• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భారతదేశ శీతోష్ణస్థితి

అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అకాల వర్షాలు.. ఉన్నట్టుండి వడగళ్ల వాన, ఊహించని వరదల భీభత్సం.. వీటిని చూసి అందరిలో కాలాలు మారుతున్నాయా అన్న సందేహం.. ఎప్పుడు వాన వస్తుందో తెలీదు.. ఎప్పుడు ఎండ కాస్తుందో అంతుపట్టదు.. అవిగో రుతుపవనాలు వచ్చేస్తున్నాయంటారు.. అంతలోనే అవి మార్గాన్ని మార్చుకున్నాయంటారు.. ఈ పరిణామాలతో వాతావరణాన్ని ముందుగానే అంచనా వేయడం కష్టమవుతుందని నిపుణులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం మానవ తప్పిదాలే అని పర్యావరణ వాదులు చెబుతున్నారు.


వాతావరణం, శీతోష్ణస్థితి అంటే...
    ఒక ప్రాంతంలో, ఒక నిర్దిష్ట సమయంలో ఉష్ణోగ్రత పరిస్థితులను వాతావరణం (వెదర్) అంటారు. భూమిని ఆవరించి ఉన్న దట్టమైన గాలి పొరే వాతావరణం. ఇది సుమారు 640 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది. వాతావరణ పరిస్థితులు తక్కువ వ్యవధిలోనూ తీవ్రంగా మారుతూ ఉంటాయి.
    ఒక విశాల ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు ఒక క్రమాన్ని కనపరిచే వాతావరణ పరిస్థితులను శీతోష్ణస్థితి (క్లైమేట్) అంటారు. వరుసగా ముప్పై సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో కనిపించిన పరిస్థితులను ఆ ప్రాంత శీతోష్ణస్థితి అంటారు. ఒక సంవత్సరానికి, ఇంకొక సంవత్సరానికి వాతావరణంలో కొద్ది మార్పులు చోటు చేసుకున్నా మొత్తం మీద శీతోష్ణస్థితిలో ఏర్పడే క్రమం మారదు. శీతోష్ణస్థితి కొన్ని వందల సంవత్సరాల వాతావరణ పరిస్థితుల సంగ్రహమని చెప్పవచ్చు. ఉదాహరణకు భారతదేశ శీతోష్ణస్థితిని సుమారు వందేళ్ల భౌతికాంశాల సగటును తీసుకుని నిర్ణయించారు. మానవ జీవితం శీతోష్ణస్థితి వల్ల ఎన్నో విధాలుగా ప్రభావితమవుతుంది. జంతు, వృక్షజాలాలపైనా దీని ప్రభావం అధికంగా ఉంటుంది. 

క్లైమోగ్రాఫ్: ఏదైనా విషయాన్ని విశదీకరించి చెప్పడానికి మనం చిత్రాలు, గ్రాఫ్‌లు, 'పై' చిత్రాలు ఉపయోగిస్తాం. ఒక ప్రదేశం వాతావరణం, శీతోష్ణస్థితి అంశాల క్రమాన్ని క్లైమోగ్రాఫ్‌లు లేదా క్లైమాటోగ్రాఫ్‌ల ద్వారా చూపించవచ్చు. ఒక ప్రదేశంలో నెలవారీ సగటు అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలు; వర్షపాతాలను క్లైమోగ్రాఫ్‌లు సూచిస్తాయి. ఉష్ణోగ్రత, వర్షపాతాల్లో తేడాలిలా: దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత, వర్షపాతాల్లో తేడా ఉంటుంది. ఉదా: లెహ్ కంటే జైపూర్‌లో వేడిగా ఉంటుంది. సముద్ర సామీప్యంలో ఉన్న ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతలకు తేడా ఉంటుంది. దిల్లీ, చెన్నైల్లో ఈ పరిస్థితి ఉంది. ఉత్తరాన హిమాలయాలు ఉండగా, దక్షిణ ద్వీపకల్పం సముద్రాలతో చుట్టుముట్టి ఉంది. కొన్ని ప్రదేశాలు సముద్రతీరానికి చాలా దూరంలో ఉన్నాయి. కొన్ని చాలా ఎత్తయిన ప్రదేశాలు కాగా, కొన్ని మైదాన ప్రదేశాలుగా ఉన్నాయి. భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల్లో తేడాలు ఎందుకున్నాయో చూద్దాం.
శీతోష్ణస్థితి, వాతావరణాలను ప్రభావితం చేసే అంశాలివి: శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే అంశాలను శీతోష్ణస్థితి కారకాలు అంటారు.
అవి: 1) అక్షాంశం
       2) భూమికి - నీటికి ఉండే సంబంధం
       3) భౌగోళిక స్వరూపం
       4) ఉపరితల గాలి ప్రసరణ
1. అక్షాంశం లేదా భూమధ్య రేఖ నుంచి దూరం: భూమధ్య రేఖ వద్ద ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ధ్రువాల వైపు వెళ్లే కొద్దీ తగ్గిపోతుంది. భూమధ్య రేఖ వద్ద సూర్య కిరణాలు నిలువుగాను, ధ్రువాల వద్ద ఏటవాలుగా పడతాయి. నిలువుగా పడిన కిరణాలు భూమిని ఎక్కువగా వేడి చేస్తాయి. అందువల్ల ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. కాబట్టి భూమధ్య రేఖ వద్ద ఉన్న ప్రాంతాలు ఎక్కువ ఉష్ణోగ్రతలను కలిగి ఉంటాయి. దీనికి భిన్నంగా ఏటవాలుగా పడిన కిరణాలు ఎక్కువ భూమిని వేడి చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా వాతావరణంలోని ఎక్కువ భాగం ద్వారా ప్రసరించి భూమిని చేరుకునేటప్పటికీ ఎక్కువ కిరణాలు పరావర్తనం చెందుతాయి. అందువల్ల ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.
      భారతదేశం సుమారుగా 8° ఉత్తర అక్షాంశం నుంచి 37° ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది. దేశాన్ని కర్కటరేఖ ఇంచుమించు రెండు సమభాగాలగా విభజిస్తుంది. ఈ రేఖకు దక్షిణాన ఉన్న ప్రాంతం ఉష్ణమండలంలో, ఉత్తరాన ఉన్న ప్రాంతం సమశీతోష్ణ మండలంలో ఉన్నాయి. అక్షాంశాలను బట్టి ఆయా ప్రాంతాల్లోని శీతోష్ణస్థితుల్లో మార్పులు కనిపిస్తాయి.

2. భూమికి, నీటికి సంబంధం: సముద్ర తీర ప్రాంతాల్లో వేసవిలో ఉష్ణోగ్రత (వేడి తీవ్రత) కొంత తక్కువగా ఉంటుంది. అలాగే శీతాకాలంలో చలి కూడా కొంచెం తక్కువే. సముద్రాలకు దూరంగా ఖండాంతర్గత ప్రదేశాల్లో వేసవి కాలంలో ఉష్ణోగ్రత, శీతాకాలంలో చలి రెండూ అధికంగా ఉంటాయి. దీనికి కారణం భూమి, నీరు ఒకే మాదిరిగా వేడెక్కక పోవడమే. భూమి త్వరగా వేడెక్కి త్వరగా చల్లారుతుంది. దీనికి భిన్నంగా జలభాగాలు ఆలస్యంగా వేడెక్కి, ఆలస్యంగా చల్లారుతాయి. దీనివల్ల శీతోష్ణస్థితులు అనేక రకాలుగా ప్రభావితమవుతాయి. నేల మీద నుంచి, సముద్రం మీద నుంచి వీచేగాలుల్లో తేడాలుండటం వీటిల్లో ఒకటి. భారతదేశ దక్షిణ ప్రాంతంలోని అధిక భాగం సుదీర్ఘ కోస్తా తీరం వల్ల సముద్ర ప్రభావానికి గురవుతుంది. దీనివల్ల పగలు, రాత్రుల ఉష్ణోగ్రతల్లో; అదే విధంగా వేసవి, శీతాకాలాల ఉష్ణోగ్రతల్లో అంతగా తేడా ఉండదు. దీన్ని సమశీతోష్ణస్థితి అంటారు.

3. భౌగోళిక స్వరూపం: ఒక ప్రదేశం ఉష్ణోగ్రత సముద్ర మట్టం నుంచి దాని ఎత్తును బట్టి మారుతుంది. సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. కాబట్టి మైదాన ప్రాంతాల కంటే కొండలు, పర్వతాల మీద ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అంటే ఒక ప్రదేశం శీతోష్ణస్థితిని ఆ ప్రదేశం ఎత్తు కూడా ప్రభావితం చేస్తుంది.  భారతదేశంలో వేసవి తీవ్రంగా ఉండే నెలల్లో కూడా హిమాలయ ప్రాంతాల్లోని సిమ్లా, గుల్మార్గ్, నైనిటాల్, డార్జిలింగ్‌లు చాలా చల్లగా ఉంటాయి. ఈ ప్రాంతాలు వేసవి విడుదులుగా పేరుగాంచాయి.

4. వాతావరణంలో ఉపరితల గాలి ప్రసరణ: భారతదేశ శీతోష్ణస్థితి ఉపరితల వాయు ప్రవాహాల వల్ల కూడా ప్రభావితమవుతుంది. వీటిని జెట్‌ప్రవాహాలు అంటారు. ఇవి నేల నుంచి 12 వేల మీటర్ల ఎత్తులో సన్నటి మేఖల్లో వేగంగా ప్రయాణిస్తాయి. ఈ గాలుల వేగం గంటకు వేసవిలో 110, శీతాకాలంలో 184 కిలోమీటర్ల వరకు ఉంటుంది. వీటివల్ల చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత చల్లబడుతుంది. తూర్పు జెట్‌స్ట్రీం యొక్క చల్లబరిచే ప్రక్రియ వల్ల అక్కడ ఉన్న మేఘాలు వర్షిస్తాయి.


భారతదేశంలోని కాలాలు:
శీతాకాలం:
ఆహ్లాదానికి మారుపేరు శీతాకాలం. వర్షాకాలం నుంచి శీతాకాలంలోకి ప్రవేశిస్తాం. మన దేశంలో ఉష్ణోగ్రతలు నవంబరు మధ్య నుంచి గణనీయంగా తగ్గుతాయి. ఈ చలికాలం ఫిబ్రవరి మధ్యవరకు కొనసాగుతుంది.
దేశంలో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 10° సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అల్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దక్షిణ భారతదేశం, ప్రత్యేకించి కోస్తా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మధ్యస్తంగా ఉంటాయి. (20° సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ) దేశంలో జనవరిలో సాధారణంగా అత్యంత చలిగా ఉంటుంది. 

ఎండాకాలం: ఈ కాలంలో దేశంలో కనిష్ఠ ఉష్రోగ్రతలు 20° సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉండవు. అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 41° - 42° సెంటీగ్రేడ్‌లు నమోదవుతాయి. ఉత్తరాన మైదానాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నుంచి క్రమేపీ 37° సెంటీగ్రేడ్‌లు దాటుతాయి. వేసవి కాలంలో దేశ దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తర ప్రాంతం వైపు వెళ్లే కొద్దీ సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఉత్తరాది మైదానాల్లో పొడిగా, వేడిగా ఉండే స్థానిక పవనాలు వీస్తాయి. వీటిని లూ పవనాలు అంటారు.
     పర్యావరణ మార్పు కారణంగా మే నెలాఖరు వరకే ఉండాల్సిన ఎండలు జూన్‌లో కూడా విజృంభిస్తాయి. ఇలా జరగడానికి రుతుపవనాల రాక ఆలస్యం కావడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.
రుతుపవనాలు: గతంలో భారతదేశానికి వచ్చిన నావికులు గాలులు వీచే దిశ క్రమం తప్పకుండా మారుతుండటాన్ని గమనించారు. ఈ గాలుల సహాయంతో వారు భారతదేశ తీరం వైపు ప్రయాణించేవాళ్లు. ఇలా కాలానుగుణంగా గాలుల దిశ మారడాన్ని అరబ్ వర్తకులు మాన్‌సూన్ అని పేరు పెట్టారు. వీటిని మనం రుతుపవనాలు అంటున్నాం.

       ఒక నియమిత కాలంలో ఆయా ప్రాంతాల్లో రుతువుల ఆధారంగా ఒక నిర్దిష్ట దిశల్లో వీచే పవనాలను రుతుపవనాలు అంటారు. ఉష్ణ ప్రాంతంలో సుమారుగా 20° ఉత్తర అక్షాంశం నుంచి 20° దక్షిణ అక్షాంశాల మధ్య ఇవి ఏర్పడతాయి.
రుతుపవనారంభం: రుతుపవనాలు జూన్ నెలలో భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రవేశిస్తాయి. దీనినే రుతుపవనారంభం అంటారు. ఇవి భారతదేశ దక్షిణాగ్రం చేరిన తర్వాత అరేబియా సముద్ర శాఖ, బంగాళాఖాతం శాఖలుగా విడిపోతాయి. అరేబియా శాఖ పశ్చిమ తీరం, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోని కొంత భాగానికి వర్షాన్నివ్వగా; బంగాళాఖాతం శాఖ బెంగాల్ తీరం, షిల్లాంగ్ పీఠభూమిని తాకి పశ్చిమవైపు కదులుతుంది. తర్వాత వాయవ్యంగా హిమాలయాలకు సమాంతరంగా ప్రయాణించి బిహార్, ఉత్తరప్రదేశ్, దిల్లీ ప్రాంతాలకు వర్షాన్నిస్తాయి. అరేబియాశాఖ, బంగాళాఖాతం శాఖలు పంజాబ్‌లో కలుస్తాయి.     ఇలా జూన్ నుంచి నాలుగైదు వారాల్లో ఈ రుతుపవనాలు క్రమేపీ దేశమంతా విస్తరిస్తాయి. భారతదేశంలో అత్యధిక వర్షపాతం ఈ రుతుపవన కాలంలోనే సంభవిస్తుంది.

తిరోగమన రుతుపవనాలు: నైరుతి రుతుపవనాలు ఉత్తర భారతదేశంలో తిరోగమనం చెంది ఈశాన్య రుతుపవనాలుగా మారి సెప్టెంబరు మధ్య నుంచి డిసెంబరు మధ్య వరకు వీస్తాయి. తిరోగమన రుతుపవనాల సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండి, ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. చాలా ఉక్కబోతగా ఉంటుంది. ఈ కాలంలో అండమాన్ ప్రాంతంలో తుపాన్లు, వాయుగుండాలు ఏర్పడతాయి. ఈ ఉష్ణప్రాంత తుపాన్లు చాలా విధ్వంసకరంగా ఉంటాయి. గోదావరి, కృష్ణా, కావేరీ నదుల డెల్టా ప్రాంతాలు వీటి ప్రతాపానికి గురవుతాయి. అప్పుడప్పుడు ఈ తుపాన్లు సుందరవనాలు, బంగ్లాదేశ్‌ను కూడా తాకుతాయి. కోరమండల్ ప్రాంతంలో అధికశాతం వర్షం తుపాన్లు, వాయుగుండాల వల్లే కురుస్తుంది.
వేడెక్కుతున్న భూగోళం: 19వ శతాబ్దం నుంచి భూగోళం చాలా వేగంగా వేడెక్కుతోంది. దీనిపట్ల అందరిలోనూ ఆందోళన పెరిగింది. దీంతో మానవులు ఎన్నోరకాలుగా ఇబ్బందికి గురవుతున్నారు. 

జంతువులు మానవ నివాస ప్రాంతాలకు వచ్చేస్తున్నాయి. ఉత్తర, దక్షిణ ధ్రువాల్లో మంచుకరిగే ప్రమాదముందని, దానివల్ల ఎన్నో పల్లపు ప్రాంతాలు మునిగిపోతాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. వీటన్నింటికి గ్లోబల్ వార్మింగ్ కారణమంటున్నారు.

గ్లోబల్ వార్మింగ్: నీటిఆవిరి, కార్బన్‌డైఆక్సైడ్, మీథేన్ లాంటి వాయువులను గ్రీన్ హౌస్ వాయువులు అంటారు. ఇవి ప్రకృతి సహజంగా ఏర్పడినప్పుడు భూమిపై ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు సాయం చేస్తాయి. అలా కాకుండా శిలాజ ఇంధనాల (ఉదా: పెట్రో ఉత్పత్తులు) వినియోగంతో అవసరానికి మించి అధికమొత్తంలో గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతాయి. ఈ వాయువులు భూగోళంపై ఉష్ణోగ్రతలను పెంచేస్తాయి. ఓజోన్ పొర గ్రీన్‌హౌస్ వాయువుల వల్ల తరిగిపోతుంది. దీంతో భూమిపై సగటు ఉష్ణోగ్రత రోజురోజుకూ పెరిగిపోతుంది. దీనినే గ్లోబల్ వార్మింగ్ అంటారు.

భూమి వేడెక్కటానికి మానవ చర్యలే కారణమా?
     ఇంతకుముందు భూమి వేడెక్కడానికి, చల్లబడటానికి చాలా సమయం పట్టేది. దీనిమూలంగా ప్రాణులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారడానికి కొంతసమయం దొరికింది. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఇప్పుడు భూమి చాలా తొందరగా వేడెక్కుతుంది. ఇది వినాశకర మార్పులకు దారితీయవచ్చు. పారిశ్రామిక విప్లవం తర్వాత భూమి వేడెక్కడానికి మానవచర్యలే కారణం అని చెప్పవచ్చు. కాబట్టి ప్రస్తుతం భూమి వేడెక్కడాన్ని మానవ కారణంగా భూగోళం వేడెక్కడం (AGW - Anthropogenic Global Warming) అంటున్నాం.

వేడెక్కితే ఏం జరుగుతుంది: భూగోళం వేడెక్కితే భౌమ్యవ్యవస్థ ఉష్ణప్రసరణలో అనేక మార్పులు జరుగుతాయి. వాతావరణ, శీతోష్ణస్థితుల సరళిలో మార్పులు వస్తాయి. వాతావరణంలో స్వల్పకాలిక మార్పులు ఒకదానికొకటి తోడై దీర్ఘకాలికంగా శీతోష్ణస్థితులు మారతాయి.
       భూగోళ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నకొద్దీ టండ్రాల్లో గడ్డకట్టిన మంచు మరింతగా కరుగుతుంది. ఫలితంగా మంచుకింద ఉన్న మీథేన్ వాతావరణంలోకి విడుదల అవుతుంది. దానివల్ల భూమి ఇంకాస్త వేడెక్కుతుంది. మరీ ఎక్కువగా కరుగుతుంది. అధికమొత్తంలో మీథేన్ విడుదలవుతుంది. ఇది ఒక విషవలయంగా మారుతుంది. హరితగృహ వాయువుగా కార్బన్‌డైఆక్సైడ్ కంటే మీథేన్ మరింత శక్తిమంతంగా పనిచేస్తుంది.
ప్రపంచదేశాలు ఇలా అంటున్నాయి: ఈ సమస్యను ఎదుర్కోవడానికి శీతోష్ణస్థితి మార్పుపై ప్రపంచదేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం (IPCC - Intergovernmental Panel on Climate Change) ఏర్పడింది. మానవ కారణంగా భూగోళం వేడెక్కడాన్ని తగ్గించడానికి, వాతావరణ మార్పు వేగాన్ని తగ్గించడానికి ఒక ఒడంబడిక ఏర్పరుచుకునేలా అన్నిదేశాలతో అనేక సమావేశాలను ఈ సంఘం నిర్వహించింది. ఇవేమీ విజయవంతం కాలేదు. 2013లో పోలాండ్‌లోని వార్సాలో జరిగిన సమావేశం కూడా ఎలాంటి ఒడంబడికను సాధించలేకపోయింది.
దేశాలమధ్య భిన్నాభిప్రాయాలు: వాతావరణంలోని హరితగృహ వాయువులను పెంచే బొగ్గు వినియోగం, ఇతర కార్యకలాపాలను అభివృద్ధి చెందుతున్న దేశాలు తగ్గించుకోవాలని అభివృద్ధి చెందిన దేశాలు అంటున్నాయి. శిలాజ ఇంధనాలు వినియోగించకపోతే తమ ఆర్థిక ప్రగతి కుంటుపడుతుందనేది అభివృద్ధి చెందుతున్న దేశాల వాదన.
శాస్త్రజ్ఞుల అభిప్రాయం: మానవ కారణంగా భూగోళం వేడెక్కుతోంది అన్నది వాస్తవమని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. దీనివల్ల రాబోయే సంవత్సరాల్లో వాతావరణంలో తీవ్ర పరిణామాలు సంభవించవచ్చని, జీవన మనుగడకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.

జరిగే నష్టాలివి: సగటు ఉష్ణోగ్రతలు 2° సెంటీగ్రేడులు పెరిగితే వచ్చే శతాబ్ద ఆరంభం నాటికి దీనికారణంగా సముద్రమట్టం ఒక మీటరు పెరుగుతుంది. మన తీర ప్రాంతాలు చాలావరకు దీనివల్ల ప్రభావితమవుతాయి. కోట్ల మందిని ఇతర ప్రాంతాలకు తరలించాల్సి వస్తుంది. వీరంతా తమ జీవనోపాధిని కోల్పోతారు. వర్షపాతం రీతిలో చాలా మార్పులు రావచ్చు. కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం చాలా ఎక్కువగా ఉంటే, కొన్ని ప్రాంతాలు వర్షాభావానికి గురికావచ్చు. అంటే కరవులు, వరదలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. దీనివల్ల వ్యవసాయం దెబ్బతింటుంది. ప్రజల జీవన మనుగడకు భంగం కలుగుతుంది. ఇతర ప్రాణులకు కూడా నష్టం వాటిల్లుతుంది. మూగజీవులు మానవ నివాసాలకు వచ్చే ప్రమాదముంది.
సమస్యను ఇలా అరికడదాం:
* శిలాజ ఇంధనాల వాడకం తగ్గించాలి.
* తక్కువ దూరాలకు సైకిళ్లు వాడాలి
* ఎ.సి., ఫ్రిజ్‌ల వాడకం తగ్గించాలి.
* అడవులను నరకడం ఆపాలి.
* మొక్కలను పెంచి, వాటిని సంరక్షించాలి.
* ప్రపంచదేశాలన్నీ ఒకే తాటిపైకి వచ్చి ఈ పరిస్థితికి పరిష్కారమార్గం కనుక్కోవాలి.
* ఈ సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పించి తదనుగుణంగా నడిచేలా ప్రభుత్వాలు కృషిచేయాలి.
* పారిశ్రామిక వ్యర్థాలు, ప్లాస్టిక్‌ను సరైన రీతిలో తొలగించాలి.


ప్రధానాంశాలు

హైదరాబాద్‌లో తరచూ కురుస్తోన్న అకాల వర్షాల వల్ల వాతావరణ శాఖ అధికారులు ఆశ్చర్యపోతున్నారు.
* దేశంలోని వాతావరణాన్ని ముందుగానే అంచనా వేయడం రానురాను మరింత కష్టమవుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
* గత మూడేళ్లుగా వాతావరణ వ్యవస్థలో అసాధారణ మార్పులను గమనిస్తున్నాం. ఫలితంగా ఊహించని విధంగా వాతావరణం ఉంటుంది.
* ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలోని ఉష్ణోగ్రత పరిస్థితులను వాతావరణం అంటారు.
* ఒక విశాల ప్రాంతంలో కొన్నేళ్లపాటు ఒక క్రమాన్ని కనబరిచే వాతావరణ పరిస్థితులును శీతోష్ణస్థితి (క్లైమేట్) అంటారు.
* వరుసగా ముప్పై సంవత్సరాల పాటు కనిపించిన వాతావరణ పరిస్థితులను ఆ ప్రాంత శీతోష్ణస్థితి అంటారు.
* ఒక సంవత్సరానికి ఇంకొక సంవత్సరానికి వాతావరణంలో కొద్దిగా మార్పులు చోటుచేసుకున్నా మొత్తంమీద శీతోష్ణస్థితిలో ఏర్పడే క్రమం మారదు.
* ఈ సాధారణ పరిస్థితుల ఆధారంగా సంవత్సరాన్ని కాలాలుగా విభజిస్తారు.
* శీతోష్ణస్థితిలో ముఖ్యమైన ఉష్ణోగ్రత (అత్యధిక, అత్యల్ప), వర్షపాతాలను క్లైమాటోగ్రాఫ్‌ల ద్వారా చూపించవచ్చు.
* ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, గాలివేగం, గాలిలో తేమ, వర్షపాతం మొదలైనవి వాతావరణంలోని అంశాలు.
* కొన్ని ప్రదేశాల్లో ఉదాహరణకు చెన్నైలో వివిధ నెలల్లోని ఉష్ణోగ్రతల్లో అంతగా తేడా ఉండదు.
* కొన్ని ప్రదేశాల్లో ఉదాహరణకు దిల్లీలో వివిధ నెలల్లోని ఉష్ణోగ్రతల్లో ఎంతో తేడా ఉంటుంది.

* శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే అంశాలను శీతోష్ణస్థితి కారకాలు అంటారు.
* 1. అక్షాంశం, 2. భూమికి - నీటికి ఉన్న సంబంధం, 3. భౌగోళిక స్వరూపం, 4. ఉపరితల గాలి ప్రసరణ మొదలైనవి శీతోష్ణస్థితి కారకాలు.
* భూమధ్యరేఖ నుంచి దూరం పెరుగుతున్న కొద్దీ వార్షిక సగటు ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి.
* ఉష్ణోగ్రతల ఆధారంగా భూమిని మూడు ప్రాంతాలుగా విభజిస్తాం. అవి:
ఉష్ణప్రాంతాలు: భూమధ్యరేఖకు దగ్గరగా ఉండేవి.
ధ్రువపాంతాలు: ధ్రువాలకు దగ్గరగా ఉండేవి.
సమశీతోష్ణ ప్రాంతాలు: ఈ రెండింటికీ మధ్యలో ఉండేవి.
* అక్షాంశాన్ని బట్టి ఉష్ణోగ్రత తీవ్రత ఆధారపడి ఉంటుంది.
* భూమి ఉపరితలంపైన ఉష్ణోగ్రత ఆ ప్రాంతంలో సూర్యకిరణాల నుంచి వచ్చే వేడిమి (సూర్యపుటం) మీద ఆధారపడి ఉంటుంది.
* భూమధ్య రేఖకు దూరంగా ఉన్న అక్షాంశాల కంటే దగ్గరగా ఉన్న అక్షాంశాల వద్ద ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
* భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్లే కొద్దీ సగటు వార్షిక ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి.
* భారతదేశంలో దక్షిణాది ప్రాంతం భూమధ్యరేఖకు దగ్గరగా ఉష్ణమండలంలో ఉన్న కారణంగా ఈ ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు ఉత్తర ప్రాంతం కంటే ఎక్కువగా ఉంటాయి. కన్యాకుమారిలోని శీతోష్ణస్థితి భోపాల్ లేదా దిల్లీ శీతోష్ణస్థితి కంటే భిన్నంగా ఉండటానికి ఇదొక కారణం.
* భారతదేశం సుమారుగా 8° - 37° ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది.
* భారతదేశాన్ని కర్కటరేఖ ఇంచుమించు రెండు సమభాగాలుగా చేస్తుంది.
* కర్కటరేఖకు దక్షిణంగా ఉన్న ప్రాంతం ఉష్ణమండలంలో, ఉత్తరాన ఉన్న ప్రాంతం సమశీతోష్ణ మండలంలో ఉంది.
* శీతోష్ణస్థితులను ప్రభావితం చేసే మరొక ముఖ్యమైన అంశం భూమికి నీటికి ఉన్న సంబంధం.
* బాగా పచ్చదనం, చెట్లు ఉండే ప్రాంతాలు సూర్యరశ్మిని బాగా గ్రహిస్తాయి.
* మంచుతో కప్పిన ప్రాంతాలు సూర్యరశ్మిని తిరిగి వాతావరణంలోకి ప్రసరింపజేస్తాయి.
* భూమితో పోలిస్తే సముద్రం చాలా నిదానంగా వేడెక్కుతుంది. నిదానంగా చల్లబడుతుంది. దీనివల్ల శీతోష్ణస్థితులు అనేక రకాలుగా ప్రభావితమవుతాయి.
* దక్షిణ ప్రాంతంలోని అధికభాగం సముద్రం ప్రభావానికి గురవుతుంది. దీనివల్ల పగలు, రాత్రుల ఉష్ణోగ్రతల్లో; వేసవి, శీతాకాలాల ఉష్ణోగ్రతల్లో అంతగా తేడా ఉండదు. దీన్ని సమశీతోష్ణస్థితి అంటారు.
* ఒకే అక్షాంశం మీద సముద్రం నుంచి దూరంగా ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను పోలిస్తే సముద్ర ప్రభావం ఏమిటో బాగా తెలుస్తుంది.
* ఒక ప్రదేశ శీతోష్ణస్థితిని ఆ ప్రదేశం ఎత్తుకూడా ప్రభావితం చేస్తుంది.
* సముద్ర మట్టం నుంచి ఎత్తుకి వెళుతున్నకొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. కాబట్టి మైదాన ప్రాంతాల కంటే కొండలు, పర్వతాల మీద ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.
* వేసవి తీవ్రంగా ఉండే నెలల్లో కూడా హిమాలయ ప్రాంతాల్లోని సిమ్లా, గుల్మార్గ్, నైనిటాల్, డార్జిలింగ్ లాంటి వేసవి విడిదుల్లో చాలా చల్లగా ఉంటుంది.
* పశ్చిమ కనుమల్లోని కొడైకెనాల్, ఉదగమండలం (ఊటీ) లాంటి ప్రాంతాల్లో తీర ప్రాంతాలతో పోలిస్తే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.
* ఉత్తరార్ధ గోళంలో ఉప అయనరేఖ అధిక పీడనం వల్ల శాశ్వత పవనాలు ఏర్పడతాయి.
* ఇవి భూమధ్యరేఖ వద్ద ఉండే అల్పపీడన ప్రాంతం వైపు పశ్చిమంగా పయనిస్తాయి. వీటిని వ్యాపార పవనాలు (ట్రేడ్‌విండ్స్) అంటారు.
* ట్రేడ్ అన్న జర్మన్ పదానికి ట్రాక్ అని అర్థం. అంటే ఒకే దిశలో స్థిరంగా పయనించే గాలులని అర్థం.
* శుష్క ఈశాన్య పవనాల మేఖలలో భారతదేశం ఉంది.
* భారతదేశ శీతోష్ణస్థితి ఉపరితల వాయు ప్రవాహాలవల్ల కూడా ప్రభావితమవుతుంది. దీన్నే జెట్ ప్రవాహం అంటారు.
* జెట్ ప్రవాహం నేల నుంచి 12,000 మీటర్ల ఎత్తులో సన్నటి మేఖల్లో వేగంగా ప్రవహిస్తుంది.
* ఈ గాలుల వేగం గంటకు వేసవిలో 110 కిలోమీటర్లు, శీతాకాలంలో 184 కిలోమీటర్ల మధ్య ఉంటుంది.
* 25° ఉత్తర అక్షాంశం వద్ద తూర్పు జెట్ ప్రవాహం ఏర్పడుతుంది.
* ఇలాంటి జెట్ ప్రవాహం వల్ల చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత చల్లారుతుంది.
* తూర్పు జెట్‌స్ట్రీం చల్లబడే ప్రక్రియ వల్ల అక్కడ ఉన్న మేఘాలు వర్షిస్తాయి.
* భాతరదేశ భూభాగంపై ఉష్ణోగ్రతలు నవంబరు మధ్యనుంచి గణనీయంగా తగ్గుతాయి.
* నవంబరు మధ్య నుంచి ఫిబ్రవరి మధ్యవరకు చలికాలం కొనసాగుతుంది.
* జనవరి నెల సాధారణంగా అత్యంత చలిగా ఉంటుంది.
* ఆ సమయంలో దేశంలోని పలుప్రాంతాల్లో ఉష్ణోగ్రత 10°C కంటే తక్కువ ఉంటుంది.
* జనవరిలో ఉత్తర భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
* దక్షిణ భారతదేశం, ప్రత్యేకించి కోస్తా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 20° సెంటీగ్రేడుల కంటే ఎక్కువ ఉండి, ఆహ్లాదకరంగా ఉంటుంది.
* పశ్చిమ విక్షోభాలుగా పేరొందిన మధ్యధరా సముద్రం నుంచి వచ్చే తుపాను, వాయుగుండాలు ఉత్తర భారతదేశంలో ఒక మోస్తరు వర్షపాతానికి కారణమవుతున్నాయి.
* సాధారణంగా రబీకాలంలో సాగుచేసే గోధుమ పంటకు ఈ వర్షం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
* ఉత్తరార్థ భూగోళంలోని వ్యాపార పవనాల మేఖలలో భారతదేశం ఉంది.
* భూభాగం నుంచి సముద్రం మీదకు వీచే ఈశాన్యగాలులు పొడిగా ఉంటాయి. అయితే ఇవి బంగాళాఖాతాన్ని దాటే క్రమంలో కొంత తేమను గ్రహించడం వల్ల తమిళనాడులోని కోరమండల్ తీరప్రాంతంలో కొంత వర్షం కురుస్తుంది.
* వేసవి కాలంలో దేశ దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తర ప్రాంతం వైపు వెళుతుంటే సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి.
* మే నెల మధ్య నాటికి భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రత్యేకించి వాయవ్య మైదానం, మధ్యభారతంలో పగటి ఉష్ణోగ్రతలు 41° - 42° సెంటీగ్రేడ్‌లు నమోదవుతాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా 20°Cకు తక్కువ ఉండవు.
* ఉత్తరాది మైదానాల్లో పొడిగా, వేడిగా ఉండే స్థానిక పవనాలు వీస్తాయి. వీటిని లూ పవనాలు అంటారు.
* సాధారణంగా వేసవి ముగిసే సమయంలో దక్కన్ పీఠభూమిలో తొలకరి జల్లులు పడతాయి.
* భారతదేశ ద్వీపకల్ప ప్రాంతంలో మామిడి, ఇతర ఫలాలు త్వరగా పండటానికి ఈ వానలు దోహదం చేస్తాయి. అందువల్ల ఈ తొలకరి జల్లులను గోదావరి జిల్లాల్లో మామిడి జల్లులు అంటారు.
* భారతదేశంలోని శీతోష్ణస్థితి రుతుపవనాల వల్ల గణనీయంగా ప్రభావితమవుతోంది.
* గతంలో భారతదేశానికి వచ్చిన నావికులు గాలులు వీచే దిశ క్రమం తప్పకుండా మారుతుండటాన్ని గమనించారు.
* ఈ గాలుల సహాయంతో నావికులు భారతదేశ తీరంవైపు ప్రయాణించేవారు.
* ఇలా కాలానుగుణంగా గాలుల దిశ మారడాన్ని అరబ్ వర్తకులు మాన్‌సూన్ అని పేరు పెట్టారు. వీటిని మనం రుతుపవనాలు అని పిలుస్తాం.
* ఉష్ణప్రాంతంలో సుమారుగా 20° ఉత్తర అక్షాంశాల నుంచి 20° దక్షిణ అక్షాంశాల మధ్య రుతుపవనాలు ఏర్పడతాయి.
* ఆగ్నేయ రుతుపవనాలు హిందూ మహాసముద్రం మీదుగా ఉత్తరాన అల్పపీడన ప్రాంతం వైపు పయనించే సమయంలో నీటి ఆవిరిని తీసుకెళతాయి.
* భూమధ్య రేఖను దాటిన తర్వాత ఈ పవనాలు భారత ఉపఖండం మీద ఏర్పడిన అల్పపీడనం ప్రాంతం వైపు పయనిస్తాయి.
* భూమి వేడెక్కడం వల్ల భారత ఉపఖండంలోని భూభాగం మీద, ప్రత్యేకించి మధ్యభారతం, గంగానదీ మైదాన ప్రాంతం మీద అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. తర్వాత ఈ పవనాలు నైరుతి రుతుపవనాలుగా ప్రయాణం మొదలుపెడతాయి.
* భారత ద్వీపకల్పం ఈ పవనాలను రెండు శాఖలుగా విభజిస్తుంది. అవి: అరేబియా సముద్ర శాఖ, బంగాళాఖాతం శాఖ.
* అరేబియా సముద్ర శాఖ భారత పడమటి తీరాన్ని చేరి ఉత్తర దిశగా కదులుతుంది. బంగాళాఖాతం శాఖ బెంగాల్ తీరాన్ని, షిల్లాంగ్ పీఠభూమి దక్షిణ ముఖాన్ని తాకుతుంది.
* ఈ రెండు శాఖలు భారతదేశానికి జూన్ మొదట్లో చేరుకుంటాయి. దీన్నే రుతుపవనాల ఆరంభంగా పేర్కొంటారు.
* నాలుగు నుంచి అయిదు వారాల్లో ఈ రుతుపవనాలు క్రమేపీ దేశమంతా వ్యాపిస్తాయి.
* భారతదేశంలో అత్యధిక వర్షపాతం నైరుతి రుతుపవన కాలంలో సంభవిస్తుంది.
* పశ్చిమ తీరం వెంట పశ్చిమ కనుమల వల్ల, ఈశాన్య ప్రాంతంలో ఎత్తయిన కొండల వల్ల ఆ ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది.
* అరేబియా సముద్ర శాఖకు వర్షచ్ఛాయా ప్రాంతంలోనూ, బంగాళాఖాతం శాఖకు సమాంతరంగానూ ఉండటం వల్ల ఈ కాలంలో తమిళనాడులోని కోరమాండల్ తీరంలో అంతగా వర్షం కురవదు.
* వేడి పెరుగుతున్న నేలల నుంచి పొడిగా ఉండే చలి పరిస్థితుల మధ్య అక్టోబరు, నవంబరు నెలలు సంధికాలంగా ఉంటాయి.
* తిరోగమన రుతుపవనాల సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండటమే కాకుండా ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. నేల ఇంకా తేమగా ఉంటుంది.
* అధిక ఉష్ణోగ్రత, గాలిలో అధిక తేమ కారణంగా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది. దీన్ని సాధారణంగా అక్టోబరు వేడిమి అంటారు.
* ఇంతకు ముందు వాయవ్య భారతంలో ఉన్న అల్పపీడన పరిస్థితులు నవంబరు ఆరంభం నాటికి బంగాళాఖాతంలో ఏర్పడతాయి.
* ఈ కాలంలో అండమాన్ ప్రాంతంలో తుపాన్లు, వాయుగుండాలు ఏర్పడతాయి.
* ఈ ఉష్ణ ప్రాంత తుపాన్లు విధ్వంసకరంగా ఉంటాయి. గోదావరి, కృష్ణా, కావేరీ నదుల డెల్టా ప్రాంతాలు వీటి ప్రతాపానికి గురవుతాయి.
* అప్పుడప్పుడు ఈ తుపాన్లు సుందర వనాలను, బంగ్లాదేశ్‌ను కూడా తాకుతాయి.
* కోరమాండల్ ప్రాంతంలో అధిక శాతం వర్షం తుపాన్లు, వాయుగుండాల వల్ల సంభవిస్తుంది.
* భారతదేశ సంప్రదాయం ప్రకారం రెండేసి నెలలు ఉండే ఆరు రుతువులుగా ఏడాదిని విభజిస్తారు.
* ఉత్తర, మధ్య భారతదేశ ప్రజలు అనుభవించే సాధారణ శీతోష్ణస్థితుల ఆధారంగా రుతువులను విభజించారు.
* ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి రుతువుల విభజనలో కొంత తేడా ఉంది.
* మండుతున్న బంతి నుంచి భూగోళం ఏర్పడిన క్రమంలో ఎన్నో వాయువులు వెలువడ్డాయి.
* భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల ఈ వాయువులు రోదసిలోకి తప్పించుకోలేవు. భూమ్యాకర్షణ శక్తి ఈ వాయువులను ఇంకా పట్టి ఉంచుతోంది. ఫలితంగా భూమి చుట్టూ వాయువుల పొర ఒకటి ఏర్పడింది.
* ఈ వాయువుల పొర వల్ల ఎన్నో ముఖ్యమైన ప్రయోజనాలున్నాయి. అవి: ఈ వాయువుల పొరలో మనం పీల్చుకునే ప్రాణవాయువు (ఆక్సిజన్), సూర్యుడి అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడే ఓజోను పొర, మనకు అవసరమైన మాంసకృత్తులు తయారు చేయడానికి మొక్కలు వినియోగించుకునే నత్రజని ఉన్నాయి.
* వాతావరణం చేసే ముఖ్యమైన పనుల్లో మనల్ని వెచ్చగా ఉంచడం ఒకటి.
* ఇది భూమిని కప్పి ఉంచే తేలికపాటి, బాగా పనిచేసే దుప్పటి లాంటిది.
* భూమిని చేరుకునే సౌరశక్తి అంతా తిరిగి రోదసిలోకి వికిరణం చెందకుండా వాతావరణం కొంత శక్తిని పట్టి ఉంచుతుంది. దీనినే హరిత గృహ ప్రభావం అంటారు.
* భూమి మీద ప్రాణుల మనుగడకు ఇది ఎంతో ముఖ్యం.
* భూమిపైన వాతావరణమే లేకపోతే చాలా చల్లగా ఉండేది.
* 19వ శతాబ్దం నుంచి భూగోళం చాలా వేగంగా వేడెక్కుతోంది.
* ఇంతకు ముందు భూమి వేడెక్కడానికి/చల్లబడడానికి చాలా ఎక్కువ సమయం పట్టేది. దీని వల్ల భూమి మీద ప్రాణులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారడానికి సమయం దొరికింది.
* ఇప్పుడు భూమి గతంతో పోలిస్తే తొందరగా వేడెక్కుతుంది.
* పారిశ్రామిక విప్లవం తర్వాత భూమి వేడెక్కడానికి కారణం మానవ చర్యలే.
* కాబట్టి ప్రస్తుతం భూమి వేడెక్కడాన్ని మానవ కారణంగా భూగోళం వేడెక్కడం
(AGW - Anthropogenic Global Warming) అంటారు.

* ఇటీవలి కాలంలో శాస్త్రజ్ఞులు ఉత్తర అక్షాంశాల వద్ద గడ్డకట్టిన టండ్రాల కింద (ప్రధానంగా ఉత్తర రష్యా విశాల భూభాగం కింద) పెద్ద మొత్తంలో మీథేన్ వాయువు ఉందని కనుక్కున్నారు.
* భూగోళ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నకొద్దీ టండ్రాల్లో గడ్డ కట్టిన మంచు మరింతగా కరుగుతుంది.
* ఫలితంగా మంచు కింద ఉన్న మీథేన్ వాతావరణంలో విడుదలవుతుంది. దాని వల్ల భూమి ఇంకా వేడెక్కుతుంది. మంచు మరికాస్త ఎక్కువగా కరుగుతుంది. ఫలితంగా అధిక మొత్తంలో మీథేన్ విడుదలవుతుంది. ఇది ఒక విషవలయంగా మారుతుంది.
* హరితగృహ వాయువుగా (Green House Gas) కార్బన్‌డైఆక్సైడ్ కంటే మీథేన్ మరింత శక్తిమంతంగా పని చేస్తుంది.
* మానవజనిత కారణాల వల్ల భూమి వేడెక్కడం, భౌమ్య వ్యవస్థ ఉష్ణ ప్రసరణలో అనేక మార్పులకు కారణమవుతుంది.
* ఉష్ణ పున:ప్రసరణ గందరగోళం కావడంతో వాతావరణ, శీతోష్ణస్థితుల సరళిలో మార్పులు వస్తాయి.
* ఈ సమస్యను ఎదుర్కోవడానికి శీతోష్ణస్థితి మార్పుపై ప్రపంచ దేశాల మధ్య అంతర ప్రభుత్వ సంఘం
(IPCC -Intergovernmental Panel on Climate Change) ఏర్పడింది.
* మానవ కారణంగా భూగోళం వేడెక్కడాన్ని తగ్గించడానికి, వాతావరణ మార్పు వేగాన్ని తగ్గించడానికి ఒక ఒడంబడిక ఏర్పరచుకొని అన్ని దేశాలతో అనేక సమావేశాలను ఈ సంఘం నిర్వహించింది. వీటిల్లో ఏదీ విజయవంతం కాలేదు.
* 2013లో పోలాండ్‌లోని వార్సాలో జరిగిన సమావేశం కూడా ఎలాంటి ఒడంబడికను సాధించలేకపోయింది.
* దీని మూలంగా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి.

* వాతావరణంలోని హరితగృహ వాయువులను పెంచే బొగ్గు వినియోగం, ఇతర కార్యకలాపాలను అభివృద్ధి చెందుతున్న దేశాలు తగ్గించుకోవాలని అభివృద్ధి చెందిన దేశాలు అంటున్నాయి.
* శిలాజ ఇంధనాల వినియోగం ద్వారానే ఆ దేశాలు అభివృద్ధి చెందాయన్నది ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాల వాదన.
* మానవ కారణంగా భూగోళం వేడెక్కుతుందని, రాబోయే సంవత్సరాల్లో వాతావరణంలో తీవ్ర పరిణామాలు సంభవించి జీవ మనుగడకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ప్రపంచవ్యాప్తంగా అనేకమంది శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.
* భూగోళం వేడెక్కటానికి దోహదం చేసే మానవ కారణ అంశాల్లో అడవులను నరికేయడం ఒకటి.
* సగటు ఉష్ణోగ్రతలు 2° సెంటీగ్రేడులు పెరిగితే, వచ్చే శతాబ్దం ఆరంభం నాటికి దీని కారణంగా సముద్ర మట్టం ఒక మీటరు పెరుగుతుంది.
* ఫలితంగా తీర ప్రాంతాల నుంచి కోట్లాది మందిని ఇతర ప్రాంతాలకు తరలించాల్సి వస్తుంది. వీళ్లు తమ జీవనోపాధిని కోల్పోతారు.
* ఐలా పెను తుఫాను కారణంగా 2009లో సుందర్‌బన్ ప్రాంతం అతలాకుతలం కావడంతో పని వెతుక్కుంటూ తూర్పు కోల్‌కతా వచ్చి, నోనడంగా ప్రాంతంలో గత కొన్నేళ్లుగా జనాలు నివసిస్తున్నారు.
* వీరిని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించడానికి కోల్‌కతా నగర పాలక అభివృద్ధి సంస్థ అనేక ఇబ్బందులకు గురవుతోంది.
* ఇంకొక ప్రభావం వర్షపాతం మీద ఉంటుంది. వర్షపాతం రీతిలో చాలా మార్పులు రావచ్చు.
* కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం చాలా ఎక్కువగా ఉంటే, కొన్ని ప్రాంతాలు వర్షాభావానికి గురి కావచ్చు. అంటే వరదలు, కరవులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.
* హిమాలయాల్లోని హిమ పర్వతాలు వేగంగా కరగడం వల్ల చేపల ఆవాస ప్రాంతం ప్రభావితమై మంచినీటి చేపలు పట్టేవాళ్ల జీవనోపాధులు ప్రభావితమవుతాయి.

Posted Date : 19-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం