• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అభివృద్ధి భావనలు 

అభివృద్ధి, ప్రగతికి సంబంధించిన భావనలు అనాది నుంచీ మనకు పరిచయమే. మనందరం... పిల్లలను ఎలా పెంచాలి? వారిని ఏ పాఠశాలలో చదివించాలి? వారి భవితకు బంగారు బాట ఎలా వేయాలి? అని ఆలోచిస్తుంటాం. అలాగే ప్రభుత్వాలకు... దేశం ఎలా ఉండాలి? అందరికీ మౌలిక వసతులు ఎలా సమకూర్చాలి? ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలంటే ఏం చేయాలి? అనే అభిప్రాయాలు  ఉంటాయి. ఇలా ప్రజ‌లు, ప్రభుత్వాలు (నాయ‌కులు) ప్రతిరోజూ వివిధ ర‌కాల కోరిక‌లు, ఆకాంక్షల‌తో స‌త‌మ‌త‌మ‌వుంటారు. ఒకరికి అభివృద్ధిగా తోచింది మ‌రొక‌రికి విధ్వంసంగా అనిపించ‌వ‌చ్చు. ప్రస్తుత సమాజంలో వివిధ వర్గాల ఆకాంక్షలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
వివిధ వర్గాల ప్రజలు ఏమనుకుంటున్నారు?

 భూమిలేని గ్రామీణ కార్మికులు ఎక్కువ రోజుల పని దొరకాలనీ, కూలీ రేట్లు పెరగాలనీ కోరుకుంటారు. తమ పిల్లలను మంచి పాఠశాలలో చదివించాలనీ, గ్రామంలో సర్పంచ్ లేదా సభ్యుడిగా ఎన్నిక కావాలనీ భావిస్తారు.
 ధనిక రైతు తన పొలంలో పండిన పంటలకు అధిక ధరలు లభించాలనీ, తక్కువ ధరకే కూలీలు దొరకాలనీ, రైతు రుణమాఫీ వర్తించాలనీ, పిల్లలు విదేశాల్లో చదివి స్థిరపడాలని భావిస్తాడు.
       పై అంశాలను పరిశీలిస్తే అభివృద్ధి, ప్రగతిపై అందరికీ ఒకే భావన లేదని స్పష్టమవుతోంది. ఒక్కొక్కరి కోరికలు ఒక్కో విధంగా ఉంటాయి. ఒక్కోసారి ఇద్దరు వ్యక్తులకు లేదా బృందాలకు పరస్పర విరుద్ధమైన కోరికలుండవచ్చు. అదే విధంగా ఎక్కువ విద్యుత్ కోసం పారిశ్రామిక వేత్తలు మరిన్ని ఆనకట్టలు కట్టాలని అనుకుంటారు. కానీ వాటివల్ల భూములు ముంపునకు గురై, నిర్వాసిత ప్రజల జీవితాలు అల్లకల్లోలం అవుతాయి. అలా కాకుండా గిరిజనులు పెద్ద ఆనకట్టలు కట్టడాన్ని వ్యతిరేకించి తమ భూములకు సాగునీటిని అందించేలా చిన్న చెక్‌డ్యాములు లేదా కుంటలను కోరుకోవచ్చు.


అభివృద్ధి ఎవరికి?
        తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లాలోని కుడంకుళంలో మత్స్యకారుల ఆవాస ప్రాంతాలున్న ప్రశాంత సముద్ర తీరంలో భారత ప్రభుత్వం అణువిద్యుత్ కేంద్రాన్ని స్థాపించింది. దీనికి వ్యతిరేకంగా ఆ ప్రాంత ప్రజలు నిరసన చేశారు. అణువిద్యుత్ కేంద్ర నిర్మాణ ప్రధానోద్దేశం నిరంతరంగా పెరుగుతున్న దేశ విద్యుచ్ఛక్తి అవసరాలను తీర్చడానికే అయినప్పటికీ, అక్కడి ప్రజలు వారి భద్రత, రక్షణ, జీవనోపాధుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నారు. దేశాలను రేడియోధార్మిక వినాశక ప్రమాదాల నుంచి రక్షించాలని అక్కడి ప్రజలంతా కోరుకుంటున్నారు. శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు ఉద్యమకారుల పక్షాన నిలబడి దీన్ని వ్యతిరేకించారు. ప్రభుత్వం మాత్రం భద్రతా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించి ఉద్యమాలకు అతీతంగా నిర్మాణాన్ని కొనసాగిస్తోంది.

పేలిన గ్యాస్ పైప్‌లైన్ - స్థానికుల నిరసన: 
        ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి జిల్లాలోని 'నగరం'లో జరిగిన ''గ్యాస్ పైప్ పేలిన సంఘటన"లో పలువురు మృత్యువాత పడ్డారు. అనేకమంది గాయాలపాలయ్యారు. దేశాభివృద్ధికి ఖనిజ వనరులను పైకి తీయడం, వాటిని సద్వినియోగ పరచడం మంచిదే. కానీ దాన్ని సరైన మార్గంలో ఉపయోగించకపోవడం దురదృష్టకరం. తుప్పుపట్టిన పైపులను తొలగించలేదని, గెయిల్ (GAIL: గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వాపోయారు. ఎవరి నిర్లక్ష్యం అయితేనేం చాలా మంది ప్రాణాలు గాలిలో కలసిపోవడంతో, అక్కడి ప్రజలు నిరసనకు దిగారు. నివాస ప్రాంతాల నుంచి గ్యాస్‌పైపులైన్లను తొలగించాలని కోరుతున్నారు.
       ఈ రెండు సంఘటనల వల్ల అభివృద్ధి, విధానాల్లో వ్యత్యాసాలుండటం సహజమేనని అర్థమవుతుంది.

ప్రజలు ఆదాయమే ముఖ్యమని భావిస్తారా?
        మానవుడు జీవించడానికి భౌతిక వస్తువులు మాత్రమే సరిపోవు. డబ్బుతో వస్తువులను కొనడం మన జీవితంలో ఒక అంశం మాత్రమే. మరింత ఆదాయాన్ని పొందడమే కాకుండా స్వేచ్ఛ, భద్రత, ఇతరుల నుంచి గౌరవం పొందడం లాంటి అంశాలను ప్రజలు కోరుకుంటున్నారు. వారు వివక్షతనూ వ్యతిరేకిస్తున్నారు. మీకు దూర ప్రాంతంలో ఉద్యోగం వస్తే జీతమే కాకుండా, మీ కుటుంబానికి సరిపడే సదుపాయాలున్నాయా లేదా అక్కడి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా మొదలైన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఉద్యోగ భద్రత ఉంటే తక్కువ జీతానికైనా పనిచేస్తారు. సురక్షితమైన వాతావరణం ఉంటే మహిళలు అనేక రకాల ఉద్యోగాలు చేయడానికి, వ్యాపారాలను నిర్వహించడానికి ముందుకు వస్తారు. కాబట్టి ప్రజలు మెరుగైన ఆదాయాల గురించే కాకుండా జీవితంలో ముఖ్యమైన ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారని తెలుస్తుంది.

ధనిక, పేద దేశాలంటే...
        వేర్వేరు వస్తువులను పోల్చినప్పుడు వాటిల్లో పోలికలు, తేడాలు రెండూ ఉంటాయి. విద్యార్థులను ఆటల జట్టుకు, వక్తృత్వ పోటీకి, సంగీత బృందానికి లేదా విహారయాత్రలకు ఎంపిక చేయడానికి వేర్వేరు ప్రామాణికాలను తీసుకుంటాం. పిల్లల సమగ్రాభివృద్ధిని అంచనా వేయాలంటే స్నేహశీలత, సహకార స్ఫూర్తి, సృజనాత్మకత లేదా సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటాం.

 దేశాలను పోల్చడానికి ముఖ్యమైన ప్రామాణికాల్లో వాటి ఆదాయం ఒకటిగా పరిగణిస్తారు. దేశంలోని ప్రజలందరి ఆదాయమే జాతీయాదాయం అవుతుంది. వివిధ దేశాల జనాభాలో తేడా ఉంటుంది. కాబట్టి దేశాలను పోల్చడానికి దేశాదాయం అంతగా ఉపయోగపడదు. ఒక దేశంలోని ప్రజలు, మరోదేశంలోని ప్రజల కంటే మెరుగ్గా ఉన్నారా, లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనకు సగటు ఆదాయం ఉపయోగపడుతుంది. దేశం మొత్తం ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే సగటు ఆదాయం (తలసరి ఆదాయం) వస్తుంది.  దేశాలను వర్గీకరించడానికి ప్రపంచబ్యాంకు తన ప్రపంచ అభివృద్ధి నివేదికలో ఈ ప్రామాణికాన్ని ఉపయోగించింది. 2012 సంవత్సరానికి, 12,600 అమెరికన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాలను అధిక ఆదాయ దేశాలు లేదా ధనిక దేశాలుగా పరిగణించారు. అదేవిధంగా 2012లో 1,035 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉండే దేశాలను తక్కువ ఆదాయ దేశాలన్నారు. ఒక దశాబ్దానికి ముందు తక్కువ ఆదాయ దేశాల జాబితాలో ఉన్న భారతదేశం ప్రస్తుతం తలసరి ఆదాయం వేగంగా పెరగడంతో దాని స్థానం మెరుగుపడింది.

అందరి సహకారం కావాలి
        మన దగ్గర ఎక్కువ డబ్బు ఉన్నప్పటికీ ఒక్కోసారి బాగా జీవించలేం. అవసరమైన వస్తువులు, సేవలన్నింటినీ డబ్బుతో కొనలేం. అంటే పౌరులు ఉపయోగించుకోగల భౌతిక వస్తువులు, సేవలను కేవలం ఆదాయం సూచించలేదు. ఉదా: మీ వీధిలో అందరూ విచ్చలవిడిగా వ్యర్థ పదార్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారని అనుకుందాం. దాంతో రోగాల బారిన పడితే, మీ డబ్బు అక్కడ పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించలేదు. మహా అయితే మీరు ఉండే ప్రాంతాన్ని మారగలరు. అక్కడా అదే పరిస్థితి ఉంటే చేయగలిగింది ఏమీ లేదు, మీ ప్రాంతంలోని వారందరూ నివారణ చర్యలు చేపడితే తప్ప డబ్బు ఈ సమస్య నుంచి మిమ్మల్ని రక్షించలేదు.

  మీ ఊళ్లో మీ ఒక్కరికి తప్పించి, ఇంకెవ్వరికీ చదువు మీద ఆసక్తి లేదనుకోండి, అప్పుడు మీరు చదువుకోలేరు. దూరంగా ఉన్న పాఠశాలకు వెళ్లాల్సిందే. చాలామంది పిల్లలు చదువుకోవాలని అనుకోవడంతో, ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించి, అనేక సౌకర్యాలను కల్పించడంతో మీ ప్రాంతంలోనే మీరు చదువుకోగలుగుతున్నారు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం/ సమాజం అవసరమైన సౌకర్యాలను కల్పించకపోవడంతో పిల్లలు, ప్రత్యేకించి ఆడపిల్లలు ప్రాథమికోన్నత విద్యను కొనసాగించలేక పోతున్నారు.

అభివృద్ధిలో పురోగతి:
        ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) ప్రచురించిన మానవాభివృద్ధి నివేదికలో వివిధ దేశాలను ఆ ప్రజల విద్యాస్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాలతో పోల్చింది. మానవాభివృద్ధి సూచిక (HDI) ప్రకారం కొన్ని దేశాలు మరికొన్ని దేశాల కంటే ముందున్నట్లే, రాష్ట్రంలో తేడాలున్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు మానవాభివృద్ధి సూచికలో ముందున్నాయి. కొన్ని అంశాల్లో అభివృద్ధి సరిగా లేకపోవడంతో, ఆ అంశాలపై దృష్టి కేంద్రీకరించాలన్న సంకేతాన్ని మానవాభివృద్ధి సూచిక ఇచ్చింది. కొన్ని రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల కంటే బాగా అభివృద్ధి చెందాయి. ఉదాహరణకి హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రజలు సగటున మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ చదువుకోవడానికి ఉన్న కారణాలను తెలుసుకుందాం.

విద్య కోసం విప్లవం:
        స్వాతంత్య్రం వచ్చేసరికి, భారతదేశంలోని అనేక ఇతర రాష్ట్రాల మాదిరిగానే హిమాచల్‌ప్రదేశ్‌లోనూ విద్యాస్థాయి చాలా తక్కువగా ఉంది. కొండప్రాంతం కావడంతో చాలా గ్రామాల్లో జనసాంద్రత తక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను ప్రారంభించడం పెద్ద సవాలుగా ఉండేది. వీటన్నింటినీ అధిగమించి హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం అక్కడి ప్రజల విద్యావ్యాప్తికి విప్లవాత్మకమైన మార్పులను చేపట్టింది.

విద్యాభివృద్ధి ఇలా...
        ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించి చాలా వరకు ఉచిత విద్యను లేదా నామమాత్రపు ఖర్చుతో విద్యను అందిస్తోంది. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను కూడా కల్పిస్తోంది. 2005 లో భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకోసం సగటున ప్రతి విద్యార్థికి రూ.1,049 ఖర్చు పెడితే, హిమాచల్‌ప్రదేశ్ మాత్రం రూ. 2,005 లను ఖర్చు చేసింది.

కొడుకులు, కూతుళ్లు సమానమే:
        హిమాచల్‌ప్రదేశ్‌లోని మహిళలు ఉద్యోగాలు చేస్తూ స్వతంత్రంగా ఉంటారు. పిల్లల చదువు, ఆరోగ్యం, గృహ నిర్వహణల్లో మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది. ఆడపిల్లల పట్ల వివక్షత లేదు. కొడుకులతో పాటు కూతుళ్లు కూడా చదువుకోవాలని తల్లిదండ్రులందరూ కోరుకుంటున్నారు.

వికసించిన విద్యా కుసుమాలు:
        హిమాచల్‌ప్రదేశ్‌లోని పిల్లలు చాలా ఉత్సాహంగా బడికి వస్తారు. అధిక శాతం పిల్లలు పాఠశాల అనుభవం ఎంతో సంతోషంగా ఉందంటారు. 'చంబా' గ్రామంలో 4వ తరగతి చదువుతున్న నేహా ''టీచర్ మమ్మల్ని ప్రేమతో చూస్తారు. పాఠాలు బాగా చెబుతారని" ఒక సర్వేలో చెప్పింది. పైతరగతులు చదివి పోలీసులు, శాస్త్రవేత్తలు, టీచర్లు కావాలని అక్కడి పిల్లలు కోరుకుంటున్నారు. పాఠశాలలో పది సంవత్సరాల పాటు పిల్లలు చదవడమనేది అక్కడ నియమంగా మారింది. మన దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ అక్కడిలాగే విద్యాభివృద్ధి జరగాలని ఆశిద్దాం.

Posted Date : 30-06-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

సాంఘిక శాస్త్రం

ఇతర సబ్జెక్టులు