• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం 1900 - 1950

ముఖ్య‌మైన ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

ఒక మార్కు ప్రశ్నలు

1. 20వ శతాబ్దం ప్రారంభంలో జార్‌ల పాలనలోని విశాల సామ్రాజ్యంలో ఏయే దేశాలు ఉండేవి?
జ: రష్యా, ఉక్రెయిన్, ఉజ్బెకిస్థాన్, కజకస్థాన్, తజికిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్‌ దేశాలు ఉండేవి.


2. ‘యానిమల్‌ ఫామ్‌’ రచయిత ఎవరు? ఆ నవలలో అతడు ఏ అంశాన్ని చిత్రీకరించాడు?
జ: ‘యానిమల్‌ ఫామ్‌’ రచయిత జార్జ్‌ ఆర్వెల్‌. ఇది ఒక వ్యంగ్య నవల. దీనిలో అతడు రష్యన్‌ విప్లవంలోని ఆదర్శాలను యూఎస్‌ఎస్‌ఆర్‌లో ఎలా నీరుకార్చారో చిత్రీకరించాడు.


3. ఆర్థికమాంద్యంపై జె.ఎం.కీన్స్‌ ఏమని వాదించాడు?
జ: ఆర్థిక పరిస్థితి క్షీణించి గిరాకీ తగ్గినప్పుడు ప్రభుత్వ నిధులతో ఉపాధి కల్పించాలని, దీనివల్ల ప్రజలకు ఆదాయం సమకూరి మార్కెట్‌లో వస్తువులకు డిమాండు ఏర్పడుతుందని కీన్స్‌ వాదించాడు.


4. రెండో ప్రపంచ యద్ధం ముగిసేనాటికి బ్రిటన్‌లో సంక్షేమ రాజ్యం ఏర్పడటానికి ఏయే అంశాలు దోహదం చేశాయి?
జ: నిరుద్యోగ భృతి, అనారోగ్యానికి ఖర్చులు, ఆరోగ్య పథకాలు, శిశు సంరక్షణ అంశాలు దోహదపడ్డాయి.

5. తీవ్ర ఆర్థికమాంద్యం ఎప్పుడు సంభవించింది?
జ: 1929లో తీవ్ర ఆర్థికమాంద్యం సంభవించింది.


6. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణమేమిటి?

జ: 1914, జూన్‌ 28న ఫెర్డినాండ్‌ ఒక సెర్బియన్‌ ఉన్మాది చేతిలో హత్యకు గురవడమే మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం.


7. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు ఏవి?
జ: బాలల అత్యవసర నిధి; విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ, ఆరోగ్య సంస్థ, కార్మిక సంస్థలు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు.


8. రష్యన్‌ కమ్యూనిస్టు విప్లవం నుంచి స్ఫూర్తి పొందిన భారతీయులు ఎవరు?
జ: ఎం.ఎన్‌. రాయ్, ఠాగూర్, నెహ్రూ లాంటి భారతీయులు రష్యన్‌ విప్లవం నుంచి స్ఫూర్తి పొందారు.


9. సామ్యవాదం యొక్క రెండు లక్షణాలను తెలపండి.
జ: * ఉత్పత్తి సాధనాల ప్రక్రియ ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. 
   * ప్రైవేటు ఆస్తి అనే భావన సామ్యవాదంలో ఉండదు.


10. ప్రపంచ యుద్ధాల అనంతరం ఏర్పడిన రెండు ప్రధాన సైద్ధాంతిక రాజకీయ శిబిరాలు ఏవి?
జ: * యూఎస్‌ఎస్‌ఆర్‌ నేతృత్వంలోని కమ్యూనిస్టు శిబిరం.
   * అమెరికా నేతృత్వంలోని ప్రజాస్వామిక పెట్టుబడిదారీ శిబిరం.

11. రెండో ప్రపంచ యుద్ధానంతరం స్వాతంత్య్రం పొందిన ఏవైనా రెండు దేశాల పేర్లు రాయండి.
జ: భారతదేశం, శ్రీలంక


12. ‘ఎనేబ్లింగ్‌’ చట్టం ఫలితం ఏమిటి?

జ: 1933, మార్చి 3న ఎనేబ్లింగ్‌ చట్టాన్ని రూపొందించారు. దీని ద్వారా జర్మనీలో నియంతృత్వం ఏర్పడింది. పార్లమెంట్‌ను పట్టించుకోకుండా డిక్రీల ద్వారా పాలించే అధికారాన్ని హిట్లర్‌కు ఈ చట్టం కల్పించింది.


13. 1917లో సంభవించిన తొలి రష్యన్‌ విప్లవానికి మరొక పేరేమిటి?
జ: 1917లో సంభవించిన తొలి రష్యన్‌ విప్లవానికి మరో పేరు మార్చి విప్లవం.


14. నాజీలు కోరుకున్న విధంగా సమాజాన్ని నియంత్రించడానికి ఏర్పడిన ప్రత్యేక నిఘా, భద్రతా దళాలు ఏవి?
జ: ఆకుపచ్చ యూనిఫారంలో ఉన్న పోలీసు సిబ్బంది, స్టార్మ్‌ ట్రూపర్స్, గెస్టాపో (రహస్య పోలీసు బృందం), రక్షణ దళాలు, నేర విచారణ పోలీసులు, భద్రతా సేవలు ఏర్పడ్డాయి.
 

రెండు మార్కుల ప్రశ్నలు


1. 1917, మార్చి 8న సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ నగరంలో పదివేల మంది మహిళలు నిరసన ఊరేగింపు చేపట్టి, ‘రొట్టె, శాంతి’ కావాలని కోరారు. ఈ నిరసనలో మహిళలతోపాటు కార్మికులు కూడా చేరారు.
ప్ర. మహిళలు ఎందుకు నిరసన ఊరేగింపు చేపట్టారు?
జ: మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం రష్యాకు ఉండేది. 1917 నాటికి 20 లక్షల మంది సైనికులు, పౌరులు చనిపోయారు. ప్రాణనష్టమే కాకుండా రష్యా ఆర్థిక పరిస్థితి కూడా పూర్తిగా చిన్నాభిన్నమైంది. యుద్ధ రంగానికి ఆహారాన్ని మళ్లించడం వల్ల పట్టణాల్లో ఆహార కొరత ఏర్పడింది. యుద్ధం వల్ల శాంతి లేకపోవడం, ఆహారం లభించకపోవడంతో మహిళలు నిరసన ఊరేగింపు చేపట్టారు.

2. హోలోకాస్ట్, ఆష్విట్జ్‌ల గురించి మీకు తెలిసింది రాయండి.
జ: హోలోకాస్ట్‌: దీని అర్థం ‘మంటల్లో తోసి చంపడం’. దేశంలోని అన్ని అనర్థాలకు యూదులే కారణమంటూ హిట్లర్‌ వారిని హోలోకాస్ట్‌ల ద్వారా హత్య చేయించేవాడు.
ఆష్విట్జ్‌: ఇవి గ్యాస్‌ ఛాంబర్స్‌. నాజీలు తమను ఎదిరించిన వారిని గదుల్లో పెట్టి, వాటిలోకి గ్యాస్‌ను పంపి చంపేవారు.


3. అమెరికాలో తీవ్ర ఆర్థికమాంద్యం ప్రభావాన్ని వివరించండి.
జ: అమెరికాలో తీవ్ర ఆర్థికమాంద్య ప్రభావం:
* నిరుద్యోగులు 25% పెరిగారు.
* ఫ్యాక్టరీలు మూతపడి వాణిజ్యం తగ్గడంతో పట్టణాలు పతనానికి కేంద్రాలుగా మారాయి.
* దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గి లక్షలాది మంది రైతులు పేదలుగా మారారు. 
* పేదరికం పెరిగింది. ఇళ్లులేక పలు ప్రాంతాలు నిర్జనంగా మారాయి.


3. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ చేపట్టిన ‘మానవ మారణ హోమం’లో బలైనవారు ఎవరు?
జ: రెండో ప్రపంచ యుద్ధం కొనసాగుతున్న కాలంలో నాజీ ప్రభుత్వం జర్మన్‌ జాతి ఆధిపత్యాన్ని నిర్మించడానికి అల్పసంఖ్యాక వర్గాలపై దారుణ హత్యాకాండల కార్యక్రమాన్ని చేపట్టింది.
* దీని ఫలితంగా యూరప్‌లో ఎంపిక చేసిన అమాయకులైన పౌరులను పెద్ద సంఖ్యలో చంపేశారు. 
* ఆరు కోట్ల యూదులు, 20 లక్షల జిప్సీలు, కోటి పోలిష్‌ పౌరులు బలయ్యారు.

* బలైనవారిలో మానసిక, శారీరక వైకల్యం గల 70 వేల మంది జర్మన్లు; 10 వేల మంది స్వలింగ సంపర్కులు, అనేక రాజకీయ ప్రత్యర్థులు, వివిధ మతాలకు చెందినవారు ఉన్నారు.
* నాజీలు అంతకు ముందెన్నడూ లేని విధానాలను ఉపయోగించి ప్రజలను వధించేవారు. ఉదాహరణకు ఆష్విట్జ్ లాంటి హత్యాకేంద్రాల్లో ప్రజలను గదుల్లో బంధించి, వాటిలోకి గ్యాస్‌ను పంపి వారిని చంపేవారు.


4. తీవ్ర ఆర్థికమాంద్యం సంభవించినప్పుడు బ్రిటన్‌ ఏయే చర్యలు చేపట్టింది?
జ: * మాంద్యం సంభవించక ముందే మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనే బ్రిటన్‌ నిరుద్యోగ బీమా, వృద్ధాప్య పింఛన్‌ పథకాలను చేపట్టింది. 
* రెండో ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి నిరుద్యోగ భృతి, అనారోగ్యానికి ఖర్చులు, ఆరోగ్య పథకాలు, శిశు సంరక్షణ లాంటి సామాజిక భద్రతా చర్యలను విస్తృతంగా చేపట్టింది. ఇవన్నీ సంక్షేమ రాజ్యాన్ని ఏర్పరచడానికి దోహదం చేశాయి.
* దీని ప్రకారం ప్రజలందరికీ కనీస జీవన స్థాయి, ఆహారం, గృహవసతి, ఆరోగ్యం, విద్య, శిశు, వృద్ధాప్య సంరక్షణ లాంటి మౌలిక అంశాలకు ప్రభుత్వం హామీగా ఉంటుంది.
* ప్రభుత్వం మార్కెట్‌ ఆధారిత పెట్టుబడిదారీ విధానంలోని ఒడుదొడుకులను తగ్గించడానికి ప్రయత్నించింది.

5. కింది పటాన్ని పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.


ఎ) జపాన్‌ నియంత్రణలో లేని రెండు దేశాలను పేర్కొనండి.
జ: ఇండియా, యూఎస్‌ఎస్‌ఆర్‌
బి) జపాన్‌ నియంత్రణలో ఉండి, ఆ దేశానికి పశ్చిమ వైపున ఉన్న రెండు ప్రాంతాలను తెలపండి.
జ: థాయ్‌లాండ్, కొరియా

నాలుగు మార్కుల ప్రశ్నలు

1. లెనిన్, స్టాలిన్‌ రష్యాలో ఏయే మార్పులు తీసుకొచ్చారు?
జ: లెనిన్, స్టాలిన్‌ రష్యాలో అనేక విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చారు.
లెనిన్‌:
* కమ్యూనిస్టు రష్యా స్థాపకుడు, నిర్మాత అయిన లెనిన్‌ అసలు పేరు వ్లాదిమిర్‌ ఇల్లిచ్‌ ఉలియనోవ్‌. ఇతడి కలం పేరైన ‘యన్‌.లెనిన్‌’తో ఆయన్ని పిలిచేవారు. బోల్షివిక్కులకు లెనిన్‌ (1870 - 1924) నాయకత్వం వహించాడు.
మార్పులు: 
* లెనిన్‌ భూమినంతటినీ జాతీయం చేసి, దాన్ని రైతులందరికీ పంచిపెట్టాడు.
* ఇతడు ప్రవేశపెట్టిన ‘నూతన ఆర్థిక విధానం’ ప్రకారం కర్షకులు తాము ఉత్పత్తి చేసిన సరకులను తామే మార్కెట్‌లో అమ్ముకోవచ్చు.
* ధరలను నియంత్రించాడు.

* అన్ని కర్మాగారాలు, బ్యాంకులను జాతీయం చేశాడు.
* దేశీయ, విదేశీయ అప్పులు రెండింటినీ రద్దు చేశాడు.

స్టాలిన్‌:
* 1924లో లెనిన్‌ చనిపోయిన తర్వాత స్టాలిన్‌ కమ్యూనిస్టు పార్టీ నాయకుడయ్యాడు. ఇతడి నాయకత్వంలో రాజకీయ, ఆర్థిక రంగాల్లో ప్రధానమైన మార్పులు వచ్చాయి.
మార్పులు:


* శాసించడానికి వీల్లేని అధికారంతో సోవియట్‌ రష్యాను బలమైన ఆర్థిక శక్తిగా మలిచాడు.
* పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాన్ని అందించాడు. పంచవర్ష ప్రణాళికల ద్వారా రష్యాలో పారిశ్రామికాభివృద్ధిని అనూహ్యరీతిలో సాధించాడు.
* పెద్ద కమతాల వ్యవసాయానికి మారాలన్న ఉద్దేశంతో ‘ఉమ్మడి క్షేత్రాలు’ ఏర్పాటు చేశాడు.
* నిరక్షరాస్యతను నిర్మూలించి కమ్యూనిస్టు విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు.


2. పిల్లలను పెంచడానికే మహిళలు పరిమితమా? అన్ని విషయాల్లో స్త్రీ, పురుషులు సమానంగా భాగస్వాములు కాగలరని మీరు అనుకుంటున్నారా?
జ: పిల్లలను పెంచడానికే మహిళలు పరిమితం కాకూడదు. ఒక జాతిని కాపాడటంలో అన్నింటికంటే స్థిరమైన అంశం మహిళలే అనే హిట్లర్‌ మాటల్లో అతిశయోక్తి లేదు. 
* సమాజంలో కుటుంబానికి గుర్తింపు తెచ్చేది స్త్రీ.

* మహిళ తన నిరంతర ఆత్మత్యాగంతో ఎన్ని బాధలున్నా సంతానాన్ని అభివృద్ధి పథాన నడిపించడానికి కృషి చేస్తుంది.
* ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నిరంతరం శ్రమజీవిగా బతుకుతుంది.
* ప్రస్తుతం మహిళలు భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని విషయాల్లో భాగస్వాములవుతున్నారు. 
* పిల్లలను పెంచడమే కాకుండా, వ్యవసాయ క్షేత్రాలు, కార్యాలయాలు, కర్మాగారాలు, చట్టసభలు, సైన్యంలో మహిళలు పురుషులతో సమానంగా పనిచేస్తున్నారు.
* పిల్లలను సన్మార్గంలో నడిపించడంలో ఇద్దరూ భాగస్వాములే.
* వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో పురుషులతోపాటు స్త్రీలు కూడా తమవంతు కృషి చేస్తున్నారు.
* అన్ని విషయాల్లో స్త్రీ, పురుషులిద్దరూ తమ మేధాశక్తితో సమానంగా పని చేయగలరు.
 కాబట్టి అన్ని విషయాల్లో స్త్రీ, పురుషులు సమాన భాగస్వాములు కాగలరని నేను అనుకుంటున్నాను.


3. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను రాయండి.
జ: * సంసద్‌ ఆదర్శ్‌ గ్రామయోజన 
* స్వచ్ఛ భారత్‌ అభియాన్‌
* బేటీ బచావో - బేటీ పడావో యోజన
* హృదయ్‌ 

* ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన
* అటల్‌ పెన్షన్‌ యోజన
* సాయిల్‌ హెల్త్‌ కార్డు పథకం
* మిషన్‌ ఇంద్రధనుష్‌ 
* డిజిటల్‌ ఇండియా 
* కృషోన్నతి యోజన
* ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన
* అమృత్‌ 
* మధ్యాహ్న భోజన పథకం
* సమగ్ర బాలల సంరక్షణ పథకం
* జాతీయ గ్రామీణ తాగునీటి పథకం
* మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం

4. జర్మనీలో ఆర్థికమాంద్యం ఏర్పడినప్పుడు సర్వత్రా నిరాశ - నిస్పృహలు అలుముకున్నాయి. ఆ సమయంలో జర్మన్లు ఎలాంటి కష్టాలకు లోనయ్యారు?
జ: * మాంద్యం వల్ల అన్నిటికంటే ఎక్కువగా జర్మనీ ప్రభావితమైంది. ఈ ఆర్థిక సంక్షోభం ప్రజల్లో తీవ్ర భయాందోళనలను కలిగించింది.
* 1932 నాటికి పారిశ్రామిక ఉత్పత్తి 1929 స్థాయితో పోలిస్తే 40 శాతానికి పడిపోయింది.
* కార్మికులు ఉపాధి కోల్పోయారు, వేతనాలు తగ్గాయి.
* నిరుద్యోగుల సంఖ్య 60 లక్షలకు చేరింది.
* జర్మనీ వీధుల్లో పురుషులు ‘ఏ పని చేయడానికైనా సిద్ధం’ అని రాసి ఉన్న కార్డులు మెడలో వేసుకుని కనిపించేవారు. 
* ఉద్యోగాలు లేకపోవడంతో యువకులు నేరాలకు పాల్పడ్డారు.
* కరెన్సీ విలువ కోల్పోవడంతో మధ్యతరగతి ప్రజలు ప్రత్యేకించి ఉద్యోగస్తుల, ఫించనుదార్ల పొదుపులు తగ్గిపోయాయి.
* వ్యాపారాలు దెబ్బతినడంతో చిన్న వ్యాపారస్తులు, చిల్లర వర్తకులు, స్వయం ఉపాధి కార్మికులు అనేక కష్టాలు పడ్డారు. 
* సమాజంలోని ఈ వర్గాలు తాము పేదవారిగా మారతామని లేదా కార్మికవర్గ శ్రేణికి పడిపోతామని లేదా నిరుద్యోగులం అవుతామని భయపడ్డారు.

* పెద్దవ్యాపారస్తులు సంక్షోభానికి గురయ్యారు. 
* వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోవడం వల్ల రైతాంగంలో అధికభాగం ప్రభావితమైంది.
* ఆహారం లేక మహిళలు తీవ్ర నిస్పృహకు లోనయ్యారు.
* రాజకీయ అస్థిరత్వంతో ప్రభుత్వం స్థిరమైన పాలన అందించలేకపోయింది.


5. కింది పట్టికను గమనించి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.


ఎ) వైమర్‌ గణతంత్ర రాజ్యంగా ప్రకటించిన దేశం?
జ: జర్మనీ


బి) రెండో ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటి?
జ: పోలెండ్‌పై జర్మనీ సేనలు దండెత్తడం.


సి) 1941లో జరిగిన సంఘటనలు ఏవి?
జ: యూఎస్‌ఎస్‌ఆర్‌పై జర్మనీ దండెత్తడం, రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా చేరడం, యూదులపై సామూహిక హత్యాకాండ 1941లో జరిగిన సంఘటనలు.


డి) యూఎస్‌ఎస్‌ఆర్‌ను విశదీకరించండి.
జ: యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్టు రిపబ్లిక్‌


6. కింది పట్టికను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.


ఎ) బోల్షివిక్కుల నాయకుడు ఎవరు?
జ: వ్లాదిమిర్‌ లెనిన్‌


బి) 1929లో భూముల ఏకీకరణ ఏ దేశంలో ప్రారంభమైంది?
జ: రష్యా


సి) రష్యాలో పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించినవారు?
జ: స్టాలిన్‌


డి) రక్తసిక్త ఆదివారం విప్లవం ఎప్పుడు జరిగింది?
జ: 1905


7. కిందివాటిని ప్రపంచ పటంలో గుర్తించండి.
ఉక్రెయిన్, జర్మనీ, అమెరికా, ఇటలీ, నైజీరియా, రష్యా, కజకస్థాన్, చైనా, వియత్నాం, భారతదేశం

8. కిందివాటిని ప్రపంచ పటంలో గుర్తించండి.
సెయింట్‌ పీటర్స్‌బర్గ్, బ్రిటన్, ఫ్రాన్స్, తుర్క్‌మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్, జపాన్, ఇండోనేషియా, ఈజిప్టు

Posted Date : 19-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం