• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భారతదేశ న‌దులు - నీటి వనరులు

ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు

ఒక మార్కు ప్రశ్నలు

1. పుట్టుక ఆధారంగా భారతదేశ నదీ జల వ్యవస్థను ఎన్ని భాగాలుగా విభజించవచ్చు? అవి ఏవి?
జ: పుట్టుక ఆధారంగా భారతదేశ నదీ జల వ్యవస్థను రెండు భాగాలుగా విభజించవచ్చు.
అవి: 1) హిమాలయ నదులు
     2) ద్వీపకల్ప నదులు


2. హిమాలయ నదులను జీవ నదులు అని ఎందుకు అంటారు?
జ: హిమాలయ నదుల్లో సంవత్సరమంతా నీరు ఉంటుంది. వర్షపాతం, మంచు కరగడం ద్వారా నిరంతరం నీరు ప్రవహిస్తుంది. అందువల్ల వీటిని జీవనదులు అంటారు.


3. సింధూనది ఉపనదులను రాయండి.
జ: జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ సింధూనది ప్రధానమైన ఉపనదులు.


4. బ్రహ్మపుత్ర నదికి గల వివిధ పేర్లను రాయండి.
జ: టిబెట్‌లో దీన్ని 'సాంగ్‌పో' అంటారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో సియాంగ్, దిహాంగ్ అని పిలుస్తారు.

5. ద్వీపకల్ప పీఠభూమి ఉత్తర భాగంలో పుట్టిన గంగానదీ వ్యవస్థకు చెందిన నదులేవి?
జ: చంబల్, సింధ్, బేత్వా, కేన్, సోన్‌లు ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతంలో పుట్టిన గంగానదీ వ్యవస్థకు చెందినవి.


6. 'వాటర్‌షెడ్' అంటే ఏమిటి?
జ: ఎత్తయిన ప్రాంతంలో ఒకవైపు నీటి ప్రవాహాలు ఒక నదిలో, మరోవైపు నీటి ప్రవాహాలు మరో నదిలో కలిస్తే దాన్ని 'వాటర్‌షెడ్' అంటారు.


7. తుంగభద్ర నదీ జలాలను పంచుకుంటున్న రాష్ట్రాలు ఏవి?
జ: కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తుంగభద్రనదీ జలాలను పంచుకుంటున్నాయి.


8. అడవులు ఎందుకు క్షీణిస్తున్నాయి?
జ: చెట్లను విస్తృతంగా నరికివెయ్యడం, గనులు తవ్వడం లాంటి వాటివల్ల అడవులు క్షీణిస్తున్నాయి.


9. 'ఆదర్శ గ్రామ పథకం' కింద ఎన్నికైన గ్రామం ఏది? అది ఎక్కడ ఉంది?
జ: ఆదర్శ గ్రామ పథకం కింద ఎంపికైన గ్రామం 'హివారే బజార్'. ఇది మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉంది.


10. 'హివారే బజార్‌'లో విధించిన ముఖ్యమైన నాలుగు నిషేధాలు ఏవి?
జ: 1) చెట్లను నరకడం.
     2) పశువులను స్వేచ్ఛగా మేయడానికి వదలడం.
     3) మత్తుపానీయాల వాడకం నిషేధం.
     4) అధిక సంతానం నిషేధం.

11. నీటికి సంబంధించి ఎలాంటి చట్టాలు అవసరం?
జ: నీరు ప్రవహించే 'ఉమ్మడి వనరు' అని గుర్తించే చట్టాలు, నియమాలు అవసరం.


12. నీటి వినియోగ ప్రణాళికల కోసం ప్రభుత్వ నదీ పరీవాహక ప్రాధికార సంస్థ ఉంటే ఎలా ఉపయోగకరంగా ఉంటుంది?
జ: అందరికీ న్యాయం జరుగుతుంది. నీటి వనరుల అభివృద్ధికి, పర్యవేక్షణకు అన్ని స్థాయిల్లోనూ సహకరిస్తుంది.


13. గంగానది ఏయే రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది?
జ: ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ్ బంగ రాష్ట్రాల్లో గంగానది ప్రవహిస్తుంది.


14. నీటి వినియోగంలో పొదుపు ఆవశ్యకత గురించి ప్రజలను చైతన్యపరచడానికి రెండు నినాదాలు రాయండి.
జ:  1) వృథా చేయకు నీటిని, కొని తెచ్చుకోకు చేటుని
   2) చేయి, చేయి కలుపుదాం నీటిని పొదుపుగా వాడదాం


15. ప్రస్తుతం మనముందున్న నీటి సమస్యలేవి?
జ:  * జల వనరులు తరిగిపోవడం.
   * విచక్షణారహితంగా నీటిని వినియోగించడం.
   * వివిధ కారణాల వల్ల నీరు కలుషితమవడం.


16. పెరుమట్టి గ్రామంలో భూగర్భ జలాల వివాదంలో ఇద్దరు జడ్జీలు ఇచ్చిన తీర్పు పరస్పర విరుద్ధ భావాలను తెలియజేస్తుంది. ఎందుకు?
జ:  దీనికి కారణం భూగర్భ జలాలకు సంబంధించిన ప్రస్తుత చట్టాలు ఇప్పటి పరిస్థితులకు అనువైనవి కావు.

రెండు మార్కుల ప్రశ్నలు

1. 'భారతదేశంలోని నదులు భారతీయులకు ఎన్నో రకాల ప్రయోజనాలను సమకూరుస్తున్నాయి'. ప్రశంసించండి.
జ: ప్రకృతిలో పంచభూతాల్లో ఒకటిగా పిలిచే 'నీరు' మానవుడి మనుగడకు ఎంతో అవసరం. అనాది కాలం నుంచి ప్రజలు ఎక్కువగా నదీ తీర ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. నదులు ఎన్నో విధాలుగా ఉపయోపడుతున్నాయి.
* నదులు తాగు - సాగు నీటిని అందిస్తున్నాయి.
* పరిశ్రమలకు ఉపయోగపడుతున్నాయి.
* వంటకు, స్నానానికి, శుభ్రపరచడానికి, పశువులకు, మొక్కలకు నీటిని అందిస్తున్నాయి.
* జల విద్యుచ్ఛక్తి లభిస్తుంది.
* నదుల్లో దొరికే మత్స్య సంపద ఆహారంగా ఉపయోగపడటమే కాకుండా ఎంతోమందికి జీవనోపాధిని కల్పిస్తుంది.
* రవాణా మార్గాలుగా ఉపయోగపడుతున్నాయి.
* సుందర ప్రదేశాలు ఏర్పడుతున్నాయి.

 

2. మీ రాష్ట్రంలో నీటి సంరక్షణను మెరుగుపరచడానికి మీరు ఇచ్చే సూచనలు ఏవి?
జ: ప్రతి మనిషికి నీరు అవసరం కాబట్టి, దీన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.

 

నేనిచ్చే సూచనలు
 

* మంచినీటికి తప్ప, సాగునీటికి సాధ్యమైనంత వరకు బోరుబావులు తవ్వకూడదు.

* నీటిని అధికంగా తీసుకునే పంటలు తగ్గించి, తక్కువ నీరు అవసరమయ్యే పంటలు పండించాలి.
* వర్షపాతం తక్కువగా ఉంటే, చలికాలంలో సాగు విస్తీర్ణం తగ్గించాలి.
* చెట్లను నరకడం నిషేధించాలి. మొక్కలను ఎక్కువగా నాటాలి.
* పశువులను స్వేచ్ఛగా మేయడానికి వదలకూడదు.
* నీటి ఆవశ్యకతను తెలిపి, పొదుపును పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలి.
* నీరు కాలుష్యం కాకుండా, పరిశ్రమలపై నియంత్రణ ఉండాలి.

 

3. మీ ప్రాంతంలో ఏయే అవసరాలకు నీటి కొనుగోలు, అమ్మకాలు జరుగుతున్నాయి? దీనిపై నియంత్రణ ఉండాలా?
జ: * కరవు పరిస్థితుల వల్ల వ్యవసాయానికి నీటి కొనుగోలు, అమ్మకం జరుగుతుంది.
* పారిశ్రామిక అవసరాలకు పరిశ్రమలు నీటిని కొనుగోలు చేస్తున్నాయి.
* తాగునీటి అవసరాలకు, గృహ అవసరాలకు నీటిని కొంటున్నారు. ఈ పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఉంది. దీనిపై నియంత్రణ కచ్చితంగా ఉండాలి.
* ఈ అవసరాల దృష్ట్యా కొందరు వ్యాపారులు చేస్తున్న జల వ్యాపారాన్ని, నీటి దుర్వినియోగాన్ని తగ్గించడానికి నీటి కొనుగోలు, అమ్మకంపై నియంత్రణ ఉండాలి.


4. కింది పటాన్ని పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఎ) రెండు నదుల కలయిక వల్ల జన్మించిన నది ఏది? ఆ రెండు నదులు ఎక్కడ కలుస్తాయి?
జ: * రెండు నదుల కలయిక వల్ల జన్మించిన నది గంగానది.
* భగీరథి, అలకనంద దేవ ప్రయాగ వద్ద కలసి గంగానదిగా మారుతుంది.

బి) గంగానది, బ్రహ్మపుత్ర నదులు ఏయే రాష్ట్రాల ద్వారా ప్రవహిస్తున్నాయో తెలపండి.
జ:  * గంగానది ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ్ బంగా రాష్ట్రాల ద్వారా ప్రవహిస్తుంది.
* బ్రహ్మపుత్ర నది అరుణాచల్‌ప్రదేశ్, అసోంలో ప్రవహిస్తుంది.

నాలుగు మార్కుల ప్రశ్నలు

1. తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతంలో నీటి వనరులకు సంబంధించి ఎదుర్కొంటున్న సవాళ్లు ఏవి?
జ: తుంగభద్ర నది కృష్ణానదికి ఉపనది. ఈ నదీ ప్రవాహం కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. దీని మొత్తం పరీవాహక ప్రాంతం 71,417 చ.కి.మీ. ఇందులో 57,671 చ.కి.మీ. కర్నాటకలో ఉంది.


ఎదుర్కొంటున్న సవాళ్లు


* గత కొద్ది దశాబ్దాల నుంచి తుంగభద్ర ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుంది.
* ఈ నదీ పరీవాహక ప్రాంతాల్లో జనాభా పెరగడం, పారిశ్రామికీకరణ అభివృద్ధి చెందడంతో నీరు సరిపడినంతగా అందడం లేదు.
* గనుల తవ్వకం, దమ్ము, నేలకోత, వ్యర్థ పదార్థాల వల్ల రిజర్వాయర్ మేటవేసి, నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది.
* పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాల వల్ల నదీ జలాలు విషపూరితంగా మారుతున్నాయి.
* కుద్రేముఖ్‌లో ఇనుప ఖనిజం, శాండూర్ వద్ద మాంగనీస్ తవ్వకంలో సరైన ప్రామాణికాలు పాటించని కారణంగా పరీవాహక ప్రాంతంలో నేల కోత ఎక్కువైంది.
* దీనివల్ల సంప్రదాయ చెరువులు, చిన్న జలాశయాలు, తుంగభద్ర జలాశయం పూడికకు గురవుతున్నాయి.

* తక్కువగా లభించే నీటి వనరులను సక్రమంగా వినియోగించు కోలేకపోతున్నారు.
* నదీ పరీవాహక ప్రాంతాల్లోని పట్టణాలకు తాగునీటిని అందించడానికి సరైన ప్రణాళికలు రూపొందించడం లేదు. ప్రత్యేకించి చిన్న పట్టణాల్లో నీటి అందుబాటు, సమ పంపిణీలో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు వేసవిలో మరింత తీవ్రమవుతున్నాయని ఒక నివేదిక పేర్కొంది.
* రాష్ట్రాల మధ్య నీటి వనరుల పంపకానికి సరైన విధానాలు, ప్రణాళికలు లేకపోవడం వల్ల అంతర్రాష్ట్ర వివాదాలు తలెత్తుతున్నాయి.

 

2. 'భూగర్భ జలాలు అందరికీ చెందిన వనరులు'. దీనిపై మీ అభిప్రాయాలను తెలపండి.
జ: ప్రస్తుతం భూగర్భ జలాలే ప్రజలకు ప్రధానమైన నీటి వనరు. భూగర్భ జలాల వినియోగం నామమాత్రంగా ఉన్న రోజుల్లో వీటిపై సమస్యలుండేవి కావు. కానీ వర్షాభావం, భూగర్భ జలాల వాడకం పెరగడం, కాలుష్యం వల్ల భవిష్యత్ తరాలకు వీటిని అందించగలమా, లేదా అనే సందేహాలు రావడంతో భూగర్భ జలాలపై చర్చ పెరిగింది.
 భూ హక్కుకీ, భూగర్భ జలాలపై హక్కుకీ సంబంధాన్ని కలపలేం. భూమి కింద నుంచి తీసిన భూగర్భ జలాలపై ఆ భూ యజమానికి హక్కు ఉందని భావించేవారు. భూమి మీద ఏర్పరచుకున్న యాజమాన్య సరిహద్దులను భూగర్భ జలాలు పాటించవు. నీరు ప్రవహిస్తున్న వనరు. ఒక బోరు బావిలోంచి తోడుకో గల నీరు భూగర్భంలో రాతి పొరల ఏర్పాటు, వర్షపాతం, ఉపరితల నీటి నుంచి నేల లోపలికి ఇంకే నీరు లాంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ ఒక విశాల ప్రాంతంలో జరుగుతాయి. కాబట్టి ఆ ప్రాంతంలోని ఇతరుల చర్యలు ఈ బావిలోని నీటి మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి.

 ఉదాహరణకు ఒక బోరు బావి నుంచి ఎక్కువ నీరు తోడేస్తే దాని చుట్టుపక్కల ఉన్న అనేక బోరు బావులు ఎండిపోవచ్చు. పక్కవారి కంటే లోతైన బోరుబావి వేయాలని ప్రతి ఒక్కరూ పోటీపడుతూ ఉంటారు. ఒక ప్రాంతంలోని బోరు బావులన్నీ భూగర్భ స్వరూపం ద్వారా ఒక దాంతో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఒకే లోతున్న బావులన్నీ ఎండిపోయే అవకాశం ఉంటుంది.
  గాలికి ఎలా సరిహద్దులు నిర్ణయించలేమో, భూగర్భ జలాలకు సరిహద్దులు చూపలేం. భూ యజమానులకు వారికి ఇష్టమొచ్చినంత నీటిని తోడుకునే హక్కును ఇవ్వలేం. భూగర్భ జలాలు అందరికీ అవసరమే కాబట్టి 'భూగర్భ జలాలు అందరికీ చెందిన వనరుగా' చూడాలని నా అభిప్రాయం.

3.
 

 పై పట్టికను చదివి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.


ఎ) తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతం ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది? ఎందుకు?
జ: * తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతం కర్ణాటకలో ఎక్కువగా ఉంది.
   * ఈ నది కర్ణాటకలో ఎక్కువ దూరం ప్రవహించడం వల్ల ఇక్కడ నదీ పరీవాహక ప్రాంతం ఎక్కువగా ఉంది.

బి) తెలంగాణ రాష్ట్రం అవతరించక ముందు తుంగభద్ర నదీ జలాలను ఏయే రాష్ట్రాలు పంచుకునేవి?
జ: తెలంగాణ రాష్ట్రం అవతరించక ముందు తుంగభద్ర నదీ జలాలను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ పంచుకునేవి.

 

సి) నది నీటి నిల్వ సామర్థ్యం ఎందుకు తగ్గింది?
జ: గనుల తవ్వకం, దుమ్ము, నేలకోత, వ్యర్థ పదార్థాల లాంటి వాటి వల్ల రిజర్వాయర్ మేటవేసి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది.

 

డి) ఈ నదీ పరీవాహక ప్రాంతంలో అడవులు ఎందుకు క్షీణిస్తున్నాయి?
జ: చెట్లను విస్తృతంగా నరకడం, గనులు తవ్వడం లాంటి కారణాల వల్ల తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతంలో అడవులు క్షీణిస్తున్నాయి.

 

4. 'భూగర్భ జలాల చట్టాలు పాతవయ్యాయి, అవి ప్రస్తుత కాలానికి తగవు' వివరించండి.
జ: భూగర్భ జలాల వినియోగం నామమాత్రంగా ఉన్న రోజుల్లో ఈ చట్టాలను రూపొందించారు. అనేక రాష్ట్రాల్లో భూగర్భ జలాలకు సంబంధించిన చట్టాలు కాలం చెల్లినవే అని చెప్పవచ్చు. ప్రస్తుత పరిస్థితులకు ఇవి అనువైనవి కావు. భూ హక్కుకీ, భూగర్భ జలాలపై హక్కుకీ సంబంధం కలపడం అనేది ఈ నియమాల్లో ఉన్న లోపం.
భూమి నుంచి భూగర్భ జలాలను తోడుకోవాలి కాబట్టి ఈ నియమాలను అప్పట్లో రూపొందించారు. భూమి కింద నుంచి తీసిన భూగర్భ జలాలపై ఆ భూ యజమానికి హక్కు ఉందని భావించారు. కానీ నీరు ప్రవహించే వనరు అనే విషయాన్ని మరిచారు. తాగునీటికు మొదటి స్థానం ఇవ్వడంతో పాటు, దాన్ని పొందడం అనేది మానవ హక్కు. కాబట్టి నీరు 'ప్రవహించే ఉమ్మడి వనరు' అని గుర్తించే చట్టాలు రావాలి. కాలం చెల్లిన చట్టాలను మార్చాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉందని గుర్తించాలి.

5. కిందివాటిని భారతదేశ పటంలో గుర్తించండి.
 
ఎ)     1) హివారే బజార్     2) పెరుమట్టి     3) కర్ణాటక     4) మహారాష్ట్ర

                                         

                                                      (లేదా)


  బి)     1) రెండు హిమాలయ నదులు      2) రెండు ద్వీపకల్ప నదులు

అదనపు ప్రశ్నలు

1. జనాభాలో ఎక్కువ మందికి నీరు అందడం లేదు. కారణాలు రాయండి.
2. ఉపరితల నీటివనరుల్లో 70% కలుషితమయ్యాయి. ఎందుకు?
3. గంగానది ఉపనదుల్లో ఉత్తర, దక్షిణ దిశలుగా ప్రవహించే నదులు ఏవి?
4. హివారే బజార్ మాదిరిగానే భూగర్భ జలాల నియంత్రణ ప్రధానంగా ప్రజలే చేయాలా?
5. నీటిని సంరక్షించాలంటే మనం ఏం చేయాలి?
6. భూగర్భ జలాలను పెంచడానికి మీరిచ్చే సలహాలు ఏమిటి?
7. హిమాలయ నదులకు, ద్వీపకల్ప నదులకు మధ్య భేదాలను రాయండి.
8. బోరు బావులకు 24 గంటలూ విద్యుత్తు ఇవ్వడం మంచిదేనా?
9. హివారే బజార్‌లోని ప్రజల కృషిని ప్రశంసించండి.
10. ఆదర్శ గ్రామ పథకానికి ఎంపిక కావాలంటే మీ గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు?

Posted Date : 12-10-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

సాంఘిక శాస్త్రం

ఇతర సబ్జెక్టులు