించారు. జనరల్ నాలెడ్జ్ విభాగంలో ఫిజిక్స్ నుంచి 100, కెమిస్ట్రీ నుంచి 60, జనరల్ సైన్స్ నుంచి 40, చరిత్ర, స్వాతంత్రోద్యమాలు తదితరా నుంచి 80, భూగోళ శాస్త్రం నుంచి 80, వర్తమానాంశాల నుంచి 40 మార్కులకు ప్రశ్నలడుగుతారు. రుణాత్మక మార్కులుంటాయి. వర్తమాన వ్యవహారాలు మినహా మిగతా ప్రశ్నలు దాదాపు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల నుంచే వస్తాయి.
‣ రాత పరీక్షలో అర్హత పొందిన వారికి సర్వీస్ సెలక్షన్ బోర్డు(ఎస్ఎస్బీ) ఆధ్వర్యంలో యూపీఎస్సీ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్టులు నిర్వహిస్తుంది. ఈ విభాగానికీ 900 మార్కులు కేటాయించారు. ఇందులో భాగంగా తొలిరోజు ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ ర్యాటింగ్ (ఓఐఆర్), పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్ర్కిప్షన్టెస్ట్ (పీపీ అండ్ డీటీ) నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి మిగిలిన 4 రోజులు ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్, గ్రూప్ ప్లానింగ్, అవుట్ డోర్ గ్రూప్ టాస్కులు నిర్వహిస్తారు. రాత పరీక్ష, ఎస్ ఎస్ బీ నిర్వహించిన ఇంటర్వ్యూలో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపికలు జరుగుతాయి.
40 శాతం చాలు...
పరీక్ష, ఇంటర్వ్యూల్లో 40 శాతం మార్కులు సాధించినవారు శిక్షణకు ఎంపిక కావడానికి అవకాశాలు ఉన్నాయి. 2020(1) పరీక్షలో 900కు గానూ 355 మార్కులు పైన సాధించినవారు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. అంతకు ముందు అంటే 2019లో నిర్వహించిన రెండు పరీక్షల్లోనూ ఈ కటాఫ్ మార్కులు 350లోపే ఉన్నాయి. అందువల్ల 40 శాతం మార్కులు పొందితే ఇంటర్వ్యూకు అర్హత లభిస్తుంది. తుది నియామకాల్లో 720 మార్కులు పొందినవారికి అవకాశాలుంటాయి. అంటే పరీక్ష, ఇంటర్వ్యూల్లో కలుపుకుని 1800కు గానూ 40 శాతం (720) మార్కులు పొందినవారు శిక్షణకు ఎంపిక కావచ్చు. అందువల్ల శ్రద్ధగా సన్నద్ధమైనవాళ్లు ఉత్తీర్ణత సాధించడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఎంపీసీ విద్యార్థులకు ఈ పరీక్ష అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కేవలం ఈ గ్రూప్ నుంచే 460 (పేపర్ 1లో మ్యాథ్స్ 300, పేపర్ 2లో ఫిజిక్స్, కెమిస్ట్రీ 160) మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఆర్ట్స్, బైపీసీ గ్రూపు విద్యార్థులు విజయానికి గట్టి కృషి తప్పనిసరి. పరీక్షలో అర్హతకు సబ్జెక్టులవారీ కనీసం 25 శాతం మార్కులు పొందడం తప్పనిసరి.
సన్నద్ధం అవ్వండిలా..
సీబీఎస్ఈ 11,12 తరగతుల పుస్తకాలను క్షుణ్ణంగా చదవడంతోపాటు 8,9,10 తరగతుల పాఠ్యాంశాలనూ చదవాలి. ప్రాథమికాంశాలతో అధ్యయం ప్రారంభించాలి. వీటిపై పట్టు సాధిస్తే ప్రశ్న ఏ విధంగా అడిగినా సులభంగా జవాబు గుర్తించవచ్చు. పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అవగాహన ఏర్పడుతుంది. రోజుకొకటి మాక్ పరీక్ష రాస్తే జవాబులు గుర్తించడంలో వేగం, కచ్చితత్వం అలవడుతుంది. ఏయే విభాగంలో వెనుకబడుతున్నామో తెలుసుకొని మెరుగుపరుచుకోవడానికి వీలుంటుంది. ఈ పరీక్షలో రుణాత్మక మార్కులుంటాయి కాబట్టి జవాబులు తెలియని ప్రశ్నలను వదిలేయడమే ఉత్తమం.
గణితం; మ్యాథ్స్ ప్రశ్నలకు ఎక్కువ సమయం పడుతుంది. సాధనతోనే ఆ సమయాన్ని తగ్గించుకోవచ్చు. కొన్ని ప్రశ్నలకు సమాధానం గుర్తించే విధానం తెలిసినప్పటికీ అందుకు ఎక్కువ సమయం పట్టొచ్చు. కాబట్టి చివర్లో సమయం ఉంటేనే వాటి జోలికి వెళ్లాలి. గణితంలోని ప్రాథమికాంశాలు, సూత్రాలు, అనువర్తనంపై దృష్టి పెట్టాలి. ఈ పేపర్లో మ్యాట్రిసెస్ అండ్ డిటెర్మినేంట్స్ నుంచి 30, ట్రిగనోమెట్రీ 30, కాల్క్యులస్ 20, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 20, ప్రాబబిలిటీ 10, కాంప్లెక్స్ నంబర్స్ 10 వరకు ప్రశ్నలు వస్తున్నాయి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి ఆయా చాప్టర్ల నుంచి వస్తోన్న ప్రశ్నల ప్రకారం సన్నద్ధం కావాలి.
ఫిజిక్స్; ఫిజిక్స్ లో ప్రశ్నలకు సులభంగా సమాధానాలు గుర్తించాలంటే ప్రాథమిక భావనలపై పట్టు సాధించాలి. ఆయా సూత్రాల అనువర్తనంపై అవగాహన పెంచుకోవాలి. సిలబస్ ను ఒక క్రమంలో సిద్ధం చేసుకొని అధ్యయనం సాగించాలి. తరచూ పునశ్చరణ చాలా ముఖ్యం.
రసాయన శాస్త్రం; రసాయన శాస్త్రంలో మూలకాల వర్గీకరణ, సమ్మేళనాలు, మిశ్రమాలు తదితర అధ్యాయాలపై దృష్టి పెట్టాలి. సాంకేతిక పదజాలాన్ని అర్థం చేసుకోవడంతోపాటు మరచిపోకుండా ఉండాలంటే స్వయంగా కొన్ని సంకేతాలను ఏర్పరచుకొని చదవాలి. రివిజన్ చేయడం మరచిపోకూడదు.
ఇంగ్లిష్; ఆంగ్ల వ్యాకరణం, పదసంపద కొన్ని రోజుల్లోనే నేర్చుకోవడం సాధ్యం కాదు. వీటి కోసం ప్రతి రోజు కొంత సమయం కేటాయించాలి. కొత్త పదాలను తెలుసుకోవాలి. ఇంగ్లిష్ లో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, సెలెక్టింగ్ వర్డ్స్ లో పదేసి చొప్పున ప్రశ్నలు రావచ్చు. అలాగే వాక్యంలోని పదాలను ఒక క్రమంలో అమర్చమనే ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. అర్థాలు, వ్యతిరేక పదాలు, తప్పుని గుర్తించడం, కాంప్రహెన్షన్ పైనా దృష్టి పెట్టాలి.
కరెంట్ అఫైర్స్; కరెంట్ అఫైర్స్ లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి కీలక పరిణామాలపై ప్రశ్నలు రావచ్చు. వీటి కోసం నిత్యం దినపత్రికలు చదవాలి. వార్తలను అభ్యర్థులు స్పోర్ట్స్, ఆర్ట్స్, లిటరేచర్ పై కూడా దృష్టి పెట్టాలి. మ్యాథ్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీలకు పాఠ్యపుస్తకాలు ఉపయోగపడతాయి. ఎంసెట్, జేఈఈ పాత ప్రశ్నపత్రాలనూ ప్రాక్టీస్ చేయవచ్చు.

‣ చరిత్ర, భూగోళశాస్త్రం, జనరల్ సైన్స్ విభాగంలోని ప్రశ్నలకు ఆయా సబ్జెక్టుల్లో ఎన్సీఈఆర్టీ 8, 9, 10 తరగతులతోపాటు ప్లస్ వన్, ప్లస్ టు పుస్తకాలను అధ్యయనం చేయవచ్చు. టాటా మెక్ గ్రాహిల్స్, అరిహంత్ పబ్లిషర్ల ఎన్‌డీఏ పుస్తకాలు, జీకే ప్రశ్నలకు- లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు సరిపోతాయి
‣ ఇంటర్వ్యూలో ఒక అధికారికి ఉండాల్సిన లక్షణాలు ఏమేరకు ఉన్నాయో గమనిస్తారు. ఆత్మవిశ్వాసంతో జవాబులు చెప్పాలి. భారత రక్షణ రంగంలోని విభాగాలు, అధికారులు, విధులు, ప్రత్యేక సంస్థలు తదితరాలపై అవగాహన పెంచుకోవడం మంచిది.
కోర్సులకు ఎంపికైతే..
నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్డీఏ అండ్ ఎన్ఏ), ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ పరీక్షలో మెరిట్ సాధిస్తే కోర్సులకు ఎంపికవుతారు. ఎంపికైనవారు బీఏ, బీఎస్సీ, బీటెక్ కోర్సులను ఉచితంగా చదవచ్చు. ఉత్తీర్ణులకు న్యూదిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం డిగ్రీలను ప్రదానం చేస్తుంది.
శిక్షణ ఎక్కడ? ఎలా?
మూడు విభాగాల్లో తుది అర్హతకు ఎంపికైన అభ్యర్థులకు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మూడేళ్లు అకడమిక్, ఫిజికల్ శిక్షణ ఉంటుంది. మొదటి రెండున్నరసంవత్సరాలు అందరు క్యాడెట్లకు ఒకేరకమైన శిక్షణ ఇస్తారు. మిగిలిన ఆరు నెలలు విభాగాలకు సంబంధించిన విషయాలు నేర్పుతారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు బీఎస్సీ/ బీఎస్సీ(కంప్యూటర్స్)/ బీఏ/ బీటెక్ పట్టా ఇస్తారు. అనంతరం ఆర్మీ క్యాడెట్లను డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలటరీ అకాడమీకి; నేవల్ క్యాడెట్లను ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీకి; ఎయిర్ ఫోర్స్ క్యాడెట్లను హైదరాబాద్ లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధిత ట్రేడ్ శిక్షణ కోసం పంపుతారు. అభ్యర్థి ఎంపికైన విభాగాన్ని బట్టి ఈ శిక్షణ ఏడాది నుంచి 18 నెలల వరకు ఉంటుంది. ఈ సమయంలో అభ్యర్థులకు నెలకు రూ.56,100 స్టైపెండ్ ఇస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. అప్పుడు వేతనం నెలకు రూ.లక్ష పైనే ఉంటుంది. దీంతోపాటు వివిధ రకాల ప్రోత్సాహకాలు, అలవెన్సులు అందుతాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ప్రారంభ స్థాయి ఆఫీసర్ ఉద్యోగాలైన లెఫ్టినెంట్, సబ్-లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్/గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభం అవుతుంది. రెండేళ్లు, ఆరేళ్లు, పదమూడేళ్ల సర్వీస్ తో ప్రయోషన్లు పొందవచ్చు. భవిష్యత్తులో సంబంధిత విభాగానికి చీఫ్ అయ్యే అవకాశాలూ ఉంటాయి.
వెబ్‌సైట్: https://upsconline.nic.in/mainmenu2.php