• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఉత్పత్తి, ఉపాధి

నాలుగు మార్కుల ప్రశ్నలు

1. సేవారంగం ఇతర రంగాల కంటే ఎలా భిన్నమైంది? కొన్ని ఉదాహరణలతో వివరించండి. (వి.అ.)

జ: ఉంది.తృతీయ రంగాన్నే సేవారంగం అని కూడా అంటారు. వస్తువులను నేరుగా తయారు చేయకుండా వస్తువుల ఉత్పత్తికి ప్రజలకు అవసరమైన సేవలను తృతీయ రంగం అందిస్తుంది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల కంటే సేవా రంగం భిన్నమైంది. ఎందుకంటే.....

* గత 50 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో సేవారంగానికి ప్రాధాన్యం మారుతూ వస్తుంది.

* మిగతా రెండు రంగాల కంటే ఈ రంగం అతి పెద్ద రంగంగా అభివృద్ధి చెందుతోంది.

* మొత్తం ఉత్పత్తిలో సేవారంగం ప్రముఖ స్థానంలో

* ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ, పరిశ్రమల రంగాలు పుష్ఠినిస్తే, సేవారంగం దానిని ఆధునికీకరణ చేస్తుంది. ఈ రంగం ఇతర రంగాల అభివృద్ధికి పరిపూరక రంగంగా పని చేస్తుంది.

ఉదా: ఉత్పత్తి పెరుగుదలకు అవసరమైన అవస్థాపనా సౌకర్యాలను ఇది అందిస్తుంది.

* పరిశ్రమల రంగం అభివృద్ధి చెందాలంటే యంత్ర పరికరాలు, విద్యుత్తు, (శక్తి వనరులు) బీమా సౌకర్యాలు, రవాణా మార్కెట్ సౌకర్యాలు, బ్యాంకులు మొదలైన సేవలు అవసరం.

వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే సాగునీరు, విద్యుత్తు, రవాణా సౌకర్యాలు, రసాయనిక ఎరువులు మొదలైన సేవలు అవసరం.

* పనిచేసేవారిలో కూడా ఇప్పుడు ఎక్కువమంది సేవల రంగంలో ఉపాధి పొందుతున్నారు.

ఉదా: వ్యాపారం, హోటళ్లు, రవాణా ప్రసారాలు, రైల్వేలు, విమానాలు, తంతి తపాలా, బ్యాంకులు, ప్రసార మాధ్యమాలు.

2. కింది పట్టికను పరిశీలించి ప్రశ్నలకు జవాబులు రాయడి. (స.నై.)

భారతదేశంలో పరిశ్రమల వారీగా కార్మికుల వివరాలు, 2009 - 2010(%)

ప్ర: వ్యవసాయ రంగంలోని అత్యధిక మంది కార్మికులు ఎక్కడ నివసిస్తున్నారు?

జ: వ్యవసాయ రంగంలోని అత్యధిక మంది కార్మికులు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.

ప్ర: 90% కంటే అధికంగా పట్టణ ప్రాంత పనివారు ఏ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు?

జ: 90% కంటే అధికంగా పట్టణ ప్రాంత పనివారు పారిశ్రామిక, సేవా రంగాల్లో ఉపాధి పొందుతున్నారు.

ప్ర: స్త్రీ, పురుషుల నిష్పత్తి పోలిస్తే స్త్రీలు ఏ రంగాల్లో కొద్దిశాతం మాత్రమే ఉపాధి పొందుతున్నారు?

జ: స్త్రీ, పురుషుల నిష్పత్తి పోలిస్తే స్త్రీలు పారిశ్రామిక, సేవా రంగాల్లో కొద్దిశాతం మందే ఉపాధి పొందుతున్నారు.

ప్ర: వ్యవసాయ రంగంలో స్త్రీలు ఎంతమంది పని చేస్తున్నారు?

జ: వ్యవసాయ రంగంలో 69% మంది స్త్రీలు పని చేస్తున్నారు.

3. అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు కింది అంశాల్లో రక్షణ కావాలి. కూలీ, భద్రత, వైద్యం ఉదాహరణలతో వివరించండి.

జ: అవ్యవస్థీకృత రంగంలో ఉద్యోగులకు జీతాలు తక్కువ. ఈ రంగంలో చిన్న సంస్థలు అక్కడక్కడ ఉంటాయి. ఇవి సాధారణంగా ప్రభుత్వ నియంత్రణలో ఉండవు. నియమ నిబంధనలు ఉంటాయి. కానీ వీటిని అనుసరించరు. కాబట్టి అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు కూలీ, భద్రత, వైద్యంలో రక్షణ కల్పించాలి.

కూలీ:

* అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు పని ఎక్కువ. జీతం తక్కువ.

* ఆర్జిత సెలవులు, సెలవులు, అనారోగ్యమప్పుడు సెలవులు లాంటివి ఉండవు.

* వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కూలీల్లో అధికశాతం మంది చాలా తక్కువ వేతనానికి పనిచేస్తున్నారు.

* ఈ కార్మికుల జీవన ప్రమాణం మెరుగుపడాలన్నా, వీరి కొనుగోలు శక్తి పెరగాలన్నా, ఆర్థిక సామాజిక అభివృద్ధి పొందాలన్నా వీరికి రక్షణ అవసరం.

భద్రత:

* అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదు. అలాగే జీవితానికి భద్రత ఉండదు.

* ఏ కారణం లేకుండా ఉద్యోగస్థులను మానేయమనవచ్చు.

* మరింతపని అవసరంతోపాటు, ఇందులోని కార్మికులకు రక్షణ, మద్దతు చాలా అవసరం.

వైద్యం:

* ఈ రంగంలోని కార్మికులకు వైద్య ప్రయోజనాలు అందవు. అనారోగ్యం పాలైతే వారి కుటుంబ జీవనం దుర్భరంగా ఉంటుంది. కాబట్టి వారికి కచ్చితంగా జీవిత బీమా, ఆరోగ్యబీమా లాంటి సౌకర్యాలు కల్పించాలి.

రెండు మార్కుల ప్రశ్నలు

1. ప్రజలు తమ జీవనోపాధి కోసం చేసే పనులను ఎలా విభజిస్తారు? (వి.అ.)

జ: ప్రజలు తమ జీవనోపాధి కోసం రకరకాల పనులను చేపడతారు. ఈ పనులను ప్రధానంగా మూడు రంగాలుగా విభజిస్తారు. అవి:

* ఉత్పత్తి ప్రక్రియలో ప్రకృతి ప్రధాన పాత్ర వహించే వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, అటవీ, గనులకు సంబంధించిన పనులు.

* యంత్రాలు, పరికరాలు ఉపయోగించి వస్తువులు ఉత్పత్తి చేయడం, ఇతర పరిశ్రమలు.

* వస్తువులను నేరుగా తయారుచేయకుండా వస్తువుల ఉత్పత్తికి, ప్రజలకు అవసరమైన సేవలు అందించే కార్యకలాపాలు.

2. అంత్య వస్తువులకు, మాధ్యమిక వస్తువులకు తేడా ఏమిటి? (వి.అ.)

జ: అంత్య వస్తువులు: వినియోగానికి సిద్ధంగా ఉన్న వస్తువులను అంత్య వస్తువులు అంటారు. ఈ వస్తువులను వెంటనే వినియోగించుకోవచ్చు.

ఉదా: పెన్ను, పుస్తకం, ఇడ్లీ.

మాధ్యమిక వస్తువులు: వినియోగ వస్తువుల తయారీలో ఉపయోగించే వస్తువులను మాధ్యమిక వస్తువులు అంటారు. ఈ వస్తువులు నేరుగా ఉపయోగపడవు.

ఉదా: గోధుమ పిండి, పెట్రోలు.

3. నిత్యం మీరు అనేకమందిని చూస్తూ ఉంటారు. వారు ధనికులా, పేదవారా అని మీరు ఎలా అంచనా వేస్తారు? (స.అం.ప్ర.ప్ర.)

జ: కింది అంశాలను బట్టి ధనికులా, పేదలా అని అంచనా వేయవచ్చు.

* కుటుంబ సభ్యులు వేసుకునే దుస్తులు

* ప్రయాణాలకు వాడే వాహనాలు

* తినే ఆహారం

* ఉండే ఇల్లు

* వారు ఉపయోగించే వస్తువులు

* వైద్యం కోసం వారు వెళ్లే ఆస్పత్రులు

* వారికి ఉన్న ఆస్తిపాస్తులు

ఒక మార్కు ప్రశ్నలు

1. స్థూల జాతీయోత్పత్తి అంటే ఏమిటి?

జ: ఒక సంవత్సర కాలంలో ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి చేసిన అన్ని అంతిమ వస్తు సేవల విలువనే 'స్థూల జాతీయోత్పత్తి' అంటారు.

2. ఆర్థిక సంవత్సరమని దేన్ని అంటారు?

జ: ఏప్రిల్ నుంచి మార్చి వరకు గల సంవత్సరాన్ని ఆర్థిక సంవత్సరమంటారు.

3. 'వ్యవస్థీకృత రంగం' అంటే ఏమిటి?

జ: కొన్ని క్రమబద్ధ విధానాలు, ప్రక్రియలు ఉండి; ఒక నిర్వచనీయమైన పద్ధతిలో ఉత్పత్తి, ఉపాధి కల్పనలు ఉన్న రంగాన్నే వ్యవస్థీకృత రంగం అంటారు.

ఉదా: భారీ పరిశ్రమలు.

4. అవ్యవస్థీకృత రంగం అంటే ఏమిటి?

జ: ఉద్యోగాల్లో, జీతాల్లో ఒక నియమిత పద్ధతి లేని కార్మికులు, కర్షకులు ఉండే చిన్న సంస్థలున్న రంగాన్నే 'అవ్యవస్థీకృత రంగం' అంటారు. ఉదా: అగరబత్తీ పరిశ్రమ

5. ప్రచ్ఛన్న నిరుద్యోగం అని దేన్ని అంటారు?

జ: అందరూ పనిచేస్తున్నట్లుగా ఉంటుంది. కానీ ఎవ్వరికీ తమ పూర్తి సామర్థ్యానికి తగినట్లుగా పని ఉండదు. ఈ రకమైన అల్ప ఉపాధి ఎవరికీ కనిపించదు. అందుకే దీన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు.

6. అంత్యవస్తువులకు, మాధ్యమిక వస్తువులకు తేడా ఏమిటి?

జ:  వినియోగానికి సిద్ధంగా ఉన్న వస్తువులు అంత్య వస్తువులు అంటారు.

ఉదా: బిస్కెట్.

వినియోగ వస్తువుల తయారీలో ఉపయోగించే వస్తువులను 'మాధ్యమిక వస్తువులు' అంటారు.

ఉదా: గోధుమ పిండి

7. భారతదేశంలో ఇప్పటికీ ఏ రంగం ప్రధాన ఉపాధి రంగంగా ఉంది?

జ: భారతదేశంలో ఇప్పటికీ వ్యవసాయ రంగమే ప్రధాన ఉపాధి రంగంగా ఉంది.

8. ఏ రంగంలోని కార్మికులకు రక్షణ, మద్దతు అవసరం?

జ: అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు రక్షణ, మద్దతు అవసరం.

మరికొన్ని రాదగిన ప్రశ్నలు

1. ఆర్థిక కార్యకలాపాలను ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలుగా విభజించడం ఉపయోగకరమేనా? వ్యాఖ్యానించండి. (ఇ.పా.చ.వ్యా. 4 మా.)

2. అల్ప ఉపాధి అంటే ఏం అర్థం చేసుకున్నారు? కొన్ని ఉదాహరణలతో వివరించండి. (వి.అ. 2 మా.)

3. వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల మధ్య భేదాలు రాయండి. (వి.అ. 4 మా.)

4. భారతదేశంలో ఉపాధి అవకాశాలు పెరగాలంటే ఏం చేయాలి? కొన్ని సూచనలు ఇవ్వండి. (స.అ.ప్ర.ప్ర. 4 మా.

Posted Date : 04-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం