• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భారతదేశం: భౌగోళిక స్వరూపాలు

విభిన్న భౌతిక రూపురేఖలతో విలసిల్లుతున్న భారతదేశం

1. కింద భారతదేశ ఉనికి గురించి కొన్ని వాక్యాలు ఇచ్చారు. వాటిని సరిచేయండి.

ఎ) భారతదేశం పూర్తిగా దక్షిణార్ధ గోళంలో ఉంది.

బి) దేశం 8º - 50º ఉత్తర రేఖాంశాల మధ్య 68º - 9º తూర్పు అక్షాంశాల మధ్య ఉంది.

జ: ఎ) భారతదేశం ఉత్తరార్ధ, పూర్వార్ధ గోళాల్లో పాక్షికంగా విస్తరించి ఉంది. 

బి) భౌగోళికంగా 8º 4' - 37º 6' ఉత్తర అక్షాంశాల మధ్య, 68º 7' - 97º 25' తూర్పు రేఖాంశాలకు మధ్య ఉంది.

2. ఆర్కిటిక్ వృత్తంలో భారతదేశం ఉందని ఊహించుకోండి. అప్పుడు మీ జీవితంలో ఏఏ తేడాలుంటాయి?

జ: భారతదేశం ఆర్కిటిక్ వృత్తంలో ఉందని ఊహించుకుంటే, మా జీవితంలో కింది తేడాలుంటాయి.

ఆర్కిటిక్ వృత్తంలో పంటలు పండవు కాబట్టి అక్కడి ప్రజలు ఆహారంగా తీసుకునే మాంసం, చేపలను మేము కూడా ఆహారంగా తీసుకోవాల్సి వస్తుంది.

అక్కడ చలి ఎక్కువ కాబట్టి, జంతు చర్మాలతో తయారైన దుస్తులు ధరించాల్సి వస్తుంది.

ఆర్కిటిక్‌లో మేము సాధారణంగా నివసించే ఇళ్లు ఉండవు. అక్కడ మంచుతో నిర్మించిన 'ఇగ్లూ', జంతు చర్మాలతో తయారైన గుడారాల్లో నివసించాల్సి ఉంటుంది.

మేము వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం, ఇతర వృత్తుల్లో ఉపాధి పొందగలుగుతాం. ఆర్కిటిక్‌లో వేట, చేపలు పట్టడమే ప్రధాన వృత్తి కాబట్టి మేము కూడా ఆ వృత్తులనే చేపట్టాల్సి ఉంటుంది.

సాధారణంగా మనకు ఎండ, వాన, చలి కాలాలు ఉంటాయి. మనదేశం ఆర్కిటిక్ వలయంలో ఉంటే 6 నెలలు వేసవి, 6 నెలలు శీతాకాలంలో గడపాల్సి ఉంటుంది.

ప్రస్తుతం మేము బైక్, కారు, బస్సు, రైలు, విమానాల్లో ప్రయాణం చేస్తున్నాం. ఆర్కిటిక్‌లో అయితే స్లెడ్జ్ బండ్లు తప్ప, మరేమీ ఉండవు.

సరైన విద్య, వైద్య సౌకర్యాలకు దూరమవుతాం.

ఆర్కిటిక్ ప్రాంతంలో సినిమాలు, టెలివిజన్‌లు, కంప్యూటర్ల సదుపాయం ఉండదు. ప్రసార సాధనాలు, వినోద కార్యక్రమాలను చూడలేం.

3. పశ్చిమాన ఉన్న గుజరాత్‌లో కంటె అరుణాచల్‌ప్రదేశ్‌లో సూర్యోదయం రెండు గంటల ముందు అవుతుంది. కానీ గడియారాలు ఒకే సమయం చూపిస్తాయి. ఎందుకని?

జ: భూమి పశ్చిమం నుంచి తూర్పునకు తనచుట్టూ తాను తిరుగుతుంది. ఇదే సమయంలో సూర్యుడి కాంతి భూమి మీద పడుతుంది. సూర్య కాంతి ఒక రేఖాంశాం నుంచి, మరొక రేఖాంశం దాటడానికి 4 నిమిషాలు పడుతుంది. గుజరాత్‌లోని కచ్ 68º 7' తూర్పు రేఖాంశం వద్ద, అరుణాచల్‌ప్రదేశ్‌లోని తూర్పుప్రాంతం 97º 25' తూర్పు రేఖాంశం వద్ద ఉన్నాయి. దాదాపు రెండు ప్రాంతాల మధ్య తేడా 30º ల వరకు విస్తరించి ఉంది. కాబట్టి గుజరాత్, అరుణాచల్‌ప్రదేశ్‌ల మధ్య రెండు గంటలు (30 (రేఖాంశాలు) × 4 నిమిషాలు = 120 నిమిషాలు) తేడా ఉంటుంది. భారత దేశానికి 82º 30' తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా పరిగణిస్తారు. మనదేశంలోని వివిధ ప్రదేశాల స్థానిక కాలాల్లోని భేదాన్ని తొలగించడానికి, ఈ రేఖ వద్ద కాలాన్ని లెక్కించి, దాన్నే భారత ప్రామాణిక కాలంగా వ్యవహరిస్తున్నారు. అందుకే సూర్యుడు భారతదేశానికి తూర్పున పశ్చిమం కంటే రెండు గంటలు ముందుగా ఉదయించినా గడియారాలు ఒకే సమయం చూపుతాయి.

4. భారతదేశ ఉత్తర మైదానాల ఏర్పాటుకు దోహదపడిన హిమాలయ ద్వీపకల్ప నదులను పేర్కొనండి.

జ: హిమాలయ నదులు: గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు; వాటి ఉపనదులు.

ద్వీపకల్ప నదులు: నర్మదా, మహానది మొదలైనవి భారతదేశ ఉత్తర మైదానాల ఏర్పాటుకు దోహదపడిన నదులు.

5. భూస్వరూపాలు, ఎత్తులు, దేశాలను పేర్కొంటూ బ్రహ్మపుత్ర నదీమార్గం మొత్తాన్ని వర్ణించండి.

జ: బ్రహ్మపుత్రా నది టిబెట్ పీఠభూమిలోని 'మానస సరోవరం' వద్ద కైలాస పర్వతాల్లో జన్మించింది. హిమాలయాలకు సమాంతరంగా తూర్పు వైపునకు ప్రవహిస్తున్న ఈ నది అరుణాచల్‌ప్రదేశ్‌లో నైరుతీ దిశగా పెద్ద మలుపు తిరుగుతుంది. తర్వాత అసోం లోయ ద్వారా ప్రవహించి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. ఆపై పద్మానదితో కలసి పయనించి బంగాళఖాతంలో కలుస్తుంది. బ్రహ్మపుత్రా నదిని టిబెట్‌లో 'సాంగ్ పో' అనీ, అరుణాచల్ ప్రదేశ్‌లో 'ది హాంగ్' అనీ వివిధ పేర్లతో పిలుస్తారు.

6. హిమాలయాలు ప్రస్తుతం ఉన్న స్థానంలో లేకపోతే భారత ఉపఖండ శీతోష్ణస్థితులు ఎలా ఉంటాయి?

జ: ¤ చలికాలంలో మధ్య ఆసియా నుంచి భారతదేశం వైపు తీవ్రమైన చలిగాలులు వీస్తాయి.

ఈ తీవ్రమైన చలిగాలుల వల్ల ప్రజలు అనేక రకాల వ్యాధులకు గురవడమే కాకుండా మరణించే పరిస్థితి కూడా ఉంది.

హిమాలయాలే లేకపోతే ఉత్తర భారత ప్రాంతం పొడిగా తయారవుతుంది.

రుతుపవన శీతోష్ణస్థితి లేకుండాపోయి, భారతదేశం ఉష్ణమండల ఎడారిగా మారుతుంది.

ఆవరణ సమతౌల్యాన్ని కాపాడే సతత హరిత అరణ్యాలుండేవి కావు.

7. హిమాలయాల ప్రాముఖ్యాన్ని వ్యాఖ్యానించండి.

జ: ¤ హిమాలయాల వల్ల భారతదేశ శీతోష్ణస్థితి అనేక విధాలుగా ప్రభావితం అవుతుంది.

దేశ ఉత్తర సరిహద్దులో రక్షణ కవచాలుగా ఉండి, మధ్య ఆసియా నుంచి వచ్చే చల్లటి గాలులను ఇవి అడ్డుకుంటున్నాయి.

వేసవిలో వర్షాలకు, రుతుపవన తరహా శీతోష్ణస్థితికి హిమాలయాలే కారణం. ఇవే లేకపోతే ఉత్తర ప్రాంతం పొడిగా ఉండేది.

హిమనీ నదాల వల్ల, హిమాలయ నదులు సంవత్సరం పొడవునా నీటితో కళకళలాడుతున్నాయి.

ఈ నదులు తీసుకువచ్చిన ఒండ్రుమట్టి వల్ల మైదాన ప్రాంతాలు చాలా సారవంతంగా మారాయి.

హిమాలయాలు సిమ్లా, ముస్సోరి, నైనిటాల్, రాణిఖేత్ లాంటి వేసవి విడిది ప్రాంతాలకు, సతత హరిత అరణ్యాలకు ప్రఖ్యాతిగాంచాయి.

8. కిందివాటిలో ఏ ఏ రాష్ట్రాల్లో హిమాలయాలు విస్తరించి లేవు.   మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, సిక్కిం, హర్యానా, పంజాబ్, ఉత్తరాంచల్.

జ: మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో హిమాలయాలు విస్తరించిలేవు.

9. కింది పట్టికను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులివ్వండి.


i) హిమాలయాల్లో ఎన్ని సమాంతర శ్రేణులున్నాయి? అవి ఏవి?

జ: హిమాలయాల్లో మూడు సమాంతర శ్రేణులున్నాయి. అవి:

     1) హిమాద్రి శ్రేణి      2) నిమ్నహిమాలయ శ్రేణి      3) శివాలిక్ శ్రేణి

ii) అతి ఎత్తయిన శ్రేణి ఏది?

జ: హిమాద్రి శ్రేణి అతి ఎత్తయింది. దీని ఎత్తు 6100 మీ.

iii) మిష్మికొండలు ఎక్కడున్నాయి?

జ: మిష్మికొండలు అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉన్నాయి.

iv) 'డూన్' అంటే ఏమిటి?

జ: నిమ్న హిమాలయాలకు, శివాలిక్ శ్రేణికి మధ్యలో ఉన్న లోయలను 'డూన్' అంటారు.

v) శివాలిక్ శ్రేణికి ఉత్తరాన ఉన్న శ్రేణి ఏది?

జ: శివాలిక్ శ్రేణికి ఉత్తరాన ఉన్నశ్రేణి నిమ్న హిమాలయ శ్రేణి.

10. భారతీయ వ్యవసాయాన్ని హిమాలయాలు ఏ రకంగా ప్రభావితం చేస్తున్నాయి?

జ: ¤ హిమాలయ నదుల్లో (జీవనదులు) సంవత్సరం పొడవునా నీళ్లుంటాయి. దాంతో అన్ని పంటకాలాల్లో నీరు సమృద్ధిగా లభిస్తుంది.

హిమాలయ నదులు తెచ్చే ఒండ్రుమట్టి వల్ల మైదాన ప్రాంతాలు సారవంతమై, అధిక దిగుబడికి కారణమవుతున్నాయి.

హిమాలయాల వల్లే భారతదేశంలో రుతుపవన తరహా శీతోష్ణస్థితి ఏర్పడింది. రుతుపవనాలే లేకపోతే దేశం ఉష్ణ మండల ఎడారిగా మారేది. ఏ పంటలు పండేవి కాదు.

11. భారతదేశ ప్రధాన భౌగోళిక విభజనలు ఏవి? హిమాలయ ప్రాంత భౌగోళిక పరిస్థితులతో ద్వీపకల్ప పీఠభూమిని పోల్చండి.

జ: భారతదేశ ప్రధాన భౌగోళిక విభజనలు ఆరు.

అవి: 

            1) హిమాలయాలు

            2) గంగా - సింధూనది మైదానం

            3) ద్వీపకల్ప పీఠభూమి

            4) తీరప్రాంత మైదానాలు

            5) ఎడారి ప్రాంతం

            6) దీవులు
 

12. గంగా - సింధూనది మైదానంలో జనసాంద్రత ఎక్కువ. కారణాలు తెలపండి.

జ: ¤ నాగరికతలన్నీ నదీ ప్రాంతాల్లోనే బయట పడ్డాయి. పురాతన కాలం నుంచి మైదానాలు మానవులు నివసించడానికి అనుకూలంగా ఉన్నాయి.

ఎక్కడైతే జీవనానికి అనుకూల పరిస్థితులు ఉంటాయో అక్కడే ప్రజలు ఉండటానికి ఇష్టపడతారు.

పై లక్షణాలన్నీ గంగా - సింధూనది మైదానంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ జనసాంద్రత ఎక్కువగా ఉంది.

ఈ మైదాన ప్రాంతం సారవంతంగా ఉండి, పంటలు బాగా పండటానికి దోహద పడుతుంది.

సాగునీరే కాకుండా తాగునీరు వసతులు కూడా ఉన్నాయి.

గంగా - సింధూనది ప్రాంతంలో నగరాలు కూడా అభివృద్ధి చెందడం వల్ల ఇక్కడ జనసాంద్రత పెరిగింది.

గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు, వాటి ఉపనదులు ఈ మైదాన ప్రాంతంలో ప్రవహించడం వల్ల వ్యవసాయ పరంగానే కాకుండా పారిశ్రామికంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది.

పై కారణాల వల్ల గంగా - సింధూనది మైదానంలో జనసాంద్రత ఎక్కువ. 

13. భారతదేశంలోని మైదాన ప్రాంతాలు వ్యవసాయానికి దోహదపడినంతగా పీఠభూమి ప్రాంతాలు తోడ్పడవు- దీనికి కారణాలు ఏమిటి?

జ: ¤ మైదాన ప్రాంతాలు నదులు తీసుకువచ్చిన సారవంతమైన ఒండ్రు మట్టితో ఏర్పడతాయి. అధిక దిగుబడికి అనుకూలంగా ఉంటాయి. పీఠభూములు అగ్నిపర్వత శిలలతో ఏర్పడిన కారణంగా సారవంతంగా ఉండవు.

పీఠభూమి ప్రాంతంలో జీవనదులు లేవు. వర్షాధార నదులే ఉన్నాయి. గంగా - సింధూనది మైదాన ప్రాంతంలో జీవనదులు ఉండటంవల్ల నీరు సమృద్ధిగా ఉంటుంది. ఈ పరిస్థితి వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది.

14. తూర్పుమైదాన ప్రాంతాలు, పడమటి మైదాన ప్రాంతాల మధ్య పోలికలు, తేడాలు ఏమిటి?

జ: తూర్పు, పడమటి మైదాన ప్రాంతాల మధ్య పోలికలు, తేడాలు:

ఒకమార్కు ప్రశ్నలు

1. భారతదేశ ప్రామాణిక కాలమానంగా ఏ రేఖాంశాన్ని పరిగణిస్తారు?

జ: 82º 30' తూర్పు రేఖాంశాన్ని భారతదేశ ప్రామాణిక రేఖాంశంగా పరిగణిస్తారు.

2. భారతదేశ ద్వీపకల్పం ఏ భూభాగంలోనిది?

జ: భారతదేశ ద్వీపకల్పం గోండ్వానా భూభాగంలోనిది.

3. హిమాలయాల్లో సమాంతరంగా ఉండే శ్రేణులు ఎన్ని? అవి ఏవి?

జ: హిమాలయాల్లో సమాంతరంగా ఉండే శ్రేణులు మూడు.

అవి: హిమాద్రి, నిమ్నహిమాలయాలు, శివాలిక్ శ్రేణులు.

4. 'డూన్' అంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి.

జ: నిమ్నహిమాలయాలకు, శివాలిక్ శ్రేణులకు మధ్య ఉండే లోయలను 'డూన్‌'లు అంటారు.

ఉదా: డెహ్రాడూన్, పాట్లిడూన్.

5. ఉత్తర మైదానం ఏ నదుల వల్ల ఏర్పడింది?

జ: గంగా, సింధూ, బ్రహ్మపుత్ర నదులు; వాటి ఉపనదుల వల్ల ఉత్తర మైదానం ఏర్పడింది.

6. 'అంతర్వేది' అంటే ఏమిటి?

జ: రెండు నదుల మధ్యప్రాంతాన్ని 'అంతర్వేది' అంటారు.

7. 'భాబర్' అంటే ఏమిటి?

జ: హిమాలయ నదులు కిందకు ప్రవహించే క్రమంలో గులకరాళ్లు, రాళ్లు లాంటి వాటిని శివాలిక్ పర్వతాల పాదభాగంలో 8 - 16 మీటర్ల సన్నటి మేఖలగా నిక్షేపణ చేస్తాయి. ఈ భూస్వరూపాన్నే 'భాబర్' అంటారు.

8. 'టెరాయి' అంటే ఏమిటి?

జ: 'టెరాయి' అంటే చిత్తడి ప్రాంతం.

9. ద్వీపకల్పం అంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి.

జ: మూడువైపులా నీరుండి ఒక వైపు భూభాగం ఉండే భూస్వరూపాన్ని 'ద్వీపకల్పం' అంటారు.

ఉదా: భారతదేశం, ఇటలీ.

10. 'కోరల్స్' అంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి.

జ: సముద్రంలో నివసించే కొన్నిరకాల జీవుల స్రావాలతో ఏర్పడిన రంగురాళ్లను 'కోరల్స్' అంటారు.

ఉదా: పగడాలు.

11. 'భారతదేశ ద్వీపకల్పం' అనే పదాన్ని తరచుగా ఎందుకు ఉపయోగిస్తారు?

జ: భారతదేశానికి మూడువైపులా నీరు, ఒకవైపు భూభాగం ఉంది కాబట్టి, తరచుగా 'భారతదేశ ద్వీపకల్పం' అనే పదాన్ని ఉపయోగిస్తారు.

Posted Date : 26-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని
 
 

విద్యా ఉద్యోగ సమాచారం