• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ప్రపంచీకరణ

ముఖ్య‌మైన ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

ఒక్క మార్కు ప్రశ్నలు

1. విదేశీ పెట్టుబడులకు, జాయింట్ వెంచర్లకు మధ్య తేడా ఏమిటి?
జ: భూమి, భవనాలు, యంత్రాలు, ఇతర పరికరాల కోసం బహుళజాతి సంస్థలు ఖర్చు పెట్టే మొత్తాన్ని 'విదేశీ పెట్టుబడులు' అంటారు.
¤ * కొన్ని సందర్భాల్లో బహుళజాతి సంస్థలు ఆయా దేశాల స్థానిక సంస్థలతో కలిసి ఉత్పత్తిని చేపడతాయి. వీటిని 'జాయింట్ వెంచర్లు' అంటారు.

 

2. 'అరబ్ వసంతం'గా దేన్ని పేర్కొన్నారు?
జ: పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికాలో ట్యునీషియా, ఈజిప్టు లాంటి అనేక దేశాలు ఒకదానితో ఒకటి ప్రభావితమై నియంతలను తొలగించటానికి విప్లవాలు చేశాయి. ప్రసార మాధ్యమాలు ఈ విప్లవాన్ని 'అరబ్ వసంతం'గా పేర్కొన్నాయి.
 

3. ప్రపంచీకరణ అంటే ఏమిటి?
జ: దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియను 'ప్రపంచీకరణ' అంటారు.

4. ప్రపంచీకరణ వల్ల బహుళజాతి సంస్థలుగా ఎదిగిన భారతీయ సంస్థలు ఏవి?
జ: టాటా మోటార్స్ (వాహనాలు), ఇన్ఫోసిస్ (ఐ.టి), రాన్‌బాక్సీ (మందులు), ఏషియన్ పెయింట్స్ (రంగులు) వంటి భారతీయ సంస్థలు ప్రపంచీకరణ వల్ల బహుళజాతి సంస్థలుగా ఎదిగాయి.
 

5. బహుళజాతి సంస్థలు అని వేటిని అంటారు?
జ: ఒక దేశం కంటే ఎక్కువ దేశాల్లో ఉత్పత్తిని చేపట్టే లేదా నియంత్రించే సంస్థలను 'బహుళజాతి సంస్థలు' అంటారు.
 

6. విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులకు మధ్య తేడా ఏమిటి?
జ: * ఇతర దేశాలతో జరిగే వాణిజ్యాన్ని 'విదేశీ వాణిజ్యం' అంటారు.
* ఒక దేశంలో ఇతర దేశాలు పెట్టుబడి పెట్టి సంస్థలను నిర్వహించడాన్ని 'విదేశీ పెట్టుబడి' అంటారు.

 

7. బహుళజాతి సంస్థలకు ఉదాహరణలివ్వండి.
జ: పెప్సీ, హోండా, నోకియా, కోకాకోలా, రాన్‌బాక్సీ లాంటివి బహుళజాతి సంస్థలకు ఉదాహరణలు.
 

8. I.T ని విస్తరించండి.
జ: Information Technology (సమాచార సాంకేతిక పరిజ్ఞానం).
 

9. SEZ అంటే ఏమిటి?
జ: Special Economic Zone (ప్రత్యేక ఆర్థిక మండలి).

10. బహుళజాతి సంస్థలు వాటి కార్యాలయాలను ఎక్కడ నెలకొల్పుతాయి?
జ: కార్మికులు, ఇతర వనరులు చౌకగా లభించే ప్రాంతాల్లో బహుళజాతి సంస్థలు తమ కార్యాలయాలను, కర్మాగారాలను నెలకొల్పుతాయి.
 

11. జాయింట్ వెంచర్ల వల్ల స్థానిక సంస్థలు ఎలా ప్రయోజనం పొందుతాయి?
జ: బహుళజాతి సంస్థలు తెచ్చే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అదనపు పెట్టుబడుల వల్ల స్థానిక సంస్థలు ప్రయోజనం పొందుతాయి.
 

12. IBRD ని విస్తరించండి.
జ: International Bank for Reconstruction and Development (అంతర్జాతీయ పునర్నిర్మాణ, అభివృద్ధి బ్యాంకు).
 

13. IMF ను విశదీకరించండి.
జ: International Monetary Fund (అంతర్జాతీయ ద్రవ్యనిధి).
 

14. సెజ్ (SEZ) లలో ఉండే సౌకర్యాలను తెలపండి.
జ: సెజ్ (SEZ)లలో ప్రపంచస్థాయి సౌకర్యాలుంటాయి.
అవి: విద్యుత్తు, నీరు, రోడ్డు, రవాణా, గిడ్డంగులు, విద్య, వినోద సదుపాయాలు.

15. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం ఏ చట్టాలను సవరించింది?
జ: * విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం కార్మిక చట్టాలను సడలించింది.
* కార్మికులను దీర్ఘకాలిక ప్రాతిపదికన కాకుండా పని ఒత్తిడిని బట్టి తక్కువ కాల వ్యవధికి నియమించుకునే అవకాశాన్ని కల్పించింది.

 

16. ప్రపంచీకరణ వల్ల ప్రయోజనం పొందేవారు ఎవరు?
జ: * ప్రపంచీకరణ వల్ల అందరికీ ప్రయోజనం చేకూరడం లేదు.
* విద్య, నైపుణ్యం, సంపద ఉన్నవాళ్లు మాత్రమే కొత్త అవకాశాలు లభించి బాగా లాభపడ్డారు.
* ఎలాంటి ప్రయోజనం పొందని ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు.

 

రెండు మార్కుల ప్రశ్నలు

1. బహుళజాతి సంస్థలు పని ప్రదేశాన్ని ఎంచుకోవడానికి ఉపయోగించే సాధారణ సూచికలను తెలపండి.
జ: బహుళజాతి సంస్థలు పని ప్రదేశాన్ని ఎంచుకోవడానికి కింది సాధారణ సూచికలను ఉపయోగిస్తాయి.
* మార్కెట్లకు దగ్గరగా ఉండడం.
* తక్కువ ఖర్చుతో నైపుణ్యం ఉన్న, నైపుణ్యం లేని కార్మికులు లభించడం.
* ఇతర ఉత్పత్తి కారకాలు అందుబాటులో ఉండడం.
* ప్రభుత్వ విధానాలు తమ ప్రయోజనాలను కాపాడే విధంగా ఉండడం.

2. ప్రపంచ వాణిజ్య సంస్థ పాత్రను విశ్లేషించండి.
జ: * అభివృద్ధి చెందిన దేశాల చొరవతో 'ప్రపంచ వాణిజ్య సంస్థ' (WTO) 1995, జనవరి 1న ఏర్పడింది.
* దీని ప్రధాన కార్యాలయం జెనీవా (స్విట్జర్లాండ్)లో ఉంది.
* ఈ సంస్థలో సుమారు 160 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి.
* అంతర్జాతీయ వాణిజ్యంలో సరళీకృత విధానాలు ఏర్పరిచే ఉద్దేశంతో పని చేస్తున్న సంస్థల్లో 'ప్రపంచ వాణిజ్య సంస్థ' ఒకటి.
* ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన నియమాలను రూపొందించి, వాటిని సభ్యదేశాలు పాటించేలా చూస్తుంది.
* అందరూ స్వేచ్ఛా వాణిజ్యం చేపట్టేలా ప్రోత్సహిస్తోంది.

 

3. ప్రపంచీకరణ భవిష్యత్తులో కూడా కొనసాగితే, రాబోయే ఇరవై ఏళ్లలో ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించి రాయండి.
జ: ¤* ప్రపంచీకరణ భవిష్యత్తులో కూడా కొనసాగితే ఇరవై సంవత్సరాల తర్వాత బహుళజాతి సంస్థల నుంచి పోటీని తట్టుకోలేక దేశీయ సంస్థలు మూతపడిపోవచ్చు.
* బహుళజాతి సంస్థల వస్తుసేవలను దృష్టిలో ఉంచుకుని స్వదేశీ వస్తుసేవలపై మోజును పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది.
* మానవ సంబంధాలు దెబ్బతినవచ్చు.

* ప్రపంచంలోనే పేరుగాంచిన భారతీయ సంస్కృతిపై వీటి ప్రభావం పడొచ్చు.
* విద్య, వైద్య రంగాల్లో కూడా బహుళజాతి సంస్థలు ప్రాచుర్యం పొందవచ్చు.
* భారతదేశంలోని పెద్దపెద్ద ప్రభుత్వరంగ సంస్థల్లో కూడా ఇవి ప్రవేశించవచ్చు.

 

4. ఒప్పంద కూలీలు అంటే ఎవరు? వారు ఎటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు?
జ: * కొత్త దేశానికి లేదా ప్రాంతానికి ప్రయాణానికయ్యే ఖర్చును యజమాని పెట్టుకోగా, దాని బదులుగా ఒక నిర్దిష్ట కాలంపాటు అతని వద్ద పని చేస్తానని కార్మికుడు ఒప్పందం కుదుర్చుకొని దానికి కట్టుబడి ఉంటాడు. వీరినే 'ఒప్పంద కూలీలు' అంటారు.
* ఈ విధంగా భారతదేశం నుంచి కార్మికులు కరీబియన్ దీవులు, మారిషస్, ఫిజీ, మలేషియా, శ్రీలంక లాంటి దేశాలకు వెళ్లారు.
* అక్కడ నివాస, పని పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి.
* ఆ కూలీలకు ఎటువంటి చట్టబద్ధమైన హక్కులు ఉండేవి కావు.

 

5. 'ఫోర్డ్ మోటర్స్' కంపెనీ ఏ దేశానికి చెందింది? దాని కార్యకలాపాలేవి?
జ: * 'ఫోర్డ్ మోటార్స్' కంపెనీ అమెరికా దేశానికి చెందింది.
* ఇది ప్రపంచ వ్యాప్తంగా 26 దేశాల్లో ఉత్పత్తి సౌకర్యాలు కలిగి, అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారుగా ఉంది.
* ఈ కంపెనీ 1995లో భారతదేశానికి వచ్చి రూ.1700 కోట్లతో చెన్నైలో కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది.

* భారతదేశంలో జీపులు, లారీల తయారీలో అతిపెద్ద కంపెనీ అయిన మహీంద్ర అండ్ మహీంద్రతో కలిసి ఈ కర్మాగారాన్ని నెలకొల్పింది.
* 2004 నాటికి ఫోర్డ్ మోటార్స్ భారతదేశంలో 27,000 కార్లు అమ్మింది.
* భారత్ నుంచి దక్షిణాఫ్రికా, మెక్సికో, బ్రెజిల్ దేశాలకు మరో 24,000 కార్లు ఎగుమతి చేస్తోంది.
* ఈ కంపెనీ ఇతర దేశాల్లోని ఉత్పత్తి కేంద్రాలకు విడి భాగాలను సరఫరా చేసేలా అభివృద్ధి చేయాలనే తలంపుతో ఉంది.

 

6. బహుళజాతి సంస్థలు, స్థానిక కంపెనీలను కొనుగోలు చేసిన తర్వాత MNCలకు లోబడి పనిచేయాలి. ఇది ఎంత వరకు నిజం?
జ: * స్థానిక కంపెనీలు బహుళజాతి సంస్థలకు అమ్ముడుపోయిన తర్వాత కచ్చితంగా MNCలకు లోబడి పని చేయాల్సిందే.
* అభివృద్ధి చెందిన దేశాల్లోని పెద్ద బహుళజాతి సంస్థలు ఉత్పత్తి కోసం చిన్న ఉత్పత్తిదారులకు ఆర్డర్లు ఇస్తాయి.
* ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్న ఉత్పత్తిదారులు దుస్తులు, చెప్పులు, క్రీడా పరికరాల లాంటి ఎన్నో వస్తువులను ఉత్పత్తి చేసి బహుళజాతి సంస్థలకు అందజేస్తాయి.
* వాటిని MNCలు తమ బ్రాండ్ పేరుతో వినియోగదారులకు విక్రయిస్తాయి.
* ఈ చిన్న ఉత్పత్తిదారులకు ధర చెల్లించే అధికారంతో పాటు వాటి నాణ్యత, సరకు అందించే సమయం, కార్మికుల పరిస్థితులను ప్రభావితం చేసే అధికారం బహుళజాతి సంస్థలకు ఉంటుంది.

7. చైనా బొమ్మలు, భారతీయ బొమ్మల ఉత్పత్తిదారులకు పెనుసవాలుగా పరిణమించాయి. కారణాలు రాయండి.
జ: చైనా బొమ్మల వల్ల, భారతీయ బొమ్మల ఉత్పత్తిదారులు దారుణంగా నష్టపోతున్నారు. ఎందుకంటే..
* భారతదేశంలో కొనుగోలుదార్లకు ఇప్పుడు భారతీయ, చైనా బొమ్మలను ఎంచుకునే అవకాశం ఉంది.
* కొత్త డిజైన్లు, తక్కువ ధర కారణంగా చైనా బొమ్మలు ఎంతో ఆదరణ పొందాయి.
* ఒక సంవత్సర కాలంలో 70 - 80 శాతం బొమ్మల దుకాణాలు భారతీయ బొమ్మలకు బదులుగా చైనా బొమ్మలను విక్రయించాయి.
* గతంలో కంటే ఇప్పుడు భారత్‌లో బొమ్మలు చౌకగా ఉన్నాయి.
* భారతీయ బొమ్మల ఉత్పత్తిదారుల పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. పోటీ వల్ల తమ బొమ్మలు అమ్ముడుపోక వారు కొత్త మార్గాలను అన్వేషించాల్సి వచ్చింది.
* ఈ ప్రక్రియలో కొంతమంది దివాలా తీశారు.

 

8. బహుళజాతి సంస్థల వల్ల కలిగే లాభ, నష్టాలేవి?
జ: బహుళజాతి సంస్థల వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి.
 

లాభాలు
 

* ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.
* ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది.

* నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తాయి.
¤ వస్తువుల ధరలు తగ్గుతాయి.
* ఉత్పత్తిదారుల మధ్య పోటీ పెరుగుతుంది.
* ప్రజల నైపుణ్యాలు పెరుగుతాయి.
* మన దేశం కూడా ఉత్పత్తిలో అగ్రరాజ్యాలతో పోటీ పడుతుంది.
* దేశాల మధ్య అనుసంధానం పెరుగుతుంది.

 

నష్టాలు
 

* అందరికీ ఉపాధి అవకాశాలు లభించడం లేదు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారికి మాత్రమే ఉపాధి లభిస్తుంది. ఎక్కువ మంది నిరుద్యోగులవుతున్నారు.
* వ్యవసాయ రంగానికి అంతగా ప్రాధాన్యత లేదు.
* గ్రామాలు అంతరించే ప్రమాదముంది. పట్టణాలు పెరుగుతాయి.
* చిన్న ఉత్పత్తిదారులు దెబ్బతింటారు. కొంతమంది పరిశ్రమలను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
* విదేశీ వాణిజ్యంలో అధిక భాగాన్ని బహుళజాతి సంస్థలు నియంత్రిస్తాయి.

9. విదేశీ వాణిజ్య సరళీకరణ అంటే ఏమిటి? దీని ద్వారా ఉత్పత్తిదారులు ఎలా లాభపడుతున్నారు?
జ: స్వాతంత్య్రం పొందిన తరువాత భారత ప్రభుత్వం విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులకు అవరోధాలు విధించింది. ఆ తర్వాత 1991 నుంచి దీర్ఘకాల ప్రభావం చూపించే విధంగా భారతదేశ విదేశీ వాణిజ్య విధానాల్లో మార్పులు చేశారు.
* విదేశీ వాణిజ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం విధించిన పరిమితులు, అవరోధాలను తొలగించి దేశంలోకి స్వేచ్ఛగా వస్తుసేవల ఎగుమతి, దిగుమతిని అనుమతిస్తూ ఆర్థిక విధానాన్ని సరళీకరించారు. దీన్నే 'విదేశీ వాణిజ్య సరళీకరణ' అంటారు.
* సరళీకృత విధానాల ఫలితంగా తాము ఎగుమతి చేయదలచుకున్న ఉత్పత్తులపై సంబంధిత వ్యాపారులు, వాణిజ్యం చేసేవారు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుంటున్నారు.
* విదేశీ కంపెనీలు ఇక్కడ కార్యాలయాలు, కార్మాగారాలను స్థాపించుకునే అవకాశం ఏర్పడింది.
* అంతకు ముందు కాలంతో పోలిస్తే ప్రభుత్వం చాలా తక్కువ పరిమితులు, ఆంక్షలను విధించింది.
దీన్నే 'సరళీకృత ఆర్థిక విధానం' అంటారు.
* భారతదేశ విధానాల్లో మార్పులు చేసిన తర్వాత, భారతీయ ఉత్పత్తిదారులు, ప్రపంచ ఉత్పత్తి దారులతో పోటీపడాల్సి వచ్చింది.
* ఈ పోటీ ఫలితంగా దేశంలోని ఉత్పత్తిదారులు తమ వస్తువుల నాణ్యతను మెరుగుపరుచుకుంటున్నారు. కాబట్టి వాటి పనితీరు మెరుగవుతోంది.
* ఈ విధంగా దేశ, విదేశీ ఉత్పత్తిదారులకు 'విదేశీ వాణిజ్య సరళీకరణ' ఎంతో ఉపయోగపడుతుంది.

10. 'ప్రపంచీకరణ ప్రక్రియకు ముఖ్య కారణం సాంకేతిక పరిజ్ఞానం'. దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు? వ్యాఖ్యానించండి.
జ: ప్రపంచీకరణ ప్రక్రియకు ముఖ్యకారణం సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందటమేనని చెప్పవచ్చు. ఎందుకంటే..
* ప్రపంచీకరణకు దోహదం చేసే అంశాల్లో ఇది ముఖ్యమైంది.
* గత 50 సంవత్సరాల్లో రవాణా, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. దీనివల్ల ఎక్కువ దూరాలకు సైతం తక్కువ సమయంలో, తక్కువ ధరలకు వస్తువులను చేరవేస్తున్నాం.
* సమాచార, భావ ప్రసార సాంకేతిక రంగంలో అభివృద్ధి గణనీయంగా ఉంది.
¤* టెలీకమ్యూనికేషన్ సేవలను (టెలిగ్రాఫ్, టెలిఫోను, మొబైల్ - ఫోన్లతో సహా ఫ్యాక్స్) ప్రపంచంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి, మారుమూల ప్రాంతాల నుంచి కూడా సమాచారాన్ని వెంటనే గ్రహించడానికి ఉపయోగించుకుంటున్నారు.
* ఉపగ్రహ ప్రసార సాధనాల వల్ల ఇదంతా సాధ్యమైంది.
* ప్రస్తుతం ప్రతి రంగంలోకి కంప్యూటర్లు ప్రవేశించాయి.
* వీటి ద్వారా ఏ విషయం గురించైనా క్షణాల్లో సమాచారం తెలుసుకోవచ్చు. మీ దగ్గరున్న సమాచారాన్ని పంచుకోవచ్చు.

* ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో ఎక్కడికైనా నామమాత్రపు ఖర్చుతో తక్షణమే ఎలక్ట్రానిక్ మెయిల్ (e-mail) పంపవచ్చు. ఎవరితోనైనా (voice mail) మాట్లాడవచ్చు.
* ఇటువంటి సాంకేతిక నైపుణ్యాలు రావటం వల్ల, ప్రపంచీకరణ ప్రక్రియ విజయవంతంగా ముందుకు సాగుతుంది.

 

11. ఒకరికి అభివృద్ధి అయింది మరొకరికి విధ్వంసం కావచ్చని మనం ఇది వరకే చదివాం. ఆర్థిక మండళ్లను నెలకొల్పటాన్ని భారతదేశంలోని కొంతమంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. వీరు ఎవరో, ఎందుకు వాటిని వ్యతిరేకిస్తున్నారో తెలపండి.
జ: అనేక వర్గాల ప్రజలు ప్రత్యేక ఆర్థిక మండళ్ల (SEZs) ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు.
 

వ్యతిరేకించటానికి కారణాలు
 

* సెజ్‌లు దేశీయ సంస్థలను దెబ్బతీస్తున్నాయి. అందుకే వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.
* సెజ్‌ల ఏర్పాటు వల్ల కార్మికుల హక్కులు హరించిపోతున్నాయి. కాబట్టి వారిలో వ్యతిరేకత వచ్చింది.
* సెజ్‌లు పెట్టుబడి వ్యవస్థను సమర్థిస్తాయి. దీని మూలంగా సామ్యవాదుల్లో వ్యతిరేకత ఉంది.
* స్థానికులకు తక్కువ ఉపాధి లభిస్తుంది. కాబట్టి వారు వ్యతిరేకిస్తున్నారు.
* చిన్న రైతులు, బడుగువర్గాల భూములను సెజ్‌లకు కేటాయించారు. కాబట్టి వారు వీటిని సమర్థించడం లేదు.
* సెజ్‌ల వల్ల విదేశీ సంస్కృతులకు ఆదరణ పెరిగి భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలు అంతరించిపోయే ప్రమాదముంది. అందుకే సంప్రదాయవాదులు వ్యతిరేకిస్తున్నారు.
* వీరు పెట్టే పరిశ్రమల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.
    కాబట్టి ఒకరికి అభివృద్ధి అయింది, మరొకరికి కాకపోవచ్చు. విధ్వంసం కూడా కావచ్చు.

12. 'ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాల ప్రకారం మేం వాణిజ్య అవరోధాలను తొలగించాం. కానీ మీరు ఆ నియమాలను పట్టించుకోకుండా మీ రైతులకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారు. మా రైతులకు మద్దతు ఇవ్వొద్దని మా ప్రభుత్వాలకు చెప్పి మీరు మీ రైతులకు మద్దతును కొనసాగిస్తున్నారు. స్వేచ్ఛ, న్యాయమైన వాణిజ్యం అంటే ఇదేనా'.
అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందిన దేశాలను ఎందుకిలా ప్రశ్నిస్తున్నాయి? వ్యాఖ్యానించండి.

జ: అమెరికా జీడీపీలో వ్యవసాయం వాటా 1 శాతం కాగా మొత్తం ఉపాధిలో కేవలం 0.5 శాతం మాత్రమే ఈ రంగానికి చెందినవారు. అయినప్పటికీ ఈ కొద్దిమందికే ఉత్పత్తికి, ఇతర దేశాల ఎగుమతికి ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు లభిస్తున్నాయి.
* పెద్దమొత్తంలో లభించే ఈ సబ్సిడీల వల్ల అమెరికా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను చాలా తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.
* అదనంగా ఉన్న వ్యవసాయ ఉత్పత్తులను ఇతర దేశాల మార్కెట్లలో చాలా తక్కువ ధరకు అమ్ముతున్నారు.
* ఇది ఇతర దేశాలలోని రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
* వాణిజ్య అవరోధాలను తొలగించడానికి ప్రపంచ వాణిజ్య సంస్థ కొన్ని నియమాలను పెట్టింది.
* అభివృద్ధి చెందిన దేశాలు ఆ నియమాలను దాటి ప్రవర్తిస్తున్నాయి.
* దీనివల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే ఆ దేశాలు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాయి.

13. కింది పేరా చదివి దానిలోని ఏవైనా 4 దేశాలను ప్రపంచ పటంలో గుర్తించండి.
ఎ. భారతదేశం నుంచి కార్మికులు కరీబియన్ దీవులు, మారిషస్, ఫిజీ, మలేషియా, శ్రీలంక లాంటి దేశాలకు వెళ్లారు. అక్కడ నివాస, పని పరిస్థితులు చాలా దారుణంగా ఉండడమే కాకుండా వాళ్లకు ఎటువంటి చట్టబద్ధమైన హక్కులు ఉండేవి కావు. ఇలా వలస వెళ్లిన వాళ్లలో చాలామంది ఆయా దేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఈ విధంగా సాంస్కృతిక మేళవింపులు అనేకం జరిగాయి.


 
                                          (లేదా)
 

బి. అమెరికాకు చెందిన ఫోర్డ్ మోటర్స్ కంపెనీ 1995లో భారత్‌కు వచ్చి రూ.1700 కోట్లతో చెన్నై దగ్గర కర్మాగారాన్ని నెలకొల్పింది. భారతదేశం నుంచి దక్షిణాఫ్రికా, మెక్సికో, బ్రెజిల్ దేశాలకు మరో 24000 కార్లు ఎగుమతి చేస్తోంది. ఇతర దేశాలలోని ఉత్పత్తి కేంద్రాలకు విడి భాగాలను సరఫరా చేసేలా ఫోర్డ్ ఇండియాను అభివృద్ధి చేయాలన్న తలంపుతో కంపెనీ ఉంది.

Posted Date : 19-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం