• facebook
  • whatsapp
  • telegram

డాల్టన్‌ పద్ధతి

వైయక్తిక భేదాల ఆధారంగా అభ్యసనం!
 


విద్యార్థుల అభ్యసనానికి ఉపాధ్యాయులు ఉపయోగించే సూత్రాల సంకలనమే బోధనా పద్ధతి. పిల్లల్లో చదువుపై ఆసక్తి పెంచి, క్రమపద్ధతిలో, తార్కికంగా నైపుణ్యాలు పెంచడమే దాని పరమార్థం. ప్రాథమిక స్థాయి బోధనకు ప్రభావ పూరితంగా సాయపడే పలు రకాల పద్ధతులు ఉన్నాయి. ప్రాచీన విధానంగా పేరొందిన డాల్టన్‌ పద్ధతి, విద్యార్థులకు స్వేచ్ఛనిస్తూ వారి ప్రతిభను వెలికి తీసే ప్రాజెక్టు పద్ధతి, అలాగే ప్రస్తుతం దేశంలో ఎక్కువగా ఆచరణలో ఉన్న కృత్యాధార పద్ధతి గురించి పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. ఒక్కో పద్ధతిలోని మౌలికాంశాలు, వాటి నిర్వచనాలు, అభివృద్ధి చేసి, ప్రతిపాదించిన విద్యావేత్తలు; బోధనలో అనుసరించాల్సిన వ్యూహాలు,  వినియోగించే బోధనోపకరణాలు, వాటితో వచ్చే ఫలితాలపై తగిన అవగాహన కలిగి ఉండాలి.

ఈ పద్ధతికి వ్యక్తి/వ్యష్టి/వైయక్తిక/నియోజనాల/నిర్ణయాల ప్రయోగశాల/ప్రాచీన గురుకుల పద్ధతి అని పేరు. ఈ పద్ధతిని మిస్‌ హెలెన్‌ పార్క్‌హర్ట్స్‌ ప్రతిపాదించారు. ఇది వైయక్తిక భేదాల ఆధారంగా అభ్యసన జరిగే పద్ధతి. అమెరికాలోని ‘డాల్టన్‌’ నగరంలో మొదట దీన్ని ఉపయోగించడం వల్ల ఆ పేరు వచ్చింది. ఈ పద్ధతిలో హౌస్‌ సిస్టమ్‌కు ప్రాధాన్యం ఉంది. ఇందులో విద్యార్థుల కృషి గ్రంథాలయాల ద్వారా జరుగుతుంది. అంటే గ్రంథాలయాల ద్వారా బోధన జరిగే పద్ధతి అని చెప్పొచ్చు. 

* ఈ పద్ధతిలో విద్యార్థులను మూడు రకాలుగా వర్గీకరిస్తారు.

1) తెలివైనవారు

2) సగటు ప్రజ్ఞ ఉన్నవారు

3) మందబుద్ధులు.


* ఈ పద్ధతిలో సబ్జెక్టును ప్రధాన వర్గం, అప్రధాన వర్గం అని వర్గీకరిస్తారు. తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం మొదలైనవి ప్రధాన వర్గం అని; చేతిపనులు లాంటి వాటిని అప్రధాన వర్గం అని వర్గీకరిస్తారు.

* నియోజనాల ద్వారా విద్యార్థుల స్వయం అభ్యసనం జరుగుతుంది.

*   ఈ పద్ధతి మాధ్యమిక, ఉన్నత దశలకు అనుకూలం.


ప్రాజెక్టు పద్ధతి/ఉద్యమ పద్ధతి


ప్రాజెక్టు పద్ధతిని ‘సమస్యా పరిష్కార పద్ధతి’ అంటారు. దీన్నే ప్రకల్పనా/ఉద్యమ/ఎత్తుగడ/శాస్త్రీయ పద్ధతి అని కూడా అంటారు. ఉద్యమ పద్ధతిని అమెరికాలో వచ్చిన అభ్యుదయ విద్యా ఉద్యమ ఫలితం అని పేర్కొంటారు. దీన్ని జాన్‌ డ్యూయీ ప్రతిపాదించారు.


*   జె.ఎ. స్టీవెన్‌సన్‌ 1908లో ప్రాజెక్టు పద్ధతిని వినియోగించారు.


*  1918లో ‘ద ప్రాజెక్ట్‌ మెథడ్‌’ పేరుతో కిల్‌ ప్యాట్రిక్‌ అనే విద్యావేత్త రాసిన వ్యాసం ద్వారా ఈ భావన విస్తృత వ్యాప్తిలోకి వచ్చింది.


నిర్వచనాలు


*   ‘సామాజిక వాతావరణంలో ఇష్టపూర్వకంగా, ఉద్దేశ పూర్వకంగా నిర్వహించే కార్యకలాపమే ప్రాజెక్టు పద్ధతి.’ - డబ్ల్యూహెచ్‌ కిల్‌ప్యాట్రిక్‌


*   ‘స్వాభావిక పరిస్థితుల్లో నిర్వహించే సమస్యా పరిష్కార పద్ధతే ప్రాజెక్టు పద్ధతి.’ - జె.ఎ. స్టీవెన్‌సన్‌ 


*   ‘పాఠశాలలోకి ప్రవేశించిన ఒక జీవన విధానం ప్రాజెక్టు పద్ధతి.’  - బల్లార్డ్‌


ప్రాజెక్టు పద్ధతి - విద్యాసూత్రాలు


ప్రాజెక్టు పద్ధతి కింది విద్యాసూత్రాలపై ఆధారపడుతుంది.


*    పని ద్వారా అభ్యసించడం.


*    తెలిసిన దాన్నుంచి తెలియనిదాన్ని అభ్యసించడం.


*    స్వానుభవం నుంచి శాస్త్ర జ్ఞానాన్ని పొందడం.


ప్రాజెక్టు పద్ధతి నిర్వహణలోని అభ్యసనా సూత్రాలు


*    ఉద్యమాన్ని గురించి తెలుసుకోవడం.


*    నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే బాగా నేర్చుకుంటాం. (ప్రిన్సిపల్‌ ఆఫ్‌ రెడీనెస్)


*    ఉద్యమ నిర్వహణలో జ్ఞాననైపుణ్యాల వినియోగ   ఆవశ్యకత.


*    వినియోగంతోనే అభ్యసనం స్థిరమవుతుంది.


*    ఉద్యమ నిర్వహణలో స్వేచ్ఛ.


*    స్వేచ్ఛాపూరిత వాతావరణంలో శక్తులు వినియోగంలోకి వస్తాయి.


*    ఉద్యమ నిర్వహణలో భాగంగా సమస్యను పరిష్కరించి సంతృప్తి పొందడం.


* ఉద్యమాన్ని సామాజిక వాతావరణంలో అందరి  సహకారంతో పూర్తి చేయగలగడం.


* సామాజికీకరణం అనివార్యమవుతుంది.

ఉద్యమాల్లో రకాలు


కిల్‌ప్యాట్రిక్‌ ఉద్యమాలను 4 రకాలుగా వర్గీకరించారు.


1) నిర్మాణాత్మక ఉద్యమాలు: ఉదా: ఉపకరణాన్ని తయారు చేయడం, నమూనాను రూపొందించడం, నాటకం వేయడం లాంటివి.


2) సౌందర్యాత్మక ఉద్యమాలు: ఉదా: వస్తువు/ప్రదేశాన్ని అందంగా తీర్చిదిద్దడం, కవితా ప్రశంస, కవి ప్రశంస, అభినందన మొదలైనవి.


3) సమస్యాత్మక ఉద్యమాలు: ఉదా: సమస్యను గుర్తించడం, కారణాలను అధ్యయనం చేయడం, అన్వేషించడం, పరిష్కరించడం లాంటివి.


4) పునఃనిర్వహణ ఉద్యమాలు: రంగులు వేయడం, పఠనం నిర్వహించడం, సామూహిక గేయాలాపన చేయడం, పద్యాలు ధారణ చేయడం.


* ఉద్యమాల నిర్వహణలో పాల్గొనే విద్యార్థుల సంఖ్య ఆధారంగా వీటిని వ్యక్తిగత ఉద్యమాలు, సామూహిక ఉద్యమాలుగా వర్గీకరించవచ్చు. సామూహిక ఉద్యమాలు విద్యార్థుల్లో సామూహిక భావనను,సహకార భావనను పెంపొందిస్తాయి.


ఉద్యమాలను సాధారణంగా 2 రకాలుగా వర్గీకరించొచ్చు.


1) సామాన్య ఉద్యమాలు: ఏదో ఒక అంశానికి లేదా ఏదో ఒక కోణం నుంచి మాత్రమే అధ్యయనం చేయడానికి వీలున్నది. 

ఉదా: పద్య పఠనం, పాత్ర పోషణ.


2) సంకీర్ణ ఉద్యమాలు: ఒకటి కంటే ఎక్కువ అంశాలకు సంబంధించిన ఉద్యమాన్ని భిన్న కోణాల నుంచి అధ్యయనం చేసే వీలున్న అంశాలు. 

ఉదా: ఉత్సవ నిర్వహణ, పాఠశాల పత్రిక నిర్వహణ మొదలైనవి.


అభ్యాస ప్రశ్నలు


1. విద్యార్థి ఉపాధ్యాయుడి సూచనలను అనుసరించడమే తప్ప, టీచరుపై ఆధారపడని పద్ధతి?

1) ఉపన్యాస పద్ధతి   2) వ్యక్తి పద్ధతి   

3) సామూహిక పద్ధతి   4) సాముదాయక పద్ధతి


2. నియోజనంలో ఎన్ని రకాల ప్రణాళికలు రూపొందించుకోవాలి?    

1) 2      2) 4      3) 3      4) 5


3. ఉపాధ్యాయుడు చురుకుగా ఉండి, విద్యార్థి  స్తబ్దుడిగా ఉండే బోధనా పద్ధతి?

1) ఉపన్యాస పద్ధతి   2) ప్రశ్నోత్తర పద్ధతి   

3) చర్చా పద్ధతి       4) ప్రాజెక్టు పద్ధతి


4. నియోజన పద్ధతి ఏ స్థాయివారికి అంత ఉపయోగకరం కాదు?

1) ఉన్నత స్థాయి       2) కళాశాల స్థాయి   

3) ప్రాథమిక స్థాయి   4) ప్రాథమికోన్నత స్థాయి


5. నియోజన పద్ధతికి మరొక పేరు?

1) ప్రాజెక్టు పద్ధతి       2) నిర్ణయ పద్ధతి   

3) ప్రకల్పనా పద్ధతి   4) ఉద్యమ పద్ధతి


6. మాంటిస్సోరి విద్యా విధానంలో ఉపాధ్యాయుడి పాత్ర?

1) పరిశీలకుడు    2) స్నేహితుడు   

3) మార్గదర్శి   4) సలహాదారు


7. ప్రాథమిక, మాధ్యమిక తరగతుల విద్యార్థులకు  ఉపకరించే పద్ధతి?

1) ప్రశ్నోత్తర పద్ధతి  2) ఉపన్యాస పద్ధతి   

3) అభివర్ణన పద్ధతి   4) వివరణ పద్ధతి


8.విద్యార్థుల వైయక్తిక భేదాలు గుర్తించి, వారి  అభ్యసనను వేగవంతం చేయడానికి ఏ పద్ధతి  ఉపయోగపడుతుంది?

1) ప్రాజెక్టు పద్ధతి   2) మాంటిస్సోరి పద్ధతి  

3) వ్యక్తి పద్ధతి   4) క్రీడా పద్ధతి


9. విద్యకు, జీవన రంగానికి సమన్వయం కలిగించే ఒక పద్ధతిని కనుక్కునే ప్రయత్నమే?

1) డాల్టన్‌ పద్ధతి   2) ప్రాజెక్టు పద్ధతి   

3) నియోజనాల పద్ధతి 4) వ్యక్తి పద్ధతి


10. ప్రకల్పనా పద్ధతిని ప్రవేశపెట్టి, ప్రయోజనం  పొందినవారు?

1) కిల్‌ప్యాట్రిక్‌   2) గల్లిక్‌   

3) బల్లార్డ్‌   4) స్టీవెన్‌సన్‌


11. స్వాభావిక పరిస్థితుల్లో సమస్యా పరిష్కార పద్ధతి?

1) నిర్ణయాల పద్ధతి   2) వ్యక్తి పద్ధతి   

3) డాల్టన్‌ పద్ధతి       4) ప్రాజెక్టు పద్ధతి


12. ప్రకల్పనా పద్ధతిని ఒక జీవన విధానంగా, జీవితాంతర్భాగంగా గుర్తించినవారు?

1) స్టీవెన్‌సన్‌   2) బల్లార్డ్‌   

3) కిల్‌ప్యాట్రిక్‌   4)పెర్సీనన్‌


13. సహజ పరిసరాల్లో పూర్తి చేసే సమస్యాత్మక క్రియ ప్రకల్పన అని అభిప్రాయపడిన వారు?

1) స్టీవెన్‌సన్‌   2) బల్లార్డ్‌   

3) జాన్‌ డ్యూయీ     4) ఫ్రోబెల్‌


14. ‘ప్రాజెక్టు ఒక ఉద్దేశ పూర్వకమైన క్రియ, దీని ద్వారా సామాజిక వాతావరణ కల్పన సాధ్యమవుతుంది’ అని అభిప్రాయపడిన వారు?

1) బల్లార్డ్‌    2) పెర్సీనన్‌   

3) కిల్‌ప్యాట్రిక్‌   4) స్టీవెన్‌సన్‌


15. ఉద్యమ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు?

1) మిస్‌గల్‌   2) స్టీవెన్‌సన్‌   

3) మాంటిస్సోరి   4) ఫ్రోబెల్‌


16. ప్రాతిపదిక విద్యా విధానాన్ని ప్రతిపాదించినవారు?

1) నెహ్రూ   2) గాంధీజీ   

3) ఠాకుర్‌  4) జాకీర్‌ హుస్సేన్‌ 


కృత్యాధార పద్ధతి


ఈ పద్ధతికి కార్యకలాపాల పద్ధతి అని పేరు. దీన్ని ఈశ్వర్‌భాయ్‌ పటేల్‌ కమిటీ ప్రతిపాదించింది. పనిచేయడం ద్వారా అభ్యసనం అనే సూత్రాన్ని అనుసరించే పద్ధతి ఇది.


* విద్యార్థుల్లో స్వయం అభ్యసనా శక్తిని అలవడేలా చేస్తుంది.


* విద్యార్థుల వైయక్తిక నైపుణ్యాలు, లోపాలను గుర్తించగలుగుతుంది.


* ఎన్‌సీఎఫ్‌ 2005, మహాత్మాగాంధీ బేసిక్‌ విద్యా   విధానంలో ఇమిడి ఉన్న పద్ధతి.


* విద్యార్థుల్లో పరస్పర సహకారం పెంపొందించడానికి, స్వయం అభ్యసనా శక్తి పెంపునకు తోడ్పడుతుంది.


* కృత్యాధార పద్ధతిని ఏపీపీఈపీ సూత్రాలకు    అనుగుణంగా రూపొందించారు.


* ప్రాథమిక విద్యాక్షేత్రంలో గుణాత్మక సాధనకు తోడ్పడే విధానం.


ఏపీపీఈపీ సూత్రాలు


* ఉపాధ్యాయుడే స్వయంగా అభ్యసన కృత్యాలు రూపొందించడం.


* క్రియలు, అన్వేషణలు, ప్రయోగాల ద్వారా అభ్యసనాన్ని ప్రోత్సహించడం.


* వ్యక్తిగత జట్టు, పూర్తి తరగతి పనిని ప్రోత్సహించడం.


* వైయక్తిక భేదాలకు అనుగుణంగా అభ్యసన క్షేత్రాలను రూపొందించడం.


* కృత్య నిర్వహణ కోసం స్థానిక వనరులను వినియోగించడం.


* విద్యార్థి రూపొందించిన అభ్యసన కృత్యాలను తరగతి గదిలో ప్రదర్శించడం.


* ఈ పద్ధతిలో కృత్యకోశాలు చేయడం చాలా ముఖ్యమైనవి.


కృత్యాధార పద్ధతిలో భాగంగా అనుసరించే వ్యూహాలు


1) మైండ్‌ మ్యాపింగ్‌      

2) కేడబ్ల్యూఎల్‌ వ్యూహం

3) ఏకపాత్రాభినయం


* ఉపాధ్యాయుడు ఏదైనా ఒక కీలక పదాన్ని నల్లబల్ల మీద రాసి దాంతో సంబంధం ఉన్న పదాలను విద్యార్థుల నుంచి రాబట్టే వ్యూహమే.. భావనా చిత్రం (మైండ్‌ మ్యాపింగ్‌). 


* మైండ్‌ మ్యాపింగ్‌ ఉద్దేశం - స్వీయరచనను ప్రోత్సహించడం.


* నాకేం తెలుసు? నాకేం తెలియాలి?నేనేం తెలుసున్నాను? అనే వ్యూహాన్ని కేడబ్ల్యూఎల్‌ వ్యూహం అంటారు.


* మీకు అందుబాటులో ఉన్న వైద్యాలయాన్ని  సందర్శించి దాని పనితీరుపై ఒక నివేదిక   రూపొందించడమే ‘వ్యక్తీకరణ కృత్యం’.


కృత్యాధార పద్ధతి సోపాన క్రమం


విషయ విశ్లేషణ - సాధించాల్సిన సామర్థ్యాలు - కృత్యాలు - టీఎల్‌ఎం - ఉపాధ్యాయుడి అభిప్రాయాలు.


సమాధానాలు


1-2; 2-3; 3-1; 4-3; 5-2; 6-1; 7-2; 8-3; 9-2; 10-1; 11-4; 12-2; 13-1; 14-3; 15-1; 16-2. 
 

 

 

 

రచయిత: సూరె శ్రీనివాసులు 


 

Posted Date : 08-07-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

బిట్ బ్యాంక్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు