• facebook
  • twitter
  • whatsapp
  • telegram

వలసపాలిత ప్రాంతాల్లో జాతి విముక్తి ఉద్యమాలు 

 దేశం కాని దేశం వచ్చారు. అక్కడున్న వారికి పరిపాలించుకోవడం రాదన్నారు. 'మీరు అనాగరికులు మీకు నాగరికత నేర్పాలి' అన్నారు. 'ఇది శ్వేత జాతీయుల బాధ్యత' అని అంటూ, వందల సంవత్సరాల పాటు, వారి కబంద హస్తాల్లో బందీలుగా చేసుకున్నారు. వలస ప్రాంతాల్లోని ప్రజల హక్కులను కాలరాసి దేశ ఆర్థిక వ్యవస్థను పీల్చిపిప్పి చేశారు. ఇలా యురోపియన్ల ఉక్కు సంకెళ్లలో భారతదేశం, చైనా, వియత్నాం, నైజీరియా లాంటి ఎన్నోదేశాలు నరకయాతన పడ్డాయి. వలస పాలకుల పై పోరుసల్పి, వారి దోపిడి, అణిచివేతల నుంచి తమ మాతృభూమిని ఎలా రక్షించుకున్నాయో ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం.
       వలస పాలిత దేశాల్లో చాలావాటిలో అనేక భాషలు, మతాలు ఉన్న వివిధ రకాల ప్రజలు ఉండేవారు. వీరందరికీ తామంతా ఒకే జాతి అనే భావన అంతగా ఉండేది కాదు. ఇక్కడున్న రాజులు, చక్రవర్తులు ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ లాంటి భావనలకు అంతగా మద్దతు పలికేవారు కాదు. కొత్త ఉద్యమాలు చోటు చేసుకోవడంతో యూరప్‌లో వ్యాప్తిలో ఉన్న జాతీయతావాదం, ప్రజాస్వామ్యం, చివరికి సోషలిజం లాంటి కొత్త భావనలతో ప్రజలు స్ఫూర్తి పొందసాగారు.

రెండు భిన్నదశల్లో చైనా: వాస్తవానికి చైనా వలస పాలక దేశ నియంత్రణలో ఉండి పేరుకు మాత్రమే స్వతంత్రంగా ఉండేది. 20వ శతాబ్దం ఆరంభంలో మంచూ వంశ చక్రవర్తులు చైనాని పాలిస్తూ ఉండేవారు. ఈ వలస పాలక శక్తులు చైనాలోని వివిధ ప్రాంతాల్లో తమ ప్రాభవ ప్రాంతాలను ఏర్పరచుకుని తక్కువ దిగుమతి పన్నులు చెల్లించడం, చైనా చట్టాలు తమకు వర్తించకపోవడం, సైనిక దళాలు కలిగి ఉండటం లాంటి మినహాయింపులు ఇచ్చేలా చైనా చక్రవర్తులపై ఒత్తిడి తేగలిగారు. దీంతో ప్రజలు అనేక తిరుగుబాట్లు చేశారు.
గణతంత్రం ఇలా: మంచూ సామ్రాజ్యాన్ని కూలదోసి సన్‌యెట్-సెన్ (1866 - 1925) తన నేతృత్వంలో 1911లో గణతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. కానీ ఎంతో కాలం సన్ నాయకత్వంలోని గణతంత్ర ప్రభుత్వం స్థిరపడలేకపోయింది. యుద్ధప్రభువులు అని పిలిచే స్థానిక సైనిక శక్తుల నియంత్రణలో దేశం ఉంది. కొంత కాలం, సామాజిక, రాజకీయ అనిశ్చితి కొనసాగింది.
       గణతంత్ర విప్లవం తర్వాత దేశం ఒక సంక్షోభ స్థితిలోకి చేరుకుంది. దేశాన్ని ఐక్యం చేయడానికి, సుస్థిరత సాధించడానికి కృషిచేసే ప్రధాన శక్తులుగా గుయో మిండాంగ్ (జాతీయ ప్రజాపార్టీ - దీన్నే KMT అనేవారు), చైనా కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ) ఆవిర్భవించాయి.
       సన్‌యెట్-సెన్ చనిపోయిన తర్వాత గుయో మిండాంగ్ నాయకుడిగా చియాంగ్ కైషేక్ (1887 - 1975) ఎన్నికయ్యాడు. అధికారాన్ని హస్తగతం చేసుకున్న యుద్ధ ప్రభువులు, స్థానిక నాయకులకు వ్యతిరేకంగా, కమ్యూనిస్టులను నిర్మూలించడానికి చియాంగ్ సైనిక చర్యకు పూనుకున్నాడు. దేశాన్ని సైనిక దేశంగా మలచడానికి ప్రయత్నించాడు.

       చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) నాయకుడిగా ఎదిగిన మావో జెడాంగ్ (1893 - 1976) తన విప్లవ కార్యక్రమానికి రైతులను ఆధారంగా చేసుకుని భిన్న మార్గాన్ని అవలంభించాడు. చైనా రైతులను సంఘటితం చేస్తూ రైతు సైన్యాన్ని నిర్మించాడు. జపాన్ ఆక్రమణను ప్రతిఘటించడానికి గుయో మిండాంగ్ సీసీపీతో చేతులు కలిపాడు. కానీ 1945 ఆగస్టులో అమెరికాకు జపాన్ దాసోహమైన తర్వాత చైనాపై ఆధిపత్యం కోసం గుయో మిండాంగ్, సీసీపీల మధ్య పూర్తిసాయి యుద్ధం జరిగింది. అంతిమంగా చైనా ప్రధాన భూభాగంపై పట్టు సాధించడంలో సీసీపీ విజయం సాధించింది. గుయో మిండాంగ్‌కి తైవాన్ దీవిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కలిగింది.
చైనాలో నూతన ప్రజాస్వామ్యం ఏర్పాటు: నూతన ప్రజాస్వామ్యం అనే సిద్ధాంతంపై 1949లో చైనా ప్రజల గణతంత్రం ఏర్పడింది. భూస్వామ్య విధానాన్ని, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే సామాజిక వర్గాలన్నీ ఈ సిద్ధాంతం ఆధారంగా ఏకమయ్యాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత సీసీపీ పెద్ద ఎత్తున భూసంస్కరణలు అమలు చేసింది. మహిళల రక్షణకు కొత్త ప్రభుత్వం చట్టాలు చేసింది.
వలస పాలనలో వియత్నాం: 19వ శతాబ్ద మధ్య కాలం నాటికి ఫ్రెంచి ప్రత్యక్ష పాలన కిందకు వియత్నాం వచ్చింది. ఫ్రెంచి పాలకులు వియత్నాం చక్రవర్తిని తమ చేతిలో కీలుబొమ్మగా చేసుకుని భారతదేశాన్ని బ్రిటిషర్లు పాలించినట్లు పాలించారు. తమ స్వప్రయోజనాల కోసం వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించారు. రోడ్లు, రైలు మార్గాలను అభివృద్ధి చేశారు.

'నాగరికులుగా చేసే బాధ్యత మాది': బ్రిటిషర్ల మాదిరి ఫ్రెంచి వలస పాలకులు కూడా వలసపాలిత ప్రజలు అనాగరికులని, తమ పాలనతో ఆధునిక నాగరికత ఫలాలను వారికి అందించడం తమ కర్తవ్యమని భావించారు. స్థానికులను నాగరికులుగా చెయ్యడానికి విద్య ఒక మార్గంగా ఆలోచించారు. కానీ, విద్య వల్ల సమస్యలు వస్తాయని భయపడ్డారు.
       ఫ్రెంచి వాళ్లు ఇచ్చిన పాఠ్యాంశాలను ఉపాధ్యాయులు, విద్యార్థులు అదేవిధంగా అనుసరించలేదు. పాఠ్యపుస్తకాలు ఫ్రెంచివారిని పొగుడుతూ, వలస పాలనను సమర్ధించేవిగా ఉండేవి. పాఠాలు చెప్పేటప్పుడు వియత్నాం ఉపాధ్యాయులు పాఠాల్లో ఉన్నదాన్ని మార్చి ఫ్రెంచి ప్రభుత్వాన్ని విమర్శించేవారు. దేశభక్తి భావంతో సమాజ ప్రయోజనం కోసం పోరాడటం విద్యావంతుల విధి అనే నమ్మకంతో వారు ప్రేరణ పొందారు.
       1920 నాటికి విద్యార్థులు యువ అన్నాం పార్టీ లాంటి రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి అన్నా మీన్ స్టూడెంట్ లాంటి పత్రికలను ప్రచురించసాగారు.
       1930 ఫిబ్రవరిలో హూచిమిన్ పరస్పరం పోటీపడుతున్న జాతీయతా బృందాలను కలిపి వియత్నాం కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత దీని పేరు ఇండో-చైనీస్ కమ్యూనిస్టు పార్టీగా మార్చారు. ఐరోపాలోని కమ్యూనిస్టు పార్టీల మిలిటెంట్ ప్రదర్శనలతో హూచిమిన్ స్ఫూర్తి పొందాడు.
నూతన గణతంత్ర వ్యవస్థ: ఆగ్నేయ ఆసియాపై తన ఆధిపత్యం సాధించాలన్న సామ్రాజ్యవాద కాంక్షలో భాగంగా జపాను 1940లో వియత్నాంను ఆక్రమించింది. వియత్నాం స్వాతంత్ర సమితి (వియత్ మిన్) జపనీయుల ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడి 1945 సెప్టెంబరులో హనాయ్‌ని తిరిగి స్వాధీనం చేసుకుంది. వియత్నాం ప్రజాస్వామ్య గణతంత్రం ఏర్పడింది. హూచిమిన్ దానికి ఛైర్మన్ అయ్యాడు.

యుద్ధంలో దిగిన అమెరికా: ఉత్తర వియత్నాంలోని హూచిమిన్ ప్రభుత్వ సహాయంతో దేశాన్ని ఏకం చేయడానికి ఎన్ఎల్ఎఫ్ పోరాడసాగింది. ఈ పరిణామాలతో అమెరికా భయపడింది. కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరుగుతుందన్న ఆందోళనతో సైన్నాన్ని, ఆయుధాలను ఉత్తర వియత్నాంకు పంపి ప్రత్యక్ష జోక్యానికి దిగింది. పెద్దఎత్తున సాగిన దాడుల్లో నాపాలం (మనుషులకు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదకరమైన బాంబు), ఏజెంట్ ఆరెంజ్(చెట్లు, మొక్కలను చంపేసి భూమిని చాలా సంవత్సరాలపాటు బీడుగా మార్చేది), భాస్వరం బాంబులు వినియోగించడం వల్ల అనేక గ్రామాలు విధ్వంసమయ్యాయి. చాలామంది పౌరులు చనిపోయారు. అమెరికాలో దాని పట్ల నిరసనలు వెల్లువెత్తసాగాయి. ప్రభుత్వ విధానాలను సర్వత్రా ప్రశ్నించారు. అంతిమంగా యుద్ధముగింపు సంప్రదింపులు చేపట్టారు. 1974 జనవరిలో ప్యారిస్‌లో శాంతి ఒప్పందంపై సంతకాలు చేయడంతో యుద్ధం ముగిసింది.
వలసపాలనలో నైజీరియన్లు: ఆఫ్రికాలో అధిక జన సాంద్రత ఉన్న దేశాల్లో నైజర్ నదీ ప్రాంతం ఒకటి. ఇది అనేక రకాల వలస పాలనలతో దోపిడీకి గురైంది. 16వ శతాబ్దం నుంచి అమెరికాకు బానిసలను సరఫరా చేయడంలో ఇది ప్రధాన కేంద్రంగా ఉండేది. ఆఫ్రికా లోపలి నుంచి గిరిజన రైతులను తీసుకువచ్చి ఐరోపా బానిస వర్తకులకు అమ్మేవారు.
       ఆఫ్రికాలోని తీరప్రాంతాలపై 1861లో బ్రిటన్ తన పాలనను ఏర్పాటు చేసింది. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభంలో బ్రిటిష్ వలస సామ్రాజ్యంలో జాత్యహంకారం చోటుచేసుకుంది. ఆఫ్రికా వాసులను సివిల్ సేవలకు అనుమతించలేదు. ఆఫ్రికా వ్యాపారవేత్తలపట్ల వివక్షత చూపేవారు.

విభజించి పాలించు: 1939లో బ్రిటిష్ పాలకులు పశ్చిమ, తూర్పు నైజీరియా ప్రాంతాలను ఏర్పరిచి యొరుబా, ఈబో తెగల మధ్య విభజనలు సృష్టించారు. ఈ విధంగా విభజించి పాలించు అనే సిద్ధాంతానికి అనుగుణంగా గిరిజన తెగల మధ్య పోటీని, ఘర్షణని ప్రోత్సహించారు.
మొదటి రాజకీయ పార్టీ: విభజించి పాలించు అనే సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ పాశ్చాత్య విద్యను అభ్యసించిన కొంతమంది మేధావులు ఉమ్మడి నైజీరియా దేశం అనే భావనను ప్రజల్లో కలిగించి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడసాగారు. నైజీరియాలో మొదటి రాజకీయ పార్టీయైన నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ (ఎన్ఎన్‌డీపీ)ని 1923లో హెర్బెర్ట్ మకాలే స్థాపించాడు. 1930లో బ్రిటిష్ వలస ప్రభుత్వంపై తీవ్రవాదుల దాడులను మకాలే సమర్థించాడు. 1936లో ఎన్. నందిఅజికివె నైజీరియా యువ ఉద్యమాన్ని(ఎన్‌వైఎమ్) స్థాపించాడు. 1944లో మకాలే, అజికివె కలిసి నైజీరియా, కామెరూన్‌ల జాతీయ సంఘాన్ని ఏర్పాటు చేశారు. వీరిరువురూ నైజీరియా ప్రజల్లో జాతీయతా భావాన్ని పెంపొందించారు.
స్వాతంత్య్రం, అంతలోనే మార్పు: నైజీరియాలో ఉత్తర ప్రాంతంలో కంటే అభివృద్ధి చెందిన దక్షిణ ప్రాంతంలో జాతీయ ఉద్యమం చాలా బలంగా ఉంది. దీంతో ఉత్తర- దక్షిణ ప్రాంతాల మధ్య తేడాలు పొడసూపసాగాయి. దక్షిణ ప్రాంతంలో కూడా యొరుబా, ఈబూ తెగల మధ్య ఘర్షణలు జాతీయ ఉద్యమాన్ని పీడించసాగాయి.
       1950 నాటికి ఈ మూడు ప్రాంతాల్లో వలసపాలనను వ్యతిరేకిస్తూ మూడు ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. జాతీయ ఉద్యమ తీవ్రతను గుర్తించిన బ్రిటిష్ పాలకులు నైజీరియన్లకు అధికారాన్ని అప్పగించాలని నిర్ణయించుకున్నారు. 1963 అక్టోబరు 1 నైజీరియా స్వాతంత్య్రం పొందింది. అనతికాలంలోనే నైజీరియాలో పౌరయుద్ధం చెలరేగింది. ఫలితంగా సైనికపాలన ఏర్పడింది. సుదీర్ఘ సైనిక నియంతృత్వ పాలన తర్వాత 1999లో నైజీరియా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఎన్నుకుంది.

చమురు లభ్యత - పర్యావరణ సమస్యలు: ప్రస్తుతం నైజీరియాకు ముఖ్యమైన వనరుగా ఉన్న చమురును నైజర్ డెల్టాలో 1950లో కనుక్కున్నారు. చమురు బావులు అనేకం బహుళజాతి సంస్థల ఆధీనంలో ఉన్నాయి. దీనివల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కలగకపోయినప్పటికీ అనేక పర్యావరణ సమస్యలు ఏర్పడ్డాయి. సముద్రనీటిలో కలిసే చమురు వల్ల జీవావరణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. మడ అడవులు అంతరించిపోయాయి. నేలలు, భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. 1990లో ప్రజలు ఆందోళన చేపట్టారు. మానవ హక్కుల కార్యకర్త, పర్యావరణ వాది కెన్‌సారోవివాకి మిలటరీ ప్రభుత్వం మరణశిక్ష వేయడంతో పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి. అన్ని విపత్తుల నుంచి నైజీరియా కోలుకోవాలని కోరుకుందాం.


ప్రధానాంశాలు 

* భారత్, వియత్నాం, నైజీరియా లాంటి దేశాలు వలస పాలనలో మగ్గుతుండగా, చైనా లాంటివి వాస్తవానికి అనేక వలసపాలక దేశాల నియంత్రణలో ఉండి పేరుకు మాత్రమే స్వతంత్రంగా ఉన్నాయి.
* ఈ అధ్యాయంలో వలసపాలిత ప్రాంతాల దారుణ పరిస్థితుల గురించి, ఐరోపా దేశాల వలస పెత్తనానికి వ్యతిరేకంగా వారు పోరాడిన తీరు గురించి తెలుసుకుందాం.
* వలసపాలిత దేశాల్లో చాలావాటిలో అనేక భాషలు, మతాలు ఉన్న వివిధ రకాల ప్రజలు ఉండే వారు. వీరందరికీ తామంతా ఒకే జాతి అనే భావన అంతగా ఉండేదికాదు.
* ఈ ప్రాంతాల్లో సంప్రదాయ పాలకులుగా ఉన్న రాజులు, చక్రవర్తులు ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ లాంటి భావనలకు అంతగా మద్ధతు పలికేవారు కాదు.
* కొత్త ఉద్యమాలు చోటుచేసుకోవడంతో యూరప్‌లో వ్యాప్తిలో ఉన్న జాతీయతావాదం, ప్రజాస్వామ్యం చివరికి సోషలిజం లాంటి కొత్త భావనలతో ప్రజలు స్ఫూర్తి పొందసాగారు.
* 20వ శతాబ్దం ఆరంభంలో మంచూ వంశ చక్రవర్తులు చైనాని పాలిస్తూ ఉండేవారు.
* పాశ్చాత్య వలస పాలక శక్తుల నుంచి చైనా ప్రయోజనాలను కాపాడగలిగే పరిస్థితిలో వాళ్లు లేరు. ఈ వలస పాలక శక్తులు చైనాలోని వివిధ ప్రాంతాల్లో తమ ప్రాభవ ప్రాంతాలను ఏర్పరచుకున్నాయి.
* తక్కువ దిగుమతి పన్నులు చెల్లించడం, చైనా చట్టాలు తమకు వర్తించకపోవడం, సైనిక దళాలను కలిగి ఉండటం లాంటి మినహాయింపులు ఇచ్చేలా చైనా చక్రవర్తులపై ఈ వలస పాలకులు ఒత్తిడి తేగలిగారు.
* ఈ పరిస్థితులపట్ల చైనాలోని పాలనాధికారులు, ప్రజలు అసంతృప్తితో ఉన్నారు.
* ప్రజలు అనేక తిరుగుబాట్లు చేశారు.
* పాలనాధికారులు అనేక సంస్కరణలకు ప్రయత్నించారు.
* మంచూ సామ్రాజ్యాన్ని కూలదోసి సన్‌యెట్-సెన్ (1866 - 1925) తన నేతృత్వంలో 1911లో గణతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు.
* సన్‌యెట్ - సెన్ ఆధునిక చైనా నిర్మాత. అతి పేద కుటుంబానికి చెందినవాడు.
* క్రైస్తవ మతం, ప్రజాస్వామ్య భావనలతో ప్రభావితమయ్యాడు.
* వైద్యశాస్త్రాన్ని అభ్యసించిన ఇతడు చైనా భవిష్యత్ పట్ల ఎంతో ఆందోళన పడేవాడు.
* ఇతడు చేపట్టిన కార్యక్రమాన్ని మూడు సిద్ధాంతాలు అంటారు (సన్, మిన్, చుయి) అవి: జాతీయతావాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం.
* జాతీయతావాదం అంటే విదేశీ పాలకులుగా భావిస్తున్న మంచూ వంశాన్ని, ఇతర విదేశీ సామ్రాజ్య శక్తులను పారదోలడం.
* ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.
* సామ్యవాదం అంటే పరిశ్రమలపై నియంత్రణ, భూమిలేని రైతులకు భూమిని పంచడానికి భూసంస్కరణలు చేయడం.
* మంచూ వంశాన్ని తొలగించి గణతంత్రాన్ని ప్రకటించినప్పటికీ సన్ నాయకత్వంలోని గణతంత్ర ప్రభుత్వం స్థిరపడలేకపోయింది.
* యుద్ధ ప్రభువులు అని పిలిచే స్థానిక సైనిక శక్తుల నియంత్రణలో దేశం ఉంది.
* వర్సయిల్స్ శాంతి సమావేశం నిర్ణయాలను నిరసిస్తూ 1919 మే 4న బీజింగ్‌లో ఒక నిరసన ప్రదర్శన చేపట్టారు.
* మొదటి ప్రపంచయుద్ధంలో గెలుపొందిన బ్రిటన్ పక్షాన ఉన్నప్పటికీ జపాన్ ఆక్రమించిన ప్రాంతాలు చైనాకి తిరిగి రాలేదు. ఈ కారణంగా ప్రజలు నిరసనను చేపట్టారు.
* ఈ నిరసన ఒక ఉద్యమంగా రూపొంది మే నాలుగు ఉద్యమంగా మారింది.
* పాత సంప్రదాయాలను తిరస్కరించి ఆధునిక విజ్ఞానశాస్త్రం, ప్రజాస్వామ్యం, జాతీయతావాదం ద్వారా చైనా ముందుకు వెళ్లాలని ఒక తరం ఉద్యమించింది.

* దేశవనరులను నియంత్రిస్తున్న విదేశీయులను తరిమెయ్యాలని, పేదరికాన్ని నిర్మూలించి, అసమానతలను తగ్గించాలని విప్లవకారులు కోరారు.
* సాధారణ భాష లిపిలను అనుసరించడం, మహిళల పరాధీనత, ఆడపిల్లల పాదాలు కట్టి వేయడం (ఆడపిల్లల పాదాలు పూర్తిగా పెరగకుండా నిరోధించే క్రూరమైన సంప్రదాయం) లాంటి వాటిని విప్లవకారులు వ్యతిరేకించారు.
* వివాహంలో సమానత్వం, పేదరికాన్ని అంతం చేయడానికి, ఆర్థికాభివృద్ధి లాంటి సంస్కరణలను వారు ప్రతిపాదించారు.
* గణతంత్ర విప్లవం తర్వాత దేశం ఒక సంక్షోభస్థితిలోకి చేరుకుంది.
* దేశాన్ని ఐక్యం చేయడానికి, సుస్థిరత సాధించడానికి కృషిచేసే ప్రధాన శక్తులుగా గుయో మిండాంగ్ (జాతీయ ప్రజాపార్టీ, దీన్నే కేఎమ్‌టీ అనేవారు), చైనా కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ) ఆవిర్భవించాయి.
* గుయో మిండాంగ్ రాజకీయ సిద్ధాంతానికి సన్‌యెట్ - సెన్ భావనలు ఆధారమయ్యాయి.
* ఆహారం, దుస్తులు, నివాసం, రవాణా అనేవి నాలుగు ప్రధాన అవసరాలుగా వారు గుర్తించారు.
* సన్‌యెట్-సెన్ చనిపోయిన తర్వాత గుయో మిండాంగ్ నాయకుడిగా చియాంగ్ కైషేక్ (1886 - 1975) ఎన్నికయ్యాడు.
* అధికారాన్ని హస్తగతం చేసుకున్న యుద్ధప్రభువులు, స్థానిక నాయకులకు వ్యతిరేకంగా, కమ్యూనిస్టులను నిర్మూలించడానికి అతడు సైనిక చర్యకు పూనుకున్నాడు.
* దేశాన్ని సైనిక దేశంగా మలచడానికి ప్రయత్నించాడు.
* ప్రజలు కలిసి పనిచేసే సహజ అలవాటుని పెంపొందించుకోవాలని అతడు కోరాడు.
* గుయో మిండాంగ్ పార్టీ సామాజిక మూలాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి.
* ఆధునిక ప్రగతికి కేంద్రాలుగా మారిన షాంఘై లాంటి నగరాల్లో 1919 నాటికి 5 లక్షల పారిశ్రామిక కార్మిక వర్గం ఏర్పడింది. అయితే వీరిలో చాలాతక్కువ శాతం ఓడల నిర్మాణం లాంటి ఆధునిక పరిశ్రమల్లో ఉపాధి పొందారు.
* వీరిలో అధికశాతం మధ్యతరగతి పట్టణ వాసులు (సియావోషిమన్)గా పరిగణించే వ్యాపారస్థులు, దుకాణదారులు ఉన్నారు.
* పట్టణ కార్మికులకు, ప్రత్యేకించి మహిళలకు చాలా తక్కువ వేతనాలు లభించేవి.
* పని పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి.
* పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు విస్తరించడంతో సామాజిక, సాంస్కృతిక మార్పులకు ఊతం లభించింది.
* ఈ కొత్త ఆలోచనల పట్ల పెరుగుతున్న ఆకర్షణను సూచిస్తూ జర్నలిజం విలసిల్లింది.
* చియాంగ్ సంప్రదాయవాది.
* మహిళల పాత్ర ఇంటికి పరిమితమై ఉందని, ''పాతివ్రత్యం, రూపం, మాట, పని" అనే నాలుగు సుగుణాలపై వారు శ్రద్ధ పెట్టాలని అతడు భావించాడు.
* ఆడవారు ధరించే గౌనులు ఎంత పొడవు ఉండాలన్నది కూడా సిఫారసు చేశాడు.
* ఫ్యాక్టరీ యజమానులకు ప్రోత్సాహకంగా కార్మిక సంఘాలను అణిచివేయడానికి కూడా అతడు పూనుకున్నాడు.
* గుయోమిండాంగ్ పార్టీ తన సంకుచిత సామాజిక తత్వంతో రాజకీయ దూరదృష్టి లోపించడం వల్ల దేశంలో ఏకత్వం సాధించడంలో విఫలమైంది.
* సన్‌యెట్-సెన్ కార్యక్రమంలోని ప్రధాన అంశమైన పెట్టుబడి నియంత్రణ, భూమి సమాన పంపిణీ అనే వాటిని అమలు చేయలేదు.
* ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి బదులు సైన్యంతో శాంతిభద్రతలను కల్పించడానికి ప్రయత్నించారు.
* 1937లో చైనాపై జపాను దండెత్తినప్పుడు గుయోమిండాంగ్ పార్టీ వెనకడుగు వేసింది.
* సుదీర్ఘ యుద్ధం వల్ల చైనా బలహీనపడింది.
* 1945 - 1949 మధ్యకాలంలో ధరలు నెలకు 30 శాతం చొప్పున పెరిగాయి. దీంతో సాధారణ ప్రజల జీవితాలు దుర్భరమయ్యాయి.
* గ్రామీణ చైనా రెండు సంక్షోభాలను ఎదుర్కొంది.
* మొదటిది నేలలు నిస్సారం కావడం; అడవులు నరికి వేయడం, వరదల లాంటి జీవావరణ పరమైనవి.
* రెండోది దోపిడీ పూరిత భూమి కౌలు విధానాలు, రుణభారం, పురాతన సాంకేతిక విజ్ఞానం, అభివృద్ధి చెందని ప్రసార మాధ్యమాలతో కూడిన సామాజిక - ఆర్థికమైంది.
* రష్యా విప్లవం తర్వాత కొద్దికాలానికే 1921లో చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది.
* రష్యా సాధించిన విజయం ప్రపంచంపై బలమైన ప్రభావాన్ని చూపింది.
* దోపిడీని అంతంచేసే ప్రపంచ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దోహదపడే కొమిన్‌టర్న్‌ని లెనిన్ లాంటి నాయకులు 1918 మార్చిలో స్థాపించారు.
* వివిధ దేశాల్లోని కమ్యూనిస్టు పార్టీలకు సోవియట్ యూనియన్, కొమిన్‌టర్న్ మద్దతు ఇచ్చాయి.
* చైనాలో సీసీపీ నాయకుడిగా ఎదిగిన మావోజెడాంగ్ (1893 - 1976) తన విప్లవ కార్యక్రమానికి రైతులను ఆధారంగా చేసుకుని భిన్నమైన పంథాను అవలంబించసాగాడు.
* భూస్వామ్యాన్ని అంతం చేయడానికి పోరాడేలా అతడు చైనా రైతులను సంఘటితం చేస్తూ రైతు సైన్యాన్ని నిర్మించసాగాడు.
* సీసీపీ నాయకత్వంలోని పోరాటంలో భూమిలేని రైతులు లక్షలాదిగా చేరసాగారు.
* మావో విజయాలు సీసీపీని బలమైన రాజకీయ శక్తిగా రూపొందించి, అంతిమంగా గుయోమిండాంగ్‌పై విజయం సాధించేలా చేశాయి.
* గుయోమిండాంగ్ దాడుల నుంచి రక్షణ నిచ్చే జియాంగ్‌క్సి పర్వతాల్లో 1928 నుంచి 1934 వరకు బస చేయడం మావోజెడాంగ్ భిన్నమైన పంథాను సూచిస్తుంది.
* ఇతడు భూస్వాముల భూమిని స్వాధీనం చేసుకుని పునఃపంపిణీ చేయడం ద్వారా బలమైన రైతు సంఘాలను (సోవియట్లను) నిర్మించాడు.

* ఇతర నాయకుల్లా కాకుండా స్వతంత్రంగా ఉండే ప్రభుత్వం, సైన్యాలను మావో నిర్మించాడు.
* మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గ్రామీణ మహిళా సంఘాల ఏర్పాటును ప్రోత్సహించాడు.
* పెద్దలు కుదిర్చిన వివాహాలను నిషేధించాడు.
* వివాహ ఒప్పంద పత్రాల కొనుగోలు, అమ్మకాలను నిలిపివేశాడు.
* విడాకుల విధానాన్ని సరళీకృతం చేస్తూ కొత్త వివాహ చట్టాన్ని చేశాడు.
* కమ్యూనిస్టుల సోవియట్‌లను గుయోమిండాంగ్ చక్రబంధం చేయడంతో పార్టీ తన స్థావరాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. దీంతో లాంగ్‌మార్చ్‌గా ప్రఖ్యాతిగాంచిన షాంక్సికి 6000 మైళ్ల కష్టభూయిష్ట ప్రయాణం (1934 -35) మొదలైంది.
* యానాన్‌లోని తమ కొత్తస్థావరంలో యుద్ధప్రభువులను అంతమొందించి, విదేశీ సామ్రాజ్యవాదంపై పోరాడటానికి, భూసంస్కరణలు చేపట్టడానికి తమ కార్యక్రమాన్ని మరింత తీవ్రతరం చేశారు.
* భూ సంస్కరణలు, జాతీయికరణ అనే ఈ రెండు అంశాల కారణంగా పార్టీకి బలమైన సామాజిక పునాది ఏర్పడింది.
* 1937 - 1945 మధ్యకాలంలో చైనాపై జపాన్ దండెత్తి చాలా భూభాగాన్ని ఆక్రమించింది.
* క్రూర, వలస సైనికపాలనను జపాను అమలు చేయడంతో చైనా సమాజ, ఆర్థిక పరిస్థితి దారుణంగా ప్రభావితమయ్యాయి.
* జపాను ఆక్రమణను ప్రతిఘటించడానికి గుయోమిండాంగ్, సీసీపీ చేతులు కలిపాయి.
* 1945 ఆగస్టులో అమెరికాకు జపాను దాసోహమైన తర్వాత చైనాపై ఆధిపత్యం కోసం గుయోమిండాంగ్, సీసీపీల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగింది.
* అంతిమంగా చైనా ప్రధాన భూభాగంపై పట్టు సాధించడంలో సీసీపీ విజయవంతమైంది.
* గుయోమిండాంగ్‌కి తైవాన్ దీవిలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే పరిస్థితి కలిగింది.
* 1949లో నూతన ప్రజాస్వామ్యం అనే సిద్ధాంతంపై చైనాలో గణతంత్రం ఏర్పడింది.
* భూస్వామ్య విధానాన్ని, సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే సామాజిక వర్గాలన్నీ ఈ సిద్ధాంతం ఆధారంగా ఏకమయ్యాయి.
* అధికారంలోకి వచ్చిన తర్వాత సీసీపీ పెద్ద ఎత్తున భూసంస్కరణలు అమలుచేసింది.
* భూస్వాముల భూమిని జప్తుచేసి పేద రైతులకు పంచిపెట్టారు.
* మహిళల రక్షణకు, వారి హక్కులకు బహుభార్యత్వ నిషేధానికి కూడా కొత్తప్రభుత్వం చట్టాలు చేసింది. దీనివల్ల మహిళలు వివిధ రంగాల్లో పురుషులతో సమాన హోదా పొందగలిగారు.
* గ్రామీణ పరిస్థితిని అర్థం చేసుకోవడం, రైతు సంఘాల నిర్మాణం లాంటి వాటితో రెండు సంవత్సరాలు శాంతియుతంగా గడిచిన తర్వాత 1950 - 51లో భూసంస్కరణలు అమలు చేయడం మొదలుపెట్టారు.
* గ్రామాల్లో ఉంటున్న అన్ని వర్గాలను గుర్తించడం, తర్వాత భూస్వాముల భూమి, ఇతర ఉత్పాదక ఆస్తులను స్వాధీనం చేసుకుని తిరిగి పంచడం లాంటివి దీంట్లో ముఖ్యమైన దశలు.
* ఈ ప్రక్రియలో ప్రధాన భూమికను ప్రాంత స్థాయి భూసంస్కరణల సంఘం పంపించిన పని బృందాలు పోషించాయి.
* రైతు సంఘాలను ఏర్పాటు చేయడం, స్థానిక నాయకత్వ స్థానాలకు వాటినుంచి క్రియాశీలక సభ్యులను ఎంపిక చేయడం వీటి ముఖ్యవిధుల్లో భాగంగా ఉండేవి.

* ఈ కొత్త నాయకత్వం ప్రధానంగా పేద, మధ్య తరగతి రైతుల నుంచి ఏర్పడింది.
* పలు ప్రాంతాల్లో తమ నైపుణ్యాల కారణంగా మధ్యతరగతి రైతులు ఆధిపత్యంలోకి వచ్చారు.
* నూతన పద్ధతుల వల్ల భూస్వాములు ప్రజా అవమానాలకు గురయ్యారు.
* విచారణలో భూస్వాములకు మరణశిక్ష విధించారు. ఈ విధంగా ఈ వర్గానికి చెందిన 10 - 20 లక్షల మందిని చంపేశారు.
* ఆర్థిక సంస్కరణల కార్యక్రమంలో భాగంగా చైనా సాగు భూమిలో 43 శాతాన్ని గ్రామీణ ప్రజల్లో 60 శాతానికి పంచిపెట్టడంతో భూసంస్కరణలు విజయం సాధించాయి.
* మధ్యతరగతి రైతులు ఎక్కువ ప్రయోజనం పొందారు.
* సీసీపీ ద్వారా రాజకీయ రంగంలోకి వచ్చిన పేద, మధ్యతరగతికి చెందిన గ్రామ కార్యకర్తల నుంచి కొత్త కులీన వర్గం ఏర్పడసాగింది.
* రాజకీయ విద్య, అక్షరాస్యతను వ్యాపింపజేయడానికి పెద్దఎత్తున వయోజన రైతుల పాఠశాలను ప్రారంభించారు.
* గ్రామాల్లోని చిన్నపిల్లలు, పెద్దవారికి ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించారు.
* విప్లవ తొలి సంవత్సరాల్లో భూ సంస్కరణలు అమలు చేయడంలో, అందరికీ ప్రాథమిక విద్యను అందించడంలోనూ సాధించిన విజయాలు చైనా భవిష్యత్తు ప్రగతికి బలమైన పునాదిగా నిలిచాయని మేధావులంతా ఏకీభవిస్తారు.
* సీసీపీ పాలన క్రమేపీ ఏకపార్టీ పాలనకు దారితీసింది.

* సీసీపీకి చెందిన అధినాయకులు లేదా ఛైర్మన్ చాలా శక్తిమంతులుగా ఎదిగారు.
* ప్రతిపక్ష కార్యకలాపాలను అణగదొక్కారు.
* 19వ శతాబ్ద మధ్య కాలం నాటికి ఫ్రెంచి ప్రత్యక్ష పాలన కిందకు వియత్నాం వచ్చింది.
* ఫ్రెంచి పాలకులు వియత్నాం చక్రవర్తిని తమ చేతిలో కీలుబొమ్మగా చేసుకుని భారతదేశాన్ని బ్రిటిష్‌వారు పాలించినట్లే పాలించారు.
* భారతదేశాన్ని బ్రిటన్ ప్రభావితం చేసినట్లే వియత్నాం ప్రజల జీవితాల్లోని అన్ని అంశాలను ఫ్రెంచివారు ప్రభావితం చేశారు.
* వియత్నాంను వరిని ఎగుమతిచేసే దేశంగా అభివృద్ధి చేయాలని ఫ్రెంచి చాలా ఆసక్తిని కనబరిచింది. దీనికోసం ఫ్రెంచి మూడు ఎత్తుగడలను అనుసరించింది.
అవి: సాగునీటి సదుపాయాన్ని మెరుగుపరచడం.

        భూస్వాములను ప్రోత్సహించడం.
* మెకాంగ్ డెల్టా ప్రాంతంలో సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి ఫ్రెంచివారు బీడు భూముల నుంచి నీటిని తోడి కాలువల నిర్మాణం చేపట్టారు. దీని ఫలితంగా ఉత్పత్తి పెరిగిన వరిని అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతి చేయడం సాధ్యమైంది.
* వియత్నాం తన వరి ఉత్పత్తిలో మూడింట రెండు వంతులు ఎగుమతి చేయసాగింది.

* 1931 నాటికి వియత్నాం ప్రపంచంలో మూడో అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఎదిగింది. దీంతోపాటు వాణిజ్యసరుకుల రవాణా కోసం, సైనిక కేంద్రాలను తరలించడానికి, మొత్తం ప్రాంతాన్ని తమ ఆధీనంలో పెట్టుకోవడానికి ఫ్రెంచివారు మౌలిక సదుపాయాలను (రోడ్లు, రైలు మార్గాలు) అభివృద్ధి చేశారు.
* వియత్నాం ఉత్తర, దక్షిణ ప్రాంతాలను; చైనాను కలిపే ఇండో-చైనా ఖండాంతర రైలుమార్గ నిర్మాణాలను మొదలుపెట్టారు.
* వియత్నాం వలస పాలిత ఆర్థిక పరిస్థితి ప్రధానంగా ఫ్రెంచి, కొంతమంది వియత్నామీయుల ఆధీనంలో ఉన్న వరి ఉత్పత్తి, రబ్బరు సాగుపై ఆధారపడి ఉంది.
* రబ్బరు తోటల్లో వెట్టి కార్మికులను ఉపయోగించుకునేవారు.
* వియత్నాం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఫ్రెంచివారు చేసిందేమీ లేదు.
* పెద్ద భూస్వాములు చిన్న రైతుల భూములను హస్తగతం చేసుకుని వారితో కౌలు రైతులుగా పని చేయించుకున్నారు. ఫలితంగా రైతుల జీవన ప్రమాణం పడిపోయింది.
* రైతులు అప్పుల విష వలయంలో చిక్కుకుని, బయటపడలేకపోయారు.
* గ్రామ పెద్దలైన భూస్వాములు విధించే అధిక పన్నులు, అధిక కౌలు, అధిక వడ్డీభారం కింద రైతులు నలిగి పోయారు.
* అన్నాం అనే ప్రాంతంలో సుమారుగా 53% కుటుంబాలకు అసలు ఏ మాత్రం భూమి లేదు.
* టోన్‌కిన్, కొచిన్ చినాలో సుమారుగా 58%, 79% కుటుంబాలకు అరంగుళం భూమి కూడా లేదు.
* 1930లో భూమి ఉన్న కుటుంబాల్లో అత్యధిక శాతం ఆకలికి గురయ్యారంటే భూమిలేని కూలీల పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు.
* భూస్వాముల నుంచి భూమి తీసుకున్న రైతులు దానికి కౌలు చెల్లించడమే కాకుండా భూస్వామి పొలాలు, వారి ఇళ్లలోనూ పని చేయాలి.
* భూస్వాములు ఇష్టం వచ్చినట్లు విధించే అనేక రకాల పన్నులను కూడా రైతులు చెల్లించాలి. వీటివల్ల భూస్వాముల నుంచి రైతులకు బియ్యం, డబ్బు అప్పుగా తీసుకోక తప్పేదికాదు. దీంతో వారు మరింతగా అప్పుల్లో  కూరుకుపోయేవారు.
* బ్రిటిష్ వారిలాగానే ఫ్రెంచి వలస పాలకులు కూడా వలస పాలిత ప్రజలు అనాగరికులని తమ పాలనతో ఆధునిక నాగరికత ఫలాలను అదించడం తమ కర్తవ్యమని వారు భావించారు.
* స్థానికులను నాగరికులుగా చేయడానికి విద్య ఒక మార్గంగా భావించారు. కానీ ఒకసారి విద్యావంతులైన తర్వాత వియత్నాం ప్రజలు వలస పాలకుల ఆధిపత్యాన్ని ప్రశ్నించవచ్చని ఫ్రెంచివారు భయపడ్డారు.
* ఫ్రెంచి పౌరులు చేస్తున్న ఉద్యోగాలను (ఉపాధ్యాయులు, దుకాణదారులు, పోలీసులు లాంటివి) విద్యావంతులైన వియత్నామీయులు లాగేసుకుంటారని భయపడసాగారు.
* ప్రాథమిక స్థాయిలో వియత్నామీ భాషను నేర్పినప్పటికీ ఉన్నత విద్య అంతా ఫ్రెంచి భాషలో ఉండేది.
* జనాభాలో చాలా తక్కువగా ఉన్న వియత్నాం సంపన్నుల పిల్లలు మాత్రమే ఫ్రెంచి బడిలో చేరగలిగేవారు.
* బడిలో చేరిన వారిలో చాలా కొద్దిమంది మాత్రమే పాఠశాల విద్య పూర్తిచేసే పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేవారు.

* పాఠ్యపుస్తకాలు ఫ్రెంచివారిని పొగుడుతూ, వలస పాలనను సమర్థించేవి.
* ఫ్రెంచివారు ఇచ్చిన పాఠ్యాంశాలను ఉపాధ్యాయులు, విద్యార్థులు అదేవిధంగా అనుసరించలేదు. కొన్నిసార్లు దీనిపై బహిరంగంగా, మరికొన్నిసార్లు మౌనంగా నిరసన వ్యక్తం చేసేవారు.
* పాఠాలు చెప్పేటప్పుడు వియత్నాం ఉపాధ్యాయులు పాఠాల్లో ఉన్న దాన్ని మార్చి ఫ్రెంచి ప్రభుత్వాన్ని విమర్శించేవారు.
* కార్యాలయాల్లో ఉద్యోగాలకు వియత్నామీయులను అనర్హులుగా చేసేవిధంగా ఉన్న వలస ప్రభుత్వ ప్రయత్నాలను విద్యార్థులు ప్రతిఘటించారు.
* దేశభక్తి భావంతో సమాజ ప్రయోజనం కోసం పోరాడటం విద్యావంతుల విధి అన్న నమ్మకంతో వారు ప్రేరణ పొందారు. దీంతో వారు తమ స్థానానికి ముప్పు వాటిల్లుతుందని భయపడి ఫ్రెంచి పాలకులతో, స్థానిక సంపన్నులతోనూ ఘర్షణ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
* 1920 నాటికి విద్యార్థులు యువ అన్నాం పార్టీ లాంటి రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి, అన్నామీన్ స్టూడెంట్ లాంటి పత్రికలను ప్రచురించారు.
* 20వ శతాబ్దం ఆరంభంలో ఆధునిక విద్య కోసం వియత్నాం విద్యార్థులు జపాను వెళ్లసాగారు. వారిలో చాలా మంది ప్రధాన ఉద్దేశం వియత్నాం నుంచి ఫ్రెంచి వారిని తరిమేయడమే.
* కీలుబొమ్మగా ఉన్న చక్రవర్తిని తొలగించి, అంతకుముందు ఫ్రెంచివారు పడదోసిన ఎన్‌గుయెన్ వంశాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావడం వారి లక్ష్యం.

* చైనాలో సన్‌యెట్‌సెన్ గణతంత్ర విప్లవం సాధించిన తర్వాత వియత్నాంలో కూడా గణతంత్ర ప్రజాస్వామిక పాలనను ఏర్పాటు చేయడానికి అక్కడి ప్రజలు ప్రేరణ పొందారు.
* చాలామంది విద్యార్థులు ఆ కాలంలో కొత్త రాజకీయ భావాల గురించి తెలుసుకోవడానికి చైనా, ఫ్రాన్స్, రష్యా దేశాలకు వెళ్లసాగారు.
* 1930 నాటి ఆర్థికమాంద్యం వియత్నాంపై తీవ్ర ప్రభావం చూపింది.
* రబ్బరు, బియ్యం ధరలు పడిపోయి గ్రామీణ రుణభారం, నిరుద్యోగం పెరిగాయి. ఫలితంగా గ్రామీణ ప్రజలు తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటును ఫ్రెంచివారు ఉక్కుపాదంతో అణిచివేశారు. నిరసనకారులపై విమానాలతో బాంబులు కూడా వేశారు.
* 1930 ఫిబ్రవరిలో హూచిమిన్ (ఇతడు కొంతకాలం ఫ్రాన్స్, రష్యాల్లో ఉన్నాడు) పరస్పరం పోటీపడుతున్న జాతీయతా బృందాలను కలిపి వియత్నాం కమ్యూనిస్టు పార్టీ (వియత్నాం కాంగ్ సాన్ డాంగ్)ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత దీని పేరు ఇండో - చైనీస్ కమ్యూనిస్టు పార్టీ గా మార్చారు.
* ఐరోపాలోని కమ్యూనిస్టు పార్టీల మిలిటెంట్ ప్రదర్శనలతో అతడు స్పూర్తిని పొందాడు.
* ఆగ్నేయ ఆసియాపై తన ఆధిపత్యం సాధించాలనే సామ్రాజ్యవాద కాంక్షలో భాగంగా జపాన్ 1940లో వియత్నాంను ఆక్రమించింది. దీంతో జాతీయవాదులు ఫ్రెంచివారినే కాకుండా జపనీయులను కూడా వ్యతిరేకించాల్సి వచ్చింది. అయితే అప్పటికే రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఫ్రాన్స్‌ను ఆక్రమించడంవల్ల ఫ్రెంచివారు బలహీనస్థితిలో ఉన్నారు.

* వియత్‌మిన్‌గా పిలిచే వియత్నాం స్వాతంత్య్ర సమితి (వియత్నాం డాక్‌లాప్ డాంగ్‌మిన్) జపనీయుల ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడి 1945 సెప్టెంబరులో హనాయ్‌ని తిరిగి స్వాధీనం చేసుకుంది.
* వియత్నాం ప్రజాస్వామ్య గణతంత్రంగా ఏర్పడగా, దీనికి హూచిమిన్ ఛైర్మన్ అయ్యాడు.
* 1945 ఆగస్టులో వియత్‌మిన్ అధికారంలోకి వచ్చిన వెంటనే భూమి కౌలును 25 శాతం తగ్గించారు. మారు కౌలుకు ఇవ్వడాన్ని నిషేధించారు.
* 1945 ఆగస్టు నాటికి ఉన్న కౌలుదార్ల కౌలు బకాయిల మొత్తాన్ని మాఫీ చేశారు.
* ఉమ్మడి భూమిని, ఫ్రెంచివారి ఆధీనంలో ఉన్న భూమిని, వియత్నాం విద్రోహుల భూమిని ప్రజలకు పంచసాగారు.
* కొత్తగా ఏర్పడిన గణతంత్ర దేశం అనేక సవాళ్లను ఎదుర్కొంది.
* చక్రవర్తి బావోదాయిని కీలుబొమ్మగా చేసి వియత్నాంపై నియంత్రణను తిరిగి సాధించడానికి ఫ్రెంచివారు ప్రయత్నించారు.
* ఫ్రెంచిదాడుల నేపథ్యంలో వియత్‌మిన్ సభ్యులు కొండల్లో తలదాచుకోవాల్సి వచ్చింది.
* ఎనిమిది సంవత్సరాల యుద్ధం తర్వాత 1954లో డీన్ బీన్ పు వద్ద ఫ్రాన్స్ ఓడిపోయింది.
* 16 వేల మంది ఫ్రెంచి సైనికులు, అధికారులను యుద్ధఖైదీలుగా పట్టుకున్నారు.
* ఫ్రెంచివారు ఓడిపోయిన తర్వాత జెనీవాలో జరిగిన శాంతి సంప్రదింపుల్లో దేశాన్ని రెండుగా విభజించడానికి వియత్నాం ప్రజలను ఒప్పించారు.

* దేశం ఉత్తర, దక్షిణ భాగాలుగా ఏర్పడింది.
* హూచిమిన్, కమ్యూనిస్టులు ఉత్తర భాగంలో అధికారానికి రాగా, దక్షిణ భాగానికి పురాతన చక్రవర్తిని అధిపతిగా చేశారు. అయితే అనతికాలంలోనే అతడిని పడదోసి ఎన్‌గో డిన్‌ డీం అధికారంలోకి వచ్చాడు.
* ఎన్‌గో డిన్ డీం అణిచివేత, నియంతృత్వపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అతడిని వ్యతిరేకించిన వారందరినీ జైలుపాలు చేశాడు.
* అతడి నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా జాతీయ విముక్తి సమాఖ్య(ఎన్ఎల్ఎఫ్) అనే పేరుతో ప్రజలు పోరాడసాగారు.
* 1954 తర్వాత ఉత్తర వియత్నాంలో భూసంస్కరణల్లో కొత్తయుగం మొదలైంది.
* భూస్వాముల భూమిని స్వాధీనం చేసుకుని భూమిలేనివారికి, పేదరైతులకు భూమిని పంచసాగారు.
* ఉత్తర వియత్నాంలోని హూచిమిన్ ప్రభుత్వ సహాయంతో దేశాన్ని ఏకం చేయడానికి ఎన్ఎల్ఎఫ్ పోరాడసాగింది.
* ఈ పరిణామాలతో కమ్యూనిస్టుల ప్రాబల్యం పెరుగుతుందని అమెరికా ఆందోళన చెందింది.
* అమెరికా సైన్యాన్ని, ఆయుధాలను ఉత్తర వియత్నాంకు పంపి అది ప్రత్యక్ష జోక్యానికి నిర్ణయించుకుంది.
* యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకోవడం వల్ల వియత్నామీయులకే కాకుండా అమెరికాకు కూడా చాలా భారంగా పరిణమించింది.
* 1965 నుంచి 1972 మధ్య కాలంలో వియత్నాం యుద్ధంలో 34 లక్షల మంది అమెరికా సైనికులు పాల్గొన్నారు.
* అమెరికా వద్ద ఆధునిక సాంకేతిక విజ్ఞానం, చక్కని వైద్యసదుపాయాలు ఉన్నప్పటికీ సైనికుల మరణాలు ఎక్కువగానే ఉన్నాయి.
* ఈ యుద్ధకాలంలో మొత్తం 47,244 మంది సైనికులు చనిపోయారు. 3,03,704 మంది గాయపడ్డారు. ఇలా గాయపడిన వారిలో 23,014 మంది 100 శాతం వైకల్యం పొందినవాళ్లుగా వెటిరన్స్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది.
* వేలాదిమంది అమెరికా సైనికులు, శక్తిమంతమైన ఆయుధాలు, యుద్ధ ట్యాంకులతో వచ్చేవాళ్లు. వారికి అండగా అత్యంత శక్తిమంతమైన వైమానిక బాంబర్లు అయిన బి52 విమానాలు ఉండేవి.
* పెద్దఎత్తున సాగిన దాడులు, రసాయనిక ఆయుధాల వినియోగంతో అనేక గ్రామాలు ధ్వంసమయ్యాయి, అడవులు నాశనమయ్యాయి.
* నా పాలం (మనుషులకు తీవ్రనష్టం కలిగించే ప్రమాదకర బాంబు), ఏజెంట్ ఆరెంజ్ (ఇది చెట్లు, మొక్కలను చంపేసి భూమిని చాలా సంవత్సరాలపాటు బీడుగా మార్చింది), భాస్వరం బాంబులను అమెరికా ప్రయోగించింది.
* ప్రపంచంలోకెల్లా అత్యంత ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఉన్న, అభివృద్ధి చెందిన దేశాన్ని ప్రతిఘటించడంలో ఒక చిన్న దేశానికి (వియత్నాం) ఉండే శక్తిని అంచనా వేయడంలో అమెరికా పొరబడింది.
* భూస్వాముల చేతుల్లో తరాలపాటు దోపిడీకి గురై ఇటీవలే కొంత భూమిని పొందిన లక్షలాది పేదరైతుల నిబద్ధతను ఆ దేశం తక్కువగా అంచనా వేసింది.

* జాతీయతా భావంతో ప్రేరణ పొంది, భూసంస్కరణలతో ఉత్సాహం పొందిన ఈ పేదరైతులు ప్రపంచంలోకెల్లా మేటి సైన్యాన్ని ఓడించడంలో కీలకపాత్ర పోషించారు.
* ఈ యుద్ధ ప్రభావం అమెరికాపై కూడా పడింది. తనకు సంబంధం లేని యుద్ధంలో జోక్యం చేసుకున్నందుకు ప్రభుత్వాన్ని చాలామంది విమర్శించారు.
* యుద్ధం కోసం యువతను సైన్యంలోకి తీసుకోవడంతో వ్యతిరేకత ఇంకా పెరిగింది.
* నిరసనలు వెల్లువెత్తి, ప్రభుత్వ విధానాన్ని సర్వత్రా ప్రశ్నించడంతో అంతిమంగా యుద్ధ ముగింపు సంప్రదింపులు చేపట్టేలా చేసింది.
* 1974 జనవరిలో ప్యారిస్‌లో శాంతి ఒప్పందంపై సంతకాలు చేయడంతో అమెరికాతో యుద్ధం ముగిసింది. అయితే సైగాన్ ప్రభుత్వం, ఎన్.ఎల్.ఎఫ్. మధ్య ఘర్షణ ఇంకా కొనసాగింది.
* 1975 ఏప్రిల్ 30న జాతీయ విముక్తి సమాఖ్య (ఎన్.ఎల్.ఎఫ్.) సైగాన్‌లోని అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకుని అంతిమంగా వియత్నాంలను ఒకటిగా చేసింది.
* ఆఫ్రికాలో వలస పాలకులు కొంత ప్రాంతాన్ని ఇష్టానుసారంగా తమ నియంత్రణలోకి తీసుకున్నారు.
* ప్రస్తుతం నైజీరియాగా మనకు తెలిసిన దేశాన్ని బ్రిటిషర్లు ఏర్పాటు చేశారు.
* నైజర్ నదీ వ్యవస్థ కింద వివిధ తెగలు ఉంటున్నప్పటికీ వేర్వేరు ప్రాంతాలను ఒకటిగా చేయడం ద్వారా దీన్ని ఏర్పరిచారు.

* ఉత్తర నైజీరియాలో హౌసా-పులాని ప్రజలు అధికంగా ఉన్నారు. వీరు ముఖ్యంగా ముస్లింలు.
* ఆగ్నేయ నైజీరియాలో ఈబో తెగ, నైరుతి భాగంలో యొరుబా తెగల ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు.
* అనేక సంవత్సరాల మిషనరీల ప్రచార కారణంగా దక్షిణ ప్రాంతాల్లో క్రైస్తవ మతస్తులు అధిక సంఖ్యలో ఉన్నారు.
* గిరిజన మతనమ్మకాలు ఉన్నవాళ్లు కూడా ఎక్కువగానే ఉన్నారు.
* ఈ మూడు ప్రాంతాల మధ్య ఘర్షణలు, ఉమ్మడి ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థను ఏర్పరచాలన్న ప్రయత్నాలతో ఆధునిక నైజీరియా కథ నిండి ఉంది.
* ఆఫ్రికాలో అధిక జన సాంద్రత ఉన్న దేశాల్లో నైజర్ నదీ ప్రాంతం ఒకటి.
* 16వ శతాబ్దం నుంచి అమెరికాకు బానిసలను సరఫరా చేయడంలో ఇది ప్రధాన కేంద్రంగా ఉండేది.
* ఆఫ్రికా లోపలి నుంచి గిరిజన రైతులను తీసుకుని వచ్చి ఐరోపా బానిస వర్తకులకు అమ్మేవాళ్లు.
* 19వ శతాబ్దంలో బానిసల వ్యాపారాన్ని నిషేధించడంతో ఈ ప్రాంతంలోని వ్యవసాయ ఉత్పత్తులు, ప్రత్యేకించి కోకో, పామాయిల్ పట్ల వలస పాలకుల ఆసక్తి పెరిగింది.
* తీరప్రాంతాలపై 1861లో బ్రిటన్ తన పాలనను ఏర్పాటు చేసింది.
* పశ్చిమ ఆఫ్రికాలోని లాగోస్ విద్య, వ్యాపారం, పరిపాలనకు ప్రధాన కేంద్రంగా రూపుదిద్దుకుంది. అది వలస పాలనపై వ్యతిరేకతను, నైజీరియా జాతీయతా వాదానికి, ఖండాంతర ఆఫ్రికా వాదానికి కూడా కేంద్రంగా ఉంది.
* 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభంలో బ్రిటిష్ వలస సామ్రాజ్యంలో జాత్యాహంకారం తిరిగి చోటు చేసుకుంది.

* విద్యావంతులైన ఆఫ్రికా వాసులను సివిల్ సేవలకు అనుమతించలేదు. ఆఫ్రికా వ్యాపారవేత్తల పట్ల వివక్ష చూపేవాళ్లు.
* వలస పాలకుల విధానాల వల్ల దక్షిణ ప్రాంతంలో ఆధునిక విద్యకు, పరిపాలన ఆధునికీకరణకు ప్రోత్సాహం లభించగా, ఉత్తర ప్రాంతంలో పూర్వ సంప్రదాయాలు కొనసాగాయి.
* 1939లో బ్రిటిష్ పాలకులు పశ్చిమ, తూర్పు నైజీరియా ప్రాంతాలను ఏర్పరిచి యొరుబా, ఈబో తెగల మధ్య కూడా విభేదాలు సృష్టించారు. ఆ విధంగా విభజించి పాలించు అనే సిద్ధాంతానికి అనుగుణంగా మూడు ప్రధాన గిరిజన తెగల మధ్య పోటీని, ఘర్షణని ప్రోత్సహించారు. దీన్ని వ్యతిరేకిస్తూ పాశ్చాత్య విద్యను అభ్యసించిన కొంతమంది మేధావులు ఉమ్మడి నైజీరియా దేశం అనే భావనను కలిగించి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడసాగారు.
* నైజీరియాలో మొదటి రాజకీయ పార్టీయైన నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ (ఎన్.ఎన్.డి.పి.)ని 1923లో హెర్బెర్ట్ మకాలే స్థాపించాడు.
* 1923, 1928, 1933 లలో జరిగిన ఎన్నికల్లో ఎన్ఎన్‌డీపీ అన్ని స్థానాలను గెలుచుకుంది.
* 1930లో బ్రిటిష్ వలస ప్రభుత్వంపై తీవ్రవాద దాడులను కూడా మకాలే సమర్థించాడు.
* 1936లో ఎన్ నంది అజికివె నైజీరియా యువ ఉద్యమాన్ని (ఎన్‌వైఎమ్‌) స్థాపించాడు.
* సాంస్కృతిక నేపథ్యంతో సంబంధం లేకుండా నైజీరియా ప్రజలందరినీ అది ఆకర్షించసాగి అనతికాలంలోనే బలమైన రాజకీయ ఉద్యమంగా ఎదిగింది.
* 1944లో మకాలే, ఎన్.వై.ఎం. నాయకుడు ఎన్ నంది అజికివై కలిసి నైజీరియా, కామెరూన్‌ల జాతీయ సంఘాన్ని (ఎన్.సి.ఎన్.సి.) ఏర్పరచడానికి అంగీకారానికి వచ్చారు. క్రమేపీ ఎన్ నంది అజికివె ప్రముఖ జాతీయ నాయకుడిగా ఎదిగాడు.
* ఖండాంతర ఆఫ్రికావాదం, ఖండాంతర నైజీరియా వాదం ఆధారిత జాతీయ ఉద్యమానికి అతడు మద్దతు తెలిపాడు.
* రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నైజీరియా ఆర్థిక పరిస్థితి కష్టాలకు లోనవడంతో నైజీరియా జాతీయవాదం తీవ్రవాద భావాలకు గురై దానికి ప్రజల ఆదరణ పెరిగి బలం పుంజుకోసాగింది.
* రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరపున పోరాడి తిరిగి వచ్చిన సైనికులు, కార్మిక సంఘ నాయకులు ఈ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు.
* 1945లో అతివాద జాతీయతావాద కార్మిక సంఘ నాయకుల ఆధ్వర్యంలో జాతీయ సాధారణ సమ్మె నిర్వహించారు.
* నైజీరియా జాతీయతా వాదం ముందు రెండు కర్తవ్యాలు ఉన్నాయి. అవి: బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడటం, ఘర్షణ పడుతున్న వివిధ తెగల మధ్య ఐకమత్యాన్ని సాధించడం.
* ఉత్తర ప్రాంతంలో కంటే బాగా అభివృద్ధి చెందిన దక్షిణ ప్రాంతంలో జాతీయ ఉద్యమం బాగా బలంగా ఉండటంవల్ల ఈ రెండు ప్రాంతాల మధ్య తేడాలు పొడసూపసాగాయి.
* యొరుబా, ఈబూ తెగల మధ్య ఘర్షణలు జాతీయ ఉద్యమాన్ని పీడించసాగాయి.
* 1950 నాటికి మూడు ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి.
* ఉత్తర ప్రాంతంలో సంప్రదాయ భావాలతో కూడిన ఉత్తర ప్రజల కాంగ్రెస్ (ఎన్‌పీసీ), తూర్పు ప్రాంతంలో నైజీరియా, కామెరూన్‌ల జాతీయ సంఘం (ఎన్‌సీఎన్‌సీ), పశ్చిమ ప్రాంతంలో యాక్షన్ గ్రూపు (ఏజీ) ఏర్పడ్డాయి.
* జాతీయ ఉద్యమ తీవ్రతను గుర్తించిన బ్రిటిష్ పాలకులు నైజీరియన్‌లకు అధికారాన్ని అప్పగించాలని నిర్ణయించుకున్నారు.
* 1963 అక్టోబరు 1న నైజీరియా స్వాతంత్య్రం పొందింది.
* ప్రజాస్వామిక న్యాయపూరిత సమతుల్యం సాధించలేకపోవడంవల్ల అనతికాలంలోనే నైజీరియాలో పౌరయుద్ధం చెలరేగింది. ఫలితంగా సైనిక పాలన ఏర్పడింది.
* సైనిక పాలనలో అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనలు కొనసాగాయి.
* అవినీతి పాలకులకు మద్దతు ఇచ్చే బహుళజాతి చమురు కంపెనీలు, సైనిక ప్రభుత్వాలు దీంట్లో భాగస్వామ్యం అయ్యాయి.
* సుదీర్ఘ సైనిక నియంతృత్వ పాలన తర్వాత 1999లో నైజీరియా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఎన్నుకుంది.
* నైజర్ డెల్టాలో 1950లో చమురును కనుక్కున్నారు.
* చమురును వెలికితీసే హక్కులను డచ్‌షెల్ కంపెనీ నేతృత్వంలోని వివిధ బహుళజాతి కంపెనీలు పొందాయి.
* ప్రస్తుతం ఇది నైజీరియాకు ముఖ్యమైన వనరు.
* చమురు బావుల్లో అనేకం బహుళజాతి సంస్థల ఆధీనంలో ఉన్నాయి.
* ఇవి చమురును వెలికి తీసి తమ లాభాల్లో కొంత శాతాన్ని సైనిక పాలకులతో పంచుకున్నాయి. సాధారణ ప్రజలకు దీనివల్ల ఎలాంటి ప్రయోజనమూ ఒనగూరలేదు.
* విదేశీ చమురు కంపెనీలు పర్యావరణాన్ని పట్టించుకోకుండా యథేచ్ఛగా చమురును వెలికి తీయడం వల్ల తీర ప్రాంత వాతావరణంలో అనేక సమస్యలు ఏర్పడ్డాయి.
* 'కెన్ సారో వివా' ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త, పర్యావరణ వాది.


 

Posted Date : 19-03-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

సాంఘిక శాస్త్రం

ఇతర సబ్జెక్టులు