ప్రశ్నలు - జవాబులు
నాలుగు మార్కుల ప్రశ్నలు
1. భారతదేశ శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే అంశాలను వివరించండి. (విషయావగాహన)
జ: భారతదేశ శీతోష్ణస్థితిని అక్షాంశాలు, భూమికి, నీటికి ఉన్న సంబంధం, భౌగోళిక స్వరూపం, వాతావరణంలోని ఉపరితల గాలి ప్రసరణ అంశాలు ప్రభావితం చేస్తాయి.
అక్షాంశాలు: భూమధ్య రేఖకు దూరంగా ఉన్న అక్షాంశాల కంటే దగ్గరగా ఉన్న అక్షాంశాల వద్ద వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. భారతదేశం సుమారుగా 8° - 37° ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది. భారతదేశాన్ని కర్కటక రేఖ ఇంచుమించు రెండు సమ భాగాలుగా చేస్తుంది. కర్కటక రేఖ దక్షిణ ప్రాంతం ఉష్ణ మండలంలోనూ, ఉత్తర ప్రాంతం సమశీతోష్ణ మండలంలోనూ ఉంది. ఇలా అక్షాంశాలు భారతదేశ శీతోష్ణస్థితిని ప్రభావితం చేస్తున్నాయి.
భూమికి నీటికి ఉన్న సంబంధం: భూమితో పోలిస్తే సముద్రం చాలా నిదానంగా వేడెక్కుతుంది. నిదానంగా చల్లారుతుంది. దక్షిణ భారతదేశం మూడువైపులా నీటితో ఆవరించి ఉంటుంది. అందువల్ల ఈ అంశం మన శీతోష్ణస్థితిని ప్రభావితం చేస్తుంది.
భౌగోళిక స్వరూపం: ఒక ప్రదేశం శీతోష్ణస్థితిని ఆ ప్రదేశం ఎత్తు కూడా ప్రభావితం చేస్తుంది. సముద్ర మట్టం నుంచి ఎత్తుకి వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. భారతదేశంలో వివిధ రకాల భౌగోళిక స్వరూపాల కారణంగా శీతోష్ణస్థితిలో మార్పులు కనిపిస్తున్నాయి. హిమాలయాల్లో మంచు వేసవి విడుదులు ఏర్పడటానికి, దక్కన్ పీఠభూమిలో వర్షచ్ఛాయ ప్రదేశాలు ఏర్పడటానికి భౌగోళిక స్వరూపాలే కారణం.
వాతావరణంలో ఉపరితల గాలి ప్రసరణ: భారతదేశ శీతోష్ణస్థితిని ఉపరితల వాయు ప్రవాహాలు (జెట్ ప్రవాహాలు) కూడా ప్రభావితం చేస్తాయి. 25° ఉత్తర అక్షాంశం వద్ద తూర్పు జెట్ ప్రవాహం ఏర్పడుతుంది. ఈ జెట్ ప్రవాహాల వల్ల చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత చల్లారుతుంది. ఈ చల్లారే ప్రక్రియ కారణంగా అక్కడ ఉన్న మేఘాలు వర్షిస్తాయి.
2. కింద పేరాను చదివి, దానిపై వ్యాఖ్యానించండి. (పాఠ్యాంశాన్ని చదివి వ్యాఖ్యానించడం)
* ఇంతకు ముందు భూమి వేడెక్కడానికి లేదా చల్లారడానికి చాలా సమయం పట్టేది. దీని వల్ల భూమి మీద ప్రాణులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారడానికి సమయం దొరికింది. ఇప్పుడు భూమి గతంతో పోలిస్తే తొందరగా వేడెక్కుతోంది. ఇది వినాశకర మార్పులకు దారితీయవచ్చు. పారిశ్రామిక విప్లవం తర్వాత భూమి వేడెక్కడానికి కారణం మానవ చర్యలే.
జ: భూమి వేడెక్కడానికి, చల్లారడానికి ఎక్కువ సమయం పడితే, అక్కడ నివసించే ప్రజలు కూడా దానికి అనుగుణంగా మారడానికి అలవాటు పడతారు. ఇది జరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ప్రాణులకు ఇబ్బంది ఉండదు. అలాకాకుండా ఏడాదికేడాది వేడి పెరగడం వల్ల భూమిమీద నివసిస్తున్న ప్రాణులన్నీ ఇబ్బందులకు గురవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మానవ మనుగడకే ముప్పు ఏర్పడుతుంది.
పారిశ్రామిక విప్లవం తర్వాత భూమి వేడెక్కడానికి కారణం మానవ చర్యలే. పరిశ్రమలు నెలకొల్పిన తర్వాత, వాటి నుంచి వచ్చే వ్యర్థాలను సరైన రీతిలో తొలగించడంలేదు. శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా వాడుతున్నారు. అడవులను నరికేస్తున్నారు. తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్న చందాన మానవుడు ప్రవర్తిస్తున్నాడు. పారిశ్రామికీకరణ వల్ల విడుదలయ్యే హరితగృహ వాయువుల వల్ల భూగోళం వేడెక్కిపోతుంది. దీనిమూలంగా అనేక విపరీత పరిస్థితులు ఏర్పడవచ్చు.
ఈ పరిస్థితిని అధిగమించడానికి అంతా కృషి చేయాలి. మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలి. ఎక్కువ కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను అవసరమైతే మూసివేయాలి. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి.
3. కింది క్లైమోగ్రాఫ్ను పరిశీలించి ప్రశ్నలకు జవాబులు రాయండి. (సమాచార నైపుణ్యం)
ప్ర: ఏ నెలలో అత్యధిక వర్షపాతం నమోదైంది?
జ: ఆగస్టులో అత్యధిక వర్షపాతం నమోదైంది.
ప్ర: పై క్లైమోగ్రాఫ్ ఏ విషయాలను తెలియజేస్తుంది?
జ: హైదరాబాద్ సగటు కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలను; సగటు వర్షపాతాన్ని తెలియజేస్తుంది.
ప్ర: ఏ నెలల్లో అత్యల్ప, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి?
జ: అత్యధిక ఉష్ణోగ్రత మేలో, అత్యల్ప ఉష్ణోగ్రత డిసెంబరులో నమోదయ్యాయి.
ప్ర: జూన్, అక్టోబరు నెలల మధ్య గరిష్ఠ వర్షపాతం ఎందుకు సంభవిస్తుంది?
జ: జూన్, అక్టోబరు నెలల మధ్య నైరుతి రుతుపవనాల ఆగమనం వల్ల గరిష్ఠ వర్షపాతం సంభవిస్తుంది.
4. 'అందరి నోటా భూమి వేడెక్కిపోతుంది అన్న మాటే'. ఇలా ఎందుకు జరుగుతుందని నీవు అనుకుంటున్నావు? తగిన నివారణ చర్యలు సూచించండి. (సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, ప్రశ్నించడం)
జ: భూమిపై మనిషి చేస్తున్న తప్పిదాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రోజు రోజుకీ భూమి వేడెక్కిపోతుంది. 2100 నాటికి భూగోళం ఉష్ణోగ్రతలు సగటున 3° సెంటిగ్రేడ్ల మేరకు పెరగవచ్చని ఐక్యరాజ్యసమితి చర్చావేదిక (2010) వెల్లడించింది.
గ్లోబర్ వార్మింగ్: నీటి ఆవిరి, కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్ లాంటి వాయువులను గ్రీన్హౌస్ వాయువులు అంటారు. ఇవి ప్రకృతి సహజంగా విడుదలైనప్పుడు భూమిపై ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు సాయం చేస్తాయి. అలా కాకుండా శిలాజ ఇంధనాల (ఉదా: పెట్రో ఉత్పత్తులు) వినియోగంతో అవసరాన్ని మించి అధిక మొత్తంలో గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతాయి.
ఈ వాయువులు భూగోళంపై ఉష్ణోగ్రతలను విపరీతంగా పెంచేస్తాయి. ఓజోన్ పొర గ్రీన్హౌస్ వాయువుల వల్ల తరిగిపోతుంది. దీంతో భూమిపై సగటు ఉష్ణోగ్రత రోజు రోజుకూ పెరిగిపోతుంది. దీన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు.
ఇంతకు ముందు భూమి వేడెక్కడానికి లేదా చల్లారడానికి చాలా సమయం పట్టేది. దీని వల్ల భూమి మీద ప్రాణులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారడానికి సమయం దొరికేది. కానీ ప్రస్తుతం భూమి చాలా తొందరగా వేడెక్కుతోంది. పారిశ్రామిక విప్లవం తర్వాత భూమి వేడెక్కడానికి కారణం మానవ చర్యలే. అందువల్ల ప్రస్తుతం భూమి వేడెక్కడానికి మానవ కారణంగా భూగోళం వేడెక్కడం (A.G.W. - Anthropogenic Global Warming) అంటున్నారు.
భూమి వేడెక్కకుండా ఇలా చేద్దాం:
* మండించే ఇంధనాల వాడకం తగ్గిద్దాం.
* అడవుల నరికివేత ఆపేద్దాం.
* మొక్కలు నాటి, వాటిని సంరక్షిద్దాం.
* ఇంధన వాహనాల వాడకం తగ్గించి, తక్కువ దూరాలకు సైకిళ్లను వినియోగిద్దాం.
* కృత్రిమ ఎరువులను తగ్గించి, సహజ సిద్ధమైన ఎరువులను వాడదాం.
* పారిశ్రామిక వ్యర్థాలను రీసైక్లింగ్ చేద్దాం.
2 మార్కుల ప్రశ్నలు
1. ఉత్తర భారతదేశానికి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత ఎందుకు తగ్గుతుందని నీవు అనుకుంటున్నావు? (సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, ప్రశ్నించడం)
జ: * భూమధ్యరేఖ నుంచి కర్కట, మకర రేఖల వరకూ ఉన్న ప్రాంతాల్లో సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల అక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి.
* భూమధ్య రేఖ నుంచి ఉత్తర, దక్షిణ ధ్రువాలవైపు వెళ్లేకొద్దీ సూర్య కిరణాలు ఏటవాలుగా పడతాయి.
* భారతదేశం సుమారుగా 8° - 37° ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది.
* భారతదేశాన్ని కర్కటరేఖ ఇంచుమించు రెండు సమభాగాలుగా చేస్తుంది.
* ఉత్తర భారతదేశం కర్కటరేఖ పైభాగాన ఉండటం, అక్కడ సూర్య కిరణాలు ఏటవాలుగా పడటం వల్ల ఉత్తరానికి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుందని నేను అనుకుంటున్నాను.
2. వాతావరణానికి, శీతోష్ణస్థితికి తేడా ఏమిటి? (విషయ అవగాహన)
జ: వాతావరణం: ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలోని వాతావరణ పరిస్థితులను వాతావరణం అంటారు. ఈ వాతావరణ పరిస్థితులు తక్కువ సమయంలో కూడా చాలా తీవ్రంగా మారుతూ ఉంటాయి.
శీతోష్ణస్థితి: ఒక విశాల ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు ఒక క్రమాన్ని కనబరిచే వాతావరణ పరిస్థితులను శీతోష్ణస్థితి (క్లైమేట్) అంటారు. ప్రతి సంవత్సరం (ఒక ముప్ఫై సంవత్సరాల పాటు) కనిపించే పరిస్థితులను ఆ ప్రాంత శీతోష్ణస్థితి అంటారు.
3. కింది పట్టికను చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి (సమాచార నైపుణ్యాలు)
ప్ర: భారతదేశ సంప్రదాయం ప్రకారం ఒక్కో రుతువులో ఎన్ని నెలలుంటాయి?
జ: ఒక్కో రుతువులో రెండేసి నెలలుంటాయి.
ప్ర: భారతదేశంలో తెలుగు నెలల ప్రకారం ఏ నెలల్లో వర్షం సంభవిస్తుంది?
జ: తెలుగు నెలల ప్రకారం శ్రావణం, భాద్రపదాల్లో వర్షం సంభవిస్తుంది.
4. AGW విషయంలో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఉన్న అభిప్రాయబేధాలేమిటి? (విషయ అవగాహన)
జ: * మానవ చర్యల కారణంగా భూగోళం వేడెక్కడాన్ని AGW (ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్) అంటారు.
* దీన్ని అరికట్టడానికి IPCC (ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్) అనే అంతర్జాతీయ సంస్థ ఏర్పడింది.
* ప్రపంచ దేశాల మధ్య ఒప్పందం కుదర్చడానికి ఎన్నో సమావేశాలు ఏర్పాటయ్యాయి. కానీ ఈ ప్రయత్నాలు సఫలం కాలేదు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి.
* అభివృద్ధి చెందుతున్న దేశాలు బొగ్గు వినియోగాన్ని తగ్గించుకోవాలని అభివృద్ధి చెందిన దేశాలు చెబుతున్నాయి.
* శిలాజ ఇంధనాలను వినియోగించకపోతే తమ ఆర్థిక ప్రగతి తీవ్రంగా కుంటుపడుతుందని అభివృద్ధి చెందుతున్న దేశాలు వాదిస్తున్నాయి.
ఒక మార్కు ప్రశ్నలు
1. జెట్ ప్రవాహం అని దేన్నంటారు? (విషయ అవగాహన)
జ: భూమి నుంచి 12,000 మీటర్ల ఎత్తులో సన్నటి మేఖలలో వేగంగా ప్రవహించే గాలులను జెట్ ప్రవాహం అంటారు.
2. IPCCని విశదీకరించండి. (విషయ అవగాహన)
జ: ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం (ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్).
3. 'తొలకరి జల్లులు' ఎప్పుడు పడతాయి? (సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, ప్రశ్నించడం)
జ: వేసవి ముగిసే సమయంలో తొలకరి జల్లులు పడతాయి.
4. 'క్లైమోగ్రాఫ్లు' అంటే ఏమిటి? (విషయ అవగాహన)
జ: * శీతోష్ణస్థితి అంశాల క్రమాన్ని చూపించే గ్రాఫులను క్లైమోగ్రాఫులు లేదా క్లైమాటోగ్రాఫులు అంటారు.
* ఒక ప్రదేశ నెలవారీ సగటు అత్యధిక ఉష్ణోగ్రతలు, అత్యల్ప ఉష్ణోగ్రతలు, వర్షపాతాలను క్లైమోగ్రాఫులు సూచిస్తాయి.
5. 'ట్రేడ్ విండ్స్' అని వేటినంటారు? (విషయ అవగాహన)
జ: * ఉత్తరార్ధ గోళంలో ఉప అయన రేఖా ప్రాంతంలో అధిక పీడనం వల్ల ఏర్పడిన శాశ్వత పవనాలు, భూమధ్యరేఖ వద్ద ఉండే అల్పపీడన ప్రాంతం వైపు పశ్చిమంగా పయనిస్తాయి.
* వీటినే వ్యాపార పవనాలు (ట్రేడ్ విండ్స్) అంటారు.
* 'ట్రేడ్' అనే జర్మన్ పదానికి 'ట్రాక్' అని అర్థం.
6. మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుపాను వాయుగుండాలను ఏమంటారు? (విషయ అవగాహన)
జ: 'పశ్చిమ విక్షోభాలు' అంటారు.
7. 'రుతుపవనారంభం'గా దేన్ని పేర్కొంటారు? (విషయ అవగాహన)
జ: జూన్ మొదట్లో నైరుతి పవనాలు భారతదేశానికి చేరుకుంటాయి. దీన్నే రుతుపవనారంభం అంటారు.
8. అటవీ నిర్మూలన అంటే ఏమిటి? (విషయ అవగాహన)
జ: అటవీ ప్రాంతంలోని చెట్లను నరకడం లేదా తగలబెట్టడాన్ని అటవీ నిర్మూలన అంటారు.
9. కిందివాటిని భారతదేశ పటంలో గుర్తించండి. (పట నైపుణ్యాలు)
జైపూర్, లేహ్, భోపాల్, కోల్కతా, ఊటీ, డార్జిలింగ్, తిరువనంతపురం, గ్యాంగ్టక్, అనంతపురం, కొడైకెనాల్.

రాదగిన ప్రశ్నలు
1. కొండ ప్రాంతాలు, ఎడారుల్లోని శీతోష్ణ స్థితులను ప్రభావితం చేసే అంశాలను వివరించండి. (విషయ అవగాహన)
2. భూగోళం వేడెక్కడాన్ని అడవులు అంతరించి పోవడం ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? (సమాకాలీన అంశాలపై ప్రతిస్పందన, ప్రశ్నించడం)
3. సముద్రం సామీప్య, ఖండాంతర్గత శీతోష్ణస్థితుల్లో ఉన్న తేడాలను తెలపండి. (విషయ అవగాహన)
4. భారతదేశంలోని రుతుపవన వ్యవస్థను వివరించండి. (విషయ అవగాహన)