• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఉత్పత్తి, ఉపాధి

అవ్యవస్థీకృత రంగంలో రక్షణ అవసరం

ప్రధానంగా పనులను మూడు రంగాలుగా విభజిస్తారు. అవి:
1. ప్రథమ రంగం
2. ద్వితీయ రంగం
3. తృతీయ రంగం
ప్రథమ రంగం: ఉత్పత్తి ప్రక్రియలో ప్రకృతి ప్రధానపాత్ర వహించే వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, అటవీ, గనులకు సంబంధించిన పనులు ఈ రంగం కిందికి వస్తాయి.
ద్వితీయ రంగం: యంత్రాలు, పరికరాలు ఉపయోగించి వస్తువులు ఉత్పత్తి చేయడం, ఇతర పరిశ్రమలు ఈ రంగంలోనివి.
తృతీయ రంగం (సేవా రంగం): వస్తువులను నేరుగా తయారు చేయకుండా వస్తువుల ఉత్పత్తికి, ప్రజలకు అవసరమైన సేవలు అందించే కార్యకలాపాలు ఈ రంగం కిందికి వస్తాయి.


మరికొన్ని ఉదాహరణలతో ఈ రంగాల తేడాలు తెలుసుకుందాం:
పూలసాగు చేసేవారు, చేపలు పట్టేవారు, తోటమాలి, తేనేటీగలు పెంచేవారు, పాలు అమ్మేవారు మొదటిరంగానికి చెందినవారు. బుట్టలు అల్లేవారు, అగ్గిపెట్టెల కర్మాగారాల్లో పనిచేసేవారు, కుండలు చేసేవారు రెండో రంగానికి చెందినవారు. బట్టలు కుట్టేవారు, మత బోధకులు/పూజారులు, ఉత్తరాల బట్వాడా చేసే కొరియర్, వడ్డీ వ్యాపారి, వ్యోమగామి, కాల్‌సెంటర్ ఉద్యోగులు సేవారంగంలో ఉండి సేవలను అందిస్తారు.

సేవల్లో మూడు రకాలున్నాయి. అవి:
1. ప్రజా, సామాజిక, వ్యక్తిగత సేవలు
2. ఆర్థిక, బీమా, స్థిరాస్తి సేవలు
3. వ్యాపారం, హోటళ్లు, రవాణా, ప్రసారాలు.
స్థూల జాతీయోత్పత్తి అంటే...: ఒక సంవత్సర కాలంలో ఒక ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి చేసిన అంత్యవస్తు సేవల విలువనే స్థూల జాతీయోత్పత్తి అంటారు. అంత్య వస్తువులు అంటే వినియోగానికి సిద్ధంగా ఉన్న వస్తువులు.
ఉదా: ఇడ్లీ, దోశ, నోటు పుస్తకాలు. దేశ ఆదాయాన్ని లెక్కకట్టటానికి దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తువులు, సేవల విలువను తీసుకుంటాం. ఈ విలువకు ఉపయోగించే సాంకేతిక పదమే స్థూల జాతీయోత్పత్తి.
అంచనా ఇలా: ఒక సంవత్సరంలో ఒక రంగంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తువుల/సేవల విలువ ఆ సంవత్సరానికి, ఆ రంగంలోని మొత్తం ఉత్పత్తిని సూచిస్తుంది. మూడు రంగాల ఉత్పత్తిని కలిపితే దేశ స్థూల జాతీయోత్పత్తి వస్తుంది. ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన అన్ని అంతిమ వస్తువులు, సేవల విలువను ఇది తెలియజేస్తుంది.

రంగాల ప్రాముఖ్యంలో మార్పూ ఉంది:
ప్రస్తుతం అభివృద్ధి చెందినవిగా పరిగణిస్తున్న దేశాల అభివృద్ధి తొలి దశల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, వాటి స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలకు అధికంగా దోహదం చేశాయి. సాగు పద్ధతులు మారుతూ వ్యవసాయం వృద్ధి చెందడంతో ఇంతకు ముందు కంటే ఎక్కువ ఆహారం ఉత్పత్తి అవుతుంది. అవసరమైన ఆహారాన్ని కొంతమంది రైతులు ఉత్పత్తి చేయడంతో చాలామంది ఇతర పనులు చేపట్టారు. వృత్తి పనుల వాళ్లు, వ్యాపారులు పెరిగారు. కొనుగోలు, అమ్మకాలు ఎన్నో రెట్లు పెరగడంతో వస్తువులు, సేవలకు డిమాండ్ మరింత పెరిగింది. అయితే ఈ దశలో మొత్తంమీద ఉత్పత్తి అయిన వస్తువుల్లో ఎక్కువగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందినవే. చాలామందికి ఈ రంగాల్లోనే ఉపాధి లభించేది. కాలానుగుణంగా కొత్త ఉత్పత్తి విధానాలు రావడంతో కర్మాగారాలు ఏర్పడి, విస్తరించాయి. ఇంతకుముందు వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసినవాళ్లు ఇప్పుడు పెద్ద సంఖ్యలో కర్మాగారాల్లో పనిచేస్తున్నారు. కర్మాగారాల్లో చవక ధరలకు పెద్దఎత్తున వస్తువులు ఉత్పత్తి కావడంతో ఇవి ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లకు చేరాయి. ఈ దేశాల్లో మొత్తం ఉత్పత్తిచేసే వస్తువులు, సేవల దృష్ట్యా, కల్పించిన ఉపాధి దృష్ట్యా పారిశ్రామిక ఉత్పత్తి ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఈవిధంగా రంగాల ప్రాముఖ్యం మారింది. పారిశ్రామిక రంగం ప్రధాన రంగం అయ్యింది. ఉత్పత్తి, ఉపాధి దృష్ట్యా వ్యవసాయ రంగం క్షీణించింది.
గత 50 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో పారిశ్రామిక రంగం నుంచి సేవల రంగానికి ప్రాధాన్యం మారుతోంది. మొత్తం ఉత్పత్తిలో సేవారంగం ప్రముఖ స్థానంలో ఉంది. పనిచేసేవాళ్లు ఎక్కువమంది సేవల రంగంలో ఉపాధి పొందుతున్నారు. అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఇదే తీరు కనిపిస్తోంది.


మన దేశంలో పని పరిస్థితులు ఎలా ఉన్నాయంటే...
భారతదేశంలో ఇప్పటికీ వ్యవసాయమే ప్రధాన ఉపాధి రంగంగా ఉంది. పారిశ్రామిక, సేవా రంగాల్లో తగినంత ఉపాధి కల్పించకపోవడంవల్ల, వ్యవసాయంలో ఉపాధి వాటా తగ్గలేదు. ఈ కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి 9 రెట్లు పెరిగింది. కానీ పారిశ్రామిక ఉపాధి 3 రెట్లు మాత్రమే పెరిగింది. సేవల రంగంలోనూ ఇదే పరిస్థితి. సేవా రంగంలో ఉత్పత్తి 14 రెట్లు పెరిగింది కానీ ఉపాధి మాత్రం 5 రెట్లు పెరిగింది.
దీన్నిబట్టి చూస్తే వ్యవసాయంలో అవసరాని కంటే ఎక్కువమంది ఉన్నారని అర్థమవుతోంది. వ్యవసాయం నుంచి కొంతమంది తరలిపోయినా ఉత్పత్తి ప్రభావితం కాదు. వ్యవసాయ రంగంలోని కార్మికులు అల్ప ఉపాధిని కలిగి ఉన్నారు. ఈ రకమైన అల్ప ఉపాధి ఎవరికీ కనిపించదు. అందుకే దీన్ని 'ప్రచ్ఛన్న నిరుద్యోగం' అని కూడా అంటారు.
సేవా రంగం అభివృద్ధి చెందినా ఈ రంగంలో అన్ని కార్యకలాపాలు సమానంగా పెరగడంలేదు. ఒకవైపు బాగా చదువుకున్న, నైపుణ్యాలున్న వ్యక్తులకు ఉపాధినిచ్చే కొద్దిపాటి సేవలున్నాయి. మరోవైపు చిన్న దుకాణాలు నడిపేవారు, రవాణా సేవలు అందించేవాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అంటే సేవా రంగంలో ఒక భాగానికి మాత్రమే ప్రాధాన్యం పెరుగుతోంది.


భారతదేశంలో వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల్లో ఉపాధి!
భారతదేశంలో 92% కార్మికులు అవ్యవస్థీకృత రంగంలో పని చేస్తుండగా, కేవలం 8% మంది మాత్రమే వ్యవస్థీకృత రంగంలో పని చేస్తున్నారు. వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాల మధ్య తేడాలు గుర్తించడం ద్వారా దేశంలో అత్యధిక శాతం కార్మికుల పని పరిస్థితులు, వేతనాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగాలను అందరూ కోరుకుంటారు. కానీ ఈ రంగంలోని ఉపాధి అవకాశాలు చాలా నిదానంగా పెరుగుతాయి. అందుకే అధికశాతం కార్మికులకు చాలా తక్కువ వేతనానికి అవ్యవస్థీకృత ఉద్యోగాలు తప్పించి మరోదారిలేదు.
వ్యవస్థీకృత రంగం: ఉపాధి షరతులు ఉండి నమ్మకంగా పని ఉండే ప్రదేశాలు లేదా వ్యాపారాలను వ్యవస్థీకృత రంగంగా వ్యవహరిస్తారు. కర్మాగారాల చట్టం, కనీస వేతన చట్టం, దుకాణాలు, సంస్థల చట్టం లాంటి వాటిల్లో ఉన్న ప్రభుత్వ నియమ నిబంధనలను ఇవి అనుసరిస్తాయి.

వ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుంది. ఈ రంగంలోని కార్మికులు రోజులో నిర్ధారిత గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ పని చేస్తే యజమాని అదనపు వేతనం చెల్లించాలి. అంతేకాక జీతంతో కూడిన సెలవు, సెలవుల్లో వేతనం, భవిష్యనిధి లాంటి అనేక ఇతర ప్రయోజనాలు వారికి ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, పెద్ద సంస్థల్లో పని చేసేవారిని వ్యవస్థీకృత రంగంలోని వారుగా గుర్తించాలి.
అవ్యవస్థీకృత రంగం: అవ్యవస్థీకృత రంగంలో చిన్న సంస్థలు అక్కడక్కడా ఉంటాయి. ఇవి సాధారణంగా ప్రభుత్వ నియంత్రణలో ఉండవు. నిబంధనలు ఉంటాయి కానీ వీటిని అనుసరించరు. ఇందులో పనిచేసే ఉద్యోగులకు జీతం తక్కువ, భద్రత కూడా ఉండదు. ఏ కారణం లేకుండా ఉద్యోగస్థులను మానేయమనవచ్చు. పని తక్కువగా ఉండే కొన్ని కాలాల్లో కొంతమందిని పని మానిపించవచ్చు. ఎక్కువ పనికి ఎక్కువ వేతనం ఉండదు. ఆర్జిత సెలవు, సెలవులు, అనారోగ్యం వచ్చినప్పుడు సెలవులు లాంటివికూడా ఉండవు. గ్రామీణ ప్రాంతాల్లోని భూమిలేని వ్యవసాయ కూలీలు, సన్న, చిన్నకారు రైతులు, కౌలుదారులు, చేతివృత్తులవారు; పట్టణ ప్రాంతాల్లోని చిన్నతరహా పరిశ్రమలు, భవన నిర్మాణ, వ్యాపారం, రవాణా లాంటి వాటిలో రోజువారీ కూలీలు అవ్యవస్థీకృత రంగానికి చెందినవారు.


ఉపాధి అవకాశాలను ఇలా మెరుగు పరుద్దాం...
భూమిని సాగు చేయడానికి సన్న, చిన్నకారు రైతులకు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు, పంపుసెట్లు లాంటివి కావాలి. పేద రైతులు అధిక వడ్డీలకు అప్పు తెచ్చి ఆ వస్తువులను కొంటారు. అలా కాకుండా బ్యాంకులే తక్కువ వడ్డీకి సకాలంలో అప్పు ఇస్తే, వాటన్నింటినీ సకాలంలో కొనుక్కుని భూమి సాగుచేయగలుగుతారు. వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే సాగునీటితోపాటు రైతులకు తక్కువ వడ్డీకి వ్యవసాయ రుణాలు కచ్చితంగా ఇవ్వాలి. కొంచెం పెద్ద గ్రామాల్లో చాలామందికి ఉపాధి కల్పించేలా పరిశ్రమలు, సేవలను గుర్తించి, ప్రోత్సహించి, వాటిని అక్కడ స్థాపించేలా చూడాలి. చాలామంది రైతులు తృణధాన్యాలు, చిరుధాన్యాలు పండించాలని అనుకుంటారు. ఉదాహరణకు రైతులకు ఉపయోగపడేలా పిండిమరలను ఏర్పాటు చేయాలి. కోల్డ్ స్టోరేజ్ సదుపాయం కల్పిస్తే మిరప, ఉల్లి లాంటి ఉత్పత్తులను రైతులు నిల్వచేసుకుని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోగలుగుతారు. పండించిన పంటకు సరైన ధరలేనప్పుడు వీటిని దాచుకోవడానికి రైతులకు కోల్డ్ స్టోరేజ్‌లు బాగా ఉపయోగపడతాయి. అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో తేనె సేకరణ కేంద్రాలు ప్రారంభిస్తే, అడవుల్లో సేకరించిన తేనెను గిరిజనులు ఆ కేంద్రాల్లో అమ్మి ఎక్కువ సొమ్మును పొందుతారు. అది వారికి ఒక ఉపాధిగా కూడా మారుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు, కూరగాయల ప్రాసెసింగ్ పరిశ్రమలను స్థాపించడం ద్వారా పెద్ద పట్టణాలతోపాటు ఓ మాదిరి ఊళ్లల్లో కూడా ఉండే ప్రజలకు ఉపాధి లభిస్తుంది.


ప్రధానాంశాలు:
 ప్రజలు తమ జీవనోపాధికోసం రకరకాల పనులను చేపడతారు. వీటిని ప్రధానంగా మూడు రంగాలుగా విభజిస్తారు.
 ఉత్పత్తి ప్రక్రియలో ప్రకృతి ప్రధాన పాత్ర వహించే వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, అటవీ, గనులకు సంబంధించిన పనులు మొదటి రంగానికి సంబంధించినవి.
 యంత్రాలు, పరికరాలు ఉపయోగించి వస్తువులు ఉత్పత్తి చేయడం, ఇతర పరిశ్రమలు రెండో రంగానివి.

* మూడో రంగంలో వస్తువులను నేరుగా తయారు చేయకుండా వస్తువుల ఉత్పత్తికి, ప్రజలకు అవసరమైన సేవలు అందించే కార్యకలాపాలు ఉంటాయి.
* మొదటి రంగానికి ఉదా: పూలసాగు చేసేవారు, చేపలు పట్టేవారు, తోటమాలి, తేనెటీగలు పెంచేవారు, పాలు అమ్మేవారు.
* బుట్టలు అల్లేవారు, అగ్గిపెట్టెల కర్మాగారాల్లో పని చేసేవారు, కుండలు చేసేవారు, పెద్ద పరిశ్రమలు రెండో రంగానికి ఉదాహరణలు
*  మూడో రంగానికి ఉదాహరణలుగా బట్టలు కుట్టేవారు, మతబోధకులు/ పూజారులు, ఉత్తరాలు బట్వాడా చేసే కొరియర్, వడ్డీ వ్యాపారి, వ్యోమగామి, కాల్ సెంటర్ ఉద్యోగులను చెప్పవచ్చు.
*  భారతదేశంలో 1972 - 73లో వ్యవసాయంలో 74%, పరిశ్రమల్లో 11%, సేవల రంగంలో 15% మంది ఉపాధి పొందారు.
* 2009 - 10 లో వ్యవసాయ రంగంలో 53%, పరిశ్రమల రంగంలో 22%, సేవల రంగంలో 25% మంది ఉన్నారు.
*  కుటుంబ సభ్యులు వేసుకునే దుస్తులు, ప్రయాణాలకు వాడే వాహనాలు, తినే ఆహారం, ఉండే ఇల్లు, వాళ్లకున్న వస్తువులు, వైద్యం కోసం వాళ్లు వెళ్లే ఆస్పత్రులు లాంటి వాటిని బట్టి మనం వారిని 'ధనికులా', 'పేదవారా' అని అంచనా వేయవచ్చు.  ఈ కుటుంబాల 'ఆదాయం' అన్నిటికంటే ముఖ్యమైన సూచిక అవుతుంది.
*  దేశ ఆదాయాన్ని లెక్కగట్టడానికి దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తువులు, సేవల విలువను తీసుకుంటాం.
 ఈ విలువకు ఉపయోగించే సాంకేతిక పదం స్థూల జాతీయోత్పత్తి (GDP).
 * ప్రథమ, ద్వితీయ, తృతీయ రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు చేపట్టే ప్రజలు చాలా పెద్ద మొత్తంలో వస్తువులు, సేవలను ఉత్పత్తి చేస్తారు.
 * కొన్ని వేలాది వస్తువులు, సేవలను అంచనావేయడం అసాధ్యమైన పని అని మనకు అనిపించవచ్చు.
 ఈ పని చాలా పెద్దదే కాకుండా, కార్లు, కంప్యూటర్లు, మొబైల్ ఫోను సేవలు, బుట్టలు, కుండలను జోడించటం ఎలా వీలవుతుందని మనకు ఆశ్చర్యం కలగవచ్చు.
*  ఈ సమస్యను అధిగమించడానికి ఆర్థికవేత్తలు ఉత్పత్తి అయిన వాటి సంఖ్యను కాకుండా, ఆయా వస్తువులు, సేవల విలువను జోడించాలని సూచిస్తారు.
 వడ్లు, ఊక, బియ్యం లాంటివి మాధ్యమిక వస్తువులు.
*  మాధ్యమిక వస్తువులను అంతిమ వినియోగదారు వాడటం లేదు కానీ, అంత్య వస్తువులైన ఇడ్లీ, దోశలు తయారు చేయడానికి వీటిని ఉత్పాదకాలుగా వాడుకున్నారు.
*  ఇతర వస్తువుల తయారీకి ఉపయోగించనట్లయితే అది అంతిమ వస్తువు అవుతుంది

ఒక సంవత్సరంలో ఒక రంగంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తువుల/ సేవల విలువ ఆ సంవత్సరానికి ఆ రంగంలోని మొత్తం ఉత్పత్తిని సూచిస్తుంది.
 * మూడు రంగాల ఉత్పత్తిని కలిపితే దేశ స్థూల జాతీయోత్పత్తి వస్తుంది. ఒక దేశంలో, ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన అన్ని అంతిమ వస్తువులు, సేవల విలువను ఇది తెలియజేస్తుంది.
 * ఒక సంవత్సర కాలంలో (ఏప్రిల్ నుంచి మార్చి వరకు) ఉత్పత్తి చేసిన వివరాలను 'ఆర్థిక సంవత్సరం' అంటారు.
 ఉత్పత్తి అయిన అంత్య వస్తువుల సేవల మార్కెట్ విలువను 'స్థూల జాతీయోత్పత్తి' నమోదు చేస్తుంది.
 * కానీ మార్కెట్‌లో కొనుగోలు/ అమ్మకాలు చేయని అంశాలు ఎన్నో ఉన్నాయి.
* వంట చేయడం, ఇల్లు తుడవడం లాంటి గృహ సంబంధ పనులను దీనికి ఉదాహరణగా చూడవచ్చు. ఇవి ఆర్థిక వ్యవస్థలో చాలా ముఖ్యమైనవి.
 * భారతదేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా మహిళలు చేసే ఈ పనులకు నేటికీ ద్రవ్యపరమైన చెల్లింపులు చేయడంలేదు.
 *ప్రతి సంవత్సరం వస్తువుల, సేవల ఉత్పత్తి పెరుగుతుండటంతో స్థూల జాతీయోత్పత్తి పెరుగుతుంది.
 అభివృద్ధి చెందిన దేశాలకు తొలిదశల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలకు అధికంగా దోహదం చేశాయి.
 సాగు పద్ధతులు మారుతూ వ్యవసాయం వృద్ధి చెందడంతో మునుపటి కంటే ఎక్కువ ఆహారం ఉత్పత్తి అవుతుంది.

Posted Date : 19-03-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

సాంఘిక శాస్త్రం

ఇతర సబ్జెక్టులు