• facebook
  • twitter
  • whatsapp
  • telegram

స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం

ముఖ్య‌మైన ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

4 మార్కుల ప్రశ్నలు 

1. రాజ్యాంగ సభ చర్చల నుంచి భారత ప్రభుత్వ ఏకీకృత, సమాఖ్య సూత్రాలను వివరించండి.


జ: భారత ప్రభుత్వం ఏకీకృత సూత్రాలు:

* భారత రాజ్యాంగం ఇండియాను రాష్ట్రాల యూనియన్‌గా ప్రకటించింది.

* కేంద్రప్రభుత్వ శాసనం ఆధిక్యాన్ని కలిగి ఉంటుంది.

* దేశంలో ఏకపౌరసత్వ విధానం అమల్లో ఉంటుంది.

* భారతదేశంలో ఏకీకృత న్యాయవ్యవస్థ అమల్లో ఉంటుంది.

¤ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాష్ట్రపరిపాలనలో పాల్గొంటారు.

* కేంద్రానికి అవశిష్టాధికారాలు ఉంటాయి.


భారతప్రభుత్వ సమాఖ్య సూత్రాలు:

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన జరిగింది.

* దేశంలో రాజ్యాంగం అత్యున్నత చట్టం. దీనికి లోబడి మాత్రమే ప్రభుత్వాలు పనిచేయాలి.

* భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం.

* దేశంలోని స్వతంత్ర న్యాయవ్యవస్థ రాజ్యాంగ వ్యతిరేక చట్టాలను న్యాయసమీక్షాధికారం ద్వారా నిలుపుదల చేయవచ్చు.
 

2. భారత రాజ్యాంగం మౌలిక సూత్రాల గురించి రాయండి.

జ: భారత రాజ్యాంగం జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలు కింది విధంగా ఉన్నాయి.

పార్లమెంటరీ విధానం: భారతదేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉంది.

ప్రాథమిక హక్కులు: భారతదేశంలో పౌరులందరికీ ఆరు రకాలైన ప్రాథమిక హక్కులు ఉన్నాయి.

ప్రాథమిక విధులు: భారత పౌరులకు ప్రాథమిక హక్కులతో పాటు, 10 రకాల ప్రాథమిక విధులు ఉన్నాయి.

ఏక పౌరసత్వం: భారత రాజ్యాంగం ప్రకారం భారతీయులంతా ఒకే పౌరసత్వాన్ని కలిగి ఉంటారు.

సమాఖ్య వ్యవస్థ: భారతదేశంలో రాష్ట్రాలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగి కేంద్ర ప్రభుత్వానికి లోబడి పనిచేస్తాయి.

స్వతంత్ర న్యాయవ్యవస్థ: భారతదేశం స్వతంత్ర న్యాయవ్యవస్థను కలిగి ఉంది. రాజ్యాంగ రక్షణ కోసం న్యాయసమీక్షాధికారాన్ని కలిగి ఉంటుంది.

ఆదేశిక సూత్రాలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా నడుచుకోవాలో ఇవి సూచిస్తాయి.

సార్వజనీన వయోజన ఓటుహక్కు: 18 సంవత్సరాల వయసు నిండిన స్త్రీ పురుషులందరికీ ఎలాంటి విచక్షణ లేకుండా ఓటు హక్కు కల్పించారు.

3. దేశంలోని రాజకీయ వ్యవస్థలను రాజ్యాంగం ఎలా నిర్వచించింది? వాటిని ఎలా మార్చింది?

జ: మనదేశంలోని రాజకీయ వ్యవస్థలను ఇతర దేశాల నుంచి తీసుకుని వాటిని మనదేశ అవసరాలకు అనుగుణంగా మార్చుకున్నారు.

* మనకు పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని ప్రతిపాదించిన రాజ్యాంగం, దాని రక్షణకు అనేక చర్యలను రాజ్యాంగంలో ప్రస్తావించింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వాధిపతిగా ప్రధానమంత్రి ఉంటారు.

* సమాఖ్య, ఏకకేంద్ర లక్షణాలను రెండింటిని రాజ్యాంగం పేర్కొంది. ఈ విధానంలో బలమైన కేంద్రంతో రాష్ట్రాల యూనియన్‌గా ఏర్పడింది.

* సమాఖ్య వ్యవస్థ అధిపతిగా అధ్యక్షుడు ఉంటారు. ఇతడు నామమాత్రపు అధిపతి. వాస్తవాధికారాలు ప్రధాని నేతృత్వంలోని మంత్రిమండలి నిర్వహిస్తుంది.

* భారత రాజ్యాంగం ఏకపౌరసత్వం విధానాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశంలో ఎక్కడపుట్టినా భారత పౌరసత్వం లభిస్తుంది.

* అమెరికా మాదిరి ద్వంద్వ న్యాయవ్యవస్థలు కాకుండా మన సమాఖ్య వ్యవస్థలో ఏకీకృత న్యాయవ్యవస్థ మాత్రమే ఉంది.

* సార్వజనీన వయోజన ఓటుహక్కు ద్వారా రాజకీయ సమానత్వం, సమన్యాయాన్ని రాజ్యాంగం కల్పించింది.

* మెజారిటీ, మైనారిటీ మత భావనలకు ప్రాధాన్యం ఇవ్వకుండా లౌకిక వాదాన్ని ప్రసాదించింది.

* చట్టసభల నిర్వహణ, ఎన్నికలు... రాజ్యాంగ చట్టం ప్రకారమే జరుగుతాయి.

4. కింది ప్రకటనను చదివి, ఇచ్చిన ప్రశ్నకు సమాధానాన్ని రాయండి.

జ: భారత రాజ్యాంగ నిర్మాతలు భారతీయ సమాజం అసమానతలు, అన్యాయం, లేమి లాంటి సమస్యలను ఎదుర్కొంటుందని, ఆర్థిక దోపిడీకి పాల్పడిన వలసపాలకుల విధానాలకు బలి అయ్యిందని గుర్తించారు.

అందుకే రాజ్యాంగసభలో జవహర్‌లాల్ నెహ్రు మాట్లాడుతూ..., ''గత రాజకీయ, సామాజిక నిర్మాణాన్ని తిరస్కరించి ముందుకు కదులుతూ తనకు తాను కొత్త వస్త్రాలను రూపొందించుకుంటున్న దేశానికి

రాజ్యాంగసభ ప్రాతినిధ్యం వహిస్తుంది" అని పేర్కొన్నారు.

ప్ర:  భారత రాజ్యాంగం సామాజిక నిర్మాణానికి ఏ విధంగా తోడ్పడిందో వ్యాఖ్యానించండి.

జ: * సామాజిక మార్పునకు దోహదం చేసే అనేక అంశాలను రాజ్యాంగంలో ఏర్పాటు చేశారు.

* అంటరానితనాన్ని నిర్మూలించారు.

* షెడ్యుల్డ్ కులాలు, తెగలకు విద్య, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లు కల్పించి వారికి సామాజిక, ఆర్థిక భరోసా కల్పించారు.

* షెడ్యూల్డ్ కులాలు, తెగల (ఎస్సీ, ఎస్టీ)కు రాజకీయ భరోసా కల్పించడానికి శాసన సభా స్థానాల రిజర్వేషన్ లాంటి ప్రత్యేక అంశాలను రాజ్యాంగంలో చేర్చారు.

* రాజ్యాంగం ఆదేశ సూత్రాల ద్వారా ప్రభుత్వం నిర్వహించాల్సిన సామాజిక సంక్షేమ కార్యక్రమాలను పేర్కొంది.

* రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు వ్యక్తి సంక్షేమానికి తోడ్పడితే ఆదేశ సూత్రాలు సమాజ సంక్షేమానికి కృషి చేస్తున్నాయని చెప్పవచ్చు.

* అంతే కాకుండా, అల్ప సంఖ్యాక వర్గాల అభివృద్ధికి రాజ్యాంగంలో ప్రత్యేక రక్షణలు కల్పించారు.

* పేదలు, భూమిలేనివారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలతో కూడిన సంస్కరణలు రాజ్యాంగంలో పేర్కొన్నారు.
 

5. 'అంటరానితనం' గురించి రాజ్యాంగంలో జరిగిన చర్చల్లో పాల్గొన్న ఎవరైనా నలుగురి అభిప్రాయాలను క్లుప్తంగా రాయండి.

జ: అంటరానితనం అనే సమస్యకు సంబంధించి రాజ్యాంగసభ చర్చల్లో పలువురు వ్యక్తులు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అవి...

''అంటరానితనాన్ని ఏ రూపంలోనైనా నిషేధిస్తున్నాం. కులవ్యవస్థని నిషేధించకుండా అంటరానితనాన్ని ఎలా నిషేధిస్తారో నాకు అర్థం కావడం లేదు. అంటరానితనం కులవ్యవస్థ అనే వ్యాధి లక్షణం మాత్రమే."  -

ప్రొమథ రంజన్ ఠాకూర్

''అంటరానితనానికి, కుల వివక్షకు మనం తేడా చూపకూడదు. అంటరానితనానికి మూల కారణమైన కులవివక్షను తొలగిస్తే తప్ప, అంటరానితనం ఏదో ఒకరూపంలో కొనసాగుతూనే ఉంటుంది."  - ఎస్.పి.బెనర్జీ

''మతం, కులం లేదా చట్టబద్ధ జీవనోపాధి ఆధారంగా వివక్ష చూపే ఏ చర్యనైనా అంటరానితనం అంటారు." - రోహిణి కుమార్ చౌదరి

''అంటరానితనం ఏ రూపంలోనైనా నేరమే. నేరాలను పరిశీలించే న్యాయమూర్తులు ఒక్కొక్కరు ఒక్కోవిధంగా దీన్ని నిర్వచిస్తున్నారు. న్యాయస్థానాలు సరైన శిక్ష విధించేలా అంటరానితనం అనే పదాన్ని కేంద్ర

శాసనసభ నిర్వచిస్తుందని ఆశిస్తున్నాను."   - ధీరేంద్రనాథ్ దత్త


 

6. కింద పేర్కొన్న బార్ గ్రాఫ్‌లో ఆయా సంవత్సరాల్లో జరిగిన రాజ్యాంగ సవరణల మొత్తం సంఖ్యను సూచించారు. వీటిని పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

         
i) ఏ సంవత్సరంలో అత్యధిక రాజ్యాంగ సవరణలు చేశారు?

జ: 1971 - 80, 1981 - 90

ii) రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?

జ: 1950, జనవరి 26


iii) 1951 - 2013 వరకు మొత్తం ఎన్ని సవరణలు చేశారు?

జ: 99


iv) ఏ సంవత్సరంలో అత్యల్ప రాజ్యాంగ సవరణలు చేశారు?

జ: 1951 - 60
 

2 మార్కుల ప్రశ్నలు 

(స్వల్ప సమాధాన ప్రశ్నలు) 

1. భారత రాజ్యాంగ సవరణ విధానాన్ని వివరించండి.

జ: * రాజ్యాంగంలోని అధికరణల (ఆర్టికల్స్) సవరణను పార్లమెంటు మాత్రమే చేపట్టాలి.

* రాజ్యసభ, లోక్‌సభ.. రెండింటిలో మూడింట రెండు వంతుల సభ్యుల ఆమోదం అవసరం.

* కొన్ని అధికరణలను రాష్ట్ర శాసన సభలు అంగీకరించిన తర్వాత మాత్రమే సవరించవచ్చు.

* ఇతర చట్టాల్లాగే కొత్త సవరణలను దేశాధ్యక్షుడు కూడా ఆమోదించాల్సి ఉంది.

2. ముసాయిదా రాజ్యాంగంపై రాజ్యాంగ సభలో జరిగిన విమర్శలు రాయండి.

జ: ముసాయిదా రాజ్యాంగంపై అనేక విమర్శలున్నాయి. అవి...

* రాజ్యాంగం 1935 చట్టానికి నకలు మాత్రమేనని మౌలానా హస్రత్ మొహానీ విమర్శించారు.

* ఇటీవల కాలంనాటి రాజ్యాంగాల నుంచి.. ఉదాహరణకు సోవియట్ యూనియన్ నుంచి, ముసాయిదా రాజ్యాంగం ఏమీ తీసుకోలేదని భారతీయ నేపథ్యంలో కీలకమైన గ్రామాలను విస్మరించారని, కేంద్రీకరణకు

అధిక ప్రాముఖ్యం ఇచ్చారని డి.ఎస్.సేథ్ విమర్శించారు.

3. రాజ్యాంగ విధులేవి?

జ: రాజ్యాంగ విధులు:

* పౌరుల హక్కులు, బాధ్యతలను పేర్కొనడం.

* ప్రభుత్వ అంగాలైన కార్యనిర్వాహక, శాసన, న్యాయశాఖల లాంటి నిర్మాణం.

* ప్రభుత్వం, సమాజం కలిసి నిర్మించాల్సిన భవిష్యత్తు సమాజ స్వభావాన్ని సూచించడం. అంటే దేశం ముందుకు వెళ్లటానికి ప్రస్తుత అంశాలను ఎలా మార్చాలో రాజ్యాంగం సూచిస్తూ ప్రధానంగా భవిష్యత్తు చట్రాన్ని పేర్కొంటుంది.
 

4. సమాఖ్య విధానం అంటే ఏమిటి?

జ: సమాఖ్య విధానంలో...

* కేంద్ర రాజ్యతంత్రంతోపాటు ఉపరాజ్య తంత్రాలు కూడా ఉంటాయి. వాటికి కేటాయించిన రంగాల్లో కేంద్ర, ఉపరాజ్య తంత్రాలు- ఈ రెండూ సర్వసత్తాక అధికారాన్ని కలిగి ఉంటాయి. సూక్ష్మంగా చెప్పాలంటే కేంద్ర,

రాష్ట్రాలతో కూడిన ద్వంద్వ ప్రభుత్వాల విధానాన్ని ఏర్పాటు చేయడమే సమాఖ్య విధానం.

5. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏకీభవించిన ఏ మౌలిక సూత్రాలను మీరు ప్రశంసిస్తారు?

జ: రాజ్యాంగంలో ఏవి మౌలిక సూత్రాలు అనే విషయంలో న్యాయమూర్తుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వారికి కింది అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. అవి...

* ఉన్నతమైన రాజ్యాంగం

* ప్రభుత్వ నిర్మాణం

* సమాఖ్య లక్షణం

* సర్వసత్తాక దేశం

* న్యాయం

* సంక్షేమ రాజ్యం
 

6. రాజ్యాంగంలో మౌలిక సూత్రాలు ఉంటాయి, అయితే ప్రజలు వ్యవస్థతో తలపడినప్పుడే సామాజిక మార్పు వస్తుంది. ఈ వ్యాఖ్యతో మీరు ఏకీభవిస్తారా? మీ కారణాలు పేర్కొనండి.

జ: ప్రజలు వ్యవస్థతో తలపడినప్పుడే సామాజిక మార్పు వస్తుందన్న వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తున్నాను. అందుకు కారణాలు...

* రాజ్యాంగం మనకు కల్పించిన సౌకర్యాలను ఉపయోగించుకోవడానికి ప్రజలు ముందుకు రాకపోయినట్లయితే ఏ విధమైన మార్పును మనం ఊహించలేం.

* సామాజిక మార్పు సాధన కోసం రాజ్యాంగంలో కల్పించిన అవకాశాలను ప్రజలు ఉపయోగించుకున్నపుడే రాజ్యాంగ ఆశయాలు నెరవేరుతాయి.

* రాజకీయ వ్యవస్థలో సాంఘిక న్యాయం ఒక ముఖ్యమైన సూత్రం.

* రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు, అవకాశాలు, రక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కలిగించినప్పుడే రాజ్యాంగ ఆశయాలు నెరవేరుతాయి.


 

ఒక మార్కు ప్రశ్నలు 

(అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు) 

1. ''భారతదేశ ప్రజలమైన మేము..." అనే పదాలతో భారతదేశ రాజ్యాంగం మొదలవుతుంది. భారతదేశ ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పడం సమర్థనీయమేనా?

జ: అవును, సమర్థనీయమే.
 

2. 'స్వేచ్ఛ'ను రాజ్యాంగం మనకు ప్రసాదించింది. ఇలాంటి రాజ్యాంగ ఆధారాలను పేర్కొనండి.

జ: సమానత్వం, లౌకికతత్వం
 

3. భారతదేశాన్ని ప్రవేశిక/పీఠిక ఎలా పేర్కొంది?

జ: భారత రాజ్యాంగం భారతదేశాన్ని సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పేర్కొంది.

4. జపాన్ పార్లమెంటు పేరు ఏమిటి?

జ: నేషనల్ డైట్ (National Diet)
 

5. మీకు తెలిసిన రాజ్యాంగ సభ సభ్యుల పేర్లు రాయండి.

జ: డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్, కె.ఎం.మున్షీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
 

6. ముసాయిదా రాజ్యాంగంలో ఎన్ని అధికరణలు, షెడ్యూళ్లు ఉన్నాయి?

జ: 315 అధికరణలు, 8 షెడ్యూళ్లు.
 

7. ''భారతదేశంలో ద్వంద్వ పౌరసత్వం ఉంది" ఈ వాక్యం తప్పా! ఒప్పా! కారణం తెలపండి.

జ: తప్పు. భారతదేశంలో ఏకపౌరసత్వం ఉంది.
 

8. 1970లో భారత రాజ్యాంగ ప్రవేశికకు చేర్చిన రెండు కీలక పదాలు ఏమిటి?

జ: లౌకిక, సామ్యవాద
 

9. ఆదేశ సూత్రాలు అంటే ఏమిటి?

జ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన, చట్టాలు, విధానాల రూపకల్పన చేసే సమయంలో పాటించాల్సిన నియమాలు ఆదేశిక సూత్రాలు. వీటికి చట్టబద్ధత లేదు కానీ ఏ ప్రభుత్వాలు వీటిని విస్మరించలేవు.
 

10. సంక్షేమ రాజ్యం అంటే ఏమిటి?

జ: సంక్షేమ రాజ్యంలో విద్య, వైద్య ఆరోగ్య సౌకర్యాలు, స్త్రీ-శిశు సంక్షేమం, సామాజిక భద్రత కల్పిస్తారు.

11. రాజ్యాంగ రచనకు పట్టిన సమయం ఎంత?

జ: ముసాయిదా కమిటీ రాజ్యాంగ రచనను 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల్లో పూర్తి చేసింది.
 

12. భారతదేశం గణతంత్ర రాజ్యమా?

జ: అవును. దేశాధిపతిని ప్రజలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎన్నుకుంటారు. కాబట్టి భారతదేశం గణతంత్ర రాజ్యం.
 

13. ప్రభుత్వాంగాలు ఏవి?

జ: కార్యనిర్వాహక శాఖ, శాసన శాఖ, న్యాయశాఖ ప్రభుత్వాంగాలు.
 

14. రాజ్యాంగ ప్రవేశిక ఎందువల్ల ముఖ్యమైంది?

జ: రాజ్యాంగ ప్రవేశికలో రాజ్యాంగ ఆశయాలు, మౌలిక సూత్రాలు పేర్కొనడం వల్ల దీన్ని ముఖ్యమైందిగా పేర్కొనవచ్చు.
 

15. IAS, IPS లను విస్తరించండి.

జ: IAS - ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (Indian Administrative Service)

   IPS - ఇండియన్ పోలీస్ సర్వీస్ (Indian Police Service)

Posted Date : 26-11-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

సాంఘిక శాస్త్రం

ఇతర సబ్జెక్టులు